తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, September 16, 2008

గతాన్ని చూడవచ్చు(ఒక సాంకేతిక(సైంటిఫిక్)విశ్లేషణ)




నేడు సైన్సు విజ్ఞానము ఎంతో విస్తరిస్తోంది.కాలయంత్రాలు(Time Machines) ఊహ చాలాకాలంగా ఉంది.వీటిలో గతంలోనికి మరియు భవిష్యత్తు లోనికి ప్రయాణించాలని అనుకోవచ్చు.ఐతే భవిష్యత్తు లోనికి ప్రయాణించడం ఆచరణ సాధ్యం కాదు.ఎందుకంటే భవిష్యత్తు ఇంకా జరగలేదు కాబట్టి.
అలానే గతంలోనికి కూడా ప్రయాణించడం సాధ్యం కాదు.
ఐతే గతాన్ని,గతంలో ఒక ప్రదేశంలో జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగా చూడడానికి ఆస్కారం ఉంది.ఇది అత్యంత కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం.ఈ విషయం అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు.సరే ఇక విషయానికి వద్దాము.

మొదట ఒక విషయం తెలుసుకోవాలి.అదేమంటే మనం ఒక వస్తువునిగానీ తద్వారా ఒక సంఘటనను చూడాలంటే ఆ వస్తువుపైన కాంతి పడి ఆ పడిన కాంతి మన కన్నులను చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలము.కాబట్టి మనం చూడాలంటే కాంతి అవసరము.

మనలో చాలామందికి తెలుసు కాంతి వేగం సుమారుగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు అని.ఈ విధముగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతిసంవత్సరము అంటారు.(ఒక కాంతి సంవత్సరము= 5,880,000,000,000 మైళ్ళు లేక 9,460,000,000,000 కిలోమీతర్లు లేక 63,240 A.U(ఆంగ్‌స్ట్రాం యూనిట్లు)). కాబట్టి కాంతి సంవత్సరము అంటే అది సంవత్సరాలను సూచించేది కాదు దూరాన్ని సూచించేది అని అర్థం చేసుకోవాలి.
సూర్యుని నుండి భూమికి కాంతి ప్రసారం కావడం గమనించండి.సూర్యుని నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా 8 నిమిషాలు పడుతుంది.అంటే ఇంతకు ముందు మనము అనుకున్నదాని ప్రకారము మనము 8 నిమిషాల క్రిందటి సూర్యున్ని చూస్తున్నాము.ప్రస్తుతము(అంటే ఈ క్షణము)సూర్యునిలో ఒక గమనింపదగ్గ పెద్ద పర్వతము ఆకుపచ్చ రంగులోనికి మారిందనుకుందాము.ఆ సంఘటనకు సంబంధించిన కాంతి కిరణాలు మనలను చేరడానికి 8 నిమిషాల సమయం తీస్కుంటాయి కాబట్టి మనకు ఆ పర్వతం ఆకుపచ్చ రంగులోకి మారడం మనం ఇప్పటి నుండి 8 నిమిషాల తర్వాత మాత్రమే చూడగలము.
ఒక పరిశీలకుడు భూమి పైన గల ఒక ప్రదేశము నుండి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఒక దూరదర్శిని(Telescope)ను కలిగిఉన్నాడనుకుందాము.ఈ పరికరము అంతదూరము నుండి కూడా స్పష్టంగా భూమిపైన గల ప్రదేశాన్ని చూపగలిగినదై ఉండాలి.

ఆ ప్రదేశము నుండి భూమిపైన గల ఒక ప్రదేశాన్ని అతను చూస్తున్నప్పుడు అతనికి 4 సంవత్సరాల క్రిందటి విషయము చూస్తుంటాడు.ఎందుకంటే ఇంతకుముందు మనము చెప్పుకున్న దాని ప్రకారము 4 సంవత్సరాల క్రిందటి కాంతికిరణాలు అతన్ని ఇప్పుడు(అతని సమయం ప్రకారం)చేరుతున్నాయి.మన కాలం ప్రకారం ఇప్పుడు మనకు జరుగుతున్న విషయాలు అతను చూడాలంటే 4 సంవత్సరాలు జరగాల్సిందే.అప్పుడు మాత్రమే ఈ క్షణమున మన వద్ద జరిగిన సంఘటనల కాంతి కిరణాలు 4 సంవత్సరాల తర్వాత అతనికి చేరి అతను అప్పుడు చూడగలడు.(ఇక్కడ పరిశీలకుడు మనము ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నాడని అనుకుందాము).

3 వ పటం గమనిస్తే పరిశీలకుడు ఒక కాంతిసంవత్సరము దూరం నుండి ఒక సంవత్సరం క్రిందటి సంఘటనలను,2 కాంతి సంవత్సరాల దూరం నుండి 2 సంవత్సరాల క్రిందటి సంఘటనలను అలాగే 3,4 కాంతిసంవత్సరాల దూరం నుండి 3,4 సంవత్సరాల క్రితం సంఘటనలను చూస్తాడని తెలుసుకోవచ్చు.(ఈ సంవత్సరాలనేవి మన దృష్ట్యా నేను చెప్తున్నాను.పరిశీలకునికి అవి అప్పుడే జరుగుతున్నట్లు అనుకుంటాడు).

ఇప్పుడు పటం(4) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు భూమిపైన ఈ క్షణంలో కాంతివేగంతో ప్రయాణం మొదలు పెట్టాడనుకుందాము.అతను భూమిపైన తను బయలుదేరిన ప్రదేశాన్ని చూస్తూ వెనుకకు ప్రయాణిస్తున్నాడనుకుందాము.అప్పుడు భూమిపైన జరుగుతున్న సంఘటనల సమాచారాన్ని తీసుకువెళ్ళే కాంతి తో పాటు అతడు ప్రయాణిస్తుంటాడు.ఇక్కడ అత్యంత ఆశ్చర్యకర అనుభవాన్ని పరిశీలకుడు పొందుతాడు.అదేమంటే కాలం నిలిచిపోయినట్టు అతడికి అనుభవం అవుతుంది.అతడు బయలుదేరిన క్షణంలో సంఘటన ఐతే అతను భూమిపైన చూశాడో అదే సంఘటనను అతను చూస్తూనే ఉంటాడు.ఎందుకంటే అతను సంఘటనను చూపించే కాంతికిరణాలతోపాటే అదే వేగంతో(అంటే కాంతి వేగంతో) అతడు ప్రయాణిస్తున్నాడు.దానివలన అతను ఎంతదూరం పోయినప్పటికీ అతను చూసిన సంఘటన ను చూపించే కాంతికిరణాలు కుడా అతనితో పాటే వస్తుండడం వలన అతనికి సంఘటన తప్ప వేరే ఏమీ కనిపించదు.కాబట్టి కాలం నిలిచిపోయినట్లు అతడికి అనుభవం అవుతుంది.

ఇపుడు పటం(5) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు కాంతికి రెట్టింపు వేగంతో ప్రయాణం మొదలుపెట్టాడనుకుందాము.ఆ సమయం సెప్టెంబరు 16,2008 అనగా ఈ రోజు అనుకుందాము.అతను ఈ రెట్టింపు వేగముతో రెండు సంవత్సరాల పాటు పైకి ప్రయాణించాడనుకుందాము.అప్పుడు మనకు సెప్టెంబరు 16,2010 అవుతుంది..ఇప్పుడు అతను అక్కడ ఆగి భూమివైపు చూస్తున్నాడనుకుందాము.కానీ ఇక్కడే విచిత్రము జరుగుతుంది.ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.
పటం(5) గమనిస్తే అతను కాంతికి రెట్టింపువేగంతో 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత పరిశీలకుడు B స్థానం వద్ద,కాంతి A స్థానం వద్ద ఉంటుంది.అంటే కాంతి 2 సంవత్సరాల దూరంలో,పరిశీలకుడు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడు.అంటే అప్పుడు మనకు సెప్టెంబర్ 16,2010 అవుతుంది.ఇప్పుడు మనం ఈ రోజు సెప్టెంబర్ 16,2010 అనుకుందాము.అంటే ఒకటవ కాంతి సంవత్సరం దూరానికి ఇప్పటి మన సంఘటనల కాంతికిరణాలు పోవడానికి ఒక సంవత్సరం పడుతుంది.ఒకటవ కాంతి సంవత్సరం దూరంలో సెప్టెంబర్ 16,2009 యొక్క సంఘటనలు చూడవచ్చు.2 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2008 నాటిసంఘటనలు,3 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2007 నాటి సంఘటనలు మరియు 4 కాంతి సంవత్సరాల దూరంలో అంటే మన పరిశీలకుని స్థానంలో సెప్టెంబర్ 16,2006 యొక్క సంఘటనల కాంతి కిరణాల కారణంగా పరిశీలకుడు సెప్టెంబర్ 16,2006 వ రోజును చూస్తుంటాడు.
అంటే అతను బయలుదేరింది సెప్టెంబరు 16,2008,కానీ అతను చూస్తున్నది సెప్టెంబరు 16,2006.
దీనిని బట్టి అతను 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత మన ప్రకారం సెప్టెంబరు 16,2010 చూడాల్సింది అతను గతం లోని సెప్టెంబరు 16,2006 చూస్తున్నాడు.అంటే మొత్తం అతను 4 సంవత్సరాల క్రిందటి విషయాలను ప్రత్యక్షంగా చూస్తున్నాడు.పైన జరిగిన సంఘటనలు కాంతి కన్నా రెట్టింపు వేగంతో పొయినప్పుడు జరుగుతున్నాయి.ఇక్కడ నిజానికి 2 సంవత్సరాలు గడిచిపోయి సెప్టెంబరు 16,2010 వచ్చినప్పటికీ ఇప్పటి సంఘటనలకు సంభందించిన కాంతి కిరణాలు పరిశీలకుని చేరడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది.అంటే మన ప్రకారం సెప్టెంబరు 16,2014 వ తేదీ అతను సెప్టెంబరు 16,2010 యొక్క సంఘటనలను చూడగలడు.కాబట్టి గతాన్ని చూడగలమని స్పష్టంగా అర్థం అవుతోంది.మనము చూడగలము కానీ గతాన్ని మార్చడంకానీ,గతంలో పాల్గొనడం కానీ చేయలేము.
కానీ ఇది ఆచరణసాధ్యం కాకపోవడానికి కొన్ని పరిమితులు అడ్డుగా నిలుస్తున్నాయి.

పరిమితులు(Limitations):

ఐన్‌స్టీన్ సిద్దాంతం ప్రకారం సృష్టి లో ఏ వస్తువూ కాంతివేగాన్ని మించి ప్రయాణించలేదు.అలా ప్రయాణించాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి అనంతం కావాలి.కాని నేటి శాస్త్రవేత్తలు కాంతి కన్నా వేగం గా ప్రయాణించే కొన్ని రకాలైన కిరణాలను కనుగొన్నారు.
కాబట్టి గతాన్ని చూడాలంటే మనిషిని కిరణాలుగా మార్చాలి.తిరిగి అంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి మనిషిగా మార్చాలి.ఇది మన ఊహకు అందని విషయం.
అందువలనే గతాన్ని చూడడం అనే విషయం అత్యంత కష్టమైన విషయం.దాదాపుగా అసాధ్యమైన విషయం.

పైన పేర్కొన్న నిరూపణ కేవలం జరగవచ్చు అని చెప్పగలము కానీ జరుగుతుంది అని అనలేము.
పైన పేర్కొన్న నిరూపణ ఐన్‌స్టీన్ యొక్క సాపేక్ష సిద్దాంతం ద్వారాచేయడం జరిగింది.
పై వ్యాసం ద్వారా కొన్ని కొత్త విషయాలు మనము గ్రహించవచ్చు.అవేమిటో ఇంకో సారి చూద్దాము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు