తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, February 14, 2009

దేవుడు మనుషుల కొసం ఎంతగా దిగివస్తాడో చూడండి

అందరూ అనుకొంటారు భగవంతుని పొందడమెలాగా? అది చాలా కష్టము, తపస్సులు చేయాలేమో, పూజలు చేయాలేమో అవన్ని సాధ్యమేనా అని? కాని దీనికి పరిష్కారము భగవంతుడే భగవద్గీతలోని భక్తియోగములో సూచించాడు. చూడండి మీరే ఆశ్చర్యపోతారు.

1.మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.

ఇది మొదటిది. దేవుని యందు మనసును,బుద్ధిని లగ్నము చేయడము. ఈ ప్రపంచములో పూట గడవడానికే ఇబ్బందిగా ఉంది, మా పనులనే మేము చేసుకోలేకపోతున్నాము ఇక దేవునిపై దృష్టి ఎలా పెట్టగలము అంటారా. ఐతే క్రిందది చూడండి.

2.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.

ఇక్కడ అభ్యాసయోగం అనగా మనసును ప్రాపంచిక విషయాలపై నుండి మరల్చి దేవునిపై పెట్టడం.అంటే పనులు మానుకొనమని కాదు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా చెపుతాను. పిల్లలు గుండ్రముగా తిరిగే ఆట మీరు చూసుంటారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తిరుగుతుంటారు. అలాకాక ఒకరే ఆధారం లేకుండా ఎంతసేపు తిరగగలరు? అలా ఎక్కువసేపు తిరిగితే క్రిందపడి పోతారు. అదే ఏ గుంజనో,స్థంభాన్నో గట్టిగా పట్టుకొని తిరిగారనుకోండి క్రిందపడరు. అలాగే మనం ఏ పని చేస్తున్నా భగవంతుని ఆధారం చేసుకొంటే ఏ సమస్యా ఉండదు. రోజుకు కొంతసేపు అభ్యాసం(ధ్యానం) నియమితవేళలలో గాని,మనకు అనుకూలమైన వేళలలో కాని చేస్తే మనసు మన చేతిలోనికి వస్తుంది.

3.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.

స్వామి ఇంకా దిగివచ్చాడు. ఇది కూడా మనకు సాధ్యం కాకపోతే దేవునికి ఇష్టమైన పనులు అనగా సత్యం పలకడం, ఇతరులకు హాని కల్గించకుండా ఉండడం,ఇతరులకు సహాయం చెయ్యడం, ప్రజోపయోగ కార్యక్రమాలు చెయ్యడం మొదలగునవి అన్నమాట.

4.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.

దీని గురించి వివరముగా నా పూర్వపు టపా "కర్మయోగ రహస్యము" లో చూడండి.ఆ టపాలోని విషయాన్నే క్రింద చూడండి.
1.కర్మ చేయుటకు నీకు అధికారము గలదుకాని దాని ఫలితమందు ఆసక్తి కలిగివుండుటకు లేదు.అట్లని కర్మలు చేయుట నీవు మానరాదు.

2.ఏ కర్మ చేయుచున్నను నీవు అసంగత్వం తో మరియు శ్రద్దగా నిపుణత్వం తో చేయాలి.అనగా నీవు కావాలనుకున్నప్పుడు ఏ క్షణము లో నైనా ఆ పనితో సంబంధం లేకుండా బయటకు వచ్చేయగలగాలి.

ఈ ప్రపంచములో గెలుపు,ఓటములు అనేవి కేవలము మన శ్రమ పైనే ఆధారపడిలేవు.ఒక పని కావడానికి మన శ్రమ అత్యంత ముఖ్యము ఐనప్పటికీ ఆ పని విజయవంతము కావడానికి ఇంకా చాలా పరిస్థితులు అనుకూలించాలి.ఆ పరిస్థితులలో చాలామటుకు మన చేతులలో ఉండవు.కాబట్టి మన భాద్యత ఏమిటటంటే ప్రయత్న లోపం లేకుండా మన పనిని మనము నిర్వర్తించడం.అటువంటప్పుడు పని సఫలమైనప్పుడు విజయానందం,ఒకవేళ కాకపొతే పనిని నిర్వర్తించిన ఆనందం కలుగుతాయి.అందువలనే పని యొక్క ఫలితంపైన ఆసక్తి ఉంచుకోరాదు.

ఉదాహరణగా యజమాని ఇంట్లో పనిచేయు దాది ని చెప్పుకోవచ్చు. ఆ దాది తన యజమాని బిడ్డలను తన బిడ్డలగా భావించి పెంచుతున్నప్పటికి ఆమె ధ్యాస అంతా తన సొంత ఇంటి పైనే ఉంటుంది.అలా అని ఆమె తన యజమాని పని కూడా శ్రద్దగానే చేస్తుంది.ఏ లోటూ రానివ్వదు.అంటే మనము పని చేయుచున్నప్పటికి మన మనసు భగవంతుని దగ్గర ఉండాలి.

చివరగా భగవంతుని ప్రతిజ్ఞ చూడండి:

ఎవరైతే సర్వకాల,సర్వావస్థలలో నన్నే శరణు జొచ్చుతారో, నాపై నిష్కల్మషమైన భక్తి కలిగిఉంటారో వారి యోగక్షేమాలు నేనే చూసుకొంటాను.
అర్జునా నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడని శపథం చేసి చెపుతున్నాను.




Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు