తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 8, 2010

వేదకాలం లో జంతుబలి ఉన్నంత మాత్రాన వారు అనాగరికులా? మనం కాదా?

ఈ మధ్య వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఒక వ్యాసము(article)ఈ టపాకు ప్రేరణ.విచిత్రమేమిటంటే మన భారతీయులు కూడా ఆ వ్యాసానికి వంతపాడారు.అందుకే ఈ టపా వ్రాయవలసి వచ్చింది.

అందరికీ తెలుసు వేదకాలపు యజ్ఞాలలో జంతుబలులు ఉండేవని.ఈ విషయం ఒక్కటి తీసుకొని పాశ్చాత్యులు వేదకాలపు జనులు ఆటవికులని,అది ఆటవిక సమాజమని,ఆనాటివారు అనాగరికులని నిర్ణయించారు.లోపాలు తప్ప మంచిని గ్రహించని ఆ కాలపు ఆంగ్లేయుల వలన మన ప్రజలు కూడా వారికి వంత పాడారు,నేటికీ పాడుతూనే ఉన్నారు.సరే నేడు వారు కానీ,మనం కానీ చేస్తున్నది ఏమిటి.ఏ దేశపు ప్రజలు మాంసాహారం తినడం లేదు? కోళ్ళు,మేకలు,పొట్టేళ్ళు మొదలుకొని ఎద్దు(beef),పంది(fork),ఒంటె,పాములు,బల్లుల వరకు తినడం లేదా?దీనిని బట్టి నేటి సమాజం కూడా ఆటవిక సమాజం అనగలమా?ఏ మతం వారు,ఏ దేశం వారు పండుగలని,ఉత్సవాలని
జంతుహింసకు పాల్పడడం లేదు? ఇలా అని ప్రస్తుతం ఆటవిక సమాజం నడుస్తోందని అందామా? ప్రస్తుతం మనం కూడా అనాగరికులమని అన వీలవుతుందా? అలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పటికీ ఆంగ్లేయులకు కానీ,అమెరికనులకు కానీ ఎద్దు మాంసం కానీ,పంది మాంసం అంటే కానీ ఇష్టం పోయిందా(శాఖాహారులు తప్ప)? వీరినే ఎందుకు ఉదహరించడం జరిగిందంటే వీరే ఇలాంటి వాదనలకు ఆద్యులు.

అప్పుడు వేదకాలం లో జంతుబలులకు పాల్పడ్డవారే కాలక్రమంలో శాఖాహార ప్రాముఖ్యతను గుర్తించి శాఖాహారానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు.ఇదంతా మానవ మనసు పరిణామ దశలలో భాగమని ఎందుకు అనుకోకూడదు? కాని ఒకరిలో లోపాలు ఎంచడానికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడమే నేటి లోక నైజం. "ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో" అన్న ఏసుక్రీస్తు బోధన తెలియదా? తను బెల్లం తినడం మానివేసిన తర్వాతే పిల్లవాడికి బెల్లము ఎక్కువ తినడం హానికరమని బోధించిన రామకృష్ణపరమహంస గురించి తెలియదా?

ఒక్క మాట.మనుషులు చీమలకున్న పాటి జ్ఞానం కూడా కోల్పోతున్నారు.చీమలు ఇసుక,చక్కెర మిశ్రమం నుండి చక్కెరను మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాయి.అంటే పనికిరాని విషయాన్ని వదిలివేసి పనికివచ్చే చక్కెరను మాత్రమే గ్రహిస్తాయి.లోకంలో చాలా మందిలో లోపాలు ఉన్నంత మాత్రాన లోకాన్నంతటినీ ఒకే గాటన కట్టగలమా?(for faults in many,judge not the whole). వేదాలలోని శాంతి మంత్రం(అసతోమా సద్గమయ మంత్రం) వారికి కనపడలేదా? అనాగరికులే ఈ మహోన్నత మంత్రాన్ని అందించారు."సర్వేజనా సుఖినో భవంతు" అని ఘోషించడానికి ఎంత పరిపక్వం చెందిఉండాలి? "సహనాభవతు,సహనౌ భునక్తు"(కలిసి ఉందాం,కలిసి తిందాం) అనే సంస్కారం ఆనాటి వేదాలలోనే ఉన్నదని గ్రహించరా?

"సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమాన మస్తు వో మనో యథా వః సుసహాసతి"(అధర్వణవేదం 6-64-4)
అర్థం: మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ భావం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక!ఈ విధముగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొను గాక!
ఇంతటి ఉపదేశం ఇచ్చినవారు అనాగరికులా? ఆలోచించండి.వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే గ్రహించి మొత్తం వేదాలనే నిందించడం తగదు.

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం గారు తన ఆత్మకథ (ఒక విజేత ఆత్మకథ) లో ఒక విషయం చెప్పారు.అదేమిటంటే అతను అంతరిక్షశాఖ లో పని చేస్తున్నప్పుడు తరచూ శాస్త్రవేత్తల సమావేశాలు జరిగేవట.వాటిలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరైనా ఒక నూతన విషయం ప్రస్తావిస్తే తక్షణం అందరు శాస్త్రవేత్తలు వాదోపవాదాలు లేవదీసేవారు.కాని అదే ఎవరైనా విదేశ శాస్త్రవేత్త గనుక ప్రతిపాదిస్తే ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించేవారట.

అలానే ఆంగ్లేయులు చెప్పినంత మాత్రాన గొర్రెలా తలాడించి అవుననడమే తప్ప ఆలోచన లేకుండా తలాడించడమేనా? ఏదైనా ఒక విషయం పై అభిప్రాయం ఏర్పరుచుకునేముందు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోనవసరం లేదా? " వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ " అని మన మహాత్ములు చెప్పిన విషయం తల కు ఎక్కదా?. మేలెంచి కీడెంచమన్న పెద్దలమాట మరిచిపోయారు.కనీసం కీడెంచి మేలు కూడా ఎంచడం లేదు.కేవలం లోపాలు వెదకడమే పనిగా
పెట్టుకున్నారు.వేదాలను ఎవరైనా పూర్తిగా చదివారా? చదవకుండానే,తెలుసుకోకుండానే ఆంగ్లేయులు చెప్పారు కాబట్టి అవన్నీ బూటకమని నిర్ణయించడమేనా?.

ఆంగ్లేయులు మనలను భౌతికముగా,సాంస్కృతికముగా బానిసలు చేసుకోవడంకోసం పన్నిన ఉచ్చులో మనం ఎంత బాగా పడ్డామో తెలుసుకోవాలి.ఇప్పుడు వారు లేరు కాని వారి ప్రభావము నుండి ఇంకా బయట పడలేకపోతున్నాము.ఒకరు చెప్పినది గ్రుడ్డిగా కాకుండా పూర్తిగా తెలుసుకొని,అన్ని కోణాలలోనూ విచారించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.వేదాల విషయమే కాదు ఏ విషయానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు