తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, November 12, 2010

సమాధి స్థితి, శృంగారం, గాఢనిద్ర - ఈ మూడింటిలో ఉన్న సారూప్యత ఏమిటి?

మనందరికీ తెలుసు ప్రతి మనిషీ పై మూడింటిలో మొదటిదైన సమాధి స్థితిని కాకపోయినా శృంగారం, నిద్రలను ఖచ్చితంగా కోరుకొంటారు. శృంగారాన్ని కోరుకోని సన్యాసులు కూడా ఉంటారనుకోండి. నిద్రను మాత్రం అందరూ కోరుకొంటారనే విషయంలో సందేహం లేదు.


సమాధి స్థితి విషయాన్ని కాసేపు పక్కన పెడదాము.
ఇంతకూ నెను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఎందుకు ప్రతి మనిషీ ఇంకా చెప్పాలంటే దాదాపు ప్రతిజీవీ నిద్రను,శృంగారాన్ని ఖచ్చితంగా కోరుకొంటాయి?

శరీరం అలసిపోతే అది నిద్రను కోరుకొంటుంది. గాఢనిద్ర నిద్రపోయి లేచినవారు ( ఎవరూ లేపకుండా వారంతకువారే మామూలుగా లేచినవారు ) ఎంత ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారో మనము చూస్తూనే ఉన్నాం. ఏమి నిద్రపోయానురా,బలే నిద్రపట్టిందిరా అంటూంటారు వారు. అంటే గాఢనిద్రలో వారు ఏదొ ఆనందం పొందారు అన్నమాట. అదేంటి?


ఇక శృంగారం లో సంపూర్ణ తృప్తి ని పొందిన వారు కూడా శృంగారం అయిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా,ఉల్లాసంగా ఉండటాన్ని చూస్తున్నాము కదా. అక్కడవారు కూడా ఏదో ఆనందం పొందారన్నమాట.అదేంటి?


ఇక యోగుల,ఋషుల సమాధిస్థితి విషయానికి వస్తే సమాధిస్థితి లో మరియు అందు నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా వారు బ్రహ్మానందం లో విహరిస్తుంటారని మహాత్ముల జీవితాలలో ( ఉదా: రామకృష్ణులు, వివేకానంద, పరమహంసయోగానంద ) చూడవచ్చు. అంటె అందులో కూడా ఏదో ఆనందం ఉందన్న మాట. అదేంటి?

నిద్రకు, సమాధిస్థితికి గల తేడా ఏంటంటే నిద్రపోకముందూ,నిద్రపోయి లేచిన తర్వాత కూడా మనిషి కి ఉండే జ్ఞానంలో ఏ మార్పూ ఉండదు. అదే సమాధిస్థితి పొందిన మనిషి ఆ స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత పరమాత్మజ్ఞానం పొందుతాడని వేదాంతం చెబుతుంది.

పై మూడూ విషయాలకూ ఒకదానితో ఒకదానికి సంబంధం లేకపోయినా పై మూడింటిలో పొందే ఆనందానికి ఒకే మూలసూత్రం ఉందంటే మీరు నమ్మగలరా?


ఆ మూలసూత్రమే "తననుతాను మరిచిపోవడం" లేక వేదాంతపరిబాషలో "అద్వైతం". అంటే ఆ సమయంలో మరే భావనా చివరికి తను ఒకడిని ఉన్నాననే భావన కూడా లేకపోవడం. ఇంకా చెప్పాలంటే తనే ఆనందం,ఆనందమే తను అయిపోవడం.

ఇంతే విషయం. అయిపోయింది.

కాకపోతే కొద్దిగా కొనసాగింపు ఉంది.

గాఢనిద్రలోనూ, శృంగారం లోనూ ఈ అద్వైత భావన ఆ సమయంలో మాత్రమే ఉంటుంది. ఆ రెండూ లేని మామూలు సమయాలలో ఆ అద్వైతాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. అంటే పై రెండు విషయాలలోనూ ఈ అద్వైతాన్ని అనుభవించడం తాత్కాలికం మాత్రమే అంతే కాకుండా అక్కడ మన ఎరుక లేకుండానే మనము ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంతే.

నిద్రల్లో గాఢనిద్ర ఎంత ఉన్నతమైనదో సమాధిస్థితులలో సహజసమాధిస్థితి అంత కన్నా ఉన్నతమైనది అని వేదాంతం చెబుతోంది. ఈ సహజసమాధిస్థితి పొందిన మనిషి ఎల్లప్పుడూ అంటే నిద్రలోనూ,మెలకువలోనూ కూడా అంతే కాక ఏ పని చేస్తున్నా కూడా ఆ అద్వైతస్థితిని అనుభవిస్తూనే ఉంటాడని వేదాంతం చెబుతోంది.
అందుకే శృంగారంలోని ఆనందం కన్నా సమాధిస్థితిలోని ఆనందం కోటిరెట్లు ఉన్నతమైనదని, అధికమని అందుకే సమాధిస్థితి పొందిన వ్యక్తి అంతకు ఎంతో క్రింది స్థాయి అయిన శృంగారం పై శ్రద్ద,ఆసక్తి ఏ మాత్రం చూపడని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికతలోని లోతైన భావాలవైపు ఈ టపా పోతుంది. అవన్నీ చెప్పడానికి సందర్బం కాదు కాబట్టి ఈ టపాను ఇంతటితో ముగిస్తున్నాను.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు