తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, May 31, 2012

ఆంజనేయుడొక్కడే ఇలా అర్థం చేసుకోగలడేమో (ఆంజనేయుని అత్యద్భుత జ్ఞానం)

క్రింద ఉదహరించు సంఘటన లంకలో సీతతో రాముని నిందిస్తూ రావణుడు పలికిన మాటలు:

'
'అతల్పం నిద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''

అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు (అంటే పొగడబడేందుకు అర్హుడు కాదు) - అని రావణుడు చెప్పగా

సీతాదేవి ఇలా బదులు చెప్పింది.

'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''

ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.

ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.

ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక  పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారందుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.

''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్
)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది

''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు. 
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం. 

అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం 
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు