తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స
Showing posts with label వేదాంతము. Show all posts
Showing posts with label వేదాంతము. Show all posts

Tuesday, November 30, 2010

అద్వైతం లో ద్వైతం,విశిష్టాద్వైతాలు ఎలా కలిసిపోతాయో చూడండి - గణితం (లెక్కలు) ప్రకారం నిరూపణ

మనకు తెలుసు
ద్వైతం అంటే మనలోని జీవాత్మ,పరమాత్ముడు వేర్వేరు అని,
విశిష్టాద్వైతం అంటే జీవుడిలోనే పరమాత్మ ఆత్మగా వెలుగుతున్నాడని,
అద్వైతం అంటే జీవాత్మే మేఘాల(మాయ)చే కప్పబడిన సూర్యుడు(పరమాత్మ) అని అంటే జీవాత్మ కు పరమాత్మకు భేధం లేదని .

ఇంకా సరళంగా చెప్పాలంటే

ద్వైతం అనగా నేను వెలుగు లో ఉన్నాను అని,
విశిష్టాద్వైతం అనగా నాలో వెలుగు ఉందని,
అద్వైతం అంటే నేనే వెలుగు అని చెప్పవచ్చు.

ఇప్పుడు గణితం ప్రకారం చూద్దాం.


ద్వైతం ను A అని, విశిష్టాద్వైతమును B అని అనుకుందాము.

ఇప్పుడు ద్వైతం,విశిష్టాద్వైతములను అనగా A,B లను కలుపుదాము. అంటే నేను వెలుగులో ఉన్నాను,నాలో వెలుగు ఉంది అనే ఈ రెండు భావనలను కలిపామనుకోండి. అంటే (A+B). అపుడు నేను కు బయటా,లోపలా వెలుగు ఉంది అని అర్థం అవుతుంది. అంటే మొత్తం వెలుగే ఉంది, కేవలం నేను
అనే భావనే బయటి వెలుగును, లోపలి వెలుగును విడదీస్తోంది.

ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కుండ లోని నీరు (విశిష్టాద్వైతం) , అదే కుండను ఒక నదిలో పూర్తిగా ముంచితే అపుడు కుండ నీటిలో ఉంటుంది (ద్వైతం) కదా. ఇపుదూ కుండలోనూ, కుండ బయటా కూడా నీరే ఉంది కదా. ఇపుడు బయటి నీరుకూ, కుండలోని నీటికీ అడ్డం కుండ కదా. ఈ కుండే నేను అనే భావన.

ఇప్పుడు కుండను పగలగొట్టేసామనుకోండి అప్పుడు బయటి నీరు,లోపలి నీరూ ఒక్కటే అయిపోయి కుండ అందులో కరిగిపోతుంది. ఇప్పుడు కుండకు అస్థిత్వం,లేక ఉనికి (Existance)ఎక్కడ ఉంది?కుండ కరిగిపోయి అంతా ఒకటే (నీరే) అయిపోయింది కదా! అదే కదా అద్వైతం.

అంటే ద్వైతం, విశిష్టాద్వైతాల కలయికే అద్వైతం అని గణితం ప్రకారం నిరూపించవచ్చు.

ఇక అద్వైతంలోని విభాగాలే ద్వైతం,విశిష్టాద్వైతం అని నిరూపిద్దాం.

గణితంలో సమితులు అనే భావన వినేఉంటారు.
ద్వైతం ను A అనే సమితి గానూ, విశిష్టాద్వైతం ను B అనే సమితిగానూ అనుకొందాము.
అప్పుడు A,B లను రెండూ కలిపితే A union B అంటే (A ∪ B).
ఇంతకుముందు నిరూపణ ప్రకారం A,B ల కలయికే అద్వైతం కదా. అంటే ఇక్కడ ఆ A(ద్వైతం),B(విశిష్టాద్వైతం) ల కలయిక (A ∪ B).

గణితంలోని సమితుల ప్రకారం A,B లు రెండు సమితులైతే A,B లు రెండూ (A ∪ B)కి ఉపసమితులు అవుతాయి.

అంటే A ⊂ (A ∪ B). ==>> A is subset of (A ∪ B) (A అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

B ⊂ (A ∪ B) ==> B is subset of (A ∪ B) (B అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

ఇలా నిరూపణ చేయవచ్చు.

అంటే నేను అనే భావనకు బయట ద్వైతం, లోపలి వైపు విశిష్టాద్వైతం ఉన్నాయని ఆ నేను అనే భావనను తొలగిస్తే అద్వైతం అనే భావన అని అర్థం చేసుకోవచ్చు. ఈ టపాలో "నేను" అనే భావనను "మాయ" అని, సూర్యుడిని కప్పిన "మేఘం", శరీరం అని ప్రయోగించాను. రమణమహర్షుల ప్రకారం "నేను" ను
ప్రయోగించలేదు.


Wednesday, November 10, 2010

ఎవరు నిజమైన త్యాగులు?

సాధువులు, యోగులు, భక్తులు,సన్యాసులు మొదలైన వారు మేము భగవంతుడి కోసం అన్నీ త్యాగం చేసామంటారు. కాని క్రింది విషయాన్ని గమనించండి.

సకల ఐశ్వర్యవంతుడు,సకల సద్గుణవంతుడు అయిన భగవంతుడి కొరకు చిన్నచిన్న అల్పమైన డబ్బు,బంగారం,కామం లాంటి వాటిని వదులుకునే యోగులు,భక్తులు నిజమైన త్యాగులా?

లేక

అల్పమైన పై వాటి కోసం భగవంతుడినే వదులుకునే వ్యక్తులు నిజమైన త్యాగులా?

ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన త్యాగులో?

Monday, February 9, 2009

శ్రీ భగవద్గీతలోని కర్మ,వికర్మ,అకర్మ లకు వివరణలు

భగవద్గీతలో కర్మ,అకర్మ,వికర్మ ల గురించి పేర్కొనబడినది. అవేమిటో ఒకసారి చూద్దాం.

కర్మ: కర్మ అనగా సాధారణముగా పని అని అర్థము.ఈ పని ఏవిధముగా ఉండవలనంటే లోకమునకు విరుద్ధముగా ఉండకుండా అనగా లోకహానికి కారణము కాకుండా ఉండాలి. మనము కర్మలను మనఃపూర్వకముగా చేయాలి.కాని వాటి ఫలితముపై ఆసక్తి చూపరాదని భగవద్గీతలో భగవంతుడు అంటాడు. కర్మ కోసమే కర్మ,ప్రేమ కోసమే ప్రేమ ఉండాలి.
వికర్మ: అనగా చేయకూడని కర్మ(పని). అనగా లోకహితము కాని పనులు.

అకర్మ: అకర్మ అనగా పనిచేయకుండా ఉండడము అనేది సామాన్య అర్థము. కాని అసలు అర్థము అది కాదు. అకర్మ అనగా కర్మ చేస్తున్నా మన మనసు ప్రశాంతముగా ఉండాలి. భగవద్గీతలో భగవానుడు దీనినే అత్యంత స్పష్టముగా చెప్పాడు. "ఎవరైతే అత్యంత కర్మ(పని) స్థితిలో ఉన్నా అతని మనసు అత్యంత ప్రశాంతముగా ఉంటుందో(అకర్మను చూస్తాడో), అలాగే అత్యంత ప్రశాంత స్థితిలో కూడా(అకర్మలో కూడా) తీవ్రమైన కర్మను చూస్తుంటాడో అతనే నిజముగా కర్మను తెలిసినవాడు.అతనే కర్మ యోగి."
దీనినే కొద్దిగా వివరముగా చూద్దాం.మీరు పూర్తిగా ట్రాఫిక్‌జాము లో ఇరుక్కుపోయారనుకోండి. చుట్టుప్రక్కల నుండి అందరూ హారన్‌లు మ్రోగిస్తున్నారు. ఎవరో గలాట పడుతున్నారు. అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మీ మనసు యొక్క ప్రశాంతతకు ఏ విధమైన భంగము కలగకుండా ఉండాలి.అంటే ఎవరూలేని ఏకాంత గుహలో మీ మనసు ఎలా నిశ్చల స్థితిలో ఉంటుందో అలా ఉండాలి.అనగా శరీరం అత్యంత కార్యనిర్వహణలో ఉన్నా మనసు అత్యంత ప్రశాంతముగా ఉండాలి.అదీ నిజమైన కర్మయోగి స్థితి.
అలాకాక ఏకాంతగుహలో ఉన్నా మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటూంటే అది నిజమైన కర్మ అనిపించుకోదు.
ఇక అకర్మ లో కర్మను చూడడము అంటే చుట్టూ జరుగుతున్న పనులను లేక జగద్‌వ్యాపారమును ఎటువంటి మనశ్చాంచల్యము లేకుండా ఒక సాక్షిగా చూడడము.
ఎవరైనా చెస్(చదరంగము) ఆడుతుంటే వారికి కూడా రాని మంచి ఎత్తులు ఊరకే చూసే మనకు వస్తుంటాయి. అలాగే మన ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయనే భావం మనలో కనుక ఉంటే మనం సాక్షిగా ఆ పని ఇంకా బాగా చేయగలము.
మీరు ఒకటి గమనించే ఉంటారు.పంకా(fan) అత్యంత వేగముగా తిరిగేటప్పుడు అసలు అది తిరగనట్టే నిశ్చలస్థితిలో ఉన్నట్టు కనపడుతుంది.ఇక్కడ తీవ్రకార్యపరత్వములో ఉన్నప్పటికీ ప్రశాంతముగా ఉన్నట్టే అనిపిస్తుంది.
దీనినే ఇంకా వివరముగా చూడాలంటే "కర్మయోగ రహస్యము" చూడండి.

ఉదాహరణలు:
మనము తిరుపతి నుండి రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే హైదరాబాదుకు చేరుతాము. మనము బస్సు కానీ రైలుకానీ ఎక్కినా మనము నిద్రపోతాము. ప్రొద్దున్నే చేరుతాము. అక్కడ మనం చేసిన పని ఏమీ లేదు. ఆ వాహనమే మనలను తీసుకు వచ్చింది. కాని మనమే వచ్చామంటాము. ఇది అకర్మలో కర్మను చూడడం.
పిల్లవాడు బాగా అలసిపోయి ఏమీ తినకుండా రాత్రి పడుకున్నాడనుకొందాం. అమ్మ వాడిని లేపి అన్నం తినిపిస్తుంది. వాడు నిద్రలోనే తింటాడు. వాడికేమీ గుర్తుండదు. ప్రొద్దునలేచి రాత్రి నేను ఏమీ తినలేదు అంటాడు. దీనిని కర్మలో అకర్మను చూడడము అంటారు.
వీటిని కేవలం ఉదాహరణలుగా మాత్రమే తీసుకోండి.
అలాగే మన మనసు సదా భగవంతుని పాదచరణాలపైనే ఉంటూ మన శరీరం మాత్రం దాని పని అది చేస్తూ ఉండాలి. మన ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయని,నేను ఏమీచేయడం లేదనే భావంలో మనం నెలకొని ఉండాలి.

Wednesday, September 17, 2008

కర్మసిద్దాంతము-సంక్షిప్త వివరణ

"కర్మసిద్దాంతం".అత్యంత చర్చకు లోనైన సిద్దాంతము ఇది.ఎన్నో అపార్థాలకు గురైన సిద్దాంతం ఇది.

ఈ వ్యాసంలో కర్మసిద్దాంతాన్ని గురించి చర్చించడం జరిగింది.సరే అసలు ఈ కర్మసిద్దాంతం అంటే ఏమిటి. ముఖ్యముగా ఈ సిద్దాంత విషయం ఏమిటంటే "కారణం లేని కర్మఫలితాలు (కార్యము) అనేవి ఉండవు"అని.
అంటే మనము అనుభవించేది సుఖమైనా కావచ్చులేక దుఖమైనా కావచ్చు
ఈ సుఖదుఃఖాలకు కారణం మనం పూర్వజన్మలలో చేసిన కర్మలైనా కావచ్చు,లేక ఈ జన్మలో చేసిన కర్మలైనా కావచ్చు.మరి మనము చేసిన కర్మల యొక్క ఫలితాలను
మనము ఖచ్చితంగా అనుభవించవలసిందేనా? ఖచ్చితముగా అనుభవించవలసిందే.భగవద్గీత లో శ్రీకృష్ణుడి వాక్కు చూడండి
"అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం".
అంటే "చేసిన కర్మల ఫలితం అది చెడైనా ,మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే."
మీరు బాణం వదిలారు.ఇక అది ఎక్కడికి వెళ్ళేదీ మీ చేతుల్లోనే లేదు.మీరు వదలడంవలన అది ఖచ్చితంగా దేనికో ఒకదానికి తగలకతప్పదు. వేసే ముందే అది మన చేతుల్లోఉంది.
మరి, కొందరు ఈ కర్మసిద్దాంతం పేరు చెప్పి నానా తప్పులు చేస్తున్నారు కదా అని మీరనవచ్చు.నిజమే.వారికి నిజంగా సిద్దాంతం గురించి తెలియదనే అనుకోవాలి.ఇలాంటి వారిని డాంభికులు అంటారు.అంటే లోన ఒకటి ఉంచుకుని బయటికి మరోలా ఉండేవారు.
ఈ కర్మలు మూడు రకాలు.అవి ప్రారబ్ద,సంచిత మరియు ఆగామి కర్మలు.
ప్రారబ్దకర్మలనగా గతజన్మల కర్మల ఫలితాలు. సంచితకర్మలనగా ఈ జన్మలో ఇప్పటివరకు చేసిన కర్మల సంచితం.
ఆగామికర్మలనగా మన ప్రస్తుతము చేయబోవు పనుల ద్వారా భవిష్యత్తులో అనుభవించు ఫలితాలు.


ఈ కర్మసిద్దాంతం లో చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది.ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు."పల్లెటూళ్ళలో ఎద్దులనుకానీ,ఆవులను కానీ లేక గేదెలను గానీ ఒక తాడుతో గుంజకు కట్టిఉండడం చూసేఉంటారు.అవి ఆ తాడు యొక్క పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు.ఎలా ఐనా తిరగవచ్చు.కానీ ఆ తాడు పరిధిని దాటి మా పోలేవు.వాటి స్వేచ్చ అంతా ఆ తాడులోపలే."
"అలానే మనకు భగవంతుడు కొంత స్వేచ్చను ఇస్తాడు.ఇక్కడ తాడు అనగా మన గత కర్మల ఫలితం.మన యొక్క నిష్కామ కార్యాల వలన దేవుడు తాడు పొడవు ఇంకా పెంచవచ్చు.అప్పుడు మరింత స్వేచ్చ మనము పొందగలము."

నిష్కామకార్యాలనగా నిస్సంగత్వంతో పనులు చేయడం.అంటే మన పనుల వలన మనలో ఎటువంటి వికారాలు అనగా ఆ పనికి సంబందించిన ఎటువంటి బంధము కూడా మన మనసులో ఉండరాదు.ఇదే కర్మయోగము అనబడుతుంది.అసలు కర్మలే చేయకుండా ఉండవచ్చుకదా అనుకోవచ్చు.కాని ఏ కర్మా చేయకుండా మనము ఒక క్షణము కూడా బ్రతకలేము.అందువలనే నిష్కామకర్మ చేయమని చెప్పారు.
అసలు తాడే లేకుండా చేసుకోవడానికి ఒక మార్గం ఉంది.అదే కర్మయోగం.క్రితం టపాలో దీని గురించి వివరించడం జరిగింది.క్లుప్తంగా మన పనులను నిస్సంగత్వం తో చేయడం.
ఈ సిద్దాంతంలో ముల్లును ముల్లుతో తీయడం అనేది ఉంది.చెడు కర్మలు అనే ముల్లును మంచికర్మలు అనే ముల్లు తో తీసివేసి తర్వాత ఈ ముల్లును కూడా పారవేయాలి.అంటే మంచిపనులు కూడా చేయకూడదా అని అడగవచ్చు.చేయాలి కాని నిష్కామముగా చేయాలి.నిష్కామకర్మ యొక్క పూర్తీ వివరాలకు భగవద్గీత యొక్క 2,3,4 అధ్యాయాలు చదవండి.

భగవద్గీతలోనే ఇంకో శ్లోకం లో "జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం"అని ఉంది.అంటే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలఫలితాన్ని దగ్దం చేస్తుంది అని అర్థం.
కొందరు అంటారు ఈ జ్ఞానాగ్ని మన పూర్వజన్మల మరియు గత కర్మల ఫలితాన్ని దగ్దం చేయదు అని.కానీ చేస్తుంది.ఉదాహరణకు దశరథుడు చనిపోయినప్పుడు అతని ముగ్గురు భార్యలు ఒక్కసారే విధవలయ్యారా లేక ఒకొక్కరు ఒక్కసారి విధవ అయ్యారా? అలానే జ్ఞానాగ్ని కూడా మన కర్మలన్నిటిఫలితాన్ని దగ్దం చేస్తుంది.ఇక్కడ జ్ఞానం అనగా భగవత్‌జ్ఞానం అనగా సర్వ సృష్టి యందు ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం.మరి ముందే చెప్పారుగా శ్రీకృష్ణుడు గీతలో ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అని.మరి ఇప్పుడేమో జ్ఞానాగ్ని కర్మలను దగ్దం చేస్తుంది అంటున్నాడు.కృష్ణుడు రెండు మాటలు చెప్తున్నాడా అనే సందేహం వస్తుంది.కాని ఆయన అలా చెప్పలేదు.మనకు తెలుసు అగ్ని ఒక వస్తువును పూర్తిగా దగ్దం చేసినా ఆ భస్మం చేసిన జాడ అక్కడే(అనగా బూడిద లేక మసి) ఉంటుంది.
అలానే మనము చేసిన కర్మల ఫలితం దాదాపు పూర్తిగా దగ్దమైనా ఇంకా వాటి జాడ లేశ మాత్రంగా ఉంటుంది.అదెలాగంటే మన గతకర్మల ఫలితంగా మన కాలు ఒక్కటి పోవలసింది అనుకొందాము.కాని మనం సంపాదించిన జ్ఞానాగ్ని వలన మనకాలికి ఒక ముల్లు గుచ్చుకోవడం వలన కర్మ ఫలితం పోవచ్చు.ఈ విధంగా మన కర్మఫలితం ఆ మేరకు తగ్గించబడడం జరుగుతుంది.
ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి భగవత్ప్రీత్యర్థ కర్మలు చేయడం(నిస్వార్థసేవ,సత్యవాక్పరిపాలన,కపటం లేకుండడం మొదలగునవి ),కర్మల పట్ల అసంగత్వం కలిగిఉండడం (కర్మయోగం) అవసరం.

Monday, September 15, 2008

కర్మయోగ రహస్యము

కర్మయోగమనునది నాలుగు యోగాలలో ఒకటి.ఈ యోగ సారాంశమంతా భగవద్గీత లోని రెండు శ్లోకములలొ ఉంది.
వాటి అర్థాలు:
1.కర్మ చేయుటకు నీకు అధికారము గలదుకాని దాని ఫలితమందు ఆసక్తి కలిగివుండుటకు లేదు.అట్లని కర్మలు చేయుట నీవు మానరాదు.

2.ఏ కర్మ చేయుచున్నను నీవు అసంగత్వం తో మరియు శ్రద్దగా నిపుణత్వం తో చేయాలి.అనగా నీవు కావాలనుకున్నప్పుడు ఏ క్షణము లో నైనా ఆ పనితో సంబంధం లేకుండా బయటకు వచ్చేయగలగాలి.

ఈ ప్రపంచములో గెలుపు,ఓటములు అనేవి కేవలము మన శ్రమ పైనే ఆధారపడిలేవు.ఒక పని కావడానికి మన శ్రమ అత్యంత ముఖ్యము ఐనప్పటికీ ఆ పని విజయవంతము కావడానికి ఇంకా చాలా పరిస్థితులు అనుకూలించాలి.ఆ పరిస్థితులలో చాలామటుకు మన చేతులలో ఉండవు.కాబట్టి మన భాద్యత ఏమిటటంటే ప్రయత్న లోపం లేకుండా మన పనిని మనము నిర్వర్తించడం.అటువంటప్పుడు పని సఫలమైనప్పుడు విజయానందం,ఒకవేళ కాకపొతే పనిని నిర్వర్తించిన ఆనందం కలుగుతాయి.అందువలనే పని యొక్క ఫలితంపైన ఆసక్తి ఉంచుకోరాదు.

రెండవ దానికి ఉదాహరణగా యజమాని ఇంట్లో పనిచేయు దాది ని చెప్పుకోవచ్చు. ఆ దాది తన యజమాని బిడ్డలను తన బిడ్డలగా భావించి పెంచుతున్నప్పటికి ఆమె ధ్యాస అంతా తన సొంత ఇంటి పైనే ఉంటుంది.అలా అని ఆమె తన యజమాని పని కూడా శ్రద్దగానే చేస్తుంది.ఏ లోటూ రానివ్వదు.అంటే మనము పని చేయుచున్నప్పటికి మన మనసు భగవంతుని దగ్గర ఉండాలి.ఇదే కర్మయోగ రహస్యము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు