తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, August 21, 2008

ఆనందంగా జీవించండి (వ్యక్తిత్వవికాసం)

ఎన్నో ఆందోళనలకు,మనశ్శాంతి కరువవడానికి,చేస్తున్న పనులు సరిగా చేయకపోవడానికి ప్రధాన కారణం "మనిషి వర్తమానంలో జీవించకుండా గతంలో జీవించడం,అలాగే భవిష్యత్తును ఎక్కువగా ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని సరిగా జీవించలేకపోవడం".ఒక్క విషయం ఇక్కడ మనుషులు గమనించడం లేదు.మన ప్రస్తుత పరిస్థితి గతంలో మనం చేసిన పనుల యొక్క ఫలితం.అలాగే ఇప్పుడు మనం చేయబొయే పనులపైనే మన భవిష్యత్తు ఆధారపడిఉంటుంది.ఇది తెలుసుకోకుండా గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి అదేపనిగా బాధపడడం,మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధపడడం జరుగుతోంది.తద్వారా ఇప్పుడు అనగా వర్తమానంలో సరిగా పనులుచేయకపోవడం వలన గతకాలపు చేదు జ్ఞాపకాలనూ చెరిపివేయలేము,అలాగే అనుకున్న ఆశావహ భవిష్యత్తునూ జీవించలేరు.

"తప్పులు చేయడం మానవసహజం".కాబట్టి గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం మానేసి తప్పులను మరోసారి చేయకుండా జాగ్రత్తపడాలి.

కాబట్టి జరిగిపోయిన మన చరిత్రను ఒక్కసారి కూలంకుషంగా విశ్లేషించి ఇక సంఘటనలను పట్టించుకోవడం మానివేసి ప్రస్తుతం చేయబోయే పనులపైన దృష్టి పెట్టాలి.అలాగే చేయబోయే పనినైనా ముందుగా పని వలన సంతోషం మిగులుతుందా లేక బాధ ఫలితమవుతుందా అని విశ్లేషించి మొదలుపెట్టాలి.ఇక్కడ ఇంకో విషయం మరిచిపోకూడదు."మన స్వేచ్చ ఇతరులను బాధపెట్టేదైతే మనం స్వేచ్ఛగా ఉండలేము" అన్న విషయం.కాబట్టి మన పనులు సమాజానికి మేలు చేయలేకపోయినా కనీసం హాని మాత్రం చేయరాదు.

అలాగే అనవసరంగా ఎవరినీ అనవసరంగా ద్వేషించకూడదు.మన ద్వేషం వలన ద్వేషింపబడేవారిలో ఏదైనా మంచి మార్పు వచ్చేటట్టైతే మన ద్వేషానికి అర్థం ఉంటుంది.ద్వేషం వలన మనసూ మనశ్శాంతి పొందలేదు.ఉదాహరణకు మనము మనకు ఇచ్చిన పని మనస్పూర్తిగా చేస్తున్నప్పుడు మన ద్వేషానికి కారణమైన మనిషికానీ,సంఘటన కానీ ఎదురైనా లేక గుర్తువచ్చినా మనకు తెలియకుండానే మన మనసు వికలమయ్యి మన పనికి ఆటంకం అవుతుంది. విషయాలన్నీ ఆదర్శపూరిత విషయాలని అనుకోవచ్చు.కాని ఆదర్శంలేని వ్యక్తి కన్నా ఏదో ఒక ఆదర్శం గల వ్యక్తి వలనే సమాజానికి ఉపయోగం ఉంటుందన్న విషయం మనం మరిచిపోరాదు.
అప్పుడే మనము వర్తమానాన్నీ ఆనందంగా జీవించగలము మరియు సుందర భవిష్యత్తునూ జీవించగలము.

Tuesday, August 19, 2008

కొన్ని ఆంగ్ల పదాలు వాటి మూలాలు

సహారా(ఎడారి):

ఇది "సాగర"అను సంస్కృత పదము నుండి వచ్చినది.పూర్వము భూమి అంతా ఒకే ఖండము గా ఉండి ఇప్పటి రూపము సంతరించుకొనేటప్పుడు ఎన్నో మార్పులు జరిగినాయి.భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారము సహారా ఎడారి ఒక ఎండిపొయిన సముద్రము."సాగర" అను సంస్కృత పద రూపాంతరమే నేటి "సహారా" అను పదము అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.

కాలిఫోర్నియా:

మన రామాయణము లోని సగర కుమారుల వృత్తాంతము అందరికీ తెలిసేవుంటుంది.వారు కపిలమహర్షి నివశించే అరణ్యము లోనికి వెళ్ళి ఆ మునికి తపస్సు భంగము గావిస్తారు.అప్పుదు కపిలుడు వారిని బూడిద చేస్తాడు.ఈ "కపిలారణ్య"మే నేటి కాలిఫోర్నియా అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.ఇందుకు నిదర్శనము గా నేటికీ అక్కడ కనిపించే ప్రఖ్యాత " ఫౌంటైన్ యాషెస్".అనగా బూడిద ఫౌంటైన్స్.

దశావతారాలు - అంతరార్థం

ఈ క్రింద చెప్పబడిన విషయాలను ఆధ్యాత్మిక దృష్టి ద్వారా లేక మతపరంగా కాకుండా విజ్ఞానదృష్టి తో చూడాలని కోరుతున్నాను.
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.
అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.

అదెలాగంటే

1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.
2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.
3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.
4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.
5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.
6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.
7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.
8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.
9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.
10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు.

Monday, August 18, 2008

ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్తలు)

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న("0") ను అందించిన గొప్పవాడు.

ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.

ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.

గణితంలో ఇతని ఘనకార్యాలు:

1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన "భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం" గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని "పై"విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.

వీరు క్రీ.శ.550 లో మరణించారు.

మహోన్నత జీవితానికి మూడు సూత్రాలు

సత్యం,పవిత్రత,నిస్వార్థం ఈ మూడు గుణాలున్న వ్యక్తిని ముల్లోకాల్లోని ఏ శక్తీ ఏ హానీ చేయలేదు.ఈ మూడు సద్గుణాలతో శోభిల్లే వ్యక్తి సమస్త విశ్వాన్నీ ఎదుర్కోగల
సమర్థుడు
-- స్వామివివేకానంద
.సత్యం:
"సత్యం" ఈ మాట వింటేనే మనలో చాలామందికి వణుకు వస్తుంది.కానీ ఒక్కటి మరువరాదు
"సత్యమేవ జయతే,నానృతం" - ముండకోపనిషత్తు
సత్యమే జయిస్తుంది,అసత్యమెన్నటికీ కాదు.
అందరూ అనుకుంటారు " సత్యమే మాట్లాడుతూ కార్యాలయాలలోనూ,వ్యాపారాలలోనూ ఈ కాలంలో పనిచేయడం అసంభవం అని".కానీ ఇక్కడ గమనించవలసిన
విషయం ఏమిటంటే "సత్యం పురాతనమైనా,ఆధునికమైనా ఏ సమాజానికీ తలవంచదు;సమాజమే సత్యానికి తలవంచాలి".
సత్యం యొక్క తక్షణఫలితాలు చేదుగా అనిపించినా అంతిమ ఫలితం శుభమే అన్న విషయం చరిత్రలో ఋజువైంది.సత్యం పలుకువాడు దేనికీ తలవంచనవసరం
లేదు,భయపడనవసరం లేదు.

.పవిత్రత:
"పవిత్ర హృదయులు ధన్యులు.ఎందుకంటే వారు దేవుడిని దర్శిస్తారు" - బైబిల్
పవిత్ర హృదయం అనగా నిష్కల్మష హృదయమే.ఏదైనా పని నిర్విఘ్నంగా సాధించాలంటే ముందు మన మనసు పరిశుభ్రంగా ఉండాలి.ఆ పని చేస్తున్నంతవరకూ మన శ్వాస,ధ్యాస అంతా అప్పటికి ఆ పనే కావాలి.కాని ఇది సాధ్యం కావాలంటే పవిత్రమైన మనసుకు తప్ప మరేవిధంగానూ సాధ్యం కాదు.
పవిత్రత నిండిన హృదయం కులం,మతం,జాతి,సంప్రదాయం-అనే భేదబుద్ధిని విడిచి సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకుంటుంది.అప్పుడు మన పనికి ఏ విధమైన ఆటంకమూ ఏమీ చెయ్యలేదు.ఎందుకంటే అప్పుడు మన మనసు పవిత్రం కావడం వలన ఏ ఆటంకమునైనా మనము తేలికగా దాటగలము.

.నిస్వార్థత:
నేడు ప్రపంచంలో చాలామంది తమ స్వార్థం కోసమే జీవిస్తున్నారు.ఇక్కడ స్వార్థం అనగా స్వ+అర్థం=సొంత ప్రయోజనం కోసమే అని.
నిజం చెప్పాలంటే స్వార్థం లేనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు.కాని ఆ స్వార్థ శాతాన్ని తమ జీవితంలో ఎంతమేరకు తగ్గించుకుంటారో అంత ఎక్కువ ఆనందం అనేది అనుభవం అవుతుంది.
"చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష" అని అనుకున్నంత కాలం స్వార్థం అనేది లవలేశమైనా తగ్గదు.అందరికీ అనుభవమే పంచుకొని తినడంలో,అనుభవించడంలో గల ఆనందం.కాని ఎవరూ ఆచరణలో పెట్టలేకపోతున్నారు.ఎప్పుడైతే నిస్వార్థత మనకు కలుగుతుందో అప్పుడే మనశ్శాంతి వస్తుంది.కోట్లు సంపాదించినా పొందలేని మనశ్శాంతి మన వశమవుతుంది.
మనం ప్రపంచాన్ని మన మనసు ద్వారానే చూస్తున్నము కాబట్టి పరిశుద్దమైన మనసు ద్వారా మనకు ప్రపంచంలోని మంచే కనిపిస్తుంది.

సత్యం ద్వారా పవిత్రత,తద్వారా నిస్వార్థత అలవడుతాయి.

Sunday, August 17, 2008

శ్రీరామకృష్ణ పరమహంస

శ్రీరామకృష్ణ పరమహంస గారు అంటే తెలియని ఆస్తిక భారతీయులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు.భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామివివేకానంద వెనుకగల కర్త,కర్మ,క్రియ అంతా శ్రీరామకృష్ణులే.

జననము మరియు బాల్యము
శ్రీరామకృష్ణ పరమహంస గారు క్రీ.శ 1836,ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్,చంద్రమణిదేవి.వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు.రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు.బాల్యం నుండే ఇతనికి లలితకళలు,చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది.ఐనా ఇతనికి పాఠశాల విద్య అంటే ఏహ్య భావము కలిగిఉండేవాడు.దానివలన చదువు అబ్బలేదు.పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు.వారిని సేవించేవాడు.
ఉపనయనం తర్వాత చిన్నప్పుడు ఒక దళిత మహిళకు ఇచ్చిన మాటప్రకారం బంధువులు వారిస్తున్నా మొదటి భిక్షకు వెళ్ళి స్వీకరించాడు.
రానురాను వీరి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారటంతో వీరి అన్నగారైన రాంకుమార్ గారు కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాలను నడిపేవారు.తర్వాత ఒక అంత్యకులంలో జన్మించిన రాణిరాస్మణి దక్షిణేశ్వరంలో నిర్మించిన కాళికాలయంలో పూజారిగా నియమితుడయ్యాడు.

పూజారిగా
మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు పూజలో సేవచేసేవాడు.గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.కాలక్రమంలో తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవల్లు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు.ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు.అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు.నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు.

వీరి గురువులు మరియు సాధనలు
కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు.వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు.తర్వాత భైరవీబ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు.ఈ విధంగా భగవత్,ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం,క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశాం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.

వివాహము
వీరు భగవత్ధ్యాసలో ఉండడాన్ని పిచ్చితనంగా భావించిన వీరి తల్లి వీరికి వివాహము చేయ సంకల్పించింది.రామకృష్ణులే తమకొరకు ఒక అమ్మాయి సిద్దంగా ఉన్నదని ఆమె పేరు శారదాదేవి అని చెప్పి శారదాదేవిని పెళ్ళాడారు.ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు.ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.

గురువుగా
తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందముగ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యౌలు రావడం ప్రారంభించారు.వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరిపేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు.వీరి పరిచయం విచిత్రంగా జరిగినది.
అప్పటికి వివేకానందులు నిజంగా భగవత్ అనుభవమ్ పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు."మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు.రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆద్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.

రామకృష్ణులు ప్రపంచానికి అందించిన శిష్యులు:
స్వామి వివేకానంద,స్వామి బ్రహ్మానంద,స్వామి ప్రేమానంద,స్వామి శివానంద,స్వామి త్రిగుణాతీతానంద,స్వామి అభేదానంద,స్వామి తురీయాతీతానంద,స్వామి శారదానంద,స్వామి అద్భుతానంద,స్వామి అద్వైతానంద,స్వామి సుభోదానంద,స్వామి విజ్ఞానానంద,స్వామి రామకృష్ణానంద,స్వామి అఖండానంద,స్వామి యోగానంద,స్వామి నిర్గుణానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వీరు సన్యాస శిష్యులు.గృహస్థ శిష్యులలో నాగమహాశయులు,పూర్ణుడు,గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.

వీరి ప్రముఖ భోదలు
#అన్నిమతాల సారాంశం ఒక్కటే.
#కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
#మానవసేవే మాధవసేవ
#ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
అలాగే స్వామీ వివేకానందుని భోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
అంత్యదశ
వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు.
చివరికి వీరు 1886,ఆగష్టు 16 న భగవంతునియందు లయించారు.

Thursday, August 14, 2008

కొన్ని ధైర్య-ఆత్మవిశ్వాస ఉత్పాదక వచనాలు

నీవు నిత్యం నిర్భీతునిగా ఉండు.భయమే మృత్యువు,నిర్భయమే జీవితము.

అచంచల ఆత్మవిశ్వాసం గలవాడికి సముద్రం పిల్లకాలువ లాగా,మహోన్నతపర్వతాలు గోపాదంలాగా కనిపిస్తాయి.

--స్వామి వివేకానంద

భగవంతుడు మనిషికి ఎదుర్కోలేని కష్టాలు ఇవ్వడని గుర్తుంచుకో.
-- పరమహంస యోగానంద

అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖముంటుంది.సాదించి శోధించాలి.
-- శ్రీశ్రీ

నీకు విజయం వరించాలని ఆశించబోయేముందు అందుకు నీవు అర్హుడవో,కావో ఆలోచించు.
-- ఖలీల్ జిబ్రాన్

Wednesday, August 13, 2008

భూమి గుండ్రం (వేదాలు)

మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు? మనం చదువుకున్నది 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్,కోపర్నికస్,గెలీలియోలని.

కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం " భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."

అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది" అని దాని అర్థం.

ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం " భూగోళః సర్వతో వృత్తః" అంటే " భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.

క్రీ.శ.505 లో వరాహమిహిరుడు " పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)"
అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.

లీలావతి గ్రంథం లో భాస్కరాచార్యుడు " నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."
శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో

Thursday, July 31, 2008

భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి)

1. సున్న("0") ను కనుగొన్నది ఆర్యభటుడు (ఈతని పేరే మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పెట్టారు)
2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు.
3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
3."ఫోర్బ్స్" పత్రిక ప్రకారం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం.
4.పాశ్చాత్యప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీ ని ఏనాడో 2600 సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతుడు చేసాడు.
5.దేశప్రాంత పటాలు 5000 సంవత్సరాల పూర్వమే సింధునాగరికత కాలంలోనే మనవారు కనుగొన్నారు.ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం ఐన నవగతిః నుండి వచ్చింది.
6.పైథాగరస్ సిద్దాంతాన్ని,"పై" విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే.
7.గ్రీకులు,రోమనులు 105 అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు 1053 వరకు లెక్కించారు.
8.1896వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు,ఎగుమతిదారు ఒక్క భారతదేశమే.
9.మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు.
10.చదరంగం కనుగొన్నారు.
11.పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్నకాలం లోనే మనవారు సింధునాగరికత లో ఉన్నారు.
12.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.

Wednesday, July 30, 2008

త్రైలింగస్వామి (మన మహాత్ములు)

త్రైలింగస్వామి 1601 వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు.వీరి తల్లిదండ్రులు నరసింగరావ్,విద్యావతి.స్వామి వారు శివుడి అవతారంగా చెప్పబడ్డారు.

స్వామివారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం.స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు.తన తల్లి చెప్పే రామాయణ,మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు.ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు.అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు.తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు.తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150సంవత్సరాలు పైన ఉన్నాడు.

స్వామివారు కేవలం ఆకులూఅలములు,పండ్లుఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు.

స్వామివారు ఎన్నోవిషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు.వేలాదిప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు.ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు.ఒక్కొక్కసారి నీటిలోపల ,అలలక్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు.వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికాఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం ,స్వామికి ఏమీకాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.

స్వామివారు అద్వైతఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.

స్వామి వారు విషపూరితద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామివారు అబద్దాలకోరు అని ఋజువుచేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు.సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు.
త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు.స్వామివారిని కరుణించమన్నాడు.అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా!సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను.ఇంకెప్పుడు ఇలా చేయవద్దు.వెళ్ళీపో"అన్నాడు.ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.

స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు.అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది.అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు.కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పులపైన పచార్లు చేస్తూ కనిపించేవారు.ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు.అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా.అలా ఐతే నీ మలం నీవే తినగలవా?"అని ప్రశ్నించాడు.స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు.ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది.ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు.

ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.

స్వామివారు పుష్యశుక్లఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు.వీరి సమాధి కాశి లో పంచగంగఘాట్ లో ఉంది.

స్వామి వారిని దర్శించిన మహాత్ములు: శ్రీరామకృష్ణపరమహంస,శారదామాత,స్వామి వివేకానంద,పరమహంస యోగానంద,నరసింహ యోగీంద్రులు మొదలగువారు.
క్రియాయోగాన్ని బాబాజి ద్వారా గ్రహించి ప్రపంచానికి అందించిన లాహిరీ మహాశయులు త్రైలింగస్వామికి అత్యంత ఆప్తమిత్రులు.

స్త్రీ అనగా

స్త్రీ అను పదం మూడు అక్షరాలను కలిగిఉంది.అవి స,త,ర.

స - సత్వగుణం - పిల్లలను ప్రేమతో పెంచడం,భర్తను అత్తమామలను,ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం
త - తమోగుణం - పిల్లలను తీర్చిదిద్దడంలో వారిని దండించడం
ర - రజోగుణం - పిల్లలను కనడం

భారతదేశం అనగా

1.సంగీతపరంగా
భా-భావ ర-రాగ త-తాళ యుక్తమైనది భారతదేశం
2.వేదాంతపరంగా
భా(వెలుగుతో) రత(సంగమించేది అనగా నిండిఉండునది) భారతదేశం
3.యోగపరంగా
భా(వెలుగుతో అనగా సత్వగుణంతో) ర(రజోగుణాన్ని) త(తమోగుణాన్ని) జయించినది భారతదేశం

Tuesday, July 29, 2008

సదాశివబ్రహ్మేంద్రస్వామి (మన మహాత్ములు)

సదాశివబ్రహ్మేంద్రస్వామి వారు తమిళనాడు లో జన్మించిన మహాత్ముడు.వీరి తండ్రిగారి పేరు మోక్షసోమసుందర అవధాని.వీరు రామ,కృష్ణులను పూజించేవారు.వీరి భార్య పేరు పార్వతి .ఈమె శివుడిని పూజించేది.అందువలన వీరు తమకు కలిగిన కుమారుడికి శివరామకృష్ణ అని పేరు పెట్టారు.
ఇతను చిన్నప్పటి నుండే మిగతా పిల్లల కంటే తేడాగా ఉండేవాడు.వైరాగ్యం మొదలగు భావాలు ఉండేవి.అందువలన పెళ్ళి చేస్తే అంతా సరిపోతుందని వీరి తల్లిదండ్రులు భావించారు.మొదట స్వాములవారు వ్యతిరేకించినా ఒక కుమారుడిగా వారు చూసిన అమ్మాయిని 17 సంవత్సరాల వయస్సు లో పెళ్ళాడాడు.
కానీ అతను ఏ మాత్రం మారలేదు.అతనిలో వైరాగ్య భావాలు దృఢంగా ఉన్నాయి.ఇలా ఉండగా అతని భార్య పుష్పవతి అయ్యింది( ఆ కాలం లో బాల్యవివాహాల ఆచారం ఉండేది).మొదతిరాత్రిని స్వామిగారి మామగారింట్లో చేయాలని అందుకు తగ్గ వంటావార్పూ,సంభారాలు మొదలు పెట్టారు.స్వామికి విపరీతంగా ఆకలి అయ్యి వంటగది వద్దకు వెళ్ళి "నాకు ప్రత్యేక వంటకాలు అవసరం లేదు.ఏదుంటే అది పెట్టండి తినడానికి"అన్నాడు.అప్పుడు వారి అత్తగారు"దయచేసి కొద్దిసేపు వేచిఉండండి.మీరు ఎక్కువసేపు వేచి ఉండనవసరం లేదు.లోనికిరావద్దు.బయటనే ఉండు"అన్నది.

"లోనికిరావద్దు.బయటనే ఉండు" అన్న మాటలు స్వామిలో అనుకోని మార్పును వెంటనే తీసుకుని వచ్చింది."గృహస్థాశ్రమం లోకి రావద్దు.బయటనే ఉండి జ్ఞానాన్ని పొందు" అని స్వామివారు అర్థం చేసుకున్నారు.ఆకలినే తీర్చలేనివాళ్ళు తనకు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు?అని అనుకుంటూ స్వామి అక్కడినుండి వెల్లిపోయారు.బందువులు అతన్ని కనుగొనలేకపోయారు.

అతను తర్వాత అడవులలోనూ,నదీ తీరాలలోనూ గడిపాడు.భిక్షాటన చేసుకుని ఆకలి తీర్చుకునేవాడు.తనకే ఉండడానికి ప్రదేశంలేనివాడు దేవుడికి ఎక్కడ ప్రదేశం చూపించి పూజించాలి?అందువలన తన హృదయంలో పూజించేవాడు.ఈ మానసిక పూజను తన "శివ మానసికపూజ" అను స్తోత్రంలో వర్ణించాడు.

"ఓ శివా! అంతటా నీవి వ్యాపించిఉన్నావు.నిన్ని నేనెక్కడ పూజించగలను?ఆకాశమే నీ వస్త్రాలైనప్పుడు నీకు నేను ఏ వస్త్రం ఇవ్వగలను?"అంటూ స్తోత్రం చేశాడు.

ఈ హృదయవిదారక ప్రార్ఠన విని శివుడు స్వామివారికి కామకోటిపీఠంకు చెందిన పరమశివేంద్రసరస్వతి ని గురువుగా పంపాడు.గురువుగారు స్వామిని చూసి అతని లోని చైతన్యాన్ని గుర్తించి "సదాశివా"అంటూ పిలిచాడు.అప్పటి నుండి "శివరామకృష్ణ" పేరు "సదాశివ"అయ్యింది.వారి పీఠం పేరు కలుపుకొని "సదాశివబ్రహ్మేంద్రసరస్వతి" అయ్యింది.తన గురువుగారిని ఎంతగానోసేవించి అనేక కీర్తనలు,స్తోత్రాలు బ్రహ్మసూత్రాలకు పాతంజలయోగసూత్రాలకు వ్యాఖ్యానం చేసాడు.అన్నిటిని తన గురువుకు అంకితం చేసాడు.తన స్తోత్రాలకు మకుటం గా "పరమహంసగురు" అని ఎంచుకున్నాడు.
స్వామివారు ఎంతోమందితో వాదించి అందరినీ ఓడించేవాడు.ఒకసారి ఇలా ఓడిన పండితుడు గురువుగారికి ఫిర్యాదు చేసాడు.అప్పుడు గురువు గారు" ఓ! సదాశివా! నీవు ఎప్పుడు నిశ్శబ్దంగాఉంటావు?"అన్నాడు.మీ అనుగ్రహంతో ఇప్పుడే అంటూ సదాశివులవారు అన్నారు.గురువుగారి నుండి వెళ్ళిపోయి తను మౌనంలో అనుభవించిన అనుభవాలను తన కీర్తనల్లో వర్ణించాడు.లౌకిక విషయాలను వదిలి పెట్టి తనలోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ,తన దగ్గరకు వచ్చింది తింటూ జీవించాడు.

ఒకసారి ఈవిధంగా సమాధిస్థితిలో ఒక గడ్డివాము దగ్గర నిలిచున్నాడు.ఆ వాము యజమాని స్వామిని ఒక దొంగ అనుకొని కొట్టబోయాడు.వెంటనే అతను శిలావిగ్రహంలా ఉండిపోయాడు.స్వామికి ఇవేమీ తెలియదు.మరుసటి ఉదయం మెలకువలోనికి వచ్చినప్పుడు నవ్వుతూ ఆ రైతు వంక చూడగా ఆశ్చర్యకరంగా అతను మళ్ళీమామూలుగా అయ్యాడు.క్షమాపణ ఆడిగాడు.స్వామి నవ్వుతూ వెల్లిపోయాడు.ఒకసారి ఇదేవిధంగా సమాధిస్థితిలో కావేరి నదీతీరంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయాడు.మూడునెలల తర్వాత రైతులు ఇసుకమేటలు తొలగిస్తున్నప్పుడు ఒక గడ్డపార తగిలి స్పృహలోకి వచ్చి ఏమీజరగనివాడిలా వెళ్ళిపొయాడు.ఇలాంటి మహిమలెన్నో స్వామిజీవితంలో జరిగాయి.

చివరికి స్వామివారు తమిళనాడులోని నేరూరు లో స్థిరపడ్డారు.అక్కడి రాజు స్వామి ఉపదేశాలను పాటించి పరిపాలన చేసాడు.ఇప్పటికీ తమిళనాడు లో స్వామి కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

స్వామి వారి ఉపదేశం " నీవుకోరుకున్నది చేయవద్దు.అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చు" అని.

స్వామివారు నేరూరులోనే సమాధి పొందారు.

తెలుగు లిపి యొక్క పరిణామము

విద్యుత్తు ప్రస్తావన (వేదాలు)

ఋగ్వేదం లో ఒక శ్లోకం యొక్క అర్థం(నాకు శ్లోకం దొరకలేదు)

" అప్పుడు ఆ దేవత జలం నుండి ఒక శక్తిని తీశాడు.ఆ శక్తి మూడు పాములు కలిగిఉంది.ఆ పాముల తలలు ఒకటి ముందుకు,ఒకటి వెనుకకు ఒకటి భూమి వైపుకు ఉన్నాయి.ఆ శక్తిని రాక్షసుల పై ప్రయోగించాడు.ఆ శక్తి తగిలిన రాక్షసులందరూ భస్మం అయ్యారు.ఆ శక్తి తిరిగి దేవత దగ్గరకు వచ్చిచేరింది"

శ్లోకం గమనిస్తే పాము మూడు తలలూ ధనాత్మక,ఋనాత్మక మరియు భూమిలోకి(ఎర్త్) లను సూచిస్తున్నాయి.విద్యుత్తు తాకినప్పుడు కలిగే ప్రభావం గురించి చెప్పడం జరిగింది.తిరిగి వలయం(సర్క్యూట్) పూర్తవ్వడం తెలుస్తోంది.

బ్రహ్మజ్ఞాని లక్షణాలు

ఆదిశంకరాచార్యుని "వివేకచూడామణి" ప్రకారం బ్రహ్మజ్ఞాని నాలుగు లక్షణాలు కలిగిఉంటాడు.

అవి బాలక,జడ,పిశాచ మరియు ఉన్మత్త లక్షణాలు.

1.మనస్తత్వంలో స్త్రీ,పురుష భేధాలు లేక బాలక అవస్థ కలిగిఉండడం
2.బ్రహ్మనిష్ఠ(సమాధి స్థితి) లో ఉన్నప్పుడు జడుడిలా ఏమీ పట్టించుకోకుండాఉండడం
3.పగలురాత్రి అనే తేడా ఏమీలెకుండా,ఏమాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చిన విధంగా సంచరించునప్పుడు పిశాచంలా (అంటే శుచిశుభ్రత అనేవి పట్టించుకోకుండా తిరగడం)
4.తమ బ్రహ్మనిష్ఠ కు భంగం కలుగకుండా ఇతరుల పట్ల ఉన్మత్తునిలా (పిచ్చివాడిలా) ఉండడం,కానీ వీరు ఎవరికీ ఎటువంటి హానీ కలిగించరు

Monday, July 28, 2008

శుకమహర్షి - మన పురాణ ఋషులు

శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

జన్మరహస్యము:
ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ, సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది.అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను.కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు.పరమశివుడు మొదట నంది ని,ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు.అక్కడినుండి పంచభూతములను,గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు.పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు.కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక విషయాలను వింది. విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి మరణం వచ్చునట్లు శపించాడు.కాని మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు. చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి.అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది.

పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు.అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు.జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి.ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది.విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు.శుకుడు అతనివద్దకు బయలుదేరాడు.జనకునికి విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు.శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు. విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు.శుకుడు మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు.మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు.రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి.కానీ శుకుడు విధంగానూ చలింపలేదు.అప్పుడు జనకుడు శుకుడికి ఒక అంచులవరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు.కాని శుకుడు మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు.అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు,నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు.కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు.శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.
ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు.ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు.అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను.నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.వెదవ్యాసుదు వచ్చి కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి.అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు.కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు.వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు.దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు.వారి నవయవ్వనం లోఉన్న,దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు.వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు.ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" అమ్మాయిలారా!మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు.కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు.ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు"మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు,ఎలాంటి బందాలు లేనివాడు.కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు.అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది.మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.
ఇదీ శుకమహర్షి చరిత్ర.
శుకుడి విశేషాలు:
1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షి గారే.
2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు,నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు.వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.
3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షిగారే.

Friday, July 25, 2008

సూర్యచికిత్స-ఆలోచించవలసిన విషయము ( వేదాలు)

ఋగ్వేదం, మొదటి మండలం,9 వ అనువాకం 50వ సూక్తం,11వ శ్లోకం

उद्यन्नद्य मित्रमह आरोहन्नुत्तरां दिवम

हर्द्रोगं ममसूर्य हरिमाणं च नाशय

అర్థము:

ఓ సూర్యదేవా! నీవు అందరికీ సమాన తేజస్సు ఇస్తావు.ఉదయం సమయాన ఆకాశము ఎక్కుతావు.నీవు హృదయ రోగమును అలాగే కామెర్లు,పాండురోగము లను నివారింపుము.

ఇక్కడ సూర్యరశ్మిని పై వ్యాధులకు చికిత్స గా చెప్పినారు.
మరి ఇప్పటి విఙ్ఞానము ఈ విషయాన్ని కనుగొన్నదోలేదో నాకు తెలియదు.ఒకవేళ కనుగొని ఉంటే తెలుపగలరు.

Thursday, July 24, 2008

కాంతి - దాని ధర్మము (వేదాలు)

ఋగ్వేదం ఆరవ అనువాకం,30వ సూక్తం లోని 20,21,22 శ్లోకాలు

कस्त उषः कधप्रिये भुजे मर्तो अमर्त्ये कं नक्षसे विभावरि
वयं हि ते अमन्मह्यान्तादा पराकात अश्वे न चित्रे अरुषि
तवं तयेभिरा गहि वाजेभिर्दुहितर्दिवः अस्मे रयिं निधारय


"అంతము ఎరుగని ఉషస్సా! నీవు స్తుతి ప్రియవు.నీ అందాన్ని ఆనందించని మనిషి ఉన్నాడా?ఎవరైనా నీ కాంతి ని అందుకొనగలరా? ఓ ఉషో దేవీ,నీవు విచిత్రమైన రంగులు కలదానవు.ఆ రంగులు వ్యాపించు రీతి అద్భుతము.నీ దగ్గరికి వచ్చి గానీ,దూరం నుండి గానీ నిన్ను ఆస్వాదించుట సాధ్యము కాదు.నీవు ద్యులోకమునకు కూతరువి."

ఇక్కడ ఉషోదేవి అనగా కాంతి కి అధిష్టాన దేవత.ఇప్పుడు మనము విజ్ఞానము లో పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న కాంతి-ఏక వర్ణం కాదు,అనేక వర్ణాలు కలది అన్న విషయం ఈ శ్లోకం లో ఆనాడే మన వేద ఋషులకు తెలుసన్న విషయం అర్థం అవుతోంది.

ఉపనిషత్తుల సందేశము

ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుజ్ఞీథాః మాగృధఃకస్య స్విద్ధనం

సృష్టి అంతా మరియు సృష్టి అంతా భగవంతుని(ఈశ్వరుని) చే ఆవరింపబడిఉన్నది.భగవంతుడు ఇచ్చిన వాటిని త్యాగబుద్ధి చే అనుభవించాలి.పరుల ధనం ఆశించరాదు.ధనము ఎవ్వరి సొంతమూ కాదు.
ఇది ఈశావాస్య ఉపనిషత్తు లోని మొదటి శ్లోకము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు