1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు.
2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.
ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.
గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించ్ వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది.