ఈ మధ్య ఏవో పరీక్షలు ఉండడం వలన బ్లాగ్ వ్రాసి దాదాపు నెలకు పైగానే అయ్యింది. మళ్ళీ మొదలు పెడుతున్నాను. సరే విషయానికి వస్తాను.
ఈ మధ్య కొన్ని బ్లాగులలో ఒక వింత అయిన విషయాన్ని చూసాను. అదేంటంటే "శ్రీ మహావిష్ణువు వేదకాలములో చిల్లరదేవుడు,తర్వాత లక్ష్మీదేవికి మొగుడు అయినాడు" అని. దీనికి ఉదాహరణగా క్రింద ఇచ్చిన వాక్యాన్ని ఉదహరిస్తున్నారు.
"సమాజానికి అనుగుణంగా దేవుడే మారాడు!...వేదకాలంలో చిల్లర దేవుడిగా ఉండిన విష్ణువు పురాణకాలానికి నాలుగు చేతులతో శంఖుచక్రగధా పద్మాము ధరించి,వర్గ సమాజానికి ఆరాధ్యదేవత అయిన లక్ష్మికి మొగుడై,పాల సముద్రంలో (లేదా వైకుంఠంలో) చేరాడు."
- కొడవటిగంటి కుటుంబరావు, వ్యాసం:జీవితాలు - దేవుడి పాత్ర
పత్రిక: ప్రభంజనం పక్షపత్రిక
తేది: 16.11.1972
అసలు వీరు వేదాలు కనీసముగానైనా చదివారా అని అనిపించింది.
వారెవరో చెప్పారట, ఆ చెప్పినదానిలో నిజము ఉందా? లేదా ? అని కూడా ఆలోచించకుండా మన బ్లాగర్లు తమకు అనుకూలముగా ఉన్నదని ఉదహరిస్తున్నారు.
సరే మనకు తెలుసు ఋగ్వేదము చాలా పురాతనమైనదని. అందులోని 22వ సూక్తము 16 నుండి 21 వరకు మంత్రాలు చూడండి.
अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे | पर्थिव्याः सप्तधामभिः ||
इदं विष्णुर्वि चक्रमे तरेधा नि दधे पदम | समूळ्हमस्य पांसुरे ||
तरीणि पदा वि चक्रमे विष्णुर्गोपा अदाभ्यः | अतो धर्माणि धारयन ||
विष्णोः कर्माणि पश्यत यतो वरतानि पस्पशे | इन्द्रस्य युज्यः सखा ||
तद विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः | दिवीव चक्षुराततम ||
तद विप्रासो विपन्यवो जाग्र्वांसः समिन्धते | विष्णोर्यत परमं पदम
వీటి అర్థాలు:
విష్ణువు ,గాయత్రి(గాయత్రి అనేది ఛందస్సు పేరు) మొదలగు ఏడు ఛందస్సులతో భూమిపై పదవిన్యాసము చేసాడు. ఆ భూమిపై మానవులు ఉన్నారు. ఆ మనుషులను సకలదేవతలు రక్షించాలి.విష్ణువు ఈ జగములో సంచరించినాడు. మూడు విధాలుగా అడుగుపెట్టినాడు. విష్ణువు పాదధూళితో సమస్త విశ్వము నిండిఉన్నది.విష్ణువు అజేయుడు,సకల విశ్వమును పాలించు వాడు. అతడు ధర్మరక్షణకు గాను మూడు లోకాలలో మూడు అడుగులు పెట్టినాడు.విష్ణువు యొక్క కర్మలు చూడండి. మనము విష్ణువు గూర్చి కర్మలు చేయుచున్నాము.ఆకాశమున నిలిచి మనము అంతా చూడవచ్చు. అలాగే విద్వాంసులు విష్ణువు యొక్క మహత్తును ఎప్పుడూ అన్నిచోట్లా చూడగలరు.లోపరహితులు, జాగురూకులు ఐన ఋషులు(వేదకర్తలు) విష్ణువు యొక్క పరమపదమును లో ప్రకాశింపచేస్తారు(ప్రకాశిస్తారు).
ఇంత బాగా ఋగ్వేదం యొక్క 22 వ సూక్తములోనే విష్ణువు యొక్క మహత్వాన్ని వర్ణించారు.
ఇంతేకాక ఋగ్వేదం(10.8.90) లోని పురుషసూక్తం అలానే విష్ణుసూక్తము మరియు తైత్తిరీయరణ్యకం(4.10.13) (యజుర్వేదం) లోని నారాయణసూక్తం అన్నీ విష్ణువును స్తుతించేవే. ఇవన్నీ వేదాలలోనివే కదా.
ఇక లక్ష్మీదేవి విషయానికి వస్తే వేదకాలము నాటికే లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు భార్య అనే విషయం ఇంతకుమునుపు ఉదహరిచిన పురుషసూక్తం మరియు శ్రీసూక్తముల ద్వారా తెలుసుకోవచ్చు.
1.పురుషసూక్తములోని 24వ మంత్రములో "హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ" అంటే లక్ష్మీదేవి మరియు హ్రీదేవి భార్యలుగా కలిగినవాడవు అని.
2.ఇక శ్రీసూక్తం లో "లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం" అనే శ్లోకములో "శ్రీరంగధామేశ్వరీం" అనియు మరియు "వందే ముకుందప్రియం" అనియు ఉన్నాయి. శ్రీరంగధామేశ్వరీం అంటే శ్రీరంగములో వెలిసిన దానా అని అర్థము.శ్రీరంగములో ఉన్నది శ్రీరంగనాథుడు అంటే శ్రీమహావిష్ణువు అని మనకు తెలుసు. అలాగే ముకుందుడు అన్నా విష్ణువే అనియు ముకుందప్రియం అంటే విష్ణువుకు ఇష్టమైనదానా అని అర్థము కదా.
3. శ్రీసూక్తములోనే "పద్మప్రియే పద్మహస్తే" శ్లోకములో "విష్ణుమనోనుకూలే" అని, "ఓం విష్ణుపత్నీం క్షమాందేవీం" అనియు
4."సరసిజనిలయే సరోజహస్తే" శ్లోకములో" భగవతి హరివల్లభే మనోజ్ఞే" అనియు
5. ఇక లక్ష్మీదేవి గాయత్రీమంత్రములో " ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి, తన్నో లక్ష్మిః ప్రచోదయాత్" అని ఉన్నది కదా.
పైవన్నీ ఋగ్వేదములోని శ్రీ సూక్తములోనివే. ఋగ్వేదము అత్యంత ప్రాచీనము అని మనకు తెలుసు.
అందులోనే ఇవన్నీ ఉన్నాయంటే వేదకాలములోనే మహావిష్ణువుకు లక్ష్మీదేవి భార్యగా ఉందని కదా అర్థము. అంతేకాని పురాణాలకాలములో విష్ణువుకు ఎవరూ లక్ష్మీదేవిని అంటగట్టలేదు.
అలాంటిది విష్ణువును చిల్లరదేవుడని ఎలా అనగలరు? చెప్పేముందు కనీసము మూల గ్రంథాలను చదివితే బాగుంటుంది.
అలానే వారెవరో వ్రాసారని మనము ఏ మాత్రం ఆలోచించకుండా ఉదహరించడం మిగతావారిని బాధపెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి.
ఈ టపా కేవలము "విష్ణువు వేదకాలములో చిల్లరదేవుడు కాడని,వేదకాలమునాటికే విష్ణుపత్ని మహాలక్ష్మీదేవి అని" నిరూపించడానికే వ్రాశాను. వ్యాఖ్యలు ఈ విషయానికి సంబంధించే వ్రాయగలరు. అంతేకాని విషయసంబంధము లేకుండా వ్యాఖ్యానిస్తే తొలగిస్తాను