ఈ సంఘటన నిజంగా ఈ రోజు నేను చూసిన సంఘటన.
స్టీరింగ్ (సెవెన్ సీటర్) ఆటోలో నేను వెళ్తుంటే అదే ఆటోలో ఒక తల్లీ,కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది.
తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకు మీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"
కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలని అనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"
తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"
కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడా ఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2వ తరగతిలోనే హాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదా మేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలని అప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐనఈ విషయం ఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడు నెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక ఈ టాపిక్ ఎప్పుడూమాట్లాడకు.
ఇక్కడ నేను ఆటో దిగేసాను. తర్వాత ఏం వాదం జరిగిందో నాకు తెలీదు.ఆమె చేతిరుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లుఅనిపించింది.
కాని ఈ సంఘటన నాలో నేటి మానవసంబంధాలను గూర్చి ఏవేవో అస్పష్ట ఆలోచనలను రేకెత్తిస్తోంది .