ప్రస్తుత పరిస్థితులలో మన పెద్దల, ఋషుల మాటలు మనం సరిగా అర్థం చేసుకోలేక తికమకపడుతూ, అర్థం కాకపోతే వారిమాటలు ఉత్త మాటలే అని, ఆచరణ యోగ్యం కాని మాటలు అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాం. తద్వారా జీవితపు నిజమైన ఆనందాలను కోల్పోతున్నాము.
మన అందరికీ అహింస అనే భావన తెలుసు అనుకుంటున్నాము. నిజంగా ఎంతమందికి అహింస గురించి సరిగా తెలుసో నాకు తెలియదు కాని నాకు మాత్రం అహింస గురించి తెలుసు అనుకున్నది చాలా ,చాలా తక్కువ మాత్రమే అని తెలుసుకున్నాను.
నేను తెలుసుకున్నది గురుశిష్యుల సంవాదంగా వ్రాస్తున్నాను.
ఒక గురువు,శిష్యుడు ఏదో విషయాన్ని గురించి గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక దోమ ఒకటి శిష్యున్ని కుట్టుతోంది. శిష్యుని దృష్టి ప్రక్కకు మరలుతోంది. ఆ దోమను చంపాలని చేయి పైకెత్తాడు. కాని అహింస గుర్తుకు వచ్చి చంపలేదు. అప్పుడు
గురువు: పని (చంపడం) పూర్తి చెయ్యలేదేం?
శిష్యుడు: గురువు గారూ! మీరు జీవహింసను సమర్థిస్తారా?
గురువు: లేదు. కాని నీ మనసులో ఇప్పటికే చావుదెబ్బ కొట్టావు.
శిష్యుడు: నాకు అర్థం కాలేదు.
గురువు: అహింస అనే విషయంలో మన ఋషుల ఉద్దేశ్యం , చంపాలన్న "కోరిక" ను తొలగించడం. అహింసను పాటించడానికి అక్షరాలా అసౌకర్యంగా ఏర్పాటైంది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్నినాశనం చెయ్యకతప్పని పరిస్థితులు వస్తే రావచ్చు. కాని అదేవిధంగా కోపం,ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మాత్రం రాకూడదు.ఈ ప్రపంచపు గాలిని పీల్చుకునే హక్కు అన్ని జీవరాశులకూ ఉంది.
హింసించాలన్న కోరికను జయించడమే ముఖ్యం.
శిష్యుడు: క్రూర జంతువును చంపడానికి తాను బలి కావడానికి సిద్ధం కావాలా?
గురువు: అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. దైవసాక్షాత్కారానికి కానీ, అన్ని జీవులకు సేవ,సహాయం చేయడానికి కానీ మిగతా జీవులతో పోలిస్తే మానవుడికే ఎక్కువ సదుపాయం కల్పించబడింది.
ఒక వ్యక్తి ఒక జీవిని కానీ, మరే జంతువును కానీ చంపకతప్పని పరిస్థితి వస్తే అతడు స్వల్ప పాపానికి గురి కావాల్సి వస్తుందన్నది నిజమే.కాని నిష్ప్రయోజనంగా మానవ దేహం నాశనం కావడం తీవ్రమైన ధర్మ ఉల్లంఘన క్రిందికే వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి.