తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, April 8, 2014

రామ నామం అత్యంత శక్తివంతం అని ఎందుకంటారు ?


మన ఆనందం కానీ వేదాలు యే పురుషోత్తముని పరబ్రహ్మంగా స్తుతిస్తూ ఉన్నాయో ఆ శ్రీరాముడు జన్మించడం ఏమిటి... మనం వారి పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం ఏమిటి...నిజమే ఆ భగవంతుడే కౌసల్యా,దశరథుల పుత్రుడిగా ప్రజలకు ఆదర్శ జీవితం చూపించడానికి జన్మించాడు. ఇక రామాయణం అందరికీ తెలిసినదే...

రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.

అసలు రామనామం ఎందుకు అంత శక్తివంతం ఎందుకు...చాలా మందికి తెలుసు..కానీ తెలియని వారికోసం నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది చెప్తాను.

"రా" అనే అక్షరం అష్టాక్షరీ మంత్రం అయిన "ఓం నమో నారాయణాయ" నుండి, "మ" అనే అక్షరం పంచాక్షరీ మంత్రం అయిన "ఓం నమశ్శివాయ" నుండి వచ్చాయి.

ఈ రెండు అక్షరాలనే ఎందుకు తీసుకొన్నారు ? ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.

"రా" తీసివెస్తే "ఓం నమో నారాయణాయ" కాస్తా "ఓం నమో నాయణాయ" అవుతుంది. అసలు విరుద్దమైన అర్థం వస్తుంది. "నారాయణునకు నమస్కారం" అనే అర్థం బదులు "నడక లేక కదలిక లేని వాటికి అనగా అచైతన్యం(చైతన్యం లేనిది)కి నమస్కారం" అవుతుంది. ఆయణం అనగా నడక అని అర్థం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి.ఇక్కడ ఈ అర్థం తీసుకోబడింది.

ఇక "మ" ను తీసివేస్తే "ఓం నమశ్శివాయ" కాస్తా "ఓం నశ్శివాయ" అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్థం. "నశ్శివాయ" అనగా శివం కానిదానికి నమస్కారం అని అర్థం వస్తుంది.

చూసారుకదా రా,మ అనే పదాలు తీసివేస్తే ఎంత అర్థం మారిపోయిందో..అందుకే ఇవి బీజాక్షరాలు లేక ప్రాణాక్షరాలు అయ్యాయి.

అందుకే ఈ రెండింటినీ కలపడం ద్వారా వచ్చిన "రామ" నామం అత్యంత శక్తివంతం అని అంటారు.

ఇదీ పెద్దల వద్ద తెలుసుకున్న విషయం.

"శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

"రామాయ రామ భధ్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథ నాథ నాథాయ సీతాయాః పతయే నమః"

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు