మన నిత్యజీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి సంఘటనలు యాదృచ్చికమో లేక కాకతాళీయమో అయ్యొండొచ్చు.కాని మనలను చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ఇలాంటి రెండు సంఘటనలు నా జీవితంలో జరిగినవి చెప్తాను.
ఈ మధ్యే అంటే 10 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన.
రాఘవేంద్రస్వామి వారి శ్లోకం
"పూజ్యా రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ|
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే|"
ఈ శ్లోకం నాకు వచ్చినప్పటికీ 10 రొజుల క్రిందట శ్లోకం లో మొదటిపాదం ఒకటే గుర్తుకువచ్చేది. రెండవ పాదం గుర్తుకు వచ్చేది కాదు. ఎక్కడా చదవకుండా, ఎవరితోనూ అడగకుండా రెండవ పాదం గుర్తుకుతెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసేవాడిని. 10 రోజుల క్రిందట బెంగళూరు లో సిటీ బస్సులో వెళ్ళేటప్పుడు గుర్తుతెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఎదురుగా ఒక అబ్బాయి(బహుశా భవననిర్మాణ కార్మికుడు అనుకొంటాను) చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఊగిపోతూ పాటలు వింటున్నాడు.అప్పుడప్పుడు hum చేసుకొంటున్నాడు. ఆ అబ్బాయి తెలుగు పాట వింటున్నాడని అర్థమైంది. ఆ అబ్బాయి ఎందుకో ఇయర్ ఫోన్స్ తీసివేశాడు. ఇంతలో నాకు అకస్మాత్తుగా రెండవపాదం గుర్తుకు వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఆ అబ్బయితో మీది ఏ ఊరు అన్నాను. ఆ అబ్బాయి "అన్నా మాది "మంత్రాలయం", అదే అన్నా రాఘవేంద్రస్వామి మఠం ఉన్న ఊరు " అన్నాడు.
ఈ సంఘటన యాదృచ్చికమే అయ్యుండచ్చు. కాని ఆ క్షణంలో నాకు మాయగా అనిపించింది.
ఇక రెండవ సంఘటన ఏమంటే నా బ్లాగు "లేవండి,మేల్కొనండి..." పేరు 2009 వ సంవత్సరం మొదటిదాక "సత్యమేవజయతే" అనే పేరుతో నడిపేవాడిని. ఒకరోజు రాత్రి అనుకోకుండా బ్లాగుపేరు మార్చేశాను. మరుసటిరోజే "సత్యం" రామలింగరాజు గారు తమ మోసం ఒప్పుకోవడం, "సత్యం" కంపెనీ తిరోగమనం మొదలైంది.
ఈ సంఘటన అత్యంత యాదృచ్చికం,కాకతాళీయం ఐనా నాకు మాత్రం వింతగా అనిపించింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా సంభవిస్తుంటాయి. అను భవించేవాడికి మాత్రం వింతగా,మాయగా,అద్బుతంగా అనిపిస్తాయి.