తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, December 31, 2008

నిన్నటి చిలిపి ప్రశ్నలకు సమాధానాలు

దయచేసి తర్కాలను పట్టించుకోకండి.
1.శ్రీ మహావిష్ణువు ఏ అవతారము ఎత్తినప్పటికినీ భూమిపై ఆ అవతారము జరుగుతున్నా వైకుంఠములో నారాయణుడి రూపములో ఉండేవాడు.కాని చేప,పంది,నరసింహ అవతారాలు ఎత్తినప్పుడు స్వామే స్వయముగా రూపము మార్చుకొని వచ్చాడు.చేప,పంది అవతారాలు ఎక్కడ నుండీ పుట్టలేదు స్వయముగా ఆయనే దిగివచ్చాడు.కాని నరసింహస్వామి అవతారంలో స్థంభం నుండి పుట్టాడు.ఇక బ్రహ్మదేవుడు విష్ణువు నాభిలో నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడికి నాయనమ్మగా "స్థంభాన్ని" చెప్పుకోవచ్చు.
2.చందమామ,లక్ష్మీదేవి ఇరువురూ సముద్రము నుండి పుట్టారు కావున సోదర సంబంధం ఉంది.
3.మహావిష్ణువుకు చెల్లిగా పార్వతీ దేవిని చెబుతారు(నారాయణ-నారాయణి).పార్వతీ దేవి హిమవంతుని పుత్రిక కాబట్టి హిమాలయాలు విష్ణువుకు తండ్రి వరుస అవుతాయి.

Tuesday, December 30, 2008

చిలిపి ప్రశ్నలు ( తర్కాలు(లాజిక్కులు) లాగకుండా సరదాగా సమాధానం చెప్పండి)

1.బ్రహ్మదేవుడి నాయనమ్మగా ఎవరిని చెప్పుకోవచ్చు?
2.చందమామ కు లక్ష్మీదేవికి చుట్టరికం ఏమిటి?
3.శ్రీ మహావిష్ణువుకు హిమాలయానికి గల బంధుత్వం ఏమిటి?

Monday, December 15, 2008

అంతా ఆంగ్లమే-అక్కడక్కడా తెలుగు-వీలైతే విదేశీ భాషలు

ఇదీ నేటి తెలుగు ఛానళ్ళ పరిస్థితి. మన తెలుగు ఛానళ్ళు తెలుగును దాటిపోయి చివరికి ఆంగ్లాన్ని కూడా దాటి ఇతర విదేశీ భాషలను కూడా చేరేసాయి.Grand Final అనేది ఆంగ్లము.Grand Finale(గ్రాండ్ ఫినాలె)అన్నది ఏ భాషో ఏమో.అలాగే program అన్నది కాస్తా programme(ప్రోగ్రామె) అయింది.ఏంటి ఇదంతా?
ఈ మధ్య మన తెలుగు ఛానళ్ళ వారు తమ కార్యక్రమాల పేర్లు కూడా ఆంగ్లంలోనే పెట్టుకుంటున్నారు.చివరికి వార్తలకు కూడా "న్యూస్ అట్ మార్నింగ్ ఎడిషన్" అని ఈవినింగ్ ఎడిషన్ అని,నైట్ ఎడిషన్ అని అంతా ఆంగ్లమే.ఇక ప్రతి కార్యక్రమానికీ ముందు special prograame అని కనిపిస్తుంది.మాట్లాడే బాషా కల్తీయే,వ్రాయడమూ కల్తీయే ఇప్పుడు చివరికి పేర్లు పెట్టడం కూడా అలానే అయిపోతోంది."అంతిమ సమరం","ఆఖరి పోరాటం","విశేష కార్యక్రమం" లాంటి పదాలు ఆకర్షణీయం కాదా? ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో కలిసిపోయిన పదాల గురించి మనం పట్టించుకోనవసరం లేదు.అలాంటివాటిని అలానే వాడుదాము.
ఇక వ్యాఖ్యాతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు పోయే హొయలు సామాన్యులెవ్వరూ పోరు.వారు మాట్లాడుతుంటే పాలు కూడా విరిగిపోయేట్టు ఉంటాయి.వీరు "ఆంగ్లేయ తెలుగువారు".కొన్ని రోజులు పోతే Anglo Indians లానే Anglo Andhrans కూడా ఏర్పడి వారికి కూడా చట్టసభలలో,ఇతర రంగాలలో కొన్ని స్థానాలు ప్రత్యేకముగా కేటాయించవలసి వస్తుందేమో.
"తినగ తినగ వేము తియ్యగనుండు" అన్న చందముగా భాషను మాట్లాడుతూంటే తియ్యగా అవ్వదా? "నా performance చూసారుగా నాకు ఓటు వేయండి" అని పిల్లలు ముద్దుముద్దుగా అంటుంటారు. Performance బదులు "ప్రదర్శన" అనే తెలుగుపదం ఉపయోగిస్తే ఎంత మధురముగా ఉంటుంది.చిన్నచిన్న పదాల దగ్గరే తెలుగును పిల్లలకు అలవాటు చేయకపోతే ఇక వారికి తెలుగు పదాల మధురత్వం ఎలా అలవడుతుంది?
ఇక చాలామందిని మీ రాశి ఏది అని గనుక అడిగినట్లయితే వెంటనే స్కార్పియో అనో,లియో అనో ఆంగ్లరాశుల పేర్లు చెబుతారే కానీ మన భారతీయ రాశుల పేర్లు చెప్పలేరు.అసలు ఎంతమందికి ఇవి గుర్తున్నాయో చెప్పలేము.
మన భాష పరిస్థితి ఎలా తయారవుతున్నదంటే కొన్ని రోజుల తర్వాత వాడుక బాష కూడా గ్రాంధికం అయ్యేటట్లు అనిపిస్తోంది.sorry అనే పదం వాడుకగా "మన్నించండి" లేక "క్షమించండి" అనే పదం ఏదో పెద్ద తప్పు చేసినప్పుడు మాత్రమే ఉపయోగించే పదాలుగా తయారవుతున్నాయి.చాలా పదాల పరిస్థితి ఇలానే ఉంది. "తరగతి","పాఠము,వరుస,వ్యాపకము,స్వస్థలము,నమోదు" లాంటి అందమైన తెలుగు వాడుక పదాలు అవసానదశకు చేరుకుంటున్నాయి.వాటి స్థానంలో class,lesson,line,hobby,native place,register లాంటి పదాలు వాడుకలో చేరిపోతున్నాయి.
కొన్నిచోట్ల ఆంగ్లపదం బదులు తెలుగుపదం గనుక ఉపయోగిస్తే అది బూతులకు దారితీసే పరిస్థితి కూడా ఎదురవుతోంది.ఉదాహరణకు sex అనే ఆంగ్లపదాన్ని కొన్నిచోట్ల వాడుకలో ఉపయోగించకపోతే అదేదో సిగ్గుపడే వ్యవహారంగా,వాడకూడని పదంగా మారిపోయింది.

Saturday, November 22, 2008

మంచిపని కి ఆలస్యం ఎందుకు?(ఒక మంచి కథ)

ఒకసారి ధర్మరాజు కొలువుదీరి ఉండగా ఒక పేదవాడు వచ్చి తనకు ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థిస్తాడు.అప్పుడు ఏదో అవసరమైన చర్చలలో ఉన్న ధర్మరాజు "రేపు రమ్మని" తప్పక సహాయం చేస్తానని అన్నాడు.వెంటనే శ్రీకృష్ణుడు ఒక మూల నుండి ధర్మరాజు తో "ఓ మహానుభావా! సర్వజ్ఞా,సర్వాత్మస్వరూపా" అంటూ సంభోదిస్తూ ప్రత్యక్షమయ్యాడు.ఇది విన్న ధర్మరాజు నిర్ఘాంతపోయి "బావా!ఏంటి అలా సంభోదించావు?" అని బాధపడ్డాడు.అప్పుడు శ్రీకృష్ణుడు "మీరు అతన్ని రేపు రమ్మన్నారు.మరుక్షణం ఏమవుతుందో తెలియదు.అలాంటిది మీరు అతన్ని రేపు రమ్మన్నారంటే మీరు రేపటి వరకు బ్రతికి ఉంటారన్న విషయం మీకు తెలిసి ఉండాలి.అలాగే ఆ పేదవాడు కూడా రేపటివరకు బ్రతికి ఉంటాడని మీకు తెలిసి ఉండాలి.ఒక సర్వజ్ఞునికి మాత్రమే కదా ఇలాంటి విషయాలు తెలిసేది.అందుకే మిమ్ములను అలా సంభోదించాను"అన్నాడు.ఇది విని తన తప్పు తెలుసుకున్న ధర్మరాజు ఆ పేదవాడికి వెంటనే అతను కోరుకున్నది ఇచ్చి పంపాడు.

Thursday, November 6, 2008

మతరహిత సమాజం ఆకాశపుష్పం

అగ్ని,నీరు మొదలగునవి ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ తటస్థంగానే ఉంటాయి.మనం వీటిని ఉపయోగించేదానిని బట్టి అవి ఉపయోగం అవుతాయి. చలికాలంలో అగ్గి దగ్గర కూర్చొని చలి కాపుకుంటాము.ఎంతో హాయిగా అనిపిస్తుంది. కాని ఎండాకాలంలో అగ్గి అంటేనే బయపడతాము. అగ్గి చేతికి తగిలి కాలింది అనుకొందాము."అబ్బా ఈ అగ్గి ఎంత చెడ్డది" అనుకొంటాము.వాస్తవానికి అగ్గి చెడ్డదా?మంచిదా?.ఏమీ కాదు.అది తటస్థము.మనము ఉపయోగించేదాని బట్టి అది ఉపయోగపడుతుంది. నీటి విషయం కూడ అంతే.వాస్తవానికి అవి తటస్థంగానే ఉంటాయి.మనమే వాటికి గుణాలను ఆరోపిస్తుంటాము.

మతం విషయం కూడా అంతే. అందులోని మంచిని గ్రహించినవాడు అదే ప్రకారం ప్రవర్తిస్తాడు.చెడును గ్రహించినవాడు ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. ఇందుకు మనం మతాన్ని నిందించడం తగునా? ఈ మధ్య మతాలు ఉండనవసరం లేదని, చెడును ప్రోత్సహించే మతాలు ఉంటే ఏమి లేకపోతే ఏమి అని అంటున్నారు. వాస్తవానికి సృష్టిలోని ప్రతివిషయంలోనూ గుణ,దోషాలు అనేవి ఉండక తప్పదు. అలాంటప్పుడు మనం ఏమీ ఉండకూడదు అనలేము కదా. దీనికి మతం అనే విషయం మినహాయింపు కాదు.

మానవతను మించిన మతం లేదు అన్న విషయం సరైనదే. ప్రతి మతమూ మానవతను కూడా బోధిస్తుంది కదా? పైన పేర్కొన్నట్టు దోషాలు కూడా ఉంటాయి. సృష్టిలో ఏ ఒక్కటీ పరిపూర్ణం( perfect ) కాదన్న విషయం అందరికీ తెలుసు.మరి మతం అనేది మాత్రం పరిపూర్ణం అని ఎలా భావిస్తారు? సరే అసలు లోపాలే లేని మతం ఒకటి స్థాపిద్దాము అనవచ్చు. కాని పైన పేర్కొన్న విధంగా పరిపూర్ణం ఐనది లేదు కాబట్టి దానిలో కూడా దోషాలు ఉండక తప్పదు. అప్పుడు ఆ దోషాలు నచ్చనివారు ఇంకొక మతం స్థాపించవచ్చు.కథ మళ్ళీ మొదటికి వస్తుంది.

సుఖదుఃఖాలు,మంచిచెడులు మొదలగు ద్వంద్వాలు ఎలానో గుణదోషాలు కూడా అలాగే. అందరికీ తెలుసు సుఖదుఃఖాలనేవి సాపేక్షాలని.ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించడం మన అనుభవమే. కావున మతాలు అన్నింటినీ రద్దుచేసినా అవి కంటికి కనిపించకపోవచ్చు.కాని గుప్తంగా అవి ఉండనే ఉంటాయి. కాబట్టి ఏ మతం వారైనా సరే వారివారి మతాలలోని మంచినే గ్రహించి లోపం అనుకొన్నదానిని వదిలివేస్తే ఏ బాధా ఉండదు.

Sunday, November 2, 2008

సాయనాచార్యుడు (తెలుగు వారి వైభవం)

నేటికీ భారతీయులు కానీ,పాశ్చాత్యులు కానీ వేదాలను అర్థం చేసుకుంటున్నారంటే అది "సాయనాచార్యుడు" రచించిన వేదభాష్యము చేతనే.ఇతని భాష్యము పేరు "వేదార్థ ప్రకాశము".

నా టపా "కాంతివేగం వేదాలలోనే ఉంది" అనే దానిలో కాంతివేగమును సాయనాచార్యుడు తన ఋగ్వేదభాష్యములో ప్రస్తావించాడు అన్న విషయం ప్రస్తావించాను.ఇతను బుక్కరాయల ఆస్థానం లో మంత్రిగా ఉండేవాడన్న విషయం ప్రస్తావించాను.

ఇతను మన తెలుగువాడు కావడం మనకు ఎంతో గర్వకారణం.ఇతని జీవిత కాలం 1315 నుండి 1387.ఇతను తెలుగు బ్రాహ్మణుడు.భరద్వాజ గోత్రీకుడు.వీరి తల్లిదండ్రులు మాయన,శ్రీమతి గార్లు.ఇతని భాష్యము ఎంత ప్రఖ్యాతి పొందినదంటే "మాక్స్‌ముల్లర్" ,కీత్ పండితుడు మొదలగు పాశ్చాత్యులందరు సాయనాచార్యుని భాష్యము అనుసరించియే ఆంగ్లములోనికి,ఇతర విదేశీబాషలలోనికి వేదాలను అనువదించారు.ఇతను రాజనీతికోవిదుడు.ఇతను కంపరాజుకు, బుక్కరాయ, హరిహరరాయలకు మంత్రిగా వ్యవహరించారు.

సాయనాచార్యులు వేదాలకే కాక తైత్తిరీయ బ్రాహ్మణం,తైత్తిరీయ అరణ్యకం,ఐతరేయ బ్రాహ్మణం,ఐతరేయ అరణ్యకం,శతపథ బ్రాహ్మణం మొదలగు 13 పైన వ్యాఖ్యలు వ్రాశాడు.

Saturday, November 1, 2008

ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట


ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట భారతదేశంలోనే ఉంది.అంతేకాక నేటికీ అది చెక్కుచెదరకుండా ఉన్నదన్న విషయం అత్యంత ఆశ్చర్యకరం.కేవలం మరమ్మత్తులు మాత్రం చేశారు.నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ ఆనకట్ట నిదర్శనం.

ఈ ఆనకట్ట పేరు "కలనై".చోళరాజు "కరికాళ చోళుడు" కాలంలో క్రీ.శ 2వ శతాబ్దంలో నిర్మింపబడింది.తమిళనాడు లోని కావేరినది పై తంజావూరు పట్టణానికి 48 కి.మీ దూరంలో నిర్మింపబడి ఉంది.విచిత్రం ఏమిటంటే సిమెంట్ లాంటి ఏ అతుక్కోవడానికి ఉపయోగపడే (బైండింగ్ మెటీరియల్)దీని లో ఉపయోగించలేదు.
కావేరి నదీ జలాలను ఆనాటి నుండి నేటి దాకా నిరంతరాయంగా అనేక వేల ఎకరాలకు నీటిని అందిస్తూంది.
క్రీ.పూ 4వ శతాబ్దంలోనే గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద 'సుదర్శన జలాశయం' నిర్మింపబడింది.

Wednesday, October 29, 2008

మన తెలుగు బ్లాగుల వలన తెలుగు భాషకు ప్రయోజనం ఏమిటి?

మనం అందరము తెలుగులో బ్లాగులు వ్రాస్తున్నాము.ఎంతో కొంత ఐనా తెలుగు బాషకు ప్రయోజనం చేకూరుతున్నదని అనుకొంటున్నాము.గూగుల్ వారు,ఫైర్‌ఫాక్స్ వాళ్ళు తెలుగులో తమ సర్వీసులు అందిస్తున్నారు.బయటివారందరూ తెలుగు కు బాగానే ప్రాముఖ్యత ఇస్తున్నారు.కాని తీరా అసలు ప్రదేశమైన మన రాష్ట్రం వచ్చేటప్పటికి తెలుగు వాడకం ఎంతగా తగ్గిపోతోందో తెలుసు.

మనం మనవంతుగా దృష్టి పెట్టవలసిన నేను అనుకొంటున్న కొన్ని సంఘటనలను క్రింద తెలియజేసుకొంటున్నాను.

1.తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవం గా తెలుగు బాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.అందులో పాల్గొన్న మన ముఖ్యమంత్రి గారు తెలుగు కు ప్రాముఖ్యత ఇస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.కాని అసలు జరిగింది ఏమిటి?ఆ ఉత్సవాలు ముగిసిన వారం లోపే ఆరవ తరగతి నుండి తెలుగును కేవలం ఒక పాఠ్య విషయంగా(సబ్జెక్ట్)గా మాత్రమే బోధించాలని మిగతా అంతా ఆంగ్ల మాధ్యమంలో నే ఉంచాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.
యూరప్ దేశాలలో వారి విద్యావిధానం చూడండి.వారి విద్యావిధానంలో డిగ్రీ వరకు కూడా వారి మాతృభాషలోనే బోధన ఉంది.ఆంగ్లం కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే.కేవలం పిజి మాత్రమే ఆంగ్లమాధ్యమం లో బోధిస్తున్నారు.

2.ఇక రాష్ట్ర రోడ్డు రవాణా విషయానికి వస్తే ఇంకా అధ్వాన్నంగా పరిస్థితి ఉంది.స్థానికంగా మన రాష్ట్రం లోపల నడిపే బస్సుల విషయంలో మాత్రం తెలుగును అమలు చేస్తున్నారు.హైదరాబాదులో మహాత్మాగాంధీ బస్టాండులో వోల్వో(గరుడ) బస్సులు నిలిపే స్థలానికి ఎదురుగా విచారణా కేంద్రం వద్ద ఒక ఫలకం ఉంటుంది.అందులో మన ఆర్టీసి వాళ్ళు ఎంతో గొప్పగా "తెలుగు కనపడాలి","తెలుగు వినపడాలి""తెలుగు కన్నతల్లి లాంటిది" మొదలగు నినాదాలు వ్రాసిఉన్నారు.కాని ఆచరణలో వాళ్ళు చూపిస్తున్నది ఏమిటి? మన రాష్ట్రం నుండి బయలుదేరే అన్ని అంతరరాష్ట్ర బస్సుల పైనా పూర్తిగా తెలుగు తీసివేసి అంతా ఆంగ్లమయం చేసారు.ఇక గరుడ వోల్వో బస్సుల విషయంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది.రాష్ట్రంలోపల తిరిగే బస్సులను కూడా అంతా ఆంగ్లం తో నింపివేసారు.అంతర రాష్ట్ర బస్సుల విషయంలో అంతా తెలుగులోనే వ్రాయాలని అనడం లేదు.ఆంగ్లంతో పాటు తెలుగు కూడా వ్రాస్తేనే కదా,తెలుగు కనపడితేనే కదా మన బాషపై మనకు గల అభిమానం కనీసమైనా ఇతర రాష్ట్రాలవారికి తెలిసేది.కర్ణాటక వారి విషయానికి వస్తే వారి అంతర రాష్ట్ర బస్సులపై కన్నడ,తెలుగు, వోల్వో బస్సులపై కన్నడ,ఆంగ్లం,తెలుగు మరియు తమిళనాడు విషయానికి వస్తే వారి అన్ని అంతర రాష్ట్ర బస్సులపైనా తమిళం,ఆంగ్లంలలో వ్రాసి ఉంటుంది.ఆ విధంగా వారు తమ భాష ను ఇతర రాష్ట్రాలవారికి తెలిసేలా చేస్తున్నారు.తమ భాషా సంస్కృతిని ఇతర రాష్ట్రాలవారు తెలుసుకొనేలా చేస్తున్నారు.ఆంగ్లాన్ని వద్దనకుండానే తమ బాషా సంస్కృతిని కాపాడుకుంటున్నారు.కాని మన విషయం ఏమిటి?ఇంత మాత్రం జ్ఞానం కూడా మన ప్రభుత్వానికి లేదా?

3.ఇక హైదరాబాదు చూసిన వారందరికీ ఒక విషయం తెలుసు.ఒక రాష్ట్ర రాజధానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ దానికి ఉన్నప్పటికీ అసలు లక్షణమైన బాషా సంస్కృతి లక్షణం అన్నది లేదు అని.హైదరాబాదులో తిరుగుతుంటే ఒక విదేశ నగరంలో తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించదు.ఏ దుకాణం పై చూసినా పేరు సూచికలు పూర్తిగా ఆంగ్లంలోనే ఉంటాయి.ఇదే కర్ణాటక,తమిళనాడు విషయానికి వస్తే దుకాణాలపైన ఆంగ్లంతో పాటు ఆయా భాషలు కూడా తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది.ఎవరైనా అమలు చేయకపోతే ఆ దుకాణాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

ఇతర బాషలను మనం ద్వేషించనవసరం లేదు.కాని మన మాతృబాషను మనం మరిచిపోతున్నాము.

మన బ్లాగర్లు ఈ విషయాలపైన ఏమీ చేయలేమా? మనం ఏ విధమైన కార్యాచరణ పథకం చేయలేమా? ఆలోచించండి. సంఘటనలు ఇంకా ముదిరిపోకముందే మనము సంస్థాగతంగా ఏదైనా చేయకతప్పదు.ఇలా ఏమీచేయలేనినాడు మనం మన బ్లాగుల ద్వారా ఒకరికి తెలిసిన సమాచారం మరొకరికి ఇచ్చిపుచ్చుకోవడం,అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే చేయగలము.ఇవి మాత్రమే ఉద్దేశ్యంగా గలవారికి ఏమీ చెప్పడం లేదు.తెలుగు బాషను బ్రతికించుకందామనుకొనే వారికి,కాపాడుకొందాము అనుకొనేవారికి నా ఈ అభ్యర్థన.ఇప్పటికిప్పుడు తెలుగుబాషకు ఏమీ ప్రమాదం లేదని అనుకోవచ్చు.కాని సమస్యా పరిష్కారానికి నడుము బిగించాల్సిన తరుణం ఇదే అని నా ప్రగాఢవిశ్వాసం.

మన బ్లాగుల ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషా పునర్వైభవమే కాబట్టి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
పైన పేర్కొన్నవి కేవలం కొన్ని సమస్యలు మాత్రమే.ఇంకా చాలా ఉన్నాయి.కాని పైన పేర్కొన్నవి తక్షణసమస్యలు అని అనుకొంటున్నాను.
బ్లాగుల ద్వారా ఎలానూ తెలుగుభాషకు సేవ చేసుకొంటున్నాము.ఇకనైనా మనము కార్యాచరణకు నడుము బిగించాలి అనుకొంటున్నాను.అందుకుతగ్గ కార్యాచరణను ఆలోచించండి.

Sunday, October 26, 2008

గణపతి ఆవిర్భావానికి సంబంధించిన కథలు

గణపతి కి సంబంధించిన కథలను చూస్తే మనకు ఆసక్తి కలుగుతుంది.అవేమిటో చూద్దాం.
1.దేవతలు తమ పనులకు కలుగు ఆటంకాలను తొలగించి వాటిని విజయవంతం చేసే ఒక దేవత కావాల్ని శివుడిని వేడుకొన్నప్పుడు ఆయనే స్వయంగా పార్వతీదేవి గర్భంలో వినాయకుడిగా జన్మించాడు.
2.ఒకసారి పార్వతీదేవి తను వంటికి రాసుకున్న లేపనంతో ఏనుగు తల గల ఒక బాలుడి బొమ్మను తయారు చేసి గంగానదిలో విసిరివేసింది.మరుక్షణమే అది సజీవమైంది.గంగాదేవి,పార్వతి ఇద్దరూ ఆ బాలుడిని తమ బిడ్దగానే పిలిచారు.దీనివలన ఆ బాలుడికి ద్వైమాతురుడు అనగా ఇద్దరు తల్లులు గలవాడు అనే పేరు వచ్చింది.
3.పార్వతీ దేవి నలుగుపిండి తో బాలుడిని తయారుచేయడం,అతన్ని పార్వతి కాపలాగా ఉంచుకోవడం,అతడు శివుడిని అడ్డగించడం,శివుడు కోపంతో అతని తలను నరికివేయడం,పార్వతి దుఃఖించడం,ఏనుగు తలను అతికించి ప్రాణం పోసి గణనాయకుడిని చేయడం ఇది అందరికీ తెలిసిన కథ.
4.గణపతి శివుని ముఖకవలికళనుండి ఉద్భవించాడు.అందరినీ మోహింపచేస్తున్న ఆ రూపం పట్ల పార్వతీ దేవి కోపంతో శపించడం వలన వికారరూపం ఏర్పడింది.
5.గణేశుడు మొదట మానవరూపంలోని కృష్ణుడే.అపకారబుద్దితో శనిగ్రహం ఒకసారి అతన్ని చూడడంతో అతడి తల తెగి కృష్ణుడి లోకమైన గోలోకంలో పడింది.తర్వాత ఏనుగుతలను ఆ బాలుడికి అతికించారు.

Saturday, October 18, 2008

ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తిపీఠాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

1.శ్రీ భీమశంకరేశ్వరుడు : భీమశంకర్

2.శ్రీ త్రయంబకేశ్వరుడు : త్రయంబకేశ్వరం,మహారాష్ట్ర

3.శ్రీ కేదారేశ్వరుడు : కేదార్‌నాథ్,హిమాలయాలు

4.శ్రీ విశ్వేశ్వరుడు : వారణాశి,ఉత్తరప్రదేశ్

5.శ్రీ రామలింగేశ్వరుడు : రామేశ్వరం,తమిళనాడు

6.శ్రీ మల్లిఖార్జునుడు : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

7.శ్రీ మహాకాళేశ్వరుడు : ఉజ్జయిని,మధ్యప్రదేశ్

8.శ్రీ ఓంకారేశ్వరుడు : ఓంకారేశ్వర్,మధ్యప్రదేశ్

9.శ్రీ సోమనాధేశ్వరుడు : సోమనాథ్,గుజరాత్

10.శ్రీ నాగేశ్వరుడు : దారుకావనం,గుజరాత్

11.శ్రీ వైద్యనాథేశ్వరుడు : వైద్యనాథ్,బీహార్

12.శ్రీ ఘశ్మేశ్వరుడు :ఎల్లోరాగుహ,మహారాష్ట్ర

అష్టాదశ శక్తిపీఠాలు:

1.శ్రీ సరస్వతీ దేవి : జమ్మూకాశ్మీర్

2.శ్రీ విశాలాక్షీ దేవి : వారణాశి,ఉత్తరప్రదేశ్

3.శ్రీ కామాక్షీదేవి : కంచి,తమిళనాడు

4.శ్రీ గిరిజాదేవి : ఓడ్గాపురి,కటక్,ఒరిస్సా

5.శ్రీ భమరాంబా దేవి : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

6.శ్రీ వైష్ణవీ దేవి : కాంగడా,హిమాచల్‌ప్రదేశ్

7.శ్రీ పురుహూతికా దేవి : పిఠాపురం,ఆంధ్రప్రదేశ్

8.శ్రీ శృంఖలా దేవి : ప్రద్యుమ్నం,బెంగాల్

9.శ్రీ మాధవేశ్వరీ దేవి : ప్రయాగ,ఉత్తరప్రదేశ్

10.శ్రీ మహాలక్ష్మీ దేవి : కొళ్హాపురం,మహారాష్ట్ర

11.శ్రీ ఏకవీరాదేవి : మహూర్యం,నాందేడ్,మహారాష్ట్ర

12.శ్రీ కామరూపిణీ దేవి : గౌహతి,అస్సాం

13.శ్రీ చాముండేశ్వరీ దేవి : మైసూరు,కర్ణాటక

14.శ్రీ మహాకాళీ దేవి: ఉజ్జయిని,మహారాష్ట్ర

15.శ్రీ మాంగల్య గౌరీదేవి : గయ,బీహార్

16.శ్రీ జోగులాంబా దేవి : ఆలంపురం,కర్నూలు

17.శ్రీ మాణిక్యాంబా దేవి : ద్రాక్షారామం,ఆంధ్రప్రదేశ్

18.శ్రీ శంకరీ దేవి : ట్రింకోమలి,శ్రీలంక.

Wednesday, October 15, 2008

ఒక జోకు

ఓ సారి జేమ్స్‌బాండ్,తెలుగువాడు కలిసి ప్రయాణిస్తున్నారు.తెలుగువాడు అడిగాడు "మీ పేరేమిటి?"
"బాండ్.....జేమ్స్‌బాండ్" అన్నాడు జేమ్స్‌బాండ్.
'నీ పేరు ' అని అడిగాడు.
'సాయి......వెంకట సాయి......శివ వెంకట సాయి.........లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస లక్ష్మినారాయణ శివ వెంకట సాయి..........అల్లంరాజు సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............"
జేమ్స్‌బాండ్ మూర్చపోయాడు.

Tuesday, October 14, 2008

భాషతో ప్రయోగాలు - విచిత్రాలు- సరదాలు

enemy the= ఎనిమిది
way to=వేటు
సీ రియల్= చూడు నిజం
ఏమిటీ=ఏ కంపెనీ టీ
P.D.కిలి= పిడికిలి
P.C.నారి=పిసినారి
Six master=ఆరుగురు
ఫోర్మెన్=నలుగురు మగవారు
ఫోర్జరీ=నాలుగు జరీ(చీరలు)
though Say=దోసె
chest air=ఎదగాలి
100 ద్దీన్=నూరుద్దీన్
Earth Milk=నేలపాలు
సిగ్నేచర్=సిగ్గు పడే ప్రకృతి
వెన్నెల=WHEN నెల(ఎప్పుడు నెల)
వేలు= Way లు(దారులు)
Slow come=శ్లోకం
Low come=లోకం

Tuesday, October 7, 2008

త్యాగరాజ కీర్తన ( భావము )

ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే

సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత లేనివా(రెంత)

పర హింస పర భామాన్య ధనపర మానవాపవాదపర జీవనాదులకనృతమేభాషించెదరయ్య త్యాగరాజ నుత (ఎంత)

భావము:

ఈ కీర్తన త్యాగరాజు గారి ఆవేదన ను మనకు తెల్పుతుంది.మనుషులు ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా,ఎన్ని అనుభవాలు పొందినా కాంతకు అనగా కామానికి దాసులు గానే ఉన్నారు.ఇచ్చట కాంత అనగా స్త్రీని ఉద్దేశించి చెప్పినది కాదు కామాన్ని ఉద్దేశించి చెప్పినది.మనకు కామం యొక్క శక్తి తెలిసినదే.ఇది అగ్నిలాగా ఎంత అనుభవించినా ఇంకా దహించాలనుకొంటుంది అనగా అనుభవించాలనుకొంటుంది.


స్వాంతన(శాంతి లేక ఉపశమనం) కలిగించు ఆ శ్రీకాంతుని(శ్రీ మహా విష్ణువు)పైన భక్తి లేని ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా అనగా కామానికి దాసులు గానే ఉంటారు.

ఓ త్యాగరాజు చే భజింపబడే రామా,ఈ మానవులు ఇతరుల ధనానికై,ఇతర స్త్రీలను ఆశించి ఇతరులను హింసించడానికైనా వెనుకాడక తమ మానాలను అనగా శీలాన్ని పోగొట్టుకుంటారు.అపవాదులను కొనితెచ్చుకుంటారు.పరులపై అధారపడి జీవించడానికి అబద్దాలు చెప్పుతుంటారు.

Monday, October 6, 2008

యుగం బట్టి ధర్మం - కాలం బట్టి ఉద్యోగం

కాలం బట్టి యువత ఎక్కువగా కోరుకొనే ఉద్యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1900 సంవత్సర సమయాలలో : లాయరు(న్యాయవాది)
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్‌వేర్ ఉద్యోగాలు
తర్వాతో.............

Thursday, October 2, 2008

లాల్‌బహదూర్ శాస్త్రి గారిని మరిచిపోయామే

నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్‌బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?
ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే.ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.

Wednesday, October 1, 2008

త్యాగరాజ కీర్తన వినండి

క్రింది కీర్తన వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాల! కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
శ్రీ రమాలోల! విధృత శరజాల!

శుభద కరుణాలవాల!ఘననీల నవ్యవనమాలికాభరణ!ఏల నీ దయ రాదు!!
పరాకు జేసేవేల సమయము గాదు!!

రారా!! దేవాది దేవ!!రారా!! మహానుభావ!!(2)
రారా!! రాజీవ నేత్ర! రఘువర పుత్ర!
సారతర సుధాపూర! హృదయ పరివార! జలధి గంభీర దనుజ సంహార!
దశరధ కుమార! బుధ జన విహార! సకల శ్రుతిసార! నాదుపై (ఏల)

రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ
వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)

యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)

Tuesday, September 30, 2008

మహనీయుల జీవితాలలో మధుర(హాస్య)ఘట్టాలు-(స్వామి వివేకానంద)

స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ శ్రేణిని ఆరంభిస్తున్నాను.

ఒకసారి రామకృష్ణమఠంలో ఒక సన్యాస సాధువు దిగాలుగా కూర్చుని ఉన్నాడు.వివేకానందులు కారణం ఏమిటని అడిగారు.అప్పుడు ఆ సాధువు "స్వామీజీ! కూరగాయలు,ఆకుకూరలు తరగడానికి ఒకే చాకు ఉంది.నేడు కూరలు తరుగుతుంటే ఆ చాకు విరిగిపోయింది "అన్నాడు.అప్పుడు వెంటనే వివేకానందులు దిగులు నటిస్తూ " నిజం చెప్పాలంటే ఈ చాకులు ఎంతో అదృష్టం గలవి.ఎందుకంటే వీటి ఆయుష్షు ఈ విధంగా ఒకేసారి తీరుతుంది.అదే మనుషులకైతే ఎన్నో రోగాలు,వ్యాధులూ" అని అన్నాడు.ఈ వ్యాఖ్యానం విని ఆ సాధువు పగలబడి నవ్వాడు.

ఇంకో సంఘటన.

స్వామివివేకానందుల తోటి స్వామి ఒకరికి వీరి మాటంటే ఇక తిరుగులేదు.ఒకసారి అందరూ భోంచేస్తుండగా వివేకానందులు ఉన్నట్టుండి తన తోటి స్వామితో " మీకు ఈ విషయం తెలుసా? ఈ సారి "గుడ్‌ఫ్రైడే" ఆదివారం వస్తోంది తెలుసా" అన్నాడు.అప్పుడు తోటి స్వామి అమాయకంగా "అవునా? ఇందులో విశేషం ఏముంది స్వామీజీ" అన్నాడు.మిగతా భోంచేస్తున్నవారు స్వామీజీ మాటలలోని అర్థం,హాస్యం గమనించి విరగబడి నవ్వారు.ఎందుకు నవ్వుతున్నారో తెలియని ఆ తోటి స్వామికి ఏమీ అర్థం కాలేదు.

ఇంకో సంఘటన.

స్వామీజీ రెండవసారి అమెరికా పర్యటనకు వెళ్ళిన తర్వాత అతను తిరిగి భారతదేశానికి వచ్చు సమాచారం మఠంలోని వారెవరికీ తెలియదు.ఒకరోజు వివేకానందులు ఏ విధమైన సమాచారం లేకుండా అమెరికా నుండి ఈజిప్ట్ ద్వారా బొంబాయికి ఓడలో వచ్చాడు.అక్కడి నుండి కలకత్తాకు రైలులో వచ్చాడు.స్వామీ వివేకానందులు అప్పుడు బ్రిటిష్ దుస్తులు ధరించి ఉన్నాడు.కలకత్తాలోని మఠం దగ్గరికి వెళ్ళి గోడ దూకి లోనికి వెళ్ళాడు.అప్పుడు మఠం లోని స్వాములు భోజనం చేయు సమయం.దూరం నుండి బ్రిటిష్ దుస్తులలో ఉన్న వివేకానందులను వారు గుర్తించలేక భయపడి స్వామి వివేకానందుల వద్దకు కర్రలతో పరుగెత్తుకొచ్చారు.దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించి సంతోషం పట్టలేకపోయి మఠం అంతా చాటింపు వేశారు.తోటి స్వాములతో వివేకానందులు " మళ్ళీ ఆలస్యం ఐతే భోజనపదార్థాలు అయిపోతాయని గోడ దూకి వచ్చాను"అని అన్నాడు.అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అలసట లేక హాస్యాన్ని పండించడం చూసి ఆ స్వాములు ఆనందించారు.

Monday, September 29, 2008

ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము


ఈ భాగంలో ఐన్‌స్టీన్ యొక్క ప్రత్యేక సాపేక్ష సిద్దాంతాన్ని తెలుసుకొందాము.తెలుసుకొనేముందు దీని ఆవిష్కరణకు పూర్వం జరిగిన సంఘటనలను గమనిద్దాం.1801 వ సంవత్సరం లో థామస్ యంగ్ అనే శాస్తవేత్త కాంతికి తరంగధర్మం ఉంటుందని కనుగొన్నాడు.ఐతే కాంతి ప్రసారానికి యానకం ఏమిటన్న ప్రశ్నకు ఈథర్ అని అనుకొన్నారు.ఈ ఈథర్ కు అనుగుణంగా కాంతి ప్రసారం అయ్యే వేగానికి,ఇదే ఈథర్ కు వ్యతిరేకంగా కాంతి ప్రసారం అయ్యే వేగం తక్కువ ఉంటుందని అనుకొన్నారు.కాని అల్బర్ట్ మైఖేల్‌సన్ మరియు ఎడ్వర్డ్ మోర్లే అను శాస్త్రవేత్తలు కాంతివేగం ఏ దిశలోనైనా ఒక్కటే అని ఆవిష్కరించారు.

ఐన్‌స్టీన్ ఆవిష్కరణ:పై ఆవిష్కరణ వలన ఐన్‌స్టీన్ ఈథర్ అన్నదేదీ లేదని కాంతివేగం పరిశిలకుడి వేగంతో సంబంధం లేకుండా కాంతివేగం అన్నిదిశలలోనూ ఒక్కటే అని మరియు కాలం,స్థలము అన్నవి సాపేక్షము అన్న నిర్ణయానికి వచ్చాడు.ఇదే ప్రత్యేక సాపేక్ష సిద్దాంత ఆవిష్కరణ.

ఈ విషయం అర్థం కావడానికి క్రింది ఉదాహరణ చూడండి.

A,B అనే ఇద్దరు ప్రయాణికులు రెండు అంతరిక్షనౌకలలో ఒకరికొకరు వ్యతిరేక దిశలలో కాంతివేగంలో ముప్పావువంతు(3/4)వేగంతో ప్రయాణిస్తున్నారని అనుకోండి.సులభంగా అర్థం కావడానికి పటాలు చూడండి.వారి నౌకలలో ఒక కాంతిజనకము,ఒక తెర ఉన్నాయనుకోండి.వాటి మధ్య దూరం 40మీటర్లు అనుకొందాం.ఇప్పుడు A దృష్ట్యా కాంతిజనకం నుండి కాంతి బయలుదేరి తెరను చేరడానికి 0.13 మైక్రోసెకను పడుతుంది(కాంతివేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు కాబట్టి 40 మీటర్లు ప్రయాణించడానికి 0.13 మైక్రోసెకన్ పడుతుంది. 40/300000=0.13మైక్రో).అలాగే B దృష్ట్యా కూడా.
కాని A దృష్ట్యా B నౌకలోని కాంతి జనకం నుండి కాంతి B లోని తెరను చేరేలోపు B నౌక A వైపుగా 30 మీటర్లదూరం ప్రయాణిస్తుంది.పైథాగరస్ సిద్దాంతం ప్రకారం(పటం చూడండి) B నౌకలో కాంతి ప్రయాణించినదూరం 50 మీటర్లు.కాంతివేగం అన్ని పరిశీలనల ప్రకారం ఒకటే కాబట్టి A లోని వ్యక్తి B లో కాంతి ప్రయాణానికి పట్టినకాలం 0.17మైక్రోసెకను గా గుర్తిస్తాడు(50/300000=0.17 మైక్రో).కానీ B నౌకలోని వ్యక్తి ప్రకారం కాంతి 40 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది కాబట్టి అతని ప్రకారం ఈ సమయం 0.13మైక్రోసెకన్ మాత్రమే.అలాగే A నౌకలో కూడా కాంతి ప్రసారానికి 0.17మైక్రోసెకను గా B లోని వ్యక్తి గుర్తిస్తాడు.అంటే ఒకరి దృష్ట్యా మరొకరి కాలం 0.04 సెకను తొందరగా నడుస్తోంది.దీనినే Time Dilation అంటారు.ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం ప్రకారం A,B ఇద్దరూ కొలిచే సమయమూ సరైనదే.ఐన్‌స్టీన్ మరియు పై పరిశీలన ప్రకారం A ప్రకారం T కాలం గడిస్తే B ప్రకారం గడిచిన సమయం T*(1-Vవర్గము/C వర్గము)యొక్క వర్గమూలము.ఇక్కడ v అనేది ఒకరిదృష్ట్యా మరొకరి వేగము,C అనేది కాంతివేగము.
కానీ ఈ Time dilation తో సమస్య ఏమంటే ఇద్దరు పరిశీలకులు రెండు సంఘటనల మధ్య దూరం విషయంగా ఏకాభిప్రాయానికి వచ్చినా ఆ సంఘటనల మధ్య ఎంత సమయం జరిగింది మరియు ఆ సంఘటనలు ఎంత వేగంతో జరిగాయి అన్న విషయం పట్ల ఒకే అభిప్రాయానికి రాలేరు.
ఈ సిద్దాంతం ప్రకారం వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క పొడవు దాన్ని చుస్తున్న వ్యక్తికి తక్కువగా కనిపిస్తుంది.అంటే కుచించుకుపోయినట్లు కనిపిస్తుంది.ఉదాహరణకు నేను మన భూమికి సమీపనక్షత్రం వద్దకు ప్రయాణిస్తున్నాని అనుకోండి.అప్పుడు నాకు,నక్షత్రానికి మధ్య దూరం నేను కొలిచినదానికన్నా భూమిపై నుండి చూస్తున్న మీరు కొలిచేదూరం ఎక్కువగా ఉంటుంది.అంటే దూరాన్ని నేను గనుక 1000 కిలోమీటర్లుగా కొలిస్తే మీరు 1000 కన్నా ఎక్కువగా కొలుస్తారు.దీన్నే length contradiction అంటారు.అమితవేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తి యొక్క ద్రవ్యరాశి అతన్ని చూస్తున్న మరొకరి దృష్ట్యా వేగం పెరిగేకొద్దీ ద్రవ్యరాశి కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.కాని ప్రయాణిస్తున్న వ్యక్తి దృష్ట్యా తన ద్రవ్యరాశి మారదు.ఈ సిద్ధాంతం ప్రకారం ఇద్దరూ సరైనవారే.

ఈ సిద్ధాంతం అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు అవసరము.వీటిని మరోసారి తెలుసుకొందాము.

Friday, September 26, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 2


ఈ భాగం లో స్థలం వంగి ఉన్నదనే ఐన్‌స్టీన్ యొక్క అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకొందాము. మనకు సాధారణంగా సూర్యుని వెనుక భాగాన గల నక్షత్రాలు కనపడవు.ఎందుకంటే సూర్యరశ్మి యొక్క ప్రభావం చేత.కానీ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో వీటిని గమనించవచ్చు.ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్దాంతంలో సూర్యుని వెనుకవైపు గల ఈ నక్షత్రాల కాంతి సూర్యుని వలన ఏర్పడిన స్థలకాలపు వంపు వలన సూర్యుని వద్ద వంగి ప్రయాణిస్తుందని ఆ వంపు ఎంతమేరకు ఉంటుందనే కోణం చెప్పాడు.దీనివలన ఆ నక్షత్రం యొక్క స్థానాన్ని మనం తప్పుగా చూస్తాము.ప్రక్క పటం గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.ఈ సిద్దాంతం లో ప్రస్తావించిన ఈ వంపు కోణాన్ని 1919 లో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొలిచారు.అత్యద్భుతంగా ఐన్‌స్టీన్ చెప్పిన కోణానికి ఈ విలువ చాలా దగ్గరగా ఉంది.ఈ విధంగా స్థలకాలం వంగిఉందనే విషయం ఋజువైంది.

ఐన్‌స్టీన్ మాటల్లో సాధారణ సాపేక్షసిద్దాంతం
"ఒక్క మాటలో చెప్పాలంటే కాలము,స్థలము మరియు గురుత్వాకర్షణ మూడూ అస్వతంత్రాలు.ఇవి మూల పదార్థం కంటే వేరు కాదు."

సాధారణ సాపేక్ష సిద్దాంతం క్రింది సందర్బాలలో ఋజువైంది.
1.మెర్క్యురీ గ్రహం యొక్క చలనం (1915)
2.సూర్యుని వద్ద నక్షత్ర కాంతి వంగి ప్రయాణించడం (1919)
3.తెల్లని మరుగుజ్జు నక్షత్రాల వర్ణపటంలో ఎరుపు మొగ్గు (1924)
4.భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో గామా కిరణాల ఎరుపు మొగ్గు (1960)
5.శుక్ర,మెర్క్యురీ గ్రహాల పై రాడార్ సంకేతాల మధ్య సమయంలో తేడా కనుగొనడం(1968)
6.భూమి గురుత్వాకర్షణ వలన సమయాలలో ఎంత తేడా వస్తుంది అనే విషయం భూమిపై,అంతరిక్షంలో పరమాణు గడియారాల సహాయంతో కనుగొన్నారు.(1976)
7.మనకు,దూరంగా ఉన్న నక్షత్రాల మధ్య ఏవైనా బరువైన పదార్థాలు ఉన్నప్పుడు ఆ నక్షత్రాల గురుత్వబలాలు,కనిపించడం.(1980)
8.గురుత్వాకర్షణ తరంగాలు వెలువరిచే రేడియేషన్ వలన సక్తి నష్టం కలుగుతుందనే ఐన్‌స్టీన్ అంచనా ను జంట న్యూట్రాన్ నక్షత్రాల కక్ష్యలు వాటి మార్గం పరిశీలించడం వలన కనుగొన్నారు.(1982)

ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతం వలనే కాలం లో ప్రయాణించవచ్చనే ఊహ బయలుదేరింది.దీనికి సంభందించిన విశేషాలను ఇంకోసారి తెలుసుకొందాము.

Thursday, September 25, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 1





మనకు తెలుసు ఐన్‌స్టీన్ ప్రపంచప్రఖ్యాతి పొందినది తను కనుగొన్న సాపేక్షసిద్దాంతాల వలన.ఇవి ప్రత్యేక,సాధారణ సాపేక్షసిద్దాంతాలని రెండు రకాలు.ఈ భాగంలో మనం సాధారణ సాపేక్ష సిద్దాంతం గురించి చూద్దాం.ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌స్టీన్ 1915 వ సంవత్సరం లో ప్రతిపాదించాడు.(ఈ విషయంపై 1907 నుండి 1915 వరకు పరిశోధనలు చేసాడు).తర్వాతి
భాగాలలో ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం వివరాలు తెలుసుకొందాము.

మొదట సాపేక్షం అంటే ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాము.మనం ఒక వస్తువు పొడుగ్గా ఉన్నది అంటున్నామంటే దాన్ని మనం దాని పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్న వస్తువుతో పోల్చి పొడుగ్గా ఉన్నదని అంటాము.ఇలానే ఒకడు ఇంకకడికంటే వేగంగానో లేక ఆలస్యంగానో పరుగెడుతున్నాడని,ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ లేక తక్కువ మార్కులు తెచ్చుకుంటాడని చెప్తాము.అంటే ఒక వస్తువు లక్షణం దృష్ట్యా ఇంకో వస్తువు లక్షణం చెప్తున్నామన్న మాట.ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతివిషయాన్నీ ఇంకొక అదే లక్షణాలు గల
విషయంతో పోల్చి చూస్తుంటాము.దీన్నే "సాపేక్షము" లేక "సాపేక్షత" అంటారు.

ఇక అసలు విషయమైన సాధారణ సాపేక్ష సిద్దాంత విషయానికి వద్దాము.

ఈ సిద్దాంతము ప్రధానంగా గురుత్వాకర్షణ విషయాన్ని చర్చిస్తుంది.గురుత్వాకర్షణ విషయన్ని న్యూటన్ ప్రతిపాదించాడని మనకు తెలుసు.న్యూటన్ ప్రకారం సృష్టిలో ప్రతి వస్తువూ ఇంకొక వస్తువుని ఆకర్షిస్తోంది.ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణశక్తి మొదట వాటి ద్రవ్యరాశి పై మరియు వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది.ద్రవ్యరాశులు పెరిగేకొద్దీ ఆకర్షణ పెరుగుతుంది.అలాగే దూరం పెరిగేకొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.ఇలా సృష్టి మొత్తం ఈ నియమాలు పాటిస్తాయని న్యూటన్ కనుగొన్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ అసలు అవి ఎందుకు ఆకర్షించుకొంటున్నాయో న్యూటన్ చెప్పలేదు.
సాధారణ సాపేక్షసిద్దాంతం ఈ విషయాన్ని గురించే చెబుతుంది.
మనకు తెలిసిన మూడు కొలతలు పొడవు,వెడల్పు,లోతు లతో పాటు ఐన్‌స్టీన్ నాల్గవ కొలత గా కాలాన్ని తీస్కొన్నాడు.ఈ నాలుగు కొలతలతోనే విశ్వమంతా ఉంటుంది.(మొత్తం 11 కొలతలు ఉంటాయని నేటి శాస్తవేత్తలు భావిస్తున్నారు.)ఈ నాలుగు కొలతలు గల ప్రదేశాన్నే "space time continuum" అంటారు.ఈ continuum లో ఏదైనా బరువైన వస్తువును పెట్టినప్పుడు ఆ వస్తువు పెట్టిన చోట ఒక గుంత లాగ ఏర్పడుతుంది.ఉదాహరణగా మనం దిండు(తలగడ) పైన ఏదైనా బరువైన వస్తువును ఉంచామనుకోండి.అక్కడ ఒక గుంత లాగ ఏర్పడినట్టు అన్నమాట.అర్థం కావడానికి ప్రక్క పటాలు చూడండి.ఆ గుంతకు సమీపంలోని వస్తువులు,పరిధిలోని వస్తువులు ఆ గుంతలోనికి దొర్లినప్పుడు మనకు ఆ దొర్లుతున్న వస్తువులు ఆ పెద్ద వస్తువుచేత ఆకర్షింపబడుతున్నట్టు కనబడతాయి.దీనినే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతము అంటారు.ఎంతగా ఆ వస్తువులు దొర్లుతాయి అనే విషయం న్యూటన్ చెప్పిన సిద్దాంతం ద్వారా కనుగొనవచ్చు.

ఇది అర్థం కావడానికి సైన్సు లో ఒక ప్రసిద్ద ఉదాహరణను చెబుతారు.అది ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయాడనుకోండి.న్యూటన్ ప్రకారం ఆ విషయం వెంటనే భూమికి తెలిసిపోయి తన కక్ష్య నుండి తప్పి సరళరేఖామార్గంలో విశ్వంలోనికి వెళ్ళిపోతుంది.కాని నిజానికి అలా జరుగదు.ఎందుకంటే ఈ విశ్వంలో కాంతి కన్నా వేగంగా ఏ వస్తువూ,శక్తీ ప్రయాణించదని మనకు తెలిసిన సిద్దాంతాల ద్వారా తెలుస్తోంది.మనకు తెలుసు సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు తీసుకుంటాయని.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి చేరడానికి 8 నిమిషాల పైనే పడుతుంది.అప్పుడే భూమి తన కక్ష్య నుండి ప్రక్కకు తప్పుకుంటుంది.ఐన్‌స్టీన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ సూర్యుడు మాయమైనందున space time continuum లో ఏర్పడిన గుంత మామూలు స్థాయికి వస్తుంది.ఇలా గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో వ్యాపించి ఆ continuum అంతా
బల్లపరుపుగా అవుతుంది.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి 8 నిమిషాల తర్వాతే తెలుస్తుంది.

స్థలకాలం వంగి ఉందన్న అద్భుతవిషయము,దానికి ఋజువులు మొదలగు వివరాలు తర్వాత టపాలో తెలుసుకొందాము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు