తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, June 28, 2013

నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత ముద్దుబిడ్డలు"

నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత  ముద్దుబిడ్డలు".
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
భగవంతుడి దయ మేరకు వ్రాస్తాను. 

Tuesday, June 25, 2013

ఈ అరుదైన ఫోటో చూసారా?

మదర్ థెరెసా యువతిగా ఉన్నప్పటి చిత్రం 

Monday, June 17, 2013

హమ్మయ్య! ఇన్నాళ్లకు నా HTC Desire X మొబైల్ ఫోను తెలుగు చూపిస్తోంది.

HTC కంపెనీ వాళ్ళు వారి కొత్త మొబైల్ ఫోన్లలో భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తున్నారంటే విని అప్పుడే విడుదలైన HTC Desire X అనే మోడల్ (19,000 రూపాయలు) ఫోన్ ను గత అక్టోబర్ 29 న కొన్నాను.

కాని తీరా చూస్తే అందులో హింది,మరాఠి,తమిళం మరియు బెంగాళి భాషలు మాత్రం కనిపించాయి. మన తెలుగు బ్లాగులు ఓపెన్ చేస్తే అంతా ఖాళీగా దర్శనం ఇచ్చేవి. సర్లే నా ప్రాప్తం ఇంతేలే అనుకొని ఒపెరా బ్రౌజర్ లో మాత్రం తెలుగు చూసుకొని సర్దుకుపోయేవాణ్ణి.

కాని మొన్న జూన్ 10 వ తేదీ జెల్లీబీన్ అనే కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ కు update చేసుకొమ్మని HTC నుండి కాల్ వచ్చింది. update అయిన తర్వాత చూస్తే తెలుగుతో పాటు భారతీయ భాషలు అన్నిటికీ సపోర్ట్ ఉంది.
అంతేకాకుండా మన భారతీయభాషలలో మెసేజులు కూడ పంపించుకొనే సౌకర్యం కంపెనీవాడే ఇచ్చాడు.
తెలుగు చూపిస్తున్న చిత్రం చూడండి.


చాలాచాలా ధన్యవాదాలు HTC వారికి.





Thursday, June 6, 2013

IRCTC లో అసలు ఏం జరుగుతోంది?




IRCTC లో అసలు ఏం జరుగుతోంది? ఇంకా ఎన్ని రోజులు మనం బాధ పడాలి? ప్రశ్నించేవారు లేరా?
ఈ రోజు,ఇప్పుడు (10.10 ఉదయం) సైట్ ఏం చెప్తోందో చూడండి....

Monday, May 27, 2013

పదాలతో ఆడుకోవడం అంటే ఇలా ఆడుకోవాలి....అన్నమయ్య కీర్తన

తెలుగు బాష యొక్క సొగసు,సింగారాలను మనం ఎంతగా కోల్పోతున్నామో ఎందరికి తెలుసు. రామాయణంలోని హనుమంతుని సీతాన్వేషణ ను వర్ణిస్తూ ఉన్నటువంటి ఈ క్రింది అన్నమయ్య కీర్తన వింటూ చదవండి. అప్పుడు తెలుస్తుంది తెలుగు బాష యొక్క సొగసుతనం.


ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె, 
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా ||

రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||

కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||

దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||

Thursday, May 23, 2013

మన పని మనం చేసుకోవడానికి మొహమాటం ఎందుకు? (అబ్రహం లింకన్ జీవితపు చిన్న సంఘటన)


అబ్రహం లింకన్ యొక్క మహోన్నతపు వ్యక్తిత్వం మనకు పరిచయమే.
వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఒక చిన్న సంఘటన.

ఒక సారి లింకన్ గారి స్నేహితుడు లింకన్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి లింకన్ గారు తమ బూట్లు పాలిష్ చేసుకుంటున్నారు.

అది చూసి వారి స్నేహితుడు "అదేంటి లింకన్! నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్?" అన్నాడు.

వెంటనే లింకన్ గారు " మరి నువ్వు ఎవరి బూట్లు పాలిష్ చేస్తావ్?" అన్నారు.

లింకన్ మాటల్లోని అంతరార్థం తెలుసుకుని ఆ స్నేహితుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకుందాం.

స్వామి వివేకానందులు చెప్పినట్లు " ఒకరి గొప్పతనం వారు చేసిన గొప్ప కార్యాల వలన కాక వారు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది."

Friday, April 26, 2013

ఒక శ్రేయోభిలాషి వ్యాఖ్యగా వ్రాసిన ఒక కవిత

సురేష్ గారు..

మీ వ్యాఖ్యలు/ఉత్తరాలు చదువుతూంటే..

అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్న చద్దన్నం రుచి గుర్తొచ్చినట్లు.... కమ్మగా...

మనకు ఇష్టమైన పాత సినిమాలోంచి  ఘంటసాల గారు పాడిన పాట వింటున్నట్లు.. తియ్యగా...

మన ఎలిమెంటరీ స్కూల్లో.. తెలుగు మాష్టారు పాఠం మధ్యలో, ఉదాహరణల కోసం.. చెప్పే చిట్టి కథంత.. మధురంగా...

వేసవి కాలం సెలవుల్లొ వచ్చే.. ఐస్ బండిలోంచి ఇచ్చే.. చిన్న కలర్ ఐస్ ముక్కంత, చల్లగా....

ఉంటాయండి...

నిజంగా.. ఇది ఒక అరుదైన అనుభూతి..

మీరు ఇలాగే కొత్తగా.. మనం (సమాజం) మరిచిపోతున్న పాతదనాన్ని గుర్తు చేస్తూ.. ఉండాలని..

- మీ శ్రేయోభిలాషి

Tuesday, April 2, 2013

ఈ ప్రశ్నకు ఎంతమంది సమాధానం చెప్పగలరు?

పెదవులు, నాలుక అవసరం లేకుండా మనం పలుకగలిగే ఏకైక దేశం పేరు ఏమిటో చెప్పగలరా?

Friday, March 22, 2013

ఈ ఏడు మరియు మూడు తలల పామును చూసి మీ జన్మ ధన్యం చేసుకున్నారా?

ఈ మధ్య ఇంటర్నెట్ లో ప్రచారం అవుతున్న విషయం. ముఖ్యం గా facebook లో.

తిరుమలకు వెళ్ళే దారిలో తుంబురు కోన దగ్గర శివాలయానికి సమీపం లో 
7 తలల సర్పము కనిపించింది ....దీనితో అందరు కలియుగ దైవం వేంకటేశ్వరుడు కనిపించాడని....
ఆ దారి లో వెళ్ళే భక్తులంత చూశారు .కానీ అర నిముషం కనపడి మాయమైపోయింది .......

దీన్ని చూసి షేర్ చేసిన వారి జన్మ ధన్యం అవుతుంది ....అని పూజారులు , TTD పండితులు చెప్పారు.

అలాగే మూడు తలల సర్పము కనిపించిందని మరో రాష్ట్రపు పూజారులు చెప్పారు.

అలాగే ఒక తల సర్పము కనిపించిందని ఇంకో రాష్ట్రపు పూజారులు చెప్పారు.




మీరు కూడా ఈ చిత్రాలు చూసి జన్మ ధన్యం చేసుకోండి.

Friday, March 1, 2013

అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనిపించడం లేదెందుకని?

అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనపడ్డం లేదు. 
ఏం ఫరవాలేదు, ఫిబ్రవరి 29 రాకున్నా దాని బదులు మార్చ్ 1 వచ్చింది. 
కాబట్టి ఈరోజే నా పుట్టినరోజు.

Friday, February 1, 2013

సచిన్‌టెండూల్కర్‌లా భుజాలు ఎగురవేస్తామంటే సరిపోదు....ఆయనలా...?

ఈ మధ్య గమనించిన పోకడ ఏమిటంటే ఒక ఫలానా మహాత్ముడు లేక గొప్పవాడు ఇలా బట్టలు కట్టుకొనేవాడు, మాట్లాడేప్పుడు ఇలా తల ఎగురవేసేవాడు అంటే మనం కూడా వారిలానే అనుకరిచడానికి ప్రయత్నిస్తున్నాము, వారి హావభావాలను కూడా అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాము.

ఉదాహరణకు గాంధీగారు కొళ్ళాయి గుడ్డ కట్టుకొన్నాడని మనం కూడా అలానే ఉండగలమా? భగవాన్ రమణుల వారు గోచీ గుడ్డ ఒక్కటే పెట్టుకొనే వారని మనం పెట్టుకొంటామా? యోగి వేమన నగ్నంగా ఉండేవాడని మనం కూడా బట్టలు విప్పేసి తిరగగలమా? భగవాన్ రమణులు తన పాదం తప్పుచేసిందని తేనెటీగలు కుడుతున్నా అవి పూర్తిగా కరిచి వెళ్ళిపొయేవరకు తన పాదం కదపలేదు. మనమూ అలానే చేస్తే మన గతి ఏమిటి?

బయటకు కనిపించే వాటిని అనుకరిస్తూ కావలసిన దానిని పట్టించుకోకపోవడం ఎవరికి లాభం? ప్రపంచమంతా భగవంతుడే అని ఊరకే విని ఆ జ్ఞానం నిజంగా లేనివాడు పులి కూడా భగవంతుడే అని పులి ముందు నిల్చోగలడా? బయటకు అంతా దైవమే అంటూ కాలికి ఒక ముల్లు కుచ్చుకొన్న మరుక్షణం "అబ్బా నొప్పి!" అని ఎందుకు అంటున్నారు? అంటే అతడు మాట్లాడే మాట ఒకటి, లోపల ఉంచుకొన్నది ఒకటి.

అబ్దుల్‌కలాం గారి తలకట్టు(Hair style) ను, సచిన్ టెండూల్కర్ భుజాలు ఎగురవేయడాన్ని అనుకరిస్తాము, కాని వారికి తమ పనిపట్ల ఉన్న అంకితభావం, దేశం పట్ల గల ప్రేమను అలవరచుకోవడానికి ప్రయత్నించము.వారు నడిచిన మార్గం, వారు ఆచరించి చూపిన విధానాలు మనం ఆచరిద్దాం. ఒకవేళ మనం కూడా ఆ స్థాయికి ఎదిగితే అప్పుడు మనం ఏం చేయాలో, మన బట్టలు ఎలా వేసుకోవాలో, ఎలా తలదువ్వుకోవాలో మనకే అర్థం అవుతుంది. సరే వారి వేషభాషలు బాగుంటే అనుకరించడానికి అభ్యంతరం లేదు. కాని అలా అనుకరించి మనం వారే అయినట్లు భావించడం(feel అవడం) మనలను మనం మోసం చేసుకోవడమే. అంతేకాని గుడ్డిగా వారిని అనుసరిస్తే మనకు ప్రయోజనం ఏమిటి?

Saturday, January 12, 2013

దిగాలుగా,వట్టిపోయిన జనులతో నిండిన దేశం కాదు, ఇనుపకండలు ఉక్కునరాలతో ఉత్సాహం పరవళ్ళు త్రొక్కే జనులతో కూడిన భారతదేశం నాకు కావాలి.

ఇంతటి గంభీర గర్జన చేసిన వారు ఎవరు? ఇంకెవరు, భారతీయ యువత యొక్క ఆరాధ్య దైవం స్వామి వివేకానంద! ఈ పేరు వినగానే పరవళ్ళు త్రొక్కే ఉత్సాహం కలగని వారు ఉండరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అంతగా ఉత్సాహం కల్గించే పేరు ఇది.

వివేకానందుల భౌతికదేహం పుట్టినరోజు నేడు. భారతదేశం ఈ రోజుని జాతీయ యువదినోత్సవంగా ప్రకటించింది. భౌతికదేహం పుడుతుంది మరియు చస్తుంది. కాని ఆ దేహం మాధ్యమంగా తరతరాలకు తరగని ఉత్సాహజలనిధిని ఇచ్చి వెళ్ళారు వివేకానందుడు. ఆయనే స్వయంగా అన్నట్లు తన సందేశం 1000 సంవత్సరాల వరకు జనుల హృదయాలను మేల్కొలుపుతూనే ఉంటుంది. 1000 ఏం ఖర్మ, 10000 ఏళ్ళు ఐనా మేల్కొల్పుతూనే ఉంటుంది.
భారతజాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవీధులలో సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ధీరుడు స్వామి వివేకానంద. వివేకానందులు బ్రతికి ఉన్న రోజులలో మధుమేహం, నిద్రలేమి లాంటి సుమారు 31 ఆరోగ్య సమస్యలతో బాధపడేవారని అంటారు. అటువంటి పరిస్థితులలో కూడా దేశం కోసమే జీవితంలోని ప్రతిక్షణం తపించి పోయిన మహనీయుడు స్వామి. చుట్టూ హంసతూలికాతల్పాలున్నా వాటిపై నిద్రపోకుండా భారతీయ నిరుపేదల జీవితాన్ని గురించి తలచుకొని కటికనేలపై పొర్లుతూ తలగడలు తడిసిపోయేలా కన్నీళ్ళు కార్చిన స్వామికి మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం?

వారి బోధనలను, వారి సందేశాన్ని అనుసరించి "జీవసేవే దైవసేవ" అను ఆదర్శాన్ని అనుసరించడమే వారికి మనం కొంతలోకొంతైనా తీరుచుకోగల ఋణం.

సత్యం,పవిత్రత,నిస్వార్థత ఈ మూడూ కలిగి ఉన్న వారి వెంట్రుకనైనా ఈ లోకం కదిలింపజాలదు.వీటన్నిటిని మించినది ప్రేమ. వీటిని కల్గిఉన్నవారి విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు.
- స్వామి వివేకానంద

Monday, December 10, 2012

అహింస,అహింస అంటున్నారు. నిజం గా అహింస అంటే ఏంటో మనకు తెలుసా?

ప్రస్తుత పరిస్థితులలో మన పెద్దల, ఋషుల మాటలు మనం సరిగా అర్థం చేసుకోలేక తికమకపడుతూ, అర్థం కాకపోతే వారిమాటలు ఉత్త మాటలే అని, ఆచరణ యోగ్యం కాని మాటలు అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాం. తద్వారా జీవితపు నిజమైన ఆనందాలను కోల్పోతున్నాము.

మన అందరికీ అహింస అనే భావన తెలుసు అనుకుంటున్నాము. నిజంగా ఎంతమందికి అహింస గురించి సరిగా తెలుసో నాకు తెలియదు కాని నాకు మాత్రం అహింస గురించి తెలుసు అనుకున్నది చాలా ,చాలా తక్కువ మాత్రమే అని తెలుసుకున్నాను.

నేను తెలుసుకున్నది గురుశిష్యుల సంవాదంగా వ్రాస్తున్నాను.

ఒక గురువు,శిష్యుడు ఏదో విషయాన్ని గురించి గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక దోమ ఒకటి శిష్యున్ని కుట్టుతోంది. శిష్యుని దృష్టి ప్రక్కకు మరలుతోంది. ఆ దోమను చంపాలని చేయి పైకెత్తాడు. కాని అహింస గుర్తుకు వచ్చి చంపలేదు. అప్పుడు

గురువు: పని (చంపడం) పూర్తి చెయ్యలేదేం?

శిష్యుడు: గురువు గారూ! మీరు జీవహింసను సమర్థిస్తారా?

గురువు: లేదు. కాని నీ మనసులో ఇప్పటికే చావుదెబ్బ కొట్టావు.

శిష్యుడు: నాకు అర్థం కాలేదు.

గురువు: అహింస అనే విషయంలో మన ఋషుల ఉద్దేశ్యం , చంపాలన్న "కోరిక" ను తొలగించడం. అహింసను పాటించడానికి అక్షరాలా అసౌకర్యంగా ఏర్పాటైంది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్నినాశనం చెయ్యకతప్పని పరిస్థితులు వస్తే రావచ్చు. కాని అదేవిధంగా కోపం,ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మాత్రం రాకూడదు.ఈ ప్రపంచపు గాలిని పీల్చుకునే హక్కు అన్ని జీవరాశులకూ ఉంది. 
హింసించాలన్న కోరికను జయించడమే ముఖ్యం.

శిష్యుడు: క్రూర జంతువును చంపడానికి తాను బలి కావడానికి సిద్ధం కావాలా?

గురువు: అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. దైవసాక్షాత్కారానికి కానీ, అన్ని జీవులకు సేవ,సహాయం చేయడానికి కానీ మిగతా జీవులతో పోలిస్తే మానవుడికే ఎక్కువ సదుపాయం కల్పించబడింది. 
ఒక వ్యక్తి ఒక జీవిని కానీ, మరే జంతువును కానీ చంపకతప్పని పరిస్థితి వస్తే అతడు స్వల్ప పాపానికి గురి కావాల్సి వస్తుందన్నది నిజమే.కాని నిష్ప్రయోజనంగా మానవ దేహం నాశనం కావడం తీవ్రమైన ధర్మ ఉల్లంఘన క్రిందికే వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

(స్వామిశ్రీ యుక్తేశ్వర్‌గిరి గారు, శిష్యులు పరమహంస యోగానంద గారి సంభాషణల నుండి)

Wednesday, November 21, 2012

హమ్మయ్య! మొత్తానికి కసబ్ కు శిక్ష పడింది.


ఈరోజు ఉదయం 7.30 కి పూణెలోని ఎరవాడ జైలులో ముమబాయి మారణహోమపు తీవ్రవాది కసబ్ కు ఉరిశిక్ష అమలు జరిపినట్లు మహరాష్ట్ర హోంశాఖ వర్గాలు ధృవీకరించాయి.

Monday, October 22, 2012

సృష్టి నడవడంలో భగవంతుడు ఒక క్రమబద్ధమైన విధానం ఏర్పరచాడా? (నా (అందరి) అనుభవం)

ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఒకటి నాక్కూడా ఎదురైంది.

ఒక అయస్కాంతం ఉన్నదనుకోండి. అది తనకు దూరంగా ఉన్నవాటిని అతితక్కువ బలంతో ఆకర్షిస్తూ, ఆ వస్తువులు దగ్గరకు వచ్చేకొద్దీ అత్యంత బలంగా ఆకర్షిస్తుందని. ఇది ఆ అయస్కాంత పదార్థ ధర్మం.

మరి మన నిజ జీవితంలో కూడా మన అందరికీ ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. అదేమంటే మనం ఫలానాచోటికి(గుడికో లేక మన ఇంటికో,కాలేజుకో,సినిమాకో) వెళ్ళాళనుకోండి. ఆ చోటు దూరం ఉన్నంత వరకు మనం మామూలుగానే వెళుతుంటాము. కానీ చేరవలసిన ప్రదేశానికి దగ్గర అవుతున్నకొద్దీ మన నడకలో వేగం పెరుగుతుంది కదా. దగ్గరయ్యే కొద్దీ ఎంత త్వరగా చేరుకుంటామా అన్నంత వేగంగా నడుస్తాము.ఒక వేళ ఏదైనా వాహనంలో కనుక వెళ్తుంటే దగ్గరయ్యే కొద్దీ మానసికంగా ఆత్రుత చెందుతాము.

ఇక్కడ కంటికి కనిపించే లోహాల విషయంలోనూ, కనిపించని ఒక భౌతికమైన ఆకృతి అంటూ ఏమీలేని మనసుకూ కల ఒకే ధర్మాన్ని కనుక ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గుతుంది.

అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే అన్నిటికీ మూలమైన ధర్మం,వస్తువు ఏదో ఉందనీ, దాని నుండే అన్నీ ఉత్పన్నమైనాయనీ మనకు లీలగా అనిపిస్తుంది. బహుశా ఆ మూలాన్నే మనం భగంతుడిగా  కొలుస్తున్నామనుకుంటున్నాను.

Friday, September 28, 2012

పరమేశ్వరుడి కుటుంబము - జీవవైవిధ్యము

హైదరాబాదులో జరుగుతున్న జీవవైవిధ్య సదస్సు సందర్బముగా గతములో ప్రచురించిన టపా  మనకు ఆదర్శము పరమేశ్వరుడి కుటుంబమే ను మళ్ళీ ప్రచురిస్తున్నాను.

ఎప్పుడైనా శివపార్వతుల కుటుంబము ను గమనించారా?

మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులుకాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి ఈ కుటుంబ సభ్యులు.సరే, ఇక్కడ ఆ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.
పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి,శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమేఆమహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మపార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.ఈ సందర్బములో ఒకకుటుంబములోని భర్తతెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతననుఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలాచూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలుకొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసంరాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.

అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటేతనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారిసంతోషమేఅమ్మవారిసంతోషము.ఈ విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకుఅవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్యతెలుసుకోవలసిన విషయం.

ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ.బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వపుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడునిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు.కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని)సంతోషముగా అంగీకరించాడు. ఏ విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.

ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.
మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పరశత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా ఏ జంతువునైనాతినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.కాని ఈ కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగామసలుకొంటున్నాయి.
ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు.అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీబాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.
ఓం నమః శివాయఓం జగన్మాతాయ నమఃఓం గం గణపతయే నమఃఓం స్కందాయ నమః
గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్నిఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను. 

Monday, September 24, 2012

"No cell phone Day"(సెల్‌ఫోన్‌రహిత దినము)అని ఒక రోజును జరుపుకుంటే బాగుంటుంది కదా!

ఇవ్వాళ ఎక్కడో సెల్‌ఫోన్ రేడియేషన్ గురించి చదువుతుంటే ఒక ఐడియా వచ్చింది.

అదేమంటే mothers day,fathers day,lovers day లాగా No cell phone Day కూడా ప్రభుత్వం నిర్భందంగా విధిస్తే బాగుంటుంది కదా అని.

మరి అత్యవసర సమాచారం ఎలాగా అంటారేమో , ఆ రోజు call rates, sms rates నిమిషానికి 30 రూపాయలో లేక  మరో Tariff వసూలు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు