తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, January 22, 2009

బ్లాగరులారా! స్పందించండి!

నిన్న నా బ్లాగులో వ్రాసిన టపా" తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు "కు కేవలం ఒకరిద్దరు మాత్రమే స్పందించారు. నేను నిన్న ప్రతిపాదించిన విషయం పై ఎవరికైనా ఆసక్తి ఉన్న ఎడల దయచేసి తమ టపాల ద్వారా కానీ,లేక వ్యాఖ్యల ద్వారా గానీ స్పందించండి.
కార్యాచరణకు ఉపక్రమిద్దాం.

Wednesday, January 21, 2009

తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు

ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. మనకు మంచి తరుణం వచ్చింది. అదే తెలుగు భాషను రక్షించుకునే సమయం,అందుకు గాను ప్రభుత్వాన్ని నిలదీసే సమయం.
ఈ సమయం లో నైతే ప్రభుత్వం కనీసం మన మాట ఐనా వింటుంది. అందుకు గాను మనం ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకొందాము.అందులో ఉండాలి అని నేను అనుకొంటున్న అంశాలు
1.6 లేదా 7వ తరగతి వరకు నిర్బంధ తెలుగు మాధ్యమం ఉండాలి.ఆంగ్లం ఒక విషయం(subject ) మాత్రం గానే ఉండాలి.
2.ప్రభుత్వ వ్యవహారాలలోనూ, RTC లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ తెలుగు భాషకు సింహభాగం ఇవ్వాలి.
3.ప్రభుత్వ పథకాలకు తెలుగుదనం ఉట్టిపడే పేర్లు పెట్టాలి మరియు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు లోనే ( తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం లో కూడా) ఇవ్వాలి.
4.మన రాష్ట్రములో నడుపుతున్న ఆంగ్ల పాఠశాలలలో తెలుగు ఖచ్చితముగా భోధించాలి.
5.రాష్ట్రవ్యాప్తముగా ప్రతి సంవత్సరము తెలుగు పద్యాలు,వ్యాస రచన పోటీలు నిర్వహించాలి.
6.TV చానల్స్ లో కూడా తెలుగు భాషకు అత్యధిక ప్రాముఖ్యత నివ్వాలి.
7.అధికార భాషా సంఘానికి తెలుగుభాష అమలుపై పూర్తిగా అధికారాలివ్వాలి.తప్పనిసరి ఐతే తప్ప ప్రభుత్వం అధికారభాషా సంఘం వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు.

ఈ వినతిపత్రాన్ని తీసుకొని మన బ్లాగర్లు అందరు మరియు ఇంకా తెలుగుభాషా అభిమానులు అందరము ర్యాలీగా సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి అందజేద్దాము. ప్రభుత్వము ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మన ఉద్యమము ప్రజలలో బాగా వ్యాప్తి చెందుతుంది.అలా వ్యాప్తి చెందిననాడు ప్రభుత్వము దిగరాక తప్పదు.

పైన పేర్కొన్న వినతిపత్రాన్ని అన్ని రాజకీయపార్టీ నాయకులకు ఇద్దాము.ఎవరైతే సానుకూలముగా స్పందిస్తారో వారికే ఓటు వేస్తామని చెబుదాము.
మన బ్లాగర్లలో మహానుభావులు,పండితులు మరియు అనుభవశీలురు ఉన్నారు.వీరందరికీ నా విన్నపము ఏమిటంటే పైన పేర్కొన్న నా ప్రతిపాదనకు ఏమైనా సవరణలు చేసి ఇంకా విషయాలను కలిపి మన ఉద్యమానికి కార్యరూపం గావించవలసింది గా కోరుకొంటున్నాను.పైన పేర్కొన్నవే అంతిమం కావు.పై పని వలన వచ్చే ఫలితం పైన మన తర్వాతి కార్యాచరణకు సిద్దం అవుదాము.
ఈ పనికి గాను ప్రాంత భేధము లేకుండా తెలంగాణా,రాయలసీమ,కోస్తా అన్ని ప్రాంతాల నుండి బ్లాగర్లు,భాషాభిమానులు నడుం కట్టవలసి ఉంటుంది.ఈ పని భాషకు సంబంధించినది. ప్రాంతమునకు సంబంధించినది కాదు.కుల,మత మరియు ప్రాంత భేధాలు లేకుండా మనము అందరము సంఘటితముగా ఉండి ఈ విషయంపై పోరాడాలి.
మంచిపనికి ముహూర్తాలు చూసుకోనవసరంలేదు.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిద్దాము.
తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు,నల్లమోతు శ్రీధర్ గారు,వీవెన్ గారు,జ్యోతక్క,కత్తి మహేష్ కుమార్ గారు,లక్ష్మి గారు,"అమ్మఒడి" గారు,"దీప్తిధార" గారు, దుర్గేశ్వర్ గారు,నూర్‌భాషా గారు మొదలగు అనుభవశీలురకు మరియు అందరు బ్లాగర్లకు పేరుపేరునా నా విన్నపము.

Monday, January 12, 2009

వివేకానందుని పిలుపు


లేవండి, మేల్కొనండి, గమ్యం చేరుకొనేవరకు విశ్రమించకండి

Friday, January 2, 2009

మాజీ కేంద్రమంత్రి అంతూలే గారి నిజస్వరూపం

ముంబాయిలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు,లష్కర్-ఏ-తోయిబా నేతలకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలను మన పోలీసులు బహిర్గతం చేసారు.
బయటపడిన కొన్ని సంభాషణలు:
"అగ్గి పెట్టండి,అగ్గి పెట్టండి" - పేలుళ్ళ తీవ్రతను పెంచవలసిందిగా ఆదేశాలు
"అలసిపోకుండా ఒకరొకరుగా దాడి చేస్తూ అప్పుడప్పుడు నిద్రపోతూ దాడులు కొనసాగించండి" - సుదీర్ఘ,ఉద్దేశ్యపూర్వక దాడుల కొరకు ఆదేశాలు
"అంతిమ క్షణాలు వచ్చేసాయి.నమాజు చేయండి.ఏమైనా సందేశము ఇవ్వాలనుకొంటున్నారా?" - కమెండోలు ఆపరేషన్ పూర్తి చేసే సమయంలో ఉగ్రవాదులకు వచ్చిన సందేశము
"కమీషనర్‌ను ఎవరైనా చంపేసారా?" - ఈ సందేశము ఆతృతగా అడిగారు.ఈ సందేశము ATF ముఖ్యనేత కర్కరే హత్యను ఉద్దేశించి ఆ హత్య జరిగిన విషయాన్ని రూఢి చేసుకొనుటకు అడిగినట్టు ఉంది.అతన్ని ప్రత్యేకము గా లక్ష్యము చేసుకొన్నారు.

అందరికీ తెల్సు మన మాజీ కేంద్ర మంత్రివర్యులు అంతూలే గారు చేసిన వ్యాఖ్యలు.ATF ప్రధానాధికారి హేమంత్ కర్కరే మృతిని మాలేగావ్ పేలుళ్ళకు లంకె పెడుతూ ఎవరో ముస్లిమేతరులు(ఆ ముస్లిమేతరులు ఎవరో కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను) అతని హత్యకు కారణమని వ్యాఖ్యలు చేసాడు.ఎప్పుడెప్పుడు మతవిద్వేషాలు రెచ్చగొడదామా,లాభం పొందుదామా అని ఎదురుచూసే ఇలాంటి వెధవ రాజకీయనాయకులను కఠినముగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతూలే గారి నిజస్వరూపం ఈ రోజు వచ్చిన పై వార్తతో బట్టబయలైంది.కేంద్ర ప్రభుత్వములో మైనారిటీ శాఖకు మంత్రిగా ఉంటూ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రికి ఎలాంటి శిక్ష విధించినా పాపం ఉండదు.

Wednesday, December 31, 2008

నిన్నటి చిలిపి ప్రశ్నలకు సమాధానాలు

దయచేసి తర్కాలను పట్టించుకోకండి.
1.శ్రీ మహావిష్ణువు ఏ అవతారము ఎత్తినప్పటికినీ భూమిపై ఆ అవతారము జరుగుతున్నా వైకుంఠములో నారాయణుడి రూపములో ఉండేవాడు.కాని చేప,పంది,నరసింహ అవతారాలు ఎత్తినప్పుడు స్వామే స్వయముగా రూపము మార్చుకొని వచ్చాడు.చేప,పంది అవతారాలు ఎక్కడ నుండీ పుట్టలేదు స్వయముగా ఆయనే దిగివచ్చాడు.కాని నరసింహస్వామి అవతారంలో స్థంభం నుండి పుట్టాడు.ఇక బ్రహ్మదేవుడు విష్ణువు నాభిలో నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడికి నాయనమ్మగా "స్థంభాన్ని" చెప్పుకోవచ్చు.
2.చందమామ,లక్ష్మీదేవి ఇరువురూ సముద్రము నుండి పుట్టారు కావున సోదర సంబంధం ఉంది.
3.మహావిష్ణువుకు చెల్లిగా పార్వతీ దేవిని చెబుతారు(నారాయణ-నారాయణి).పార్వతీ దేవి హిమవంతుని పుత్రిక కాబట్టి హిమాలయాలు విష్ణువుకు తండ్రి వరుస అవుతాయి.

Tuesday, December 30, 2008

చిలిపి ప్రశ్నలు ( తర్కాలు(లాజిక్కులు) లాగకుండా సరదాగా సమాధానం చెప్పండి)

1.బ్రహ్మదేవుడి నాయనమ్మగా ఎవరిని చెప్పుకోవచ్చు?
2.చందమామ కు లక్ష్మీదేవికి చుట్టరికం ఏమిటి?
3.శ్రీ మహావిష్ణువుకు హిమాలయానికి గల బంధుత్వం ఏమిటి?

Monday, December 15, 2008

అంతా ఆంగ్లమే-అక్కడక్కడా తెలుగు-వీలైతే విదేశీ భాషలు

ఇదీ నేటి తెలుగు ఛానళ్ళ పరిస్థితి. మన తెలుగు ఛానళ్ళు తెలుగును దాటిపోయి చివరికి ఆంగ్లాన్ని కూడా దాటి ఇతర విదేశీ భాషలను కూడా చేరేసాయి.Grand Final అనేది ఆంగ్లము.Grand Finale(గ్రాండ్ ఫినాలె)అన్నది ఏ భాషో ఏమో.అలాగే program అన్నది కాస్తా programme(ప్రోగ్రామె) అయింది.ఏంటి ఇదంతా?
ఈ మధ్య మన తెలుగు ఛానళ్ళ వారు తమ కార్యక్రమాల పేర్లు కూడా ఆంగ్లంలోనే పెట్టుకుంటున్నారు.చివరికి వార్తలకు కూడా "న్యూస్ అట్ మార్నింగ్ ఎడిషన్" అని ఈవినింగ్ ఎడిషన్ అని,నైట్ ఎడిషన్ అని అంతా ఆంగ్లమే.ఇక ప్రతి కార్యక్రమానికీ ముందు special prograame అని కనిపిస్తుంది.మాట్లాడే బాషా కల్తీయే,వ్రాయడమూ కల్తీయే ఇప్పుడు చివరికి పేర్లు పెట్టడం కూడా అలానే అయిపోతోంది."అంతిమ సమరం","ఆఖరి పోరాటం","విశేష కార్యక్రమం" లాంటి పదాలు ఆకర్షణీయం కాదా? ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో కలిసిపోయిన పదాల గురించి మనం పట్టించుకోనవసరం లేదు.అలాంటివాటిని అలానే వాడుదాము.
ఇక వ్యాఖ్యాతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు పోయే హొయలు సామాన్యులెవ్వరూ పోరు.వారు మాట్లాడుతుంటే పాలు కూడా విరిగిపోయేట్టు ఉంటాయి.వీరు "ఆంగ్లేయ తెలుగువారు".కొన్ని రోజులు పోతే Anglo Indians లానే Anglo Andhrans కూడా ఏర్పడి వారికి కూడా చట్టసభలలో,ఇతర రంగాలలో కొన్ని స్థానాలు ప్రత్యేకముగా కేటాయించవలసి వస్తుందేమో.
"తినగ తినగ వేము తియ్యగనుండు" అన్న చందముగా భాషను మాట్లాడుతూంటే తియ్యగా అవ్వదా? "నా performance చూసారుగా నాకు ఓటు వేయండి" అని పిల్లలు ముద్దుముద్దుగా అంటుంటారు. Performance బదులు "ప్రదర్శన" అనే తెలుగుపదం ఉపయోగిస్తే ఎంత మధురముగా ఉంటుంది.చిన్నచిన్న పదాల దగ్గరే తెలుగును పిల్లలకు అలవాటు చేయకపోతే ఇక వారికి తెలుగు పదాల మధురత్వం ఎలా అలవడుతుంది?
ఇక చాలామందిని మీ రాశి ఏది అని గనుక అడిగినట్లయితే వెంటనే స్కార్పియో అనో,లియో అనో ఆంగ్లరాశుల పేర్లు చెబుతారే కానీ మన భారతీయ రాశుల పేర్లు చెప్పలేరు.అసలు ఎంతమందికి ఇవి గుర్తున్నాయో చెప్పలేము.
మన భాష పరిస్థితి ఎలా తయారవుతున్నదంటే కొన్ని రోజుల తర్వాత వాడుక బాష కూడా గ్రాంధికం అయ్యేటట్లు అనిపిస్తోంది.sorry అనే పదం వాడుకగా "మన్నించండి" లేక "క్షమించండి" అనే పదం ఏదో పెద్ద తప్పు చేసినప్పుడు మాత్రమే ఉపయోగించే పదాలుగా తయారవుతున్నాయి.చాలా పదాల పరిస్థితి ఇలానే ఉంది. "తరగతి","పాఠము,వరుస,వ్యాపకము,స్వస్థలము,నమోదు" లాంటి అందమైన తెలుగు వాడుక పదాలు అవసానదశకు చేరుకుంటున్నాయి.వాటి స్థానంలో class,lesson,line,hobby,native place,register లాంటి పదాలు వాడుకలో చేరిపోతున్నాయి.
కొన్నిచోట్ల ఆంగ్లపదం బదులు తెలుగుపదం గనుక ఉపయోగిస్తే అది బూతులకు దారితీసే పరిస్థితి కూడా ఎదురవుతోంది.ఉదాహరణకు sex అనే ఆంగ్లపదాన్ని కొన్నిచోట్ల వాడుకలో ఉపయోగించకపోతే అదేదో సిగ్గుపడే వ్యవహారంగా,వాడకూడని పదంగా మారిపోయింది.

Saturday, November 22, 2008

మంచిపని కి ఆలస్యం ఎందుకు?(ఒక మంచి కథ)

ఒకసారి ధర్మరాజు కొలువుదీరి ఉండగా ఒక పేదవాడు వచ్చి తనకు ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థిస్తాడు.అప్పుడు ఏదో అవసరమైన చర్చలలో ఉన్న ధర్మరాజు "రేపు రమ్మని" తప్పక సహాయం చేస్తానని అన్నాడు.వెంటనే శ్రీకృష్ణుడు ఒక మూల నుండి ధర్మరాజు తో "ఓ మహానుభావా! సర్వజ్ఞా,సర్వాత్మస్వరూపా" అంటూ సంభోదిస్తూ ప్రత్యక్షమయ్యాడు.ఇది విన్న ధర్మరాజు నిర్ఘాంతపోయి "బావా!ఏంటి అలా సంభోదించావు?" అని బాధపడ్డాడు.అప్పుడు శ్రీకృష్ణుడు "మీరు అతన్ని రేపు రమ్మన్నారు.మరుక్షణం ఏమవుతుందో తెలియదు.అలాంటిది మీరు అతన్ని రేపు రమ్మన్నారంటే మీరు రేపటి వరకు బ్రతికి ఉంటారన్న విషయం మీకు తెలిసి ఉండాలి.అలాగే ఆ పేదవాడు కూడా రేపటివరకు బ్రతికి ఉంటాడని మీకు తెలిసి ఉండాలి.ఒక సర్వజ్ఞునికి మాత్రమే కదా ఇలాంటి విషయాలు తెలిసేది.అందుకే మిమ్ములను అలా సంభోదించాను"అన్నాడు.ఇది విని తన తప్పు తెలుసుకున్న ధర్మరాజు ఆ పేదవాడికి వెంటనే అతను కోరుకున్నది ఇచ్చి పంపాడు.

Thursday, November 6, 2008

మతరహిత సమాజం ఆకాశపుష్పం

అగ్ని,నీరు మొదలగునవి ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ తటస్థంగానే ఉంటాయి.మనం వీటిని ఉపయోగించేదానిని బట్టి అవి ఉపయోగం అవుతాయి. చలికాలంలో అగ్గి దగ్గర కూర్చొని చలి కాపుకుంటాము.ఎంతో హాయిగా అనిపిస్తుంది. కాని ఎండాకాలంలో అగ్గి అంటేనే బయపడతాము. అగ్గి చేతికి తగిలి కాలింది అనుకొందాము."అబ్బా ఈ అగ్గి ఎంత చెడ్డది" అనుకొంటాము.వాస్తవానికి అగ్గి చెడ్డదా?మంచిదా?.ఏమీ కాదు.అది తటస్థము.మనము ఉపయోగించేదాని బట్టి అది ఉపయోగపడుతుంది. నీటి విషయం కూడ అంతే.వాస్తవానికి అవి తటస్థంగానే ఉంటాయి.మనమే వాటికి గుణాలను ఆరోపిస్తుంటాము.

మతం విషయం కూడా అంతే. అందులోని మంచిని గ్రహించినవాడు అదే ప్రకారం ప్రవర్తిస్తాడు.చెడును గ్రహించినవాడు ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. ఇందుకు మనం మతాన్ని నిందించడం తగునా? ఈ మధ్య మతాలు ఉండనవసరం లేదని, చెడును ప్రోత్సహించే మతాలు ఉంటే ఏమి లేకపోతే ఏమి అని అంటున్నారు. వాస్తవానికి సృష్టిలోని ప్రతివిషయంలోనూ గుణ,దోషాలు అనేవి ఉండక తప్పదు. అలాంటప్పుడు మనం ఏమీ ఉండకూడదు అనలేము కదా. దీనికి మతం అనే విషయం మినహాయింపు కాదు.

మానవతను మించిన మతం లేదు అన్న విషయం సరైనదే. ప్రతి మతమూ మానవతను కూడా బోధిస్తుంది కదా? పైన పేర్కొన్నట్టు దోషాలు కూడా ఉంటాయి. సృష్టిలో ఏ ఒక్కటీ పరిపూర్ణం( perfect ) కాదన్న విషయం అందరికీ తెలుసు.మరి మతం అనేది మాత్రం పరిపూర్ణం అని ఎలా భావిస్తారు? సరే అసలు లోపాలే లేని మతం ఒకటి స్థాపిద్దాము అనవచ్చు. కాని పైన పేర్కొన్న విధంగా పరిపూర్ణం ఐనది లేదు కాబట్టి దానిలో కూడా దోషాలు ఉండక తప్పదు. అప్పుడు ఆ దోషాలు నచ్చనివారు ఇంకొక మతం స్థాపించవచ్చు.కథ మళ్ళీ మొదటికి వస్తుంది.

సుఖదుఃఖాలు,మంచిచెడులు మొదలగు ద్వంద్వాలు ఎలానో గుణదోషాలు కూడా అలాగే. అందరికీ తెలుసు సుఖదుఃఖాలనేవి సాపేక్షాలని.ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించడం మన అనుభవమే. కావున మతాలు అన్నింటినీ రద్దుచేసినా అవి కంటికి కనిపించకపోవచ్చు.కాని గుప్తంగా అవి ఉండనే ఉంటాయి. కాబట్టి ఏ మతం వారైనా సరే వారివారి మతాలలోని మంచినే గ్రహించి లోపం అనుకొన్నదానిని వదిలివేస్తే ఏ బాధా ఉండదు.

Sunday, November 2, 2008

సాయనాచార్యుడు (తెలుగు వారి వైభవం)

నేటికీ భారతీయులు కానీ,పాశ్చాత్యులు కానీ వేదాలను అర్థం చేసుకుంటున్నారంటే అది "సాయనాచార్యుడు" రచించిన వేదభాష్యము చేతనే.ఇతని భాష్యము పేరు "వేదార్థ ప్రకాశము".

నా టపా "కాంతివేగం వేదాలలోనే ఉంది" అనే దానిలో కాంతివేగమును సాయనాచార్యుడు తన ఋగ్వేదభాష్యములో ప్రస్తావించాడు అన్న విషయం ప్రస్తావించాను.ఇతను బుక్కరాయల ఆస్థానం లో మంత్రిగా ఉండేవాడన్న విషయం ప్రస్తావించాను.

ఇతను మన తెలుగువాడు కావడం మనకు ఎంతో గర్వకారణం.ఇతని జీవిత కాలం 1315 నుండి 1387.ఇతను తెలుగు బ్రాహ్మణుడు.భరద్వాజ గోత్రీకుడు.వీరి తల్లిదండ్రులు మాయన,శ్రీమతి గార్లు.ఇతని భాష్యము ఎంత ప్రఖ్యాతి పొందినదంటే "మాక్స్‌ముల్లర్" ,కీత్ పండితుడు మొదలగు పాశ్చాత్యులందరు సాయనాచార్యుని భాష్యము అనుసరించియే ఆంగ్లములోనికి,ఇతర విదేశీబాషలలోనికి వేదాలను అనువదించారు.ఇతను రాజనీతికోవిదుడు.ఇతను కంపరాజుకు, బుక్కరాయ, హరిహరరాయలకు మంత్రిగా వ్యవహరించారు.

సాయనాచార్యులు వేదాలకే కాక తైత్తిరీయ బ్రాహ్మణం,తైత్తిరీయ అరణ్యకం,ఐతరేయ బ్రాహ్మణం,ఐతరేయ అరణ్యకం,శతపథ బ్రాహ్మణం మొదలగు 13 పైన వ్యాఖ్యలు వ్రాశాడు.

Saturday, November 1, 2008

ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట


ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట భారతదేశంలోనే ఉంది.అంతేకాక నేటికీ అది చెక్కుచెదరకుండా ఉన్నదన్న విషయం అత్యంత ఆశ్చర్యకరం.కేవలం మరమ్మత్తులు మాత్రం చేశారు.నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ ఆనకట్ట నిదర్శనం.

ఈ ఆనకట్ట పేరు "కలనై".చోళరాజు "కరికాళ చోళుడు" కాలంలో క్రీ.శ 2వ శతాబ్దంలో నిర్మింపబడింది.తమిళనాడు లోని కావేరినది పై తంజావూరు పట్టణానికి 48 కి.మీ దూరంలో నిర్మింపబడి ఉంది.విచిత్రం ఏమిటంటే సిమెంట్ లాంటి ఏ అతుక్కోవడానికి ఉపయోగపడే (బైండింగ్ మెటీరియల్)దీని లో ఉపయోగించలేదు.
కావేరి నదీ జలాలను ఆనాటి నుండి నేటి దాకా నిరంతరాయంగా అనేక వేల ఎకరాలకు నీటిని అందిస్తూంది.
క్రీ.పూ 4వ శతాబ్దంలోనే గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద 'సుదర్శన జలాశయం' నిర్మింపబడింది.

Wednesday, October 29, 2008

మన తెలుగు బ్లాగుల వలన తెలుగు భాషకు ప్రయోజనం ఏమిటి?

మనం అందరము తెలుగులో బ్లాగులు వ్రాస్తున్నాము.ఎంతో కొంత ఐనా తెలుగు బాషకు ప్రయోజనం చేకూరుతున్నదని అనుకొంటున్నాము.గూగుల్ వారు,ఫైర్‌ఫాక్స్ వాళ్ళు తెలుగులో తమ సర్వీసులు అందిస్తున్నారు.బయటివారందరూ తెలుగు కు బాగానే ప్రాముఖ్యత ఇస్తున్నారు.కాని తీరా అసలు ప్రదేశమైన మన రాష్ట్రం వచ్చేటప్పటికి తెలుగు వాడకం ఎంతగా తగ్గిపోతోందో తెలుసు.

మనం మనవంతుగా దృష్టి పెట్టవలసిన నేను అనుకొంటున్న కొన్ని సంఘటనలను క్రింద తెలియజేసుకొంటున్నాను.

1.తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవం గా తెలుగు బాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.అందులో పాల్గొన్న మన ముఖ్యమంత్రి గారు తెలుగు కు ప్రాముఖ్యత ఇస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.కాని అసలు జరిగింది ఏమిటి?ఆ ఉత్సవాలు ముగిసిన వారం లోపే ఆరవ తరగతి నుండి తెలుగును కేవలం ఒక పాఠ్య విషయంగా(సబ్జెక్ట్)గా మాత్రమే బోధించాలని మిగతా అంతా ఆంగ్ల మాధ్యమంలో నే ఉంచాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.
యూరప్ దేశాలలో వారి విద్యావిధానం చూడండి.వారి విద్యావిధానంలో డిగ్రీ వరకు కూడా వారి మాతృభాషలోనే బోధన ఉంది.ఆంగ్లం కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే.కేవలం పిజి మాత్రమే ఆంగ్లమాధ్యమం లో బోధిస్తున్నారు.

2.ఇక రాష్ట్ర రోడ్డు రవాణా విషయానికి వస్తే ఇంకా అధ్వాన్నంగా పరిస్థితి ఉంది.స్థానికంగా మన రాష్ట్రం లోపల నడిపే బస్సుల విషయంలో మాత్రం తెలుగును అమలు చేస్తున్నారు.హైదరాబాదులో మహాత్మాగాంధీ బస్టాండులో వోల్వో(గరుడ) బస్సులు నిలిపే స్థలానికి ఎదురుగా విచారణా కేంద్రం వద్ద ఒక ఫలకం ఉంటుంది.అందులో మన ఆర్టీసి వాళ్ళు ఎంతో గొప్పగా "తెలుగు కనపడాలి","తెలుగు వినపడాలి""తెలుగు కన్నతల్లి లాంటిది" మొదలగు నినాదాలు వ్రాసిఉన్నారు.కాని ఆచరణలో వాళ్ళు చూపిస్తున్నది ఏమిటి? మన రాష్ట్రం నుండి బయలుదేరే అన్ని అంతరరాష్ట్ర బస్సుల పైనా పూర్తిగా తెలుగు తీసివేసి అంతా ఆంగ్లమయం చేసారు.ఇక గరుడ వోల్వో బస్సుల విషయంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది.రాష్ట్రంలోపల తిరిగే బస్సులను కూడా అంతా ఆంగ్లం తో నింపివేసారు.అంతర రాష్ట్ర బస్సుల విషయంలో అంతా తెలుగులోనే వ్రాయాలని అనడం లేదు.ఆంగ్లంతో పాటు తెలుగు కూడా వ్రాస్తేనే కదా,తెలుగు కనపడితేనే కదా మన బాషపై మనకు గల అభిమానం కనీసమైనా ఇతర రాష్ట్రాలవారికి తెలిసేది.కర్ణాటక వారి విషయానికి వస్తే వారి అంతర రాష్ట్ర బస్సులపై కన్నడ,తెలుగు, వోల్వో బస్సులపై కన్నడ,ఆంగ్లం,తెలుగు మరియు తమిళనాడు విషయానికి వస్తే వారి అన్ని అంతర రాష్ట్ర బస్సులపైనా తమిళం,ఆంగ్లంలలో వ్రాసి ఉంటుంది.ఆ విధంగా వారు తమ భాష ను ఇతర రాష్ట్రాలవారికి తెలిసేలా చేస్తున్నారు.తమ భాషా సంస్కృతిని ఇతర రాష్ట్రాలవారు తెలుసుకొనేలా చేస్తున్నారు.ఆంగ్లాన్ని వద్దనకుండానే తమ బాషా సంస్కృతిని కాపాడుకుంటున్నారు.కాని మన విషయం ఏమిటి?ఇంత మాత్రం జ్ఞానం కూడా మన ప్రభుత్వానికి లేదా?

3.ఇక హైదరాబాదు చూసిన వారందరికీ ఒక విషయం తెలుసు.ఒక రాష్ట్ర రాజధానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ దానికి ఉన్నప్పటికీ అసలు లక్షణమైన బాషా సంస్కృతి లక్షణం అన్నది లేదు అని.హైదరాబాదులో తిరుగుతుంటే ఒక విదేశ నగరంలో తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించదు.ఏ దుకాణం పై చూసినా పేరు సూచికలు పూర్తిగా ఆంగ్లంలోనే ఉంటాయి.ఇదే కర్ణాటక,తమిళనాడు విషయానికి వస్తే దుకాణాలపైన ఆంగ్లంతో పాటు ఆయా భాషలు కూడా తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది.ఎవరైనా అమలు చేయకపోతే ఆ దుకాణాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

ఇతర బాషలను మనం ద్వేషించనవసరం లేదు.కాని మన మాతృబాషను మనం మరిచిపోతున్నాము.

మన బ్లాగర్లు ఈ విషయాలపైన ఏమీ చేయలేమా? మనం ఏ విధమైన కార్యాచరణ పథకం చేయలేమా? ఆలోచించండి. సంఘటనలు ఇంకా ముదిరిపోకముందే మనము సంస్థాగతంగా ఏదైనా చేయకతప్పదు.ఇలా ఏమీచేయలేనినాడు మనం మన బ్లాగుల ద్వారా ఒకరికి తెలిసిన సమాచారం మరొకరికి ఇచ్చిపుచ్చుకోవడం,అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే చేయగలము.ఇవి మాత్రమే ఉద్దేశ్యంగా గలవారికి ఏమీ చెప్పడం లేదు.తెలుగు బాషను బ్రతికించుకందామనుకొనే వారికి,కాపాడుకొందాము అనుకొనేవారికి నా ఈ అభ్యర్థన.ఇప్పటికిప్పుడు తెలుగుబాషకు ఏమీ ప్రమాదం లేదని అనుకోవచ్చు.కాని సమస్యా పరిష్కారానికి నడుము బిగించాల్సిన తరుణం ఇదే అని నా ప్రగాఢవిశ్వాసం.

మన బ్లాగుల ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషా పునర్వైభవమే కాబట్టి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
పైన పేర్కొన్నవి కేవలం కొన్ని సమస్యలు మాత్రమే.ఇంకా చాలా ఉన్నాయి.కాని పైన పేర్కొన్నవి తక్షణసమస్యలు అని అనుకొంటున్నాను.
బ్లాగుల ద్వారా ఎలానూ తెలుగుభాషకు సేవ చేసుకొంటున్నాము.ఇకనైనా మనము కార్యాచరణకు నడుము బిగించాలి అనుకొంటున్నాను.అందుకుతగ్గ కార్యాచరణను ఆలోచించండి.

Sunday, October 26, 2008

గణపతి ఆవిర్భావానికి సంబంధించిన కథలు

గణపతి కి సంబంధించిన కథలను చూస్తే మనకు ఆసక్తి కలుగుతుంది.అవేమిటో చూద్దాం.
1.దేవతలు తమ పనులకు కలుగు ఆటంకాలను తొలగించి వాటిని విజయవంతం చేసే ఒక దేవత కావాల్ని శివుడిని వేడుకొన్నప్పుడు ఆయనే స్వయంగా పార్వతీదేవి గర్భంలో వినాయకుడిగా జన్మించాడు.
2.ఒకసారి పార్వతీదేవి తను వంటికి రాసుకున్న లేపనంతో ఏనుగు తల గల ఒక బాలుడి బొమ్మను తయారు చేసి గంగానదిలో విసిరివేసింది.మరుక్షణమే అది సజీవమైంది.గంగాదేవి,పార్వతి ఇద్దరూ ఆ బాలుడిని తమ బిడ్దగానే పిలిచారు.దీనివలన ఆ బాలుడికి ద్వైమాతురుడు అనగా ఇద్దరు తల్లులు గలవాడు అనే పేరు వచ్చింది.
3.పార్వతీ దేవి నలుగుపిండి తో బాలుడిని తయారుచేయడం,అతన్ని పార్వతి కాపలాగా ఉంచుకోవడం,అతడు శివుడిని అడ్డగించడం,శివుడు కోపంతో అతని తలను నరికివేయడం,పార్వతి దుఃఖించడం,ఏనుగు తలను అతికించి ప్రాణం పోసి గణనాయకుడిని చేయడం ఇది అందరికీ తెలిసిన కథ.
4.గణపతి శివుని ముఖకవలికళనుండి ఉద్భవించాడు.అందరినీ మోహింపచేస్తున్న ఆ రూపం పట్ల పార్వతీ దేవి కోపంతో శపించడం వలన వికారరూపం ఏర్పడింది.
5.గణేశుడు మొదట మానవరూపంలోని కృష్ణుడే.అపకారబుద్దితో శనిగ్రహం ఒకసారి అతన్ని చూడడంతో అతడి తల తెగి కృష్ణుడి లోకమైన గోలోకంలో పడింది.తర్వాత ఏనుగుతలను ఆ బాలుడికి అతికించారు.

Saturday, October 18, 2008

ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తిపీఠాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

1.శ్రీ భీమశంకరేశ్వరుడు : భీమశంకర్

2.శ్రీ త్రయంబకేశ్వరుడు : త్రయంబకేశ్వరం,మహారాష్ట్ర

3.శ్రీ కేదారేశ్వరుడు : కేదార్‌నాథ్,హిమాలయాలు

4.శ్రీ విశ్వేశ్వరుడు : వారణాశి,ఉత్తరప్రదేశ్

5.శ్రీ రామలింగేశ్వరుడు : రామేశ్వరం,తమిళనాడు

6.శ్రీ మల్లిఖార్జునుడు : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

7.శ్రీ మహాకాళేశ్వరుడు : ఉజ్జయిని,మధ్యప్రదేశ్

8.శ్రీ ఓంకారేశ్వరుడు : ఓంకారేశ్వర్,మధ్యప్రదేశ్

9.శ్రీ సోమనాధేశ్వరుడు : సోమనాథ్,గుజరాత్

10.శ్రీ నాగేశ్వరుడు : దారుకావనం,గుజరాత్

11.శ్రీ వైద్యనాథేశ్వరుడు : వైద్యనాథ్,బీహార్

12.శ్రీ ఘశ్మేశ్వరుడు :ఎల్లోరాగుహ,మహారాష్ట్ర

అష్టాదశ శక్తిపీఠాలు:

1.శ్రీ సరస్వతీ దేవి : జమ్మూకాశ్మీర్

2.శ్రీ విశాలాక్షీ దేవి : వారణాశి,ఉత్తరప్రదేశ్

3.శ్రీ కామాక్షీదేవి : కంచి,తమిళనాడు

4.శ్రీ గిరిజాదేవి : ఓడ్గాపురి,కటక్,ఒరిస్సా

5.శ్రీ భమరాంబా దేవి : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

6.శ్రీ వైష్ణవీ దేవి : కాంగడా,హిమాచల్‌ప్రదేశ్

7.శ్రీ పురుహూతికా దేవి : పిఠాపురం,ఆంధ్రప్రదేశ్

8.శ్రీ శృంఖలా దేవి : ప్రద్యుమ్నం,బెంగాల్

9.శ్రీ మాధవేశ్వరీ దేవి : ప్రయాగ,ఉత్తరప్రదేశ్

10.శ్రీ మహాలక్ష్మీ దేవి : కొళ్హాపురం,మహారాష్ట్ర

11.శ్రీ ఏకవీరాదేవి : మహూర్యం,నాందేడ్,మహారాష్ట్ర

12.శ్రీ కామరూపిణీ దేవి : గౌహతి,అస్సాం

13.శ్రీ చాముండేశ్వరీ దేవి : మైసూరు,కర్ణాటక

14.శ్రీ మహాకాళీ దేవి: ఉజ్జయిని,మహారాష్ట్ర

15.శ్రీ మాంగల్య గౌరీదేవి : గయ,బీహార్

16.శ్రీ జోగులాంబా దేవి : ఆలంపురం,కర్నూలు

17.శ్రీ మాణిక్యాంబా దేవి : ద్రాక్షారామం,ఆంధ్రప్రదేశ్

18.శ్రీ శంకరీ దేవి : ట్రింకోమలి,శ్రీలంక.

Wednesday, October 15, 2008

ఒక జోకు

ఓ సారి జేమ్స్‌బాండ్,తెలుగువాడు కలిసి ప్రయాణిస్తున్నారు.తెలుగువాడు అడిగాడు "మీ పేరేమిటి?"
"బాండ్.....జేమ్స్‌బాండ్" అన్నాడు జేమ్స్‌బాండ్.
'నీ పేరు ' అని అడిగాడు.
'సాయి......వెంకట సాయి......శివ వెంకట సాయి.........లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస లక్ష్మినారాయణ శివ వెంకట సాయి..........అల్లంరాజు సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............"
జేమ్స్‌బాండ్ మూర్చపోయాడు.

Tuesday, October 14, 2008

భాషతో ప్రయోగాలు - విచిత్రాలు- సరదాలు

enemy the= ఎనిమిది
way to=వేటు
సీ రియల్= చూడు నిజం
ఏమిటీ=ఏ కంపెనీ టీ
P.D.కిలి= పిడికిలి
P.C.నారి=పిసినారి
Six master=ఆరుగురు
ఫోర్మెన్=నలుగురు మగవారు
ఫోర్జరీ=నాలుగు జరీ(చీరలు)
though Say=దోసె
chest air=ఎదగాలి
100 ద్దీన్=నూరుద్దీన్
Earth Milk=నేలపాలు
సిగ్నేచర్=సిగ్గు పడే ప్రకృతి
వెన్నెల=WHEN నెల(ఎప్పుడు నెల)
వేలు= Way లు(దారులు)
Slow come=శ్లోకం
Low come=లోకం

Tuesday, October 7, 2008

త్యాగరాజ కీర్తన ( భావము )

ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే

సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత లేనివా(రెంత)

పర హింస పర భామాన్య ధనపర మానవాపవాదపర జీవనాదులకనృతమేభాషించెదరయ్య త్యాగరాజ నుత (ఎంత)

భావము:

ఈ కీర్తన త్యాగరాజు గారి ఆవేదన ను మనకు తెల్పుతుంది.మనుషులు ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా,ఎన్ని అనుభవాలు పొందినా కాంతకు అనగా కామానికి దాసులు గానే ఉన్నారు.ఇచ్చట కాంత అనగా స్త్రీని ఉద్దేశించి చెప్పినది కాదు కామాన్ని ఉద్దేశించి చెప్పినది.మనకు కామం యొక్క శక్తి తెలిసినదే.ఇది అగ్నిలాగా ఎంత అనుభవించినా ఇంకా దహించాలనుకొంటుంది అనగా అనుభవించాలనుకొంటుంది.


స్వాంతన(శాంతి లేక ఉపశమనం) కలిగించు ఆ శ్రీకాంతుని(శ్రీ మహా విష్ణువు)పైన భక్తి లేని ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా అనగా కామానికి దాసులు గానే ఉంటారు.

ఓ త్యాగరాజు చే భజింపబడే రామా,ఈ మానవులు ఇతరుల ధనానికై,ఇతర స్త్రీలను ఆశించి ఇతరులను హింసించడానికైనా వెనుకాడక తమ మానాలను అనగా శీలాన్ని పోగొట్టుకుంటారు.అపవాదులను కొనితెచ్చుకుంటారు.పరులపై అధారపడి జీవించడానికి అబద్దాలు చెప్పుతుంటారు.

Monday, October 6, 2008

యుగం బట్టి ధర్మం - కాలం బట్టి ఉద్యోగం

కాలం బట్టి యువత ఎక్కువగా కోరుకొనే ఉద్యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1900 సంవత్సర సమయాలలో : లాయరు(న్యాయవాది)
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్‌వేర్ ఉద్యోగాలు
తర్వాతో.............

Thursday, October 2, 2008

లాల్‌బహదూర్ శాస్త్రి గారిని మరిచిపోయామే

నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్‌బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?
ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే.ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.

Wednesday, October 1, 2008

త్యాగరాజ కీర్తన వినండి

క్రింది కీర్తన వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాల! కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
శ్రీ రమాలోల! విధృత శరజాల!

శుభద కరుణాలవాల!ఘననీల నవ్యవనమాలికాభరణ!ఏల నీ దయ రాదు!!
పరాకు జేసేవేల సమయము గాదు!!

రారా!! దేవాది దేవ!!రారా!! మహానుభావ!!(2)
రారా!! రాజీవ నేత్ర! రఘువర పుత్ర!
సారతర సుధాపూర! హృదయ పరివార! జలధి గంభీర దనుజ సంహార!
దశరధ కుమార! బుధ జన విహార! సకల శ్రుతిసార! నాదుపై (ఏల)

రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ
వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)

యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు