తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, March 18, 2016

పసిపిల్లల చేష్టలు మనకు ఎందుకంత ఆనందం కల్గిస్తాయి?

మనందరికీ అనుభవమే ఈ విషయం. పసిపిల్లల పనులు, వారి చేష్టలు మనకు ఎంతో ఆనందం కల్గిస్తాయి. అలాగే ఇంట్లోని పెంపుడు జంతువుల చేష్టలు కూడా మనకు ఎంతో ఆనందం కల్గించి మన మనసులను టెన్షన్ నుండి దూరం చేస్తుంటాయి. అసలు వారి పనుల వలన మనకు ఎందుకు ఆనందం కల్గుతోంది? అవే పనులను పెద్దవాళ్ళు చెస్తే మనకు ఒక్కొక్కసారి కోపం,అసహ్యం కూడా కల్గుతుంటాయి.


పసిపిల్లల చేష్టలు మనకు ఆనందం కల్గించడానికి కారణం ఒక్కటే. వారు చూసేవారికి ఆనందం కల్గించడానికి అలా ప్రవర్తించరు. వారి పనులు పరిపూర్ణసహజత్వం కల్గిఉన్నవి. వారి సహజస్వభావం ప్రకారం పనులు చేస్తుంటారు. వారు ఎలాంటి ముసుగులనూ ధరించి ఉండరు. వారి మనసులలో కపటత్వం ఉండదు కేవలం నిర్మలత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ముసుగులు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం లాంటివి. చివరికి వాళ్ళ కోపం కూడా ఎంత సహజం గా ఉంటుందంటే వారు కోపగించుకోవడాన్ని కూడా మనం ఆనందిస్తాము. "అబ్బ ఎంతకోపం వీడికి" అంటూ మురిసిపోతాము.


కాలం గడవగా గడవగా ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిస్థితుల వలన ఆ సహజత్వం కోల్పోయి ఒకరిని ఆనందపెట్టడానికో లేక బాధపెట్టడానికో ప్రవర్తించడం వలన ఇక వారి చేష్టలు మనకు అసలైన ఆనందం ఇవ్వలేవు.


సమస్త వేదాంతానికీ మూలసూత్రం ఇదే. ఎవరైతే తమ బాల్యం లో లాగా నిర్మలమైన,కపటత్వం లేకుండా అత్యంత సహజంగా తమకు తెలియకుండానే ప్రవర్తిస్తారో వారికి తెలియకుండానే వారి పనుల వలన జీవులు ఆనందిస్తుంటాయో వారే భగవంతునికి అత్యంత సమీపంగా తమకు తెలియకుండానే ఆయన సాన్నిధ్యం అనుభవిస్తుంటారు.

Wednesday, March 16, 2016

అయినదానికీ కానిదానికీ ఆత్మహత్యలు చేసుకొనేవడమేనా? ఆగి ఆలోచించండి..- హనుమంతుడు

చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకొంటున్న యువత కానీ, పనిలో విజయం కోసం వేచిఉండలేని ప్రజలు కానీ హనుమంతుని ఉపదేశాలను (తను పాటించినవాటిని) తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

లంకలో సీతమ్మను వెతకడంలో హనుమంతుడు కూడా నిరాశ పొందాడు. కాని వెంటనే అతను చేసిన ఆలోచన యుగాల పర్యంతం మనకు ఆదర్శముగా ఉంటాయనడం అతిశయోక్తి కాదు.

సీతమ్మ కనపడక నిరుత్సాహం పొందిన హనుమంతుడు, వెంటనే
"శ్రేయస్సుకు(మంచి కలుగడానికి) , సుఖం కలుగడానికి, అన్ని పనులు సాగడానికి ఉత్సాహమే మూలము.ఉత్సాహం కల్గిన మనిషి సర్వకార్యాలందు విజయం పొందుతాడు. వాడు చేసిన కార్యం విజయవంతం అవుతుంది. అందుచేత ఉత్సాహం కోల్పోకుండా నేను మరల మరల సీతమ్మను వెదుకుతాను." అని ఆలొచించి తిరిగి సీతమ్మను వెదకడములో నిమగ్నమైనాడు.

ఐనా సీతమ్మ కనపడకపోవడముతో ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించుకొని, తిరిగి హనుమ ఒక క్షణంలో ఆలొచించిన తీరు అత్యధ్బుతం.

"చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అందువలన నేను చనిపోను."

నేటి వ్యక్తిత్వవికాస పుస్తకాలలో ఏమైతే ఉందో ఆనాడే హనుమంతుడు ఆలోచించి ఆచరించిన విధానము, మనకు ఆదర్శముగా నిలిచిన విధానము ఏనాటి మనుషులైనా, ఏ ప్రాంతపు మనుషులైనా ఖచ్చితముగా తెలుసుకొని ఆచరించి తీరవలసినవి కావంటారా ?

Monday, February 29, 2016

ఈ రోజుకి నా వయసు 9 పుట్టినరోజులు...ఎలా ?

ఈ రోజుకి నా వయసు 9 పుట్టినరోజులు...
సమాధానం చెప్పండి..

Friday, February 19, 2016

251 రుపాయలకు ఫోనా ? మనం గొర్రెలమవుతున్నామా ?


ఆఫ్ట్రాల్ ఫోన్ పౌచ్ కొనడానికి కనీసం అన్నా 80 నుండి 200 రుపాయల వరకు, ఫ్లిప్ కవర్ ఐథే 200  నుండి 1000 రూపాయల వరకు అవుతుంది...
అలాంటిది ఫోన్ 251 రూపాయలంటే ?
టచ్ స్క్రీన్ తయారు చేయడానికే 1000 రూపాయల నుండి నుండి మొదలవుతాయి...

అసలు ఇది ఎంతదాకా వెళుతుందో చూడాలి...

మనము మూకుమ్మడిగా గొర్రెలవుతున్నామనుకొంటున్నాను..

Saturday, February 13, 2016

అమ్మా! సరస్వతి మాతా మమ్మల్ని క్షమించు..



క్రింది భావాన్ని పూరించండి.

మేము "భారతీ"యులం, పేరులో మాత్రమే సరస్వతీస్వరూపులం..
మిగతా అంతా .... ?



                                                                                                                   

Tuesday, January 5, 2016

మనకు వినోదం పంచేవాడికి ఉన్న విలువ మన ప్రాణాలను కాపాడేవాళ్ళకు ఇవ్వని దౌర్భాగ్యులం మనం...



ఒక సినిమా హీరోనో లేక మరో సినీప్రముఖుడో పోతే మన సొంత మనిషే పోయాడన్నంతగా బాధపడతాము. మంచిదే అతడు మీకు వినోదాన్ని పంచాడు. కాని వినోదం ఎప్పటివరకు ? మన ప్రాణం ఉన్నంతవరకే.

మరి ఆ ప్రాణాలను కాపాడడానికే అనుక్షణం జీవిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరజవానుల కోసం ఒక కన్నీటిబొట్టైనా రాలదే !

మన మనసు అంత బండబారిపోయిందా ?

పఠాన్‌కోట్ అమర జవానులకు నివాళులు మరియు దేశసైన్యానికి వందనాలు.

Friday, January 1, 2016

కూడలి బ్లాగుల సంకలిని(అగ్రిగేటర్) మూతపడడం మనసుకు బాధగా ఉంది



ఇప్పుడే చూస్తున్నాను. కూడలి వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే కూడలిని మూసివేస్తున్నట్లు ప్రకటన.
బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పటి నుండి కూడలికి బాగా అలవాటు పడ్డాను. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి ఇంకా మనసు స్వీకరించలేకపోతోంది. అసలు ఏమయ్యిందో అర్థం కావడం లేదు.

చాలా బాధాకరంగా ఉంది.

Friday, December 11, 2015

మీ పాటకు ఒక్క తీగ చాలదా ? నాలుగు కావాలా? (ఒక నిజ సంఘటన)



ప్రఖ్యాత ఫిడేల్ వాయిద్య విద్వాంసులుగా శ్రీ కృష్ణయ్యర్ గారి గురించి చాలామందికి తెలుసు.
వారి జీవితములో ఒకసారి జరిగిన సంఘటన ద్వారా వారెంత సాధకులో,విద్వాంసులో తెలుస్తుంది.

ఒకసారి ఒక కచేరీలో గాయకులకు ప్రక్కవాద్య సహకారంగా కృష్ణయ్యర్ గారు ఫిడేలు వాయిస్తున్నారు. ఉన్నట్టుండి ఫిడేల్ లో ని ఒక తీగ తెగిపోయింది. గాయకుడు కృష్ణయ్యర్ గారి వైపు  "పాటకు అనుగుణంగా వాయించలేక కావాలని తీగ తెంపుకున్నావు" అన్నట్లు వ్యంగముగా చూసారట. ఫిడేలుకు 4 తీగలు ఉంటాయి. కృష్ణయ్యర్ గారికి కోపం వచ్చి "మీ పాటకు ఒక తీగ చాలు మిగతా 3 కూడా అవసరం లేదు" అని మిగతా రెండు తీగలు కూడా తెంపేసి ఒక్క తీగ తోనే మొత్తం కచేరీకి అత్యద్భుతంగా వాద్య సహకారం  అందించారు. కానీ ఎవరికీ అనుమానం రాలేదు.

చూసారా ఇలాంటి మహానుభావుల సాధనా బలం.

- వాసుదేవ గారి "స్మృతులు" గ్రంధం నుండి

Monday, December 7, 2015

నీలము - ఆ రంగుకు (తెలుగు భాషలో) ఈ పేరెలా వచ్చింది ? (నా అభిప్రాయము)



కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా,అకస్మాత్తుగా మనసుకు తడుతూఉంటాయి. అలా నిన్న పడుకున్నప్పుడు ఉన్నట్టుండి మెరుపులా నాకు కలిగిన భావన ఇది.

నాకు తట్టిన ఊహ ప్రకారము  :

మనకు తెలుసు సముద్రము ఆకాశము రంగులో అంటే నీలపు రంగులో ఉంటుందని (రామన్ ఎఫెక్ట్ దీనినే వివరించింది).
నీటిని తెలుగులో నీళ్ళు, నీరు గ్రాంధిక భాషలో "నీరము" అని కూడా అంటారు.
భాష అభివృద్ధి దశలో మన తెలుగువారు ఎప్పుడైనా నీలము రంగును చుసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు (ఇంకా నీలము అనే పదము లేదు కాబట్టి) వారు సముద్రపు రంగును దృష్టిలో పెట్టుకొని "నీళ్ళ రంగులో" లేక "నీరము రంగులో" ఉంది అనేవారు అని నా భావన.
ఈ భావమే తర్వాతి కాలములో నీరము అనేది నీలము అని మారిందని నా ఊహ. నీరు అనేది "నీలి" అని మారి ఉండవచ్చు..

ఇది కేవలం నా భావన మాత్రమే.ఇదే నిజమని నేను చెప్పలేను.

ఇదండీ నాకు నిన్న అకస్మాతుగా మెరుపులా వచ్చిన ఊహ.

Saturday, July 25, 2015

జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?

జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?
పొందగలము.

కానీ...........ఇది చదవండి..

శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే

"అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః"


దీని అర్థము
"ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు " అని

సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం "అమ్మా" అనో, "అబ్బా" అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.

మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. మనకు అత్యంత ఇష్టమైన సంఘటన లేక ఇష్టులు లేక పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?

మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో గుర్తుకువస్తాడు.

అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.

అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.


Monday, January 12, 2015

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్పురద్రూపి..ఒక్క మాటలో చెప్పాలంటే Manly person. 

అ వేశ్యలు విటుల కోసం చేసే హావభావాలను చూసి ఆ వ్యక్తి సహచరులలోని స్త్రీలు ఆ వేశ్యలను చూసి భయపడ్డారు. అందుచేత వారు ఆ వ్యక్తిని అక్కడ నుండి పక్కకు వచ్చేయమని వారించారు.కాని ఆ వ్యక్తి సూటిగా ఆ వేశ్యల వద్దకు వెళ్ళి వారి వద్ద కూర్చొని " వీరు తమ దివ్యత్వాన్ని బాహ్యమైన అందం రూపంలో వ్యక్తపరుస్తున్నారు( They put their divinity into beauty)" అని కన్నీళ్ళు కారుస్తూ అన్నాడు. అతని ఈ మాటలు ఆ వేశ్యలను ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆ వేశ్యలలో కొందరు తమ జీవితాన్ని తలుచుకొని మొహం కప్పుకొని ఏడవసాగారు. ఒక వేశ్య ఈ వ్యక్తి అంగీ కొనను పట్టుకొని " నేడు నేను ఒక దైవదూత అంగీని ముట్టుకొని ధన్యత చెందాను" అన్నది. ఆ వ్యక్తి మీ అందరి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు.
ఇంతలో ఆ వ్యక్తి సహచర స్త్రీలు ఆయనను పక్కకు లాక్కుపోయారు.

ఎవరు ఈ వ్యక్తి? మీలో చాలా మంది ఊహించే ఉంటారు. తన వ్యక్తిత్వంచే నేటికీ, ఎల్లప్పటికీ ప్రభావితం చేస్తున్న స్వామి వివేకానందుడే ఆ వ్యక్తి.

జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవమని, వివేకానందుల పుట్టినరోజని జరుపుకోవడం ఇదేనా ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ?
ఆయన ఉపదేశాలలో ఒక్కటి మనస్పూర్తిగా ఆచరించినా మన జీవితమే అత్యధ్బుతంగా తీర్చిదిద్దబడుంది.

"ధనం కోల్పోతే ఏమీ కోల్పోనట్టే. ఆరోగ్యం కోల్పోతే కొంత కొల్పోయినట్లే. కానీ వ్యక్తిత్వం( శీలం లేక గుణం) కోల్పోతే ప్రతిదీ కోల్పోయినట్లే."

Thursday, September 11, 2014

ప్రపంచ చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత చాలా ఆనందం,అద్భుతం,ఆశ్చర్యం,బాధాకరం

సెప్టెంబరు 11,1893:

సరిగ్గా నేటికి 121 సంవత్సరాల క్రిందట చికాగోలో

స్వామివివేకానంద "అమెరికా సోదరసోదరీమణులారా!.."

అంటూ ఇచ్చిన ఉపన్యాసం సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టింది.

భారతదేశాన్ని ప్రపంచం ముందు తిరిగి తలెత్తుకొనేలా చేసింది మరియు

భవిష్యత్తుకై బాట వేసింది.



సెప్టెంబరు11,2001:

నేటికి 13 సంవత్సరాల క్రింద ఉగ్రవాదుల దాడిలో న్యూయార్క్ లోని WTO ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి.


మొదటిది ధర్మస్థాపన కోసం నాంది అయితే రెండవది అధర్మానికి వేదిక

అయింది.







మీరు సరిగా గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది.

అదేమంటే తేడా 108 సంవత్సరాలు. మన హిందూధర్మం లో 108 ప్రాముఖ్యత మీకు తెలిసిందే. దీనికై నా గత టపా

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? 


లోని మాటలు ఇక్కడ చూడండి.

1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరంసూర్యుని వ్యాసానికి 108 రెట్లు



#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.

2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.

3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108

4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.

5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.

6.ఉపనిషత్తులు 108.

7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).

8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.

Monday, August 11, 2014

కాకతాళీయం లేక యాదృచ్చికం అయ్యుండచ్చు...కాని మాయగా కూడా అనిపిస్తాయి!


మన నిత్యజీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి సంఘటనలు యాదృచ్చికమో లేక కాకతాళీయమో అయ్యొండొచ్చు.కాని మనలను చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ఇలాంటి రెండు సంఘటనలు నా జీవితంలో జరిగినవి చెప్తాను.

ఈ మధ్యే అంటే 10 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన.

రాఘవేంద్రస్వామి వారి శ్లోకం

"పూజ్యా రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ|
 భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే|"

ఈ శ్లోకం నాకు వచ్చినప్పటికీ 10 రొజుల క్రిందట శ్లోకం లో మొదటిపాదం ఒకటే గుర్తుకువచ్చేది. రెండవ పాదం గుర్తుకు వచ్చేది కాదు. ఎక్కడా చదవకుండా, ఎవరితోనూ అడగకుండా రెండవ పాదం గుర్తుకుతెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసేవాడిని. 10 రోజుల క్రిందట బెంగళూరు లో సిటీ బస్సులో వెళ్ళేటప్పుడు గుర్తుతెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఎదురుగా ఒక అబ్బాయి(బహుశా భవననిర్మాణ కార్మికుడు అనుకొంటాను) చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఊగిపోతూ పాటలు వింటున్నాడు.అప్పుడప్పుడు hum చేసుకొంటున్నాడు. ఆ అబ్బాయి తెలుగు పాట వింటున్నాడని అర్థమైంది. ఆ అబ్బాయి ఎందుకో ఇయర్ ఫోన్స్ తీసివేశాడు. ఇంతలో నాకు అకస్మాత్తుగా రెండవపాదం గుర్తుకు వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఆ అబ్బయితో మీది ఏ ఊరు అన్నాను. ఆ అబ్బాయి "అన్నా మాది "మంత్రాలయం", అదే అన్నా రాఘవేంద్రస్వామి మఠం ఉన్న ఊరు " అన్నాడు.

ఈ సంఘటన యాదృచ్చికమే అయ్యుండచ్చు. కాని ఆ క్షణంలో నాకు మాయగా అనిపించింది.

ఇక రెండవ సంఘటన ఏమంటే నా బ్లాగు "లేవండి,మేల్కొనండి..." పేరు 2009 వ సంవత్సరం మొదటిదాక "సత్యమేవజయతే" అనే పేరుతో నడిపేవాడిని. ఒకరోజు రాత్రి అనుకోకుండా బ్లాగుపేరు మార్చేశాను. మరుసటిరోజే "సత్యం" రామలింగరాజు గారు తమ మోసం ఒప్పుకోవడం, "సత్యం" కంపెనీ తిరోగమనం మొదలైంది.

ఈ సంఘటన అత్యంత యాదృచ్చికం,కాకతాళీయం ఐనా నాకు మాత్రం వింతగా అనిపించింది.

ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా సంభవిస్తుంటాయి. అను భవించేవాడికి మాత్రం వింతగా,మాయగా,అద్బుతంగా అనిపిస్తాయి.

Monday, June 16, 2014

ఇకనైనా మారండయ్యా చులకన అయినది చాలు!


తరాలు మారినా మనకు మాత్రం సిగ్గు రావడం లేదు. ఎందుకండీ సాధువులారా! మీ సాధుత్వం? హాయిగా సంసారంలోకి రండి. రాగద్వేషాలు ఉన్నచోట సాధువుకీ సంసారికీ తేడా ఏముంది? సంసారి సంసారం కోసం కొట్టుకొంటున్నాడు, కొందరు సాధువులు పంతం కోసం కొట్టుకొంటున్నారు.

లేకుంటే ఏంటి ఇది..మొన్న భద్రాచలం లో సీతారాముల నిత్యకళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు "రామనారాయణ" అన్నారట...అలా అనకూడదని కొందరు సాధువులు గగ్గోలు పెట్టారట..
శ్రీరాముడి నామాలలో "రామనారాయణ" కూడా ఒకటి...అంటే నారాయణ స్వరూపమైన రాముడు అని అర్థం..ఇది కూడా తెలియని సాధువులా వీరు?

ప్రసిద్ది చెందిన క్రింది స్తోత్రం చూడండి:

అచ్యుతం కేశవం రామనారాయణం!!
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్!!
శ్రీధరం మాధవం గోపికావల్లభం!!
జానకీనాయకం రామచంద్రం భజే!!

అచ్యుతం కేశవం సత్యభామాధవం!!
మాధవం శ్రీధరం రాధికారాధితమ్!!
ఇందిరామందిరం చేతసా సుందరం!!
దేవకీనందనం నందజం సందధే!!


శివ కేశవుల భేధమే అంతరించిపోతున్న ఈ కాలంలో ఇంకా ఇలాంటి సంకుచిత భావాలతో ఇలాంటి వారు సనాతనధర్మానికి ఎంత ద్రోహం చేస్తున్నారో వీరికి తెలుస్తోందా?

ఇతర మతస్థులు మన ధర్మం గురించి తెలియక విమర్శిస్తే ఏమన్నా అనుకోవచ్చు, కాని మనవారే మనలనే కించపరుచుకుంటూ ఉంటే మనకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించరా? "

ఏకం సత్ విప్రా బహుదా వదంతి" (ఉన్నది ఒక్కటే, కాని అది పలురకాల పేర్లతో పిలువబడుతోంది) అన్న విషయం జీర్ణించుకుపోని సాధువులు ఎందుకు. సంసారులకు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు.కాని భగవంతుడి కోసం అని చెప్పుకుని సంసారాన్ని వదిలివేసి సాధువుల వేషం కట్టిన ఇలాంటి సాధువులు ఘోరమైన దుర్గతి పాలవుతారు.

గమనిక: ఈ పోస్ట్ కుహనా (Half minded) మరియు ఢాంభికులైన సాధువులను ఉద్దేశించి వ్రాసినది.

Monday, June 2, 2014

ఏంటండీ వెంకయ్యనాయుడు గారూ ఇది?


ఫేస్‌బుక్ లో ప్రాచుర్యం లో ఉన్న ఫోటో

Tuesday, April 8, 2014

రామ నామం అత్యంత శక్తివంతం అని ఎందుకంటారు ?


మన ఆనందం కానీ వేదాలు యే పురుషోత్తముని పరబ్రహ్మంగా స్తుతిస్తూ ఉన్నాయో ఆ శ్రీరాముడు జన్మించడం ఏమిటి... మనం వారి పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం ఏమిటి...నిజమే ఆ భగవంతుడే కౌసల్యా,దశరథుల పుత్రుడిగా ప్రజలకు ఆదర్శ జీవితం చూపించడానికి జన్మించాడు. ఇక రామాయణం అందరికీ తెలిసినదే...

రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.

అసలు రామనామం ఎందుకు అంత శక్తివంతం ఎందుకు...చాలా మందికి తెలుసు..కానీ తెలియని వారికోసం నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది చెప్తాను.

"రా" అనే అక్షరం అష్టాక్షరీ మంత్రం అయిన "ఓం నమో నారాయణాయ" నుండి, "మ" అనే అక్షరం పంచాక్షరీ మంత్రం అయిన "ఓం నమశ్శివాయ" నుండి వచ్చాయి.

ఈ రెండు అక్షరాలనే ఎందుకు తీసుకొన్నారు ? ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.

"రా" తీసివెస్తే "ఓం నమో నారాయణాయ" కాస్తా "ఓం నమో నాయణాయ" అవుతుంది. అసలు విరుద్దమైన అర్థం వస్తుంది. "నారాయణునకు నమస్కారం" అనే అర్థం బదులు "నడక లేక కదలిక లేని వాటికి అనగా అచైతన్యం(చైతన్యం లేనిది)కి నమస్కారం" అవుతుంది. ఆయణం అనగా నడక అని అర్థం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి.ఇక్కడ ఈ అర్థం తీసుకోబడింది.

ఇక "మ" ను తీసివేస్తే "ఓం నమశ్శివాయ" కాస్తా "ఓం నశ్శివాయ" అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్థం. "నశ్శివాయ" అనగా శివం కానిదానికి నమస్కారం అని అర్థం వస్తుంది.

చూసారుకదా రా,మ అనే పదాలు తీసివేస్తే ఎంత అర్థం మారిపోయిందో..అందుకే ఇవి బీజాక్షరాలు లేక ప్రాణాక్షరాలు అయ్యాయి.

అందుకే ఈ రెండింటినీ కలపడం ద్వారా వచ్చిన "రామ" నామం అత్యంత శక్తివంతం అని అంటారు.

ఇదీ పెద్దల వద్ద తెలుసుకున్న విషయం.

"శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

"రామాయ రామ భధ్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథ నాథ నాథాయ సీతాయాః పతయే నమః"

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Friday, March 21, 2014

కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తేరు(రథం) మరియు తేరును లాగే త్రాడు

కదిరి లో రేపు బ్రహ్మరథోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా కదిరి తేరు మరియు దానిని లాగు త్రాడు యొక్క చిన్న వీడియో.

Wednesday, March 19, 2014

మనం జయించామనుకుంటాం..కానీ ఇంతలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది..

నేను చాలా నాచురల్ గా ఉంటాను..ఏం పెట్టినా తింటాను..వాళ్ళ మనసు ముఖ్యం..వాళ్ళు మనస్పూర్తిగా అన్నం పెడ్తే చాలు..వాళ్ళ నుండి నాకు మర్యాద ఏమీ అవసరం లేదు..ఇలా సాగుతుంది మన ఆలోచనా వ్యవహారం.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.

గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?

ఒక చిన్నకథ.

శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్‌జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.

ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?

నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.

కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు