ఋషి అంటే గడ్డం పెంచుకొని ,ముక్కు మూసుకొని కొండకోనల్లో తపస్సు చేసుకొనేవాడు అనే భ్రమను మన విద్యావ్యవస్థ, మన కుహనా లౌకికవాదులు మన బుర్రల్లోకి బాగా ఎక్కించారు.అందులో చాలాభాగం సఫలం అయ్యారు.అది ప్రమాదకరమైన భ్రమ. అది తొలగించడం అంత సులభం కాదు.
మానవజీవితంలోని ప్రతి అంశం గురించి భారతీయ ఋషులు,మునులు చేసినంత అధ్యయనం,పరిశోధన,పరిశ్రమ మరెవ్వరూ చేయలేదు.ఇది సత్యం.
ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలినవాడు.ఇతర విషయాలు అతనికి తెలియదు. పరిశోధనయే అతని లక్ష్యము.ప్రాపంచిక విషయాలు అతనికి తెలియదు. అంతటి దీక్ష అతడిది.అదే అతని తపస్సు.
అతనిని ఎవరూ నియమించలేదు. ఎవరూ జీతభత్యాలు ఇవ్వలేదు.స్వచ్ఛందముగా పరిశోధనకు పూనుకొన్నవాడు.
ఋషి కోరిందేమీ లేదు.కేవలం జగత్కల్యాణం, మానవజీవితం సుఖమయం,శాంతిమయం కావడం ఒక్కటే ఋషి ఆశయం.
ఇదీ అతని లక్ష్యం.ఈరోజు మనం ఈ మాత్రం జీవిస్తున్నామంటే కారణం మహర్షుల కృషి,తపస్సే కారణం.
పాశ్చాత్యుల భాషలో శాస్త్రవేత్త అంటే జీతగాడు,వ్యాపారి. వారు కనుగొంటున్న,కనుగొన్న వాటి వలన కల్గుతున్న సుఖం తక్కువ.దుఃఖమే ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు.
ఋషులు తమ తపస్సు ద్వారా కనుగొన్న విషయాలు మనిషి సుఖజీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో శాంతియుత జీవితానికి కూడా అలానే ఉపయోగపడతాయి.ఇక్కడే మర్మము ఉంది. నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలతో మనం సుఖ(Luxury)జీవితం గడపగలుగుతున్నాము కానీ శాంతియుతజీవితం గడపడంలేదన్న విషయం మనకు తెలుసు.
ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కనుగొన్నారా అంటే కాదనే అనాలి. పరమాణువు(కణము)ను కనుగొన్న కణాదుడు, గణితములో సంచలనాలు సృష్టించిన భాస్కరాచార్యుడు,ఆర్యభటుడు మరియు శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు,వైద్యశాస్త్రవేత్త చరకుడు , వైమానికశాస్త్రం రచించిన మహర్షి భరధ్వాజుడు వీరు కూడా ఋషులే అన్న విషయం మరిచిపోరాదు.వీరు ఆధ్యాత్మికముగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధించినవారు.
ఇప్పటికైనా మనం ఋషుల గొప్పతనం గ్రహించి, వారి మీద గల దురభిప్రాయాలను తొలగించుకోవడం సమాజానికి చాలా మంచిది.