శ్రీ మహాభాగవతంలోని 12వ స్కంధములో వేదవ్యాస మహర్షి చే చెప్పబడ్డ కలియుగ లక్షణాలు సంగ్రహముగాచూద్దాము.
"కలికాలమున రోజురోజుకు సత్యము,ధర్మము,దయ,క్షమ,ఆయువు మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి.
ధనవంతుడే ఆచారవంతుడు,గుణవంతుడు,ధర్మపరుడు,న్యాయపరుడు మరియు సర్వనియంత అవుతాడు.( ప్రస్తుతం ధనమున్న అమెరికా దేశం ఇలా ఉంది.)
పెండ్లిండ్లలో కులం,శీలము,యోగ్యత చూడరు. ప్రేమవివాహాలు యువతీయువకులు తమకు నచ్చిన వారినే వివాహమాడతారు(ప్రేమవివాహాలు) .కాని ఆ ప్రేమలలో నిజాయితీపాలు చాలా తక్కువగా ఉంటుంది.
మోసం చేయగలవారు ,అబద్దాలు చెప్పువారు వ్యవహారదక్షులు అవుతారు.
బ్రాహ్మణత్వం బ్రహ్మజ్ఞానంచేకాక జందెము వలన వ్యక్తము అవుతుంది.( బ్రాహ్మణుడు అంటే ఎవరనేది ఇంత స్పష్టముగా చెప్పినా ఈ విషయంపై మనవారి వాదాలకు అంతులేకుండాపోయింది ).
వాగినవాడు పండితుడు , మంచిగా ఉండకపోవడమే మంచితనము, కలిసిఉండడమే పెళ్ళిగా పరిగణింపబడతాయి.
దూరముగా ఉన్న మురికిగుంటయే పుణ్యతీర్థముగా,వెంట్రుకలు పెంచుకొనుట అందముగా, కడుపు
నింపుకొనుట పురుషార్థముగా, కుటుంబపోషణే ఘనకార్యముగా, కీర్తిని కోరుకొనుటే ధర్మాచరణగా
పరిగణిస్తారు.
"కలౌ వేంకటనాయకః" అంటే కలియుగానికి శ్రీవేంకటేశ్వరస్వామియే భగవంతుడు.ఈ విషయం ఎంత అక్షరసత్యమో మనకు తెలియంది కాదు.
"సంఘేశక్తిః కలియుగౌ" అంటే కలియుగంలో సంఘ శక్తిదే కాలం."
ఇదండీ మన ఋషులు చెప్పిన కొన్ని లక్షణాలు.ఇంకా చాలా ఉన్నాయి. కాని మన ఋషుల మంచితనం,దీర్ఘదృష్టి గురించి చెప్పడానికి వ్రాసిన టపా కాబట్టి అన్నీ వ్రాయడం లేదు. ఇవన్నీ నిజాలు కావడం మనము గమనిస్తూనే ఉన్నాము కదా.