ప్రేమికుల రోజు త్వరలోనే వస్తోంది. అంటే ఫిబ్రవరి 14వ తేదీన. జరుపుకోకూడదని కొన్ని సంస్థలు, లేదు జరుపుకొనే తీరుకుంటామని యువత అంటున్నాయి. సరే అంతా బాగుంది. ప్రేమికుల రోజు అనేది పాశ్చాత్య దేశాల
నుండి దిగుమతి చేసుకొన్నది అని అందరికీ తెలుసు. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయనుకోండి.
సరే మనకు ఆ దినోత్సవం బాగుంది,జరుపుకొంటే తప్పేముంది అనుకొందాం. తప్పు ఏమీ లేదు.జరుపుకొందాం.
కాని ఒక్క విషయం. ప్రేమికుల రోజు ఎప్పుడు అంటే టక్కున ఫిబ్రవరి 14న అంటాము.
వెంటనే అన్నాచెల్లెల్ల దినోత్సవం (రాఖీ) ఈ సంవత్సరం ఎప్పుడు వస్తోంది అంటే ఎంత మంది కనీసం 5 నిమిషాల వ్యవధిలో చెప్పగలరు? చెప్పలేరు. ఇలా ఉంది మన సంస్కృతిపై మనకు గల ప్రేమ.
ప్రేమ పేరుతో యువతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే వ్యాపార వర్గాలు, పవిత్రమైన రాఖీ దినం పై ఎందుకు శ్రద్ద చూపడం లేదు? ఇది సాంస్కృతిక బానిసత్వం కాదా? యువత బలహీనత తో ఆడుకోవడం కాదా?
యువతను రెచ్చగొట్టడం కాదా?
ఇక్కడ రాఖీ దినోత్సవాన్ని ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది.
నేటి భారతదేశం ఇలా పలుకుతోంది:" పాశ్చాత్య భావాలను,వేషభాషలను, ఆహారవిహారాలను,పాశ్చాత్య ఆచారమర్యాదలను మనం పాటిస్తే వారిలాగే అభివృద్ధి చెందుతాము."
కాని ఒకటి తెలుసుకోవడంలేదు: " అనుకరణ వలన ఇతరుల భావాలు ఎన్నటికీ మనవి కాబోవు. సింహం తోలు కప్పుకొన్న గాడిద, సింహం అవుతుందా ? లేక ఆవు తోలు కప్పుకొన్న పులి ,ఆవు అవుతుందా(గోముఖవ్యాఘ్రం)?"
మరలా నేటి భారతదేశం ఇలా అంటోంది:"పాశ్చాత్య జాతులేమి చేస్తున్నాయో,అదంతా తప్పకుండా మంచిది,కాకపోతే అవి అంత బలవంతము ఎలా అయ్యాయి?"
ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే మెరుపు మిరుమిట్లు గొలుపుతున్నప్పటికీ దాని ప్రకాశం క్షణకాలం మాత్రమే.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఐతే ఇతర దేశస్థులనుండి మనం ఏమీ నేర్చుకోనవసరం లేదా? అభివృద్ధికై మనం ప్రయత్నించనవసరం లేదా? మనం పరిపూర్ణులమా? మనలో లోపం ఏమీ లేదా? మనం నేర్వవలసిన విషయాలు చాలా ఉన్నాయి.బ్రతికినంత కాలం నేర్చుకొంటూనే ఉండాలి.
మనం ఒక మహాప్రమాదం గుర్తించడం లేదు. పాశ్చాత్య అనుకరణ వ్యామోహం మనలను ఆవహించి ఉంది.కీడేదో,మేలేదో వివేకవిచక్షణలతో మనం ఎంతమాత్రం నిర్ణయించుకోవడం లేదు.
ఉదాహరణకు చైనా దేశస్థులు ఎక్కడైనా ప్రపంచ సమ్మేళనం జరుగుతుంటే తన సాంస్కృతిక వేషధారణలోనే వస్తారు. కాని మనవారో బయటకు వెళ్తే "సూటు,బూటు"కావలసిందే. చైనీయులు అభివృద్ధి చెందడం లేదా?
తమ సాంస్కృతిక వారసత్వం నిలుపుకొంటూనే నేడు అగ్రరాజ్యాలలో ఒకటిగా లేదా?
మన ఆచార సాంప్రదాయాలకు పాశ్చాత్యులు ప్రశంశా పత్రం(certificate) ఇస్తేనే మనం పాటిస్తామంటే ఎంత మాత్రం అంగీకారము కాదు.
విదేశీ ఆచారవ్యవహారాలను మనము ఎలా పోట్లాడి పాటిస్తామో అంతకంటే ఎక్కువగా మన ఆచార సాంప్రదాయాలు పాటించడానికి మొహమాటం ఎందుకు? మనకంటూ సంస్కృతి ఉంది.దాన్ని నిలబెట్టుకొందాము.