రోముకు వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండమని ఒక సామెత. అంటే వారి మనస్తత్వానికి తగ్గట్లు నడుచుకోవాలన్నమాట. అంటే ప్రతి దేశానికి కొన్ని విధివిధానాలు, సంస్కృతీసాంప్రదాయాలు
ఉంటాయి, అవి ఇంకో దేశంలో చెల్లుబాటు కావచ్చు,కాకపోవచ్చు. అలానే ప్రజల మనస్తత్వాలు కూడా. భారతదేశంలో ని ప్రజల వేషధారణ ఇంగ్లాండ్ వారికి ఎబ్బెట్టు గా కనిపించవచ్చు.
అలానే వారి స్వేఛ్ఛా మనస్తత్వాన్ని మనం విచ్చలవిడితనం గా భావించవచ్చు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన విధానాల కళ్ళజోళ్ళ లో నుండి, వారు వారి
విధానాల కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నారు. అలా చూడకూడదు కదా. ఎవరి ప్రమాణాలు(Standards) వారివి.
ఇదే విషయం మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విషయంలో కూడా వర్తిస్తుంది. వారి విధానం వేరు. ఇక్కడ మన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఋషులని సంభోధిస్తున్నాను. భారతీయులు
ఎప్పుడూ దేవుడు,ఆత్మ,వేదాంత రంగాలలోనే విషయాలు కనుగొన్నారు కానీ సైన్సు పరంగా ఏమీ లేదనే అభిప్రాయం విదేశీయులలోనే కాదు, దురదృష్టవశాత్తూ మన భారతీయులలో కూడా
చాలా ఎక్కువగా ఉంది.
మన ఋషులు ఏవైనా సైన్సుకు సంబంధించిన విశేషాలు కనుగొంటే ఎందుకు చెప్పలేదు? అని చాలామంది అంటుంటారు. ఒకటే కారణం వారు చెప్పిన విధానం వేరు.
మన ఋషుల విధానం ఏమంటే సమాజంలో సామాన్యులే ఎక్కువగా ఉంటారు. మేధావుల శాతాన్ని మామూలు జనం సంఖ్యతో పోలిస్తే నిర్లక్ష్యం చేయవచ్చు(Negligible). సైన్సు యొక్క ఫలాలు సామాన్యులకు చేరినప్పుడే దానికి విలువ అని ప్రస్తుతం మనం అనుకుంటున్నదే వారి విధానం కూడా. సాధారణంగా మన పూర్వీకుల పద్దతి ఆధ్యాత్మిక సంబంధమైనది. ఆ పద్దతికి తగ్గట్లే మన ఋషులు కూడా తమ పద్దతిని రూపకల్పన(Design) చేసుకొన్నారు. తము కనుగొన్న విషయాలను కథల రూపంలోనూ, కట్టుబాట్ల రూపం లోనూ, నిషేధాల రూపం లోనూ జనానికి అందించారు. ఉదాహరణకు ఏదైనా ఆసనం పై (కుర్చీ లేదా గోడ ఏదైనా కావచ్చు) కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు అంటారు. అలా ఊపడం అలవాటైతే గనుక పక్షవాతం వస్తుందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. కానీ మనవారు అలా ఊపితే ఎదురుగా ఉన్న వారికి కాళ్ళు చూపినట్లవుతుందని ,వారికి అగౌరవమని నిషేధించారు.ఇది ఒక ఉదాహరణ
మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా ఇందులో కలిసిపోయుండవచ్చు. అంత మాత్రాన అన్నీ మూఢనమ్మాకాలేనని ఎలా నిర్ణయించగలం?
మనఋషుల విధానం లో ప్రజలలోనికి విషయం ఎలాగైనా చేరాలి, వారు ఆచరించాలి అంతే.
అసలు తాము ఒక విషయం కనుగొన్నమనే దానికి వారు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఉదాహరణకు సాయణాచార్యులు ఋగ్వేద భాష్యం చెప్తూ కాంతివేగాన్ని కూడా
పరోక్షం(indirect)గా చెప్పారు. తానేదో కొత్తవిషయాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పలేదు.
మనకు తెలిసిన ఆర్యభటుడు , భాస్కరాచార్యుడు, చరకుడు,కణం అనే భావనను కనుగొన్న కణాదుడు మొదలగు వారు కూడా తమ ఆవిష్కరణలను ఏనాడూ ప్రచారం చేసుకోలేదు.
పేటెంటు కూడా తీసుకోలేదు. పేరును ఆశించలేదు. తమ కృషి ఫలితాలు కేవలం ప్రజలకు చేరడమే వారికి కావలసింది. అంతెందుకు మన కాలం నాటి జగదీశ్ చంద్రబోస్ కూడా ఎన్నో
కనుగొన్నా ఏనాడూ పేరు ఆశించకుండా కేవలం తన పరిశోధన ఫలితాలు జనానికి అందాలని ఆశించాడు. పేటెంట్లు కూడా తీసుకోలేదు.
ఇప్పుడంటే మనం మన పూర్వీకులు ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు అని చెప్పుకొంటున్నాం కానీ వారు ఏనాడూ పేరుప్రతిష్టలకై ఆశించలేదు.
ఇక విదేశీయుల పద్దతి ఏమిటంటే తాము ఏదైనా కనుగొంటే మొదట తమ పేరున పేటెంట్ పొంది తర్వాత జనాలకు ఆ అవిష్కరణను పరిచయం చేస్తారు. ఇక్కడ నేను విదేశీయులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వారి విధానం ఇది అని చెప్తున్నాను. వారి విధానం వారికి సరైనదని అనిపించవచ్చు కాబట్టి అదే వారు అనుసరిస్తున్నారు.
ఇప్పుడు ఆలోచించండి విదేశీయుల విధానాలను ప్రాతిపదికగా తీస్కొని మన విధానాలను పోల్చడం ఎంత బుద్ధి తక్కువ పనో!
వనరులు:
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?