నిస్వార్థసేవ:
ఒకసారి మదర్‌థెరెసా శరణాలయపు జీపు టైరు పంచర్ అయ్యింది.ఓ మరమ్మత్తు దుకాణానికి వెళ్ళి టైరును బాగు చెయ్యమని ఇచ్చింది.ఆ యజమాని"అమ్మా!మేము టైరు బాగుచేసి శరణాలయానికి పంపిస్తాము.మీరు వెళ్ళిరండి" అని అన్నాడు.
థెరెసా అతనితో "మీరు ఈ టైరు ఎవరిచే పంపిస్తారు? అతనికి ఎంత ఇస్తారు?" అని అడిగింది."రిక్షాలో పంపిస్తాము.కిరాయి గా 10 రూపాయలు ఇస్తాము" అన్నాడు.
వెంటనే ఆమె"ఆ టైరు బాగుచేసేంతవరకు ఉండి నేనే స్వయముగా తీసుకొనిపోతాను.దయచేసి ఆ పది రూపాయలు నాకు ఇవ్వండి.దానితో పదిమంది అనాధల ఆకలి తీరుతుంది "అంది. ఆ మాటలు విన్న యజమాని హృదయం ద్రవించి అతనే 50 రూపాయల చందా ఇచ్చాడు.
అవరోధాలుగా మారే అవసరాలు:
సోక్రటీస్ ప్రతిరోజూ సాయంత్రం బజారంతా తిరిగి,ఏమీ కొనకుండానే ఇంటికి వచ్చేవాడు.ఒకరోజు ఆయన శిష్యుడు "గురువుగారూ! మీరు ప్రతిరోజూ సాయంత్రం బజారుకి వెళ్ళి ఏమీ కొనకుండానే తిరిగి వస్తున్నారు. అలాంటప్పుడు అసలు బజారుకు ఎందుకు వెళ్తున్నట్లు?"అని అడిగాడు."ఈ ప్రపంచంలో మనకు అవసరం లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకొందామని బజారుకి వెళ్ళి వస్తున్నాను" అని సోక్రటీస్ శిష్యునికి సమాధానం ఇచ్చాడు.
చాలామంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా లేనిపోని అవసరాలను పెంచుకుంటూ అప్పులపాలై అశాంతిని ఆహ్వానిస్తుంటారు.ఇతరులతో పోల్చుకొనే స్వభావమే ఇందుకు కారణం. నిజానికి మనకు అవసరం లేనివాటిని పొందాలనే తాపత్రయంలో మన మనశ్శాంతికి మనమే అవరోధాలను కల్పించుకొంటున్నాము.