Tuesday, February 3, 2009
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?
మానవజీవితంలోని ప్రతి అంశం గురించి భారతీయ ఋషులు,మునులు చేసినంత అధ్యయనం,పరిశోధన,పరిశ్రమ మరెవ్వరూ చేయలేదు.ఇది సత్యం.
ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలినవాడు.ఇతర విషయాలు అతనికి తెలియదు. పరిశోధనయే అతని లక్ష్యము.ప్రాపంచిక విషయాలు అతనికి తెలియదు. అంతటి దీక్ష అతడిది.అదే అతని తపస్సు.
అతనిని ఎవరూ నియమించలేదు. ఎవరూ జీతభత్యాలు ఇవ్వలేదు.స్వచ్ఛందముగా పరిశోధనకు పూనుకొన్నవాడు.
ఋషి కోరిందేమీ లేదు.కేవలం జగత్కల్యాణం, మానవజీవితం సుఖమయం,శాంతిమయం కావడం ఒక్కటే ఋషి ఆశయం.
ఇదీ అతని లక్ష్యం.ఈరోజు మనం ఈ మాత్రం జీవిస్తున్నామంటే కారణం మహర్షుల కృషి,తపస్సే కారణం.
పాశ్చాత్యుల భాషలో శాస్త్రవేత్త అంటే జీతగాడు,వ్యాపారి. వారు కనుగొంటున్న,కనుగొన్న వాటి వలన కల్గుతున్న సుఖం తక్కువ.దుఃఖమే ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు.
ఋషులు తమ తపస్సు ద్వారా కనుగొన్న విషయాలు మనిషి సుఖజీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో శాంతియుత జీవితానికి కూడా అలానే ఉపయోగపడతాయి.ఇక్కడే మర్మము ఉంది. నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలతో మనం సుఖ(Luxury)జీవితం గడపగలుగుతున్నాము కానీ శాంతియుతజీవితం గడపడంలేదన్న విషయం మనకు తెలుసు.
ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కనుగొన్నారా అంటే కాదనే అనాలి. పరమాణువు(కణము)ను కనుగొన్న కణాదుడు, గణితములో సంచలనాలు సృష్టించిన భాస్కరాచార్యుడు,ఆర్యభటుడు మరియు శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు,వైద్యశాస్త్రవేత్త చరకుడు , వైమానికశాస్త్రం రచించిన మహర్షి భరధ్వాజుడు వీరు కూడా ఋషులే అన్న విషయం మరిచిపోరాదు.వీరు ఆధ్యాత్మికముగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధించినవారు.
ఇప్పటికైనా మనం ఋషుల గొప్పతనం గ్రహించి, వారి మీద గల దురభిప్రాయాలను తొలగించుకోవడం సమాజానికి చాలా మంచిది.
Friday, January 30, 2009
ఆర్థిక మాంద్యం(rescission) అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది? దయచేసి వివరించండి
దయచేసి మన బ్లాగు మిత్రులకు ఎవరికైనా ఈ విషయం పై స్పష్టమైన అవగాహన ఉంటే ఈ టపాకు వ్యాఖ్య రూపంలో కాని లేక తమ బ్లాగు లో టపా రూపం లో కాని వివరణ ఇవ్వండి. తమ బ్లాగు టపా రూపంలో ఇస్తే మాత్రం ఆ టపా లంకె(Link) ఇవ్వడం మాత్రం మరిచిపోకండి.
Thursday, January 29, 2009
తెలుగు పునర్వైభవం అంటే ఆంగ్లం అసలు వద్దని కాదు
ఒక వ్యక్తి మానసికముగా కానీ, సామాజికముగా కానీ అభివృద్ధి చెందాలంటే మాతృభాష లోనే ఆ వ్యక్తి యొక్క ప్రాథమికవిద్య ఉండాలనేది ఎందరో మేధావులు,అనుభవశీలురు చెబుతున్న విషయం. ప్రాథమిక దశను దాటిన తర్వాత అతను ఏభాషలో తన విద్యను అభ్యసించినా అతను నెగ్గుకు రాగలడు.అప్పుడు ఆ వ్యక్తి ఆంగ్లం అభ్యసించినా చాలా సులభముగాపైకి రాగలడు.
మనం తెలుగును ప్రేమించడం అంటే ఆంగ్లాన్ని ద్వేషించడం అని అర్థం కాదు అన్న విషయాన్ని కొందరు కడుపుకాలుతున్న బ్లాగ్మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరూ వద్దనలేదు ఆంగ్లం చదవద్దని. తెలుగును మాత్రం మరవద్దు, చిన్నచూపును చూడవద్దు అని మాత్రమే మేము అంటున్నాము. అవసరమైన చోట ఆంగ్లాన్ని వాడవద్దని ఎవరూవద్దనడం లేదు. కాని నిత్యజీవితం లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహిద్దాం, మనము కూడా అలానే పాటిద్దాం అనిఅంటున్నాము.
ప్రపంచం కుగ్రామం ఐపోతోంది కాబట్టి అందరినీ కలిపే భాష ఆంగ్లం అని అనవచ్చు.తప్పు లేదు. మనం మన రాష్ట్రం,దేశంకానివారితో ఆంగ్లం లోనే మాట్లాడుదాం. దానికోసం ఆంగ్లం నేర్చుకొందాం. మన ఉన్నతవిద్యలు కావాలంటే ఆంగ్లంలోనేచదువుదాం. కాని మన పిల్లలను తమ ప్రాథమిక విద్యను తెలుగులోనే చదివిద్దాం ,ఇప్పటి పరిస్థితుల ప్రకారం వారిఉన్నతవిద్యలను ఆంగ్లంలో చదివిద్దాం. కాని మన తెలుగుభాష ఔన్నత్యాన్ని ,మధురత్వాన్ని ఖచ్చితముగాకాపాడుకోవలసిన అవసరం లేదంటారా?
మనవారు ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప అని తలుస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలుగు మన ఆత్మ ,ఆంగ్లంకేవలం మనసు లాంటిది మాత్రమే. మనసు బయటికి శక్తివంతమే కానీ ఆత్మ లేని మనసు ఉనికి లేనిది.
మనం ఆంగ్లం మాట్లాడేటప్పుడు మన మనసు తన భావాలను మొదట తెలుగు రూపం లోనే సృష్టించి తర్వాత ఆభావాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేసి బయటకు పంపుతుంది. ఎంతో సాధన తర్వాత మాత్రమే ఈ పని లేకుండాఒకేసారి ఆంగ్లంలో మాట్లాడగలం. ఈ విధముగా తెలుగు (మాతృభాష) సహాయంతో మాత్రమే మనం ఆంగ్లం నేర్చుకొనిబయట ఎక్కడైనా బ్రతకగలం. ఇంత సేవ చేసిన మన మాతృభాషకు మనం ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామా? ఓ! కడుపు కాలుతున్న బ్లాగ్మిత్రులారా గుండె పై చేయి పెట్టుకొని చెప్పండి.
మన భాష రానివారితో మనం ఆంగ్లంలోనే మాట్లాడుదాం.కాని మనలో మనం తెలుగులోనే మాట్లాడుకొందాం.మనలోమనం ఆంగ్లంలో మాట్లాడుకోవలసిన దౌర్భాగ్యం మనకు ఎందుకు? మన భాష అంత గొడ్డుపోయిందా?
ఒక పోతన,ఒక వేమన, ఒక అన్నమాచార్యుడు లాంటి తెలుగు వారు గర్వించే మహానుభావులు పుట్టిన రాష్ట్రం మనది. పోతన గారి పద్యాలలో మధురత్వం,వేమన పద్యాలలోని సమాజంలో ఎలా ఉండాలి అనే విషయం మరియుఅన్నమాచార్యుల కీర్తనలలోని భక్తి భావం మన తర్వాత తరాలవారికి కూడా అందించవలసిన భాధ్యత ఉంది.అందుకోసంకూడా తెలుగును రక్షించవలసిన అవసరం మన పై ఉంది.
ఒక మనిషి యొక్క సంస్కృతిని,సంస్కారాన్ని అతని వేష"భాష"లే తెల్పుతాయి అనడం మనకు తెలుసు.మనలో మనంకూడా ఆంగ్లం మాట్లాడుకుంటే,మన పిల్లలకు తెలుగుపై రుచి ఎలా కల్గుతుంది? మనకంటూ ఒక సొంతభాషనుకోల్పోయినప్పుడు ఇతరులు మాత్రం మనలను ఎవరు గౌరవిస్తారు?
దీనికి ఒక ఉదాహరణగా మన రాజధానిలో కూకట్పల్లి లో "మెట్రో" అనే ఒక పెద్ద వాణిజ్యసముదాయం ఉంది. వారుమొదట దానిని ప్రారంభించినప్పుడు ఆ భవనం పైన తెలుగులో పెద్ద అక్షరాలతో "మెట్రో" అని ఒక నామఫలకం, దాని క్రిందఆంగ్లంలో ఒక నామఫలకం ఏర్ఫాటు చేసారు. ఈ ముచ్చట ఎంతోకాలం సాగలేదు. వారికి మన భాషాభిమానం ఏ పాటిదోతెలిసిపోయి కొన్నిరోజులలోనే రెండు ఫలకాలనూ ఆంగ్లంలోనికే మార్చివేసారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనగడ్డపైనే మన భాషకు ఇలాంటి అవమానం జరుగుతోంది.
వారిని ఆంగ్లం వ్రాయవద్దని అనలేదే, తెలుగులో కూడ వ్రాయమని అడుగుతున్నాం.
ఇక మన వారే మన రోడ్డు రవాణా సంస్థ వారే తమ గరుడ,అంతర రాష్ట్ర బస్సులపై తెలుగును మొత్తం తీసివేసి అంతాఆంగ్లమే వాడుతుంటే మన రాష్ట్రం లోనికి వచ్చి బ్రతికే ఇతరులకు మన భాషకు ఏ మాత్రం గౌరవం ఇస్తారు చెప్పండి?
ప్రస్తుతం ప్రపంచంలో చలామణి అవుతున్న ఏ భాషా స్వచ్ఛమైనది కాదు. ప్రతి భాషా ఇతర భాషల నుండి కొన్నిపదాలను కలుపుకొంటుంది.తెలుగు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాని ఇతర భాషలు తమ భాషలో ఇతరభాషలకు చెందిన పదాలకు సమాన పదాలు లేకుంటేనో లేక అది ఒక క్రొత్త పదం అయితేనో ఆ పదాన్ని యధాతథంగాతన భాష లోనికి తీసుకొంటాయి.ఉంటే కనుక ఉన్న పదాలనే వాడుతాయి. కాని మన తెలుగు భాష మాట్లాడేవారుతెలుగులో ఆంగ్లమో లేక మరే ఇతర భాషలోని పదాలకు తెలుగులో సమానార్థక పదాలున్నా అవి వాడరు.నాచిన్నప్పుడు నువ్వు ఏ తరగతి చదువుతున్నావు అంటే ఫలానా తరగతి చదువుతున్నాను అని పిల్లలు సమాధానాలుఇచ్చేవారు. కాని ఇప్పుడు తరగతి అనే పదాన్ని పెద్దలే వాడడం లేదు ఆ స్థానే "క్లాస్" అనే ఆంగ్ల పదం చేరిపోయింది. పిల్లలు కూడా మేము ఫస్ట్ స్టాండర్డ్ అనో లేక ఫస్ట్ క్లాస్ అనో చదువుతున్నామని అంటున్నారు. ఇలా మూలం దగ్గరేతెలుగును వాడకపోతే ఎలా?
చివరిగా ఒకమాట.మాతృభాష అనేది ఒక ఇంటికి కాని మరే నిర్మాణానికి కాని వేసే పునాది వంటిది. పునాది లేనినిర్మాణం ఎలా నిలబడదో మాతృభాష పునాది లేని జీవితం అలా నిలబడదు.పునాది వేసిన తర్వాతే దాని పై ఇతరనిర్మాణం ఎలా గావించగలమో అలానే మాతృభాష పునాది పైనే మనిషి ఉన్నతి నిర్ణయించబడుతుంది.
Tuesday, January 27, 2009
కొన్ని ఆచారాలు - వాటి మూలాలు
ముగ్గులు:
దుష్ట శక్తులు ఇళ్ళలోకి ప్రవేశించకుండా ఉండటం అని మనకు తెలిసిన కారణము.కానీ మన పూర్వీకుల ఉద్దేశ్యము చీమల లాంటి వాటికి ఆహారము కొరకు.అందుకే ముగ్గుపిండి ని మిగిలిపొయిన బియ్యపుపిండి తో ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసి ముగ్గులువేయాలి.అంతేకాని బాగాకనిపించాలని సుద్ద ముక్కలతో లేక పెయింట్ లతో వేయడము ముగ్గుల పరమార్థాన్ని మరిచిపోవడమే అవుతుంది.
ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదంటారు.ఎందుకు?:
సైంటిఫిక్ కారణము ఏమంటే ఇలా చేయడము వలన దీర్ఘకాలము లో పక్షవాతము వచ్చే అవకాశము చాలా ఎక్కువ.అంతేకాక ఇలా చేయడము వలన ఎదురుగా కూర్చున్నవారికి కాలు చూపిస్తున్నట్టు అవుతుంది.
పెళ్ళిలో జీలకర్ర, బెల్లము తలపైన పెట్టుకోవడము:
పెళ్ళి అనగానే వధూవరుల మనసు ఎన్నో మానసిక మార్పులకు లోనవుతుంది.ముఖ్యముగా పెళ్ళికొడుకు లెక పెళ్ళికూతురును చేసినప్పటినుండి వారిద్దరికీ హడావుడి మొదలవుతుంది.పెళ్ళిపీటలపైన కూర్చున్నప్పుడు వారి శరీరాలు మరియు మనసు చాలా అలసిపోయుంటాయి. జీలకర్ర,బెల్లము కలిపిన మిశ్రమము చాలా శీతలకారి కనుక వారి తలలపైన పెట్టుకుంటారు.దీనివలన ముఖ్యముగా వారి శరీరాలు మరియు మనసు శాంతము పొందుతాయి.
కమెండోల్లారా మీకు మా తల వంచి పాదాభివందనాలు చేస్తున్నాము
కార్యక్రమం చలోక్తులు,హృదయం హత్తుకొనే సన్నివేశాలతో సాగిపోయింది.
కొన్ని సన్నివేశాలు:
1.ఇది మనకు తెలియని విషయం.నారీమన్ ప్రాంతంలో నివశిస్తున్న వ్యక్తి చెప్పినది. నారీమన్ హోటల్ పైకి హెలికాప్టర్ లో నుండి తాడు సహాయంతో ఒక కమెండో దిగుతున్నప్పుడు పొరపాటున జారి క్రిందపడ్డాడు. అప్పుడు అతని కాలు బెణికింది. కాని ఆ విషయం అతను పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు.
2.ఒక సారి ఒక ఉగ్రవాది విసిరిన బాంబు కమెండో ప్రక్కనే పడింది. ఈ విషయం పసిగట్టిన కమెండో ముందుగానే నేల పై పడుకోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.వెంటనే అతను పైకి లేచి ఉగ్రవాది వైపు పరిహాసపూర్వకముగా నవ్వాడు. అంత కఠిన పరిస్థితులలో కూడా ఆ కమెండో ప్రశాంతమైన చిరునవ్వును కోల్పోలేదు.
3. ఒక కమెండో(నవ్వుతూ) ధోనీ తో :
మీరు మొన్న ఒక వన్‌డేలో కీపింగ్ చేస్తూ "గంట వాయించు" అని అంటున్నారు.ఎందుకు?
ధోనీ: అప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ ఆడుతున్నాడు. అతని పేరులో "బెల్" ఉండడం వలన మన హిందీ భాషలో బౌలర్‌కు అతని గంట వాయించమని చెప్పాను.(అందరిలో నవ్వులు)
4.ధోనీ కమెండోలతో : చివరి బంతికి 10 పరుగులు ఎలా కొట్టగలము ?
ఎవరూ జవాబు ఇవ్వలేదు.
ధోనీ: మమూలుగా ఎవరూ కొట్టలేరు.అది నోబాల్ ఐతే తప్ప.కాని అది నోబాల్ కాకున్నా అలా కొట్టగల వ్యక్తి ఒక్కడే ఉన్నాడు.అతను రజనీ కాంత్.అతను కనుక కొడితే బంతి రెండు ముక్కలై ఒక ముక్క బౌండరీకి,ఇంకో ముక్క సిక్స్ కు వెళ్తుంది.ఒక వేళ 24 పరుగులు కొట్టవలసి వస్తే బంతి ఆరు ముక్కలై అన్ని ముక్కలు బౌండరీకి వెళ్తాయి.(అందరిలో నవ్వులు)
5.ఒక కమెండో ఉద్విగ్నతతో :
మేము అక్కడ పోరాడుతుంటే పార్లమెంట్ లో కూర్చున్న కొన్ని ...... ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి.
ఇంకొన్ని విశేషాలు తర్వాత
Monday, January 26, 2009
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఓ స్వతంత్ర సమరయోధులారా!
మిమ్ములను విస్మరించాము, మీ అడుగుజాడలను విస్మరించాము,
మీ పోరాటాల ఫలమైన స్వాతంత్రమును దుర్వినియోగ పరుస్తున్నాము,
స్వతతంత్ర దినమని, గణతంత్ర దినమని మా చంకలు గుద్దుకొంటున్నాము,
ఐనా సుందర భవిష్యత్తులో మీ త్యాగాలను వృథా పోనివ్వమని ఆశిస్తూ
-ఒక భారతీయుడు
ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకొంటూ
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Sunday, January 25, 2009
ఆచరణ లేని ఆలోచనలేల?( తెలుగు భాష)
Friday, January 23, 2009
తెలుగు భాష పట్ల ప్రజలలో అభిమానం పెంపొందేందుకు ఏ చర్యలు తీసుకొంటే బాగుంటుంది ? చర్చించండి.
Thursday, January 22, 2009
బ్లాగరులారా! స్పందించండి!
కార్యాచరణకు ఉపక్రమిద్దాం.
Wednesday, January 21, 2009
తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు
ఈ సమయం లో నైతే ప్రభుత్వం కనీసం మన మాట ఐనా వింటుంది. అందుకు గాను మనం ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకొందాము.అందులో ఉండాలి అని నేను అనుకొంటున్న అంశాలు
1.6 లేదా 7వ తరగతి వరకు నిర్బంధ తెలుగు మాధ్యమం ఉండాలి.ఆంగ్లం ఒక విషయం(subject ) మాత్రం గానే ఉండాలి.
2.ప్రభుత్వ వ్యవహారాలలోనూ, RTC లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ తెలుగు భాషకు సింహభాగం ఇవ్వాలి.
3.ప్రభుత్వ పథకాలకు తెలుగుదనం ఉట్టిపడే పేర్లు పెట్టాలి మరియు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు లోనే ( తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం లో కూడా) ఇవ్వాలి.
4.మన రాష్ట్రములో నడుపుతున్న ఆంగ్ల పాఠశాలలలో తెలుగు ఖచ్చితముగా భోధించాలి.
5.రాష్ట్రవ్యాప్తముగా ప్రతి సంవత్సరము తెలుగు పద్యాలు,వ్యాస రచన పోటీలు నిర్వహించాలి.
6.TV చానల్స్ లో కూడా తెలుగు భాషకు అత్యధిక ప్రాముఖ్యత నివ్వాలి.
7.అధికార భాషా సంఘానికి తెలుగుభాష అమలుపై పూర్తిగా అధికారాలివ్వాలి.తప్పనిసరి ఐతే తప్ప ప్రభుత్వం అధికారభాషా సంఘం వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు.
ఈ వినతిపత్రాన్ని తీసుకొని మన బ్లాగర్లు అందరు మరియు ఇంకా తెలుగుభాషా అభిమానులు అందరము ర్యాలీగా సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి అందజేద్దాము. ప్రభుత్వము ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మన ఉద్యమము ప్రజలలో బాగా వ్యాప్తి చెందుతుంది.అలా వ్యాప్తి చెందిననాడు ప్రభుత్వము దిగరాక తప్పదు.
పైన పేర్కొన్న వినతిపత్రాన్ని అన్ని రాజకీయపార్టీ నాయకులకు ఇద్దాము.ఎవరైతే సానుకూలముగా స్పందిస్తారో వారికే ఓటు వేస్తామని చెబుదాము.
మన బ్లాగర్లలో మహానుభావులు,పండితులు మరియు అనుభవశీలురు ఉన్నారు.వీరందరికీ నా విన్నపము ఏమిటంటే పైన పేర్కొన్న నా ప్రతిపాదనకు ఏమైనా సవరణలు చేసి ఇంకా విషయాలను కలిపి మన ఉద్యమానికి కార్యరూపం గావించవలసింది గా కోరుకొంటున్నాను.పైన పేర్కొన్నవే అంతిమం కావు.పై పని వలన వచ్చే ఫలితం పైన మన తర్వాతి కార్యాచరణకు సిద్దం అవుదాము.
ఈ పనికి గాను ప్రాంత భేధము లేకుండా తెలంగాణా,రాయలసీమ,కోస్తా అన్ని ప్రాంతాల నుండి బ్లాగర్లు,భాషాభిమానులు నడుం కట్టవలసి ఉంటుంది.ఈ పని భాషకు సంబంధించినది. ప్రాంతమునకు సంబంధించినది కాదు.కుల,మత మరియు ప్రాంత భేధాలు లేకుండా మనము అందరము సంఘటితముగా ఉండి ఈ విషయంపై పోరాడాలి.
మంచిపనికి ముహూర్తాలు చూసుకోనవసరంలేదు.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిద్దాము.
తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు,నల్లమోతు శ్రీధర్ గారు,వీవెన్ గారు,జ్యోతక్క,కత్తి మహేష్ కుమార్ గారు,లక్ష్మి గారు,"అమ్మఒడి" గారు,"దీప్తిధార" గారు, దుర్గేశ్వర్ గారు,నూర్‌భాషా గారు మొదలగు అనుభవశీలురకు మరియు అందరు బ్లాగర్లకు పేరుపేరునా నా విన్నపము.
Monday, January 12, 2009
Friday, January 2, 2009
మాజీ కేంద్రమంత్రి అంతూలే గారి నిజస్వరూపం
బయటపడిన కొన్ని సంభాషణలు:
"అగ్గి పెట్టండి,అగ్గి పెట్టండి" - పేలుళ్ళ తీవ్రతను పెంచవలసిందిగా ఆదేశాలు
"అలసిపోకుండా ఒకరొకరుగా దాడి చేస్తూ అప్పుడప్పుడు నిద్రపోతూ దాడులు కొనసాగించండి" - సుదీర్ఘ,ఉద్దేశ్యపూర్వక దాడుల కొరకు ఆదేశాలు
"అంతిమ క్షణాలు వచ్చేసాయి.నమాజు చేయండి.ఏమైనా సందేశము ఇవ్వాలనుకొంటున్నారా?" - కమెండోలు ఆపరేషన్ పూర్తి చేసే సమయంలో ఉగ్రవాదులకు వచ్చిన సందేశము
"కమీషనర్‌ను ఎవరైనా చంపేసారా?" - ఈ సందేశము ఆతృతగా అడిగారు.ఈ సందేశము ATF ముఖ్యనేత కర్కరే హత్యను ఉద్దేశించి ఆ హత్య జరిగిన విషయాన్ని రూఢి చేసుకొనుటకు అడిగినట్టు ఉంది.అతన్ని ప్రత్యేకము గా లక్ష్యము చేసుకొన్నారు.
అందరికీ తెల్సు మన మాజీ కేంద్ర మంత్రివర్యులు అంతూలే గారు చేసిన వ్యాఖ్యలు.ATF ప్రధానాధికారి హేమంత్ కర్కరే మృతిని మాలేగావ్ పేలుళ్ళకు లంకె పెడుతూ ఎవరో ముస్లిమేతరులు(ఆ ముస్లిమేతరులు ఎవరో కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను) అతని హత్యకు కారణమని వ్యాఖ్యలు చేసాడు.ఎప్పుడెప్పుడు మతవిద్వేషాలు రెచ్చగొడదామా,లాభం పొందుదామా అని ఎదురుచూసే ఇలాంటి వెధవ రాజకీయనాయకులను కఠినముగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతూలే గారి నిజస్వరూపం ఈ రోజు వచ్చిన పై వార్తతో బట్టబయలైంది.కేంద్ర ప్రభుత్వములో మైనారిటీ శాఖకు మంత్రిగా ఉంటూ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రికి ఎలాంటి శిక్ష విధించినా పాపం ఉండదు.
Wednesday, December 31, 2008
నిన్నటి చిలిపి ప్రశ్నలకు సమాధానాలు
1.శ్రీ మహావిష్ణువు ఏ అవతారము ఎత్తినప్పటికినీ భూమిపై ఆ అవతారము జరుగుతున్నా వైకుంఠములో నారాయణుడి రూపములో ఉండేవాడు.కాని చేప,పంది,నరసింహ అవతారాలు ఎత్తినప్పుడు స్వామే స్వయముగా రూపము మార్చుకొని వచ్చాడు.చేప,పంది అవతారాలు ఎక్కడ నుండీ పుట్టలేదు స్వయముగా ఆయనే దిగివచ్చాడు.కాని నరసింహస్వామి అవతారంలో స్థంభం నుండి పుట్టాడు.ఇక బ్రహ్మదేవుడు విష్ణువు నాభిలో నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడికి నాయనమ్మగా "స్థంభాన్ని" చెప్పుకోవచ్చు.
2.చందమామ,లక్ష్మీదేవి ఇరువురూ సముద్రము నుండి పుట్టారు కావున సోదర సంబంధం ఉంది.
3.మహావిష్ణువుకు చెల్లిగా పార్వతీ దేవిని చెబుతారు(నారాయణ-నారాయణి).పార్వతీ దేవి హిమవంతుని పుత్రిక కాబట్టి హిమాలయాలు విష్ణువుకు తండ్రి వరుస అవుతాయి.
Tuesday, December 30, 2008
చిలిపి ప్రశ్నలు ( తర్కాలు(లాజిక్కులు) లాగకుండా సరదాగా సమాధానం చెప్పండి)
2.చందమామ కు లక్ష్మీదేవికి చుట్టరికం ఏమిటి?
3.శ్రీ మహావిష్ణువుకు హిమాలయానికి గల బంధుత్వం ఏమిటి?
Monday, December 15, 2008
అంతా ఆంగ్లమే-అక్కడక్కడా తెలుగు-వీలైతే విదేశీ భాషలు
ఈ మధ్య మన తెలుగు ఛానళ్ళ వారు తమ కార్యక్రమాల పేర్లు కూడా ఆంగ్లంలోనే పెట్టుకుంటున్నారు.చివరికి వార్తలకు కూడా "న్యూస్ అట్ మార్నింగ్ ఎడిషన్" అని ఈవినింగ్ ఎడిషన్ అని,నైట్ ఎడిషన్ అని అంతా ఆంగ్లమే.ఇక ప్రతి కార్యక్రమానికీ ముందు special prograame అని కనిపిస్తుంది.మాట్లాడే బాషా కల్తీయే,వ్రాయడమూ కల్తీయే ఇప్పుడు చివరికి పేర్లు పెట్టడం కూడా అలానే అయిపోతోంది."అంతిమ సమరం","ఆఖరి పోరాటం","విశేష కార్యక్రమం" లాంటి పదాలు ఆకర్షణీయం కాదా? ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో కలిసిపోయిన పదాల గురించి మనం పట్టించుకోనవసరం లేదు.అలాంటివాటిని అలానే వాడుదాము.
ఇక వ్యాఖ్యాతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు పోయే హొయలు సామాన్యులెవ్వరూ పోరు.వారు మాట్లాడుతుంటే పాలు కూడా విరిగిపోయేట్టు ఉంటాయి.వీరు "ఆంగ్లేయ తెలుగువారు".కొన్ని రోజులు పోతే Anglo Indians లానే Anglo Andhrans కూడా ఏర్పడి వారికి కూడా చట్టసభలలో,ఇతర రంగాలలో కొన్ని స్థానాలు ప్రత్యేకముగా కేటాయించవలసి వస్తుందేమో.
"తినగ తినగ వేము తియ్యగనుండు" అన్న చందముగా భాషను మాట్లాడుతూంటే తియ్యగా అవ్వదా? "నా performance చూసారుగా నాకు ఓటు వేయండి" అని పిల్లలు ముద్దుముద్దుగా అంటుంటారు. Performance బదులు "ప్రదర్శన" అనే తెలుగుపదం ఉపయోగిస్తే ఎంత మధురముగా ఉంటుంది.చిన్నచిన్న పదాల దగ్గరే తెలుగును పిల్లలకు అలవాటు చేయకపోతే ఇక వారికి తెలుగు పదాల మధురత్వం ఎలా అలవడుతుంది?
ఇక చాలామందిని మీ రాశి ఏది అని గనుక అడిగినట్లయితే వెంటనే స్కార్పియో అనో,లియో అనో ఆంగ్లరాశుల పేర్లు చెబుతారే కానీ మన భారతీయ రాశుల పేర్లు చెప్పలేరు.అసలు ఎంతమందికి ఇవి గుర్తున్నాయో చెప్పలేము.
మన భాష పరిస్థితి ఎలా తయారవుతున్నదంటే కొన్ని రోజుల తర్వాత వాడుక బాష కూడా గ్రాంధికం అయ్యేటట్లు అనిపిస్తోంది.sorry అనే పదం వాడుకగా "మన్నించండి" లేక "క్షమించండి" అనే పదం ఏదో పెద్ద తప్పు చేసినప్పుడు మాత్రమే ఉపయోగించే పదాలుగా తయారవుతున్నాయి.చాలా పదాల పరిస్థితి ఇలానే ఉంది. "తరగతి","పాఠము,వరుస,వ్యాపకము,స్వస్థలము,నమోదు" లాంటి అందమైన తెలుగు వాడుక పదాలు అవసానదశకు చేరుకుంటున్నాయి.వాటి స్థానంలో class,lesson,line,hobby,native place,register లాంటి పదాలు వాడుకలో చేరిపోతున్నాయి.
కొన్నిచోట్ల ఆంగ్లపదం బదులు తెలుగుపదం గనుక ఉపయోగిస్తే అది బూతులకు దారితీసే పరిస్థితి కూడా ఎదురవుతోంది.ఉదాహరణకు sex అనే ఆంగ్లపదాన్ని కొన్నిచోట్ల వాడుకలో ఉపయోగించకపోతే అదేదో సిగ్గుపడే వ్యవహారంగా,వాడకూడని పదంగా మారిపోయింది.
Saturday, November 22, 2008
మంచిపని కి ఆలస్యం ఎందుకు?(ఒక మంచి కథ)
Thursday, November 6, 2008
మతరహిత సమాజం ఆకాశపుష్పం
మతం విషయం కూడా అంతే. అందులోని మంచిని గ్రహించినవాడు అదే ప్రకారం ప్రవర్తిస్తాడు.చెడును గ్రహించినవాడు ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. ఇందుకు మనం మతాన్ని నిందించడం తగునా? ఈ మధ్య మతాలు ఉండనవసరం లేదని, చెడును ప్రోత్సహించే మతాలు ఉంటే ఏమి లేకపోతే ఏమి అని అంటున్నారు. వాస్తవానికి సృష్టిలోని ప్రతివిషయంలోనూ గుణ,దోషాలు అనేవి ఉండక తప్పదు. అలాంటప్పుడు మనం ఏమీ ఉండకూడదు అనలేము కదా. దీనికి మతం అనే విషయం మినహాయింపు కాదు.
మానవతను మించిన మతం లేదు అన్న విషయం సరైనదే. ప్రతి మతమూ మానవతను కూడా బోధిస్తుంది కదా? పైన పేర్కొన్నట్టు దోషాలు కూడా ఉంటాయి. సృష్టిలో ఏ ఒక్కటీ పరిపూర్ణం( perfect ) కాదన్న విషయం అందరికీ తెలుసు.మరి మతం అనేది మాత్రం పరిపూర్ణం అని ఎలా భావిస్తారు? సరే అసలు లోపాలే లేని మతం ఒకటి స్థాపిద్దాము అనవచ్చు. కాని పైన పేర్కొన్న విధంగా పరిపూర్ణం ఐనది లేదు కాబట్టి దానిలో కూడా దోషాలు ఉండక తప్పదు. అప్పుడు ఆ దోషాలు నచ్చనివారు ఇంకొక మతం స్థాపించవచ్చు.కథ మళ్ళీ మొదటికి వస్తుంది.
సుఖదుఃఖాలు,మంచిచెడులు మొదలగు ద్వంద్వాలు ఎలానో గుణదోషాలు కూడా అలాగే. అందరికీ తెలుసు సుఖదుఃఖాలనేవి సాపేక్షాలని.ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించడం మన అనుభవమే. కావున మతాలు అన్నింటినీ రద్దుచేసినా అవి కంటికి కనిపించకపోవచ్చు.కాని గుప్తంగా అవి ఉండనే ఉంటాయి. కాబట్టి ఏ మతం వారైనా సరే వారివారి మతాలలోని మంచినే గ్రహించి లోపం అనుకొన్నదానిని వదిలివేస్తే ఏ బాధా ఉండదు.
Sunday, November 2, 2008
సాయనాచార్యుడు (తెలుగు వారి వైభవం)
నా టపా "కాంతివేగం వేదాలలోనే ఉంది" అనే దానిలో కాంతివేగమును సాయనాచార్యుడు తన ఋగ్వేదభాష్యములో ప్రస్తావించాడు అన్న విషయం ప్రస్తావించాను.ఇతను బుక్కరాయల ఆస్థానం లో మంత్రిగా ఉండేవాడన్న విషయం ప్రస్తావించాను.
ఇతను మన తెలుగువాడు కావడం మనకు ఎంతో గర్వకారణం.ఇతని జీవిత కాలం 1315 నుండి 1387.ఇతను తెలుగు బ్రాహ్మణుడు.భరద్వాజ గోత్రీకుడు.వీరి తల్లిదండ్రులు మాయన,శ్రీమతి గార్లు.ఇతని భాష్యము ఎంత ప్రఖ్యాతి పొందినదంటే "మాక్స్‌ముల్లర్" ,కీత్ పండితుడు మొదలగు పాశ్చాత్యులందరు సాయనాచార్యుని భాష్యము అనుసరించియే ఆంగ్లములోనికి,ఇతర విదేశీబాషలలోనికి వేదాలను అనువదించారు.ఇతను రాజనీతికోవిదుడు.ఇతను కంపరాజుకు, బుక్కరాయ, హరిహరరాయలకు మంత్రిగా వ్యవహరించారు.
సాయనాచార్యులు వేదాలకే కాక తైత్తిరీయ బ్రాహ్మణం,తైత్తిరీయ అరణ్యకం,ఐతరేయ బ్రాహ్మణం,ఐతరేయ అరణ్యకం,శతపథ బ్రాహ్మణం మొదలగు 13 పైన వ్యాఖ్యలు వ్రాశాడు.
Saturday, November 1, 2008
ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట

ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట భారతదేశంలోనే ఉంది.అంతేకాక నేటికీ అది చెక్కుచెదరకుండా ఉన్నదన్న విషయం అత్యంత ఆశ్చర్యకరం.కేవలం మరమ్మత్తులు మాత్రం చేశారు.నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ ఆనకట్ట నిదర్శనం.
ఈ ఆనకట్ట పేరు "కలనై".చోళరాజు "కరికాళ చోళుడు" కాలంలో క్రీ.శ 2వ శతాబ్దంలో నిర్మింపబడింది.తమిళనాడు లోని కావేరినది పై తంజావూరు పట్టణానికి 48 కి.మీ దూరంలో నిర్మింపబడి ఉంది.విచిత్రం ఏమిటంటే సిమెంట్ లాంటి ఏ అతుక్కోవడానికి ఉపయోగపడే (బైండింగ్ మెటీరియల్)దీని లో ఉపయోగించలేదు.
కావేరి నదీ జలాలను ఆనాటి నుండి నేటి దాకా నిరంతరాయంగా అనేక వేల ఎకరాలకు నీటిని అందిస్తూంది.
క్రీ.పూ 4వ శతాబ్దంలోనే గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద 'సుదర్శన జలాశయం' నిర్మింపబడింది.
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...
