వేద కాలం నుండి ఏ ధర్మాలను భారతీయులు అనుసరిస్తున్నారో దానిని సనాతనధర్మం అని అంటారు. సనాతనం అంటే ఎప్పటినుండో ఉండి కూడా నిత్యనూతనం గానే ఉండేది. మనం ఈ సనాతన ధర్మాలనే పాటిస్తున్నాం.
ఈ ధర్మాన్ని పాటించే భారతదేశపు తత్వం "ఒక్కటి" కాదు. ప్రకృతి తత్వమే మన తత్వం. మనసు యొక్క తత్వమే మన అందరి తత్వం. మనసు నుండి అనేక ఆలోచనలు బయలుదేరినా, అవి వేర్వేరుగా ఉన్నా, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు సంబంధం లేకపోయినా అన్నీ ఒకే మనసుకు చెందుతాయి. చివరికి నిద్రలోనికి మనం జారిపోయినప్పుడు అన్ని ఆలోచనలు తన మూలస్థానమైన మనసును చేరతాయి. ఆ మనసుకు అభిన్నం అవుతాయి. అంటే మనసులోనికి కలిసిపోతాయి.
ఇలాంటి మనసు లేక ప్రకృతి యొక్క తత్వమే మన తత్వం. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వమే మన జీవన విధానం.
వేదాలు,ఉపనిషత్తులు, రామాయణమహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు విభిన్నమైన తత్వాలను,సిద్ధాంతాలను చెప్తాయి. ఐనా కలిసి సహజీవితం గడుపుతాయి. "ఏకం సత్,విప్రా బహుదా వదంతి" అని అన్నీ అంగీకరిస్తాయి. మనం ఇవన్నీ మావే అని గర్విస్తాం. సిగ్గుపడము. ఒకే కూరగాయతో అనేకరకాల వంటలను మనం తినేటట్లు ఒకే దేవుణ్ణి మనం వివిధరకాలుగా ఆరాధిస్తాం.
అందుకే అవైదికాలైన(వేదాలను ఒప్పుకోని) బౌద్ధ,జైన,చార్వాక మతాలతో కలిసే జీవించాం. ఇప్పుడూ క్రైస్తవ,ఇస్లాం మతాలతో కలిసేఉంటున్నాం. అవి కూడా భగవంతుని చేరే వివిధమార్గాలే అని తెలిసి జీవిస్తున్నాం. నేటి యుగంలో శ్రీ రామకృష్ణపరమహంస గారు ఇదే అనుభవపూర్వకంగా ఋజువు చేసారు.
అందుకే మనం బ్రహ్మ,విష్ణు,పరమేశ్వర,కాళిక,గణేషలతో పాటుగా పోలేరమ్మ, మరిడమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మలను కూడా ఆరాధిస్తాము.
భారతీయులుగా మనం బహుదేవతారాధకులం. ఇది మన విధానం. మన విధానమే మన నాగరికత,మన సంస్కృతి.
"ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేస్తున్నాను." - శ్రీ భగవద్గీత