ఇది నా ౨౦౦(200)వ టపా.
మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం.
అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి.
సామవేదం లోని ఉపబ్రాహ్మణమైన "సంహితోపనిషద్ బ్రాహ్మణం" లోని శ్లోకాలు ఇవి.
"విద్య వై బ్రాహ్మణం ఆజగామ తవహం అస్మి త్వం మాం పాలయస్వ-అనర్హతె మానినెమాదా
గోపాయ మా శ్రేయసీతె అహమస్మి విద్యా సార్ధం మ్రియెత్ నా విద్యాం ఊషరెవపెత్"(3-9,10)
అర్థం:
ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను
నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు."
ఈ శ్లోకపు భాష్యం:
"యోగ్యుడైన శిష్యుడు దొరక్కపోతే తన విద్యను తనలోనే ఉంచుకోవాలే కాని ఎన్నటికీ అలాంటి వారికి తను నేర్చుకొన్న విద్యను చెప్పరాదు. దానివల్ల వాడు లోకకళ్యాణం సాధించకపోగా
లోకవినాశనానికే కారణం అవుతాడు."
విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి.