మీరు చేసేపని ఏదైనాసరే! దానికి ప్రేమ ఒక్కటే ముఖ్యకారణంగా ఉండాలి. కార్యం అంటూ ఎప్పుడుఆరంభం అవుతుందో - ఆ కార్యానికి కర్త, కర్తకు వేరైన ఇతరులు ఉండనే ఉంటారు. కార్యం ఏదైనాసరే! దాని ఉద్దేశము, ప్రయోజనము, కారణము ప్రేమతప్ప ఇంకోటి కారాదు. ఇచ్చట నేను గాంధీగారు అవలంబించిన అహింసావ్రతాన్ని గురించి చెప్పటంలేదు. ఒక్కొక్కప్పుడు మనం హింసా పూర్వకములైన కార్యాలు కూడ చేయవలసివస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నేరములకు తగిన శిక్షను కూడ విధించవలసి వస్తుంది. యుద్ధాలు చేయవలసిన అవసరం కూడ కలుగుతుంది. కాని ఏ కార్యం చేసినా సరే! కర్తయొక్క ముఖ్యోద్దేశము ప్రేమయే అయిఉండాలి. ఇచ్ఛాద్వేషాలకు క్రోధమాత్సర్యాలకు అందులో తావుండరాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఈ ప్రేమ అనేది అల్లుకోనిపోయి ఉంటే ప్రపంచంలో ఎట్టి గడ్డు సమస్యలనైనాసరే, మనం అవలీలగా సాధించగలం.
-శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు