చాలా ఆకలి మీద పండ్ల తోటలోనికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక తీరా పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెడుతుంటే ఎవరికి నష్టం? కావాలంటే ఆకలి తీరాక ఆ పని చేసుకోవచ్చు.
కాని మన దురదృష్టం ఏంటంటే నేడు మనం చేస్తున్న పని లెక్కెట్టుకోవడమే, తిని ఆకలి తీర్చుకోవడం కాదు.సాధారణంగా వేదాలు కాని, మరేవైనా గ్రంధాలు కాని చదవాలని ఎందుకు అనుకొంటాము.
మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం... నిజానికి ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైన చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి ప్రక్కకు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలవల్ల మన దృష్టిలో ఆ పుస్తకాల విలువ తగ్గిపోవడమేకాక వాటిపై నిరాదరణ ఏర్పడి వానిపై మనము ఉంచవలసిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఉంచలేకపోతాము. అది పిల్లలు తినడం కోసం పెంచబడుతున్న పండ్ల తోటలను బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. అలా ప్రయోగశాలలుగా మార్చామనుకోండి, వివిధ రసాయనాలు అవీ కలపవలసివస్తుంది. అప్పుడు అసలు దేనికోసం ఆ పండ్ల తోటను పెంచుతున్నామో ఆ అసలు పని ఇక వీలు కాదు. మనం ప్రస్తుతం శాస్త్రాలను,గ్రంధాలను చదివేపద్దతి కూడా ఇలానే ఉంది.
లేదు, ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైనవి కనుగొనాలి అనేవారు ఉన్నారంటే అది వేరే సంగతి.వారు అందుకు చదువుతారు.అది వారు చదువుతున్న కారణం.
మన కారణం అది కానప్పుడు మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అయినప్పుడు కూడా పైన చెప్పినవారి పనే చేస్తుంటే ఎవరికి నష్టం?
మనం ఒక పదానికి అర్థం కావాలని నిఘంటువు(Dictionary) చూస్తాం. కాని ఆ పదానికి అర్థం వెదికే క్రమంలో అనేక ఇతరపదాలు కనపడి వాటి అర్థం కూడా చూస్తూ ఒక్కొక్కసారి మనం అసలు ఏ పదానికి అర్థం చూడాలనుకొంటామో ఆ పదాన్ని మరచిపోతుంటాం. తర్వాత ఆ పదం గుర్తుకు రాక అదేంటో అని ఆలోచిస్తూ నరకయాతన పడుతుంటాం. ఇది అందరికి అనుభవమే అనుకొంటున్నాను. మిగతా పదాల అర్థాలు తెలిసాయి కదా అని అంటారేమో మంచిదే, కాని మన అసలు పని కాలేదు కదా.
ఒక అడవిలో రాత్రి పూట అడవి జంతువులు,పురుగులు,పాములు మొదలగునవి మన వద్దకు రాకుండా మనం కాపాడబడడం కోసం మనం కట్టెలు పేర్చి మంట పెట్టామనుకొందాం. ఇక్కడ
"రక్షణ" అనేది ప్రధాన కారణం,లక్ష్యం. ఆ మంట వెలుగులో మన వద్ద ఏమైనా దుంపలు అవీ ఉంటే వాటిని ఉడికించడం,తినడం అంతేకాక చలిగా ఉంటే మనకు వెచ్చదనం రావడం అనే ప్రయోజనాలు
అనుషంగికం.అంటే మన అసలు కారణం చెడకుండానే ఇతర ప్రయోజనాలు కలగడం.
అలానే మనం దేనికోసం పుస్తకాలు చదువుతున్నామో దాని కోసం చదివేటప్పుడు ఇతర విషయాలు మనకు తెలిస్తే తెలియనీ! మేలే, కాని అసలు విషయం మాత్రం మనం మరిచిపోకూడదు.
ఎవరెందుకు చదువుతున్నారో అందుకే మొదట చదవాలి. కావాలంటే చదివిన కారణం తీరాక ఆ పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎవరు? అతను ఏ కాలం వాడు లాంటివాటిపై దృష్టి పెట్టి కనుగొనడానికి ప్రయత్నించవచ్చు.