తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

శుక్రవారం 30 ఎప్రిల్ 2010

ఆంజనేయుని అత్యద్భుత జ్ఞానం (హనుమత్ రక్షాయాగానికి అంకితం)


క్రింద ఉదహరించు సంఘటన లంకలో సీతతో రాముని నిందిస్తూ రావణుడు పలికిన మాటలు:

'
'అతల్పం ని ద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''

అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు - అని రావణుడు చెప్పగా

సీతాదేవి ఇలా బదులు చెప్పింది.

'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''

ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.

ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.

ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారం దుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.

''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్
)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది

''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు.
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
.
తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం.

అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"

"హనుమత్ రక్షాయాగం" సందర్బముగా ఈ టపా అంకితం.

గురువారం 29 ఎప్రిల్ 2010

చాలారోజులైంది బ్లాగు వ్రాశి, ఇప్పుడు మళ్ళీ వ్రాయాలంటే అంతా కొత్తగా ఉంది.

చాలా రోజులైంది బ్లాగు వ్రాసి. దాదాపు రెండున్నరనెలలు కావస్తోంది ఈ బ్లాగు ప్రపంచములోనికి వచ్చి. అంతా కొత్తగా ఉంది. ఎంతో మంది కొత్తగా వచ్చినట్లున్నారు మన బ్లాగులోకములోనికి. అందరికీ నా ఆత్మీయ స్వాగతం మరియు శుభాకాంక్షలు.

హరిద్వార్ కుంభమేళాకు వెళ్ళి రావడముతో మొదటిసారి భారతదేశపు విశాలత్వాన్ని, విభిన్నప్రజలను మరియు మన సనాతనధర్మ వైభవాన్ని ప్రత్యక్షముగా చూసివచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. అందుకు ఆయనకు అనంతకోటి కృతజ్ఞతలు.

ఇంకా అరుణాచలము కూడా వెళ్ళిరావడముతో అరుణాచలేశ్వర దర్శనభాగ్యము,
భగవాన్ రమణుల అశ్రమ సందర్శన భాగ్యము, వారు తపస్సు చేసుకొన్న విరూపాక్షగుహ,స్కందాశ్రమము చూసే అదృష్టము, శ్రీశేషాద్రిస్వామి ఆశ్రమ దర్శనప్రాప్తి ఇంకా అగ్నిలింగ అరుణాచల ప్రదక్షిణము అబ్బో ఆ భగవంతుని కృపను ఏమని వర్ణింపను? ఒళ్ళు పులకరిస్తోంది, తలుచుకొన్నంతనే కళ్ళు ఆనందభాష్పాలు కారుస్తున్నాయి.

ఇక మళ్ళీ బ్లాగులోకములోని ప్రవేశిస్తూ నా అనుభవాలను పంచుకుందామనుకుంటున్నాను.
అందుకు భగవంతుడిచే ఆశీర్వదింపబడెదని కోరుకొంటున్నాను.

నా బ్లాగును ఇష్టపడేవారు