తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, February 27, 2009

ఏ కులమని నన్నడిగితె ఏమని చెప్పను దున్నపోతులకు, లోకులకు, దుష్టులకు

ఏ కులమని నన్నెవరు అడిగితె ఏమని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు,
అంతున పుట్టిందే కులమె
ముట్టంటున పెరిగెందే కులమె
అంటున శివుడు, ముట్టున మురుడు, ఎంతన ఈశ్వరుడు,
ముగ్గురు మూర్తుల దెలెపందె ఏకులమె
ఇంటిలోపల ఇల్లు కట్టుకొని
కంటి లోపల కదురు పెట్టుకొని
నారాయణ అని నరం తీసికొని
పంచాద్రి అని తడికి వేసుకొని
గోవింద అని గుడిప దీసికొని
గబ గబ, దబ దబ, ఏకెనిదె ఏకులం
దూదేకుని కులమె నాకులం
ఏ కులమని నన్నెవరు అడిగితె ఏమని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు,
పంచాద్రి అని పంచె తీసికొని
ఎరబ్రహ్మ అని శాలువ కప్పుకొని
పూజల నడిపెందికులమె నాకులం
వంటరి గాడు ఏ కులమె శ్రీజంతనె
కలసిందె కులమె నాకులం
ఏ కులమని నన్నెవరు అడిగితె ఏ మని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు.


ఈ కవిత బ్రహ్మం గారి శిష్యుడు ఐన సిద్దయ్య గారిచే రచింపబడినది.

Tuesday, February 17, 2009

మనిషి ఉన్నతిని, అభివృద్ధిని,సుఖశాంతులను కోరుతున్న వేదాలు

ఈ టపాలో మనిషి మహిమను వేదాలు ఎలా కొనియాడుతున్నాయో, మనిషికి ఎలా ఆత్మవిశ్వాసం కలిగించడానికి ప్రయత్నించాయో కొన్ని వాక్యాలు వ్రాయడమైనది.
1. అమృతం అసి : అమరుడు అవు
2. శర్మ అసి : సుఖవంతుడు అవు
3. శుక్రం అసి : శక్తివంతుడు అవు
4. తేజః అసి : తేజము అవు
5. ధామనామ అసి : కీర్తిని పొందు
6. తేజఃవేష్ప అసి : తేజస్సుకు నిలయమము అవు
7..శత వల్మః విరో హః నిండు నూరేళ్ళు వర్ధిల్లుము
8. సర్వేపి సుఖినస్సంతు : అంతా సుఖించాలి
9.సర్వేసంతు నిరామయా : అంతా వ్యాధిరహితులు కావాలి
10.సర్వే భద్రాణి పశ్యంతు : అందరూ శుభాలను చూడాలి
11.మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్ : ఏ ఒక్కడూ దుఃఖంచే బాధించబడరాదు


Saturday, February 14, 2009

దేవుడు మనుషుల కొసం ఎంతగా దిగివస్తాడో చూడండి

అందరూ అనుకొంటారు భగవంతుని పొందడమెలాగా? అది చాలా కష్టము, తపస్సులు చేయాలేమో, పూజలు చేయాలేమో అవన్ని సాధ్యమేనా అని? కాని దీనికి పరిష్కారము భగవంతుడే భగవద్గీతలోని భక్తియోగములో సూచించాడు. చూడండి మీరే ఆశ్చర్యపోతారు.

1.మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.

ఇది మొదటిది. దేవుని యందు మనసును,బుద్ధిని లగ్నము చేయడము. ఈ ప్రపంచములో పూట గడవడానికే ఇబ్బందిగా ఉంది, మా పనులనే మేము చేసుకోలేకపోతున్నాము ఇక దేవునిపై దృష్టి ఎలా పెట్టగలము అంటారా. ఐతే క్రిందది చూడండి.

2.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.

ఇక్కడ అభ్యాసయోగం అనగా మనసును ప్రాపంచిక విషయాలపై నుండి మరల్చి దేవునిపై పెట్టడం.అంటే పనులు మానుకొనమని కాదు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా చెపుతాను. పిల్లలు గుండ్రముగా తిరిగే ఆట మీరు చూసుంటారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తిరుగుతుంటారు. అలాకాక ఒకరే ఆధారం లేకుండా ఎంతసేపు తిరగగలరు? అలా ఎక్కువసేపు తిరిగితే క్రిందపడి పోతారు. అదే ఏ గుంజనో,స్థంభాన్నో గట్టిగా పట్టుకొని తిరిగారనుకోండి క్రిందపడరు. అలాగే మనం ఏ పని చేస్తున్నా భగవంతుని ఆధారం చేసుకొంటే ఏ సమస్యా ఉండదు. రోజుకు కొంతసేపు అభ్యాసం(ధ్యానం) నియమితవేళలలో గాని,మనకు అనుకూలమైన వేళలలో కాని చేస్తే మనసు మన చేతిలోనికి వస్తుంది.

3.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.

స్వామి ఇంకా దిగివచ్చాడు. ఇది కూడా మనకు సాధ్యం కాకపోతే దేవునికి ఇష్టమైన పనులు అనగా సత్యం పలకడం, ఇతరులకు హాని కల్గించకుండా ఉండడం,ఇతరులకు సహాయం చెయ్యడం, ప్రజోపయోగ కార్యక్రమాలు చెయ్యడం మొదలగునవి అన్నమాట.

4.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.

దీని గురించి వివరముగా నా పూర్వపు టపా "కర్మయోగ రహస్యము" లో చూడండి.ఆ టపాలోని విషయాన్నే క్రింద చూడండి.
1.కర్మ చేయుటకు నీకు అధికారము గలదుకాని దాని ఫలితమందు ఆసక్తి కలిగివుండుటకు లేదు.అట్లని కర్మలు చేయుట నీవు మానరాదు.

2.ఏ కర్మ చేయుచున్నను నీవు అసంగత్వం తో మరియు శ్రద్దగా నిపుణత్వం తో చేయాలి.అనగా నీవు కావాలనుకున్నప్పుడు ఏ క్షణము లో నైనా ఆ పనితో సంబంధం లేకుండా బయటకు వచ్చేయగలగాలి.

ఈ ప్రపంచములో గెలుపు,ఓటములు అనేవి కేవలము మన శ్రమ పైనే ఆధారపడిలేవు.ఒక పని కావడానికి మన శ్రమ అత్యంత ముఖ్యము ఐనప్పటికీ ఆ పని విజయవంతము కావడానికి ఇంకా చాలా పరిస్థితులు అనుకూలించాలి.ఆ పరిస్థితులలో చాలామటుకు మన చేతులలో ఉండవు.కాబట్టి మన భాద్యత ఏమిటటంటే ప్రయత్న లోపం లేకుండా మన పనిని మనము నిర్వర్తించడం.అటువంటప్పుడు పని సఫలమైనప్పుడు విజయానందం,ఒకవేళ కాకపొతే పనిని నిర్వర్తించిన ఆనందం కలుగుతాయి.అందువలనే పని యొక్క ఫలితంపైన ఆసక్తి ఉంచుకోరాదు.

ఉదాహరణగా యజమాని ఇంట్లో పనిచేయు దాది ని చెప్పుకోవచ్చు. ఆ దాది తన యజమాని బిడ్డలను తన బిడ్డలగా భావించి పెంచుతున్నప్పటికి ఆమె ధ్యాస అంతా తన సొంత ఇంటి పైనే ఉంటుంది.అలా అని ఆమె తన యజమాని పని కూడా శ్రద్దగానే చేస్తుంది.ఏ లోటూ రానివ్వదు.అంటే మనము పని చేయుచున్నప్పటికి మన మనసు భగవంతుని దగ్గర ఉండాలి.

చివరగా భగవంతుని ప్రతిజ్ఞ చూడండి:

ఎవరైతే సర్వకాల,సర్వావస్థలలో నన్నే శరణు జొచ్చుతారో, నాపై నిష్కల్మషమైన భక్తి కలిగిఉంటారో వారి యోగక్షేమాలు నేనే చూసుకొంటాను.
అర్జునా నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడని శపథం చేసి చెపుతున్నాను.




Friday, February 13, 2009

మేము మారము గాక మారము, మేమింతే - నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు

అసలు ఏమవుతోంది మన దేశంలో? దేశంలో పూటకు గతిలేక అన్నమో రామచంద్రా అంటూ పస్తులు ఉంటున్న ప్రజలు ఎందరో ఉన్నారు.ఉండడానికి పూరిపాక,కట్టుకోవడానికి గుడ్డపేలిక లేక ఎందరో అలమటిస్తున్నారు. మనిషి కనీస అవసరాలకే గతి లేక చస్తుంటే మన భారతీయులు,భారతీయ యువత ఏం చేస్తున్నారు?

సంస్కృతీ పరిరక్షణ అంటూ కొందరు, తమ మతమే గొప్పదని,తమ మతం తప్ప వేరే దిక్కు లేదని కొందరు , హక్కులే తప్ప బాధ్యత మాకు పట్టదని యువత ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో.

ఆ మధ్య సంస్కృతీపరిరక్షకులమంటూ కొందరు మంగళూరు లో పబ్బుపై దాడి చేసారు. ఆ కుహనా పరిరక్షకులలో అందరూ యువకులే పాల్గొన్నారు. ఆకలిగొన్న పేదలకు ఒక పూట తిండి పెట్టలేని వారు, వారికి ఒక పూరిపాక నిర్మించలేనివారు, కట్టుకోవడానికి కనీసం తమ పాతబట్టలు కూడా ఇవ్వలేని వారు వీరండీ సంస్కృతీ పరిరక్షకులు. అసలు ఒకరి వ్యక్తిగత స్వాతంత్ర్యము, వ్యక్తిగత జీవితము పై వీరి అధికారము ఏంటి? ఎవరి హద్దులలో వారు ఉంటే మంచిది. ఎవరికీ ఎవరిపై పెత్తనము చలాయించే హక్కు గాని, అధికారము గానీ లేవు.

"అన్నమో రామచంద్రా! అంటున్న వారికి మత భోధనలు ఎందుకు, వారికి పట్టెడన్నం పెట్టండి.ఒక కుక్కకు ఆకలి తీర్చడం కొరకు వెయ్యిజన్మలు ఎత్తడానికైనా,వేయిసార్లు నరకానికి పోవడానికైనా సిద్దమే" అన్న వివేకానందుని వాక్యాలు తెలుసుకోవాలి.

ఇక నేటి విద్యార్థుల (యువత) విషయానికి వద్దాము.

ప్రేమికులను కలపడానికి, వారి ప్రేమను నిలపడానికి తమ ప్రాణాలనైనా ఇస్తామంటారు. అదే సాటి మనిషి కొనప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నా స్పందించరు.అది మా పని కాదు. ప్రభుత్వపు పని అంటారు. వెళ్ళే సినిమా హాళ్ళ వద్ద ,తాగే పబ్బుల వద్ద ఒక రూపాయి ఇమ్మంటూ అడిగే వారిని, తినడానికి ఏమైనా ఇమ్మనే వారిని చీదరించుకొంటారు. ఏం! యువతకు సంఘబాధ్యత (Social responsibility) లేదా?

ఈ ఫిబ్రవరి 14 ప్రేమికులదినోత్సవమును ఎవరూ ఆపలేరని,అది తమ హక్కు అని బెంగళూరులో చాలా కళాశాలల విద్యార్థినీ,విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించబోతున్నారు.అదీ అందరూ కలిసి. ప్రేమికులదినోత్సవం గా ని మరే దినోత్సవం కాని జరుపుకోవడంలో తప్పులేదు.నిరభ్యరంతరముగా జరుపుకోవచ్చు.అది మన హక్కు.

కాని ఏనాడైనా అన్ని కళాశాలలూ కలిసి ఈ విధముగా పోరాడినట్టు ప్రజాసమస్యలపై పోరాడారా? కాని హక్కుల కోసం పోరాడుతున్నామే కాని,బాధ్యతల గురించి పట్టించుకోమా? ఇప్పుడు ఇలా ర్యాలీ చేస్తున్నామే,ఎప్పుడైనా ఇంతగా మనలను ఈ ర్యాలీ ద్వారా ప్రజలను ఆకర్షించింట్లు సమాజంలోని అవినీతిపై గాని, అందరికీ కనీస అవసరాల కోసం కాని ఉద్యమించామా? అప్పుడప్పుడు ఎయిడ్స్ పై అవగాహన కోసం ర్యాలీలనునిర్వహిస్తుంటాము,అదీ కళాశాలల తరపున ,వారు నిర్వహిస్తామంటేనే. ఇక్కడ అందరినీ అనడం లేదు.కాని చాలామందినే అంటున్నాను.

ఎవరు అడ్డొచ్చినా మేము దినోత్సవాలు జరుపుకొంటామంటామే కానీ, ఎవరు ఏమన్నా లంచాలు ఇవ్వము,కనీస అవసరాల కోసం ఉద్యమిస్తాము అని యువత అంటున్నదా? పైగా మీడియా కూడా ఇలాంటి వార్తలకు ఇస్తున్నంత ప్రచారం మనిషి కనీస అవసరాలకై ఉద్యమిస్తున్న వారికి ప్రచారం కల్పిస్తోందా?లేదు. వారికి సంచలన వార్తలు, సున్నితాంశాలపై ప్రజలను ఆడుకోవడం తద్వారా తమ సర్క్యులేషన్ పెంచుకోవడం,డబ్బు సంపాదించడం ఇవే కావాలి.

కళాశాలల్లో ర్యాగింగ్ చేస్తారు. సాటి విద్యార్థులనే బాధ పెడతారు. ఇలాంటివారా దేశానికి భవిష్యత్తు? వీరా దేశాన్ని అభివృద్ధిపథములో నడిపేవారు?

ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. సంఘం బాగుంటేనే అందరమూ బాగుంటాము.

ఒక మదర్‌థెరెసా, ఒక వివేకానంద, ఒక గాంధీజీ, ఒక అబ్దుల్‌కలాం, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్,దేశ సైనికుడు వీరు నిజముగా యువతకు ఆదర్శముగా ఉండాలి.

హక్కుల కోసం పోరాడుతూ బాధ్యతలను విస్మరించడము దేశపతనానికే దారితీస్తుంది. మనిషి కనీస అవసరాలు తీర్చగలిగిన రోజు, ఏ ఒక్కరూ ఆకలితో చనిపోని రోజు ఆ రోజుకై పోరాడదాం.

గమనిక : ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి వ్రాయలేదు.




Thursday, February 12, 2009

షిర్డి సాయిబాబా గారు మరణించి తిరిగి మూడు రోజుల తర్వాత ఎందుకు లేవవలసివచ్చింది?

ఈ మధ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ విరచిత షిరడిసాయిబాబా చరిత్ర చదువుచున్నప్పుడు ఇప్పుడు చెప్పబోవు విషయం ఆసక్తికరంగా,రహస్య విషయంగా అనిపించింది.

సాయిబాబా గారు మూడు రోజుల తర్వాత తిరిగి మరణించి లేచినప్పుడు సాయిబాబా గారే స్వయముగా చెప్పినది.
"నేను అల్లా దగ్గరికి వెల్లి ఓ దేవా నేను ఇక జన్మ చాలించి మీదగ్గరికి వచ్చేద్దామని అనుకుంటున్నానని అన్నాను.కాని అల్లా ఏమన్నాడంటే సాయీ!గదాధరుడు అనే మహాత్ముడు కూడా చాలారోజులనుండి నా దగ్గరకు వస్తానని వేడుకుంటున్నాడు.భూలోకంలో అతని కార్యం ముగిసినది.నీ కార్యం ఇంకా ఉన్నది.అందువలన నీవు తిరిగి భూలోకానికి వెళ్ళు.గధాదరుడు నా దగ్గరికి వస్తాడు"అన్నాడు.

ఇక్కడ గధాదరుడు అంటే వేరెవరోకాదు శ్రీరామకృష్ణపరమహంస గారు.సాయిబాబా గారు అర్దరాత్రి ఒంటి గంటకు తిరిగిలేచారు.సరిగా అదే సమయంలో అదే రోజు శ్రీరామకృష్ణపరమహంస తన దేహం చాలించారు.

బ్లాగరుల సమావేశ విశేషాలు ఎవరూ వ్రాయలేదేమి?

మొన్న ఆదివారం ఫిబ్రవరి,8 న యూసుఫ్‌గూడ ,కృష్ణకాంత్ పార్కు లో బ్లాగర్ల సమావేశం జరిగిందా? జరిగుంటే ఇంతవరకూ ఎవరూ దాని వివరాలు వ్రాయలేదు ఎందుకని? విశేషాలు చెప్పండి.

Wednesday, February 11, 2009

స్వామి వివేకానందుని జీవితంలో మనకు తెలియని వింత

స్వామి వివేకానందుని గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. అతను ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితిని కూడా పొందాడు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఇంత మహానుభావునికి సిద్ధులు అనగా అతీతశక్తులు ఉండవా అని. ఉన్నాయి. కాని అతను ఎప్పుడూ వాటిని బహిరంగముగా ప్రదర్శించలేదు.

ఇప్పుడు శ్రీ పరమహంస యోగానంద గారి గురించి చూద్దాం.
స్వామి పరమహంస యోగానంద క్రియాయోగమును భారత మరియు అమెరికా,ఇంగ్లండు లలో వ్యాప్తి చేసిన ఒక యోగి. ఇతను రచించిన ఆత్మకథ పేరు "ఒక యోగి ఆత్మకథ". ఈ పుస్తకం చాలా ప్రచారం పొందింది.ఈ పుస్తకమును అనేక అమెరికా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశముగా పెట్టారు. ఈ పుస్తకములోనే మనకు తెలియని వివేకానందుని అతీత శక్తి గురించి ఉంది.సరే ఆ సంఘటన చూద్దాం.
####################################################################

పరమహంస యోగానంద గారు రెండవ సారి అమెరికా వెళ్ళినప్పుడు తన పాశ్చాత్య శిష్యుల కోసం ఎన్నో కానుకలు తీసుకెళ్ళారు. అక్కడ అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఒక శిష్యునికి ఒక వెండి కప్పు బహుమానముగా ఇచ్చారు.
ఈ శిష్యుడు యోగానందుల కంటే వయసులో పెద్దవాడు. అప్పుడు ఆ శిష్యుడు నిశ్చేష్టుడై నోట మాట రాక ఒక మూల ఏడుస్తూ కూర్చుండిపోయాడు. యోగానంద గారు అది గమనించి అప్పటికి ఏమీ అనకుండా చివరలో ఏకాంతముగా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు అవి ఆనందభాష్పాలు అని చెప్పాడు. యోగానంద గారు కారణం అడిగారు.
అప్పుడు ఆ శిష్యుడు తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పాడు. అతని చిన్నతనంలో ఒకసారి అతను నీళ్ళల్లో మునిగిపోబోతూ రక్షించండని అరవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గాలిలో సూర్యకాంతివెలుగుతో ప్రత్యక్షమై "లే" అన్నాడు. ఈ శిష్యుడు ఎలాగో బయట పడ్డాడు. కొన్ని రోజులకు ఆ విషయం మరిచిపోయాడు.
తర్వాత చికాగోలో విశ్వమతమహాసభ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి పోవడం చూసి ఈ అబ్బాయి నిశ్చేష్టుడై తన తల్లితో "అమ్మా! చిన్నప్పుడు నాకు గాలిలో కనిపించిన వ్యక్తి అతనే" అంటూ వడివడిగా లోనికి ప్రవేశించారు. ఆ వ్యక్తే స్వామి వివేకానంద. వివేకానందులు ఈ అబ్బాయిని చూడ్డంతోనే నవ్వుతూ " నీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు" అన్నారు.ఈ అబ్బాయి ఆనందభాష్పాలు రాలుస్తూ శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వివేకానందులు "నీ గురువు నేను కాదు. అతను మరో పాతిక సంవత్సరాల తర్వాత వస్తాడు. దానికి గుర్తు అతడు నీకు ఒక "వెండి కప్పు"ను బహుమానముగా ఇస్తాడు" అన్నాడు.
వివేకానందులకు తనను శిష్యునిగా చేసుకోవడం ఇష్టములేక ఇలా అంటున్నాడని బాలుడు అనుకొన్నాడు. కాని ఇప్పుడు అతని భవిష్యవాణి ఇలా జరగడం చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమత మహాసభ జరిగినది 1893 సెప్టెంబరులో. యోగానంద గారు పుట్టినది 1893 జనవరి 5 న.
####################################################################

వివేకానందులు సిద్ధులను అనగా మహిమలను అసహ్యించుకొనేవారు. అందువలన అత్యంత అవసర పరిస్థితులలోనే తన శక్తులను ఉపయోగించారు. పైన పేర్కొన్న మానవాతీతశక్తి గురించి కూడా స్వామి వివేకానందులు ఎవరికీ స్వయముగా చెప్పలేదు.అందువలనే వివేకానందులు స్థాపించిన శ్రీ రామకృష్ణ మఠం వారి పుస్తకాలలో ఎక్కడా ఈ విశేషముగాని మరే ఇలాంటి విశేషాలు కాని పేర్కొనబడలేదు.



Monday, February 9, 2009

శ్రీ భగవద్గీతలోని కర్మ,వికర్మ,అకర్మ లకు వివరణలు

భగవద్గీతలో కర్మ,అకర్మ,వికర్మ ల గురించి పేర్కొనబడినది. అవేమిటో ఒకసారి చూద్దాం.

కర్మ: కర్మ అనగా సాధారణముగా పని అని అర్థము.ఈ పని ఏవిధముగా ఉండవలనంటే లోకమునకు విరుద్ధముగా ఉండకుండా అనగా లోకహానికి కారణము కాకుండా ఉండాలి. మనము కర్మలను మనఃపూర్వకముగా చేయాలి.కాని వాటి ఫలితముపై ఆసక్తి చూపరాదని భగవద్గీతలో భగవంతుడు అంటాడు. కర్మ కోసమే కర్మ,ప్రేమ కోసమే ప్రేమ ఉండాలి.
వికర్మ: అనగా చేయకూడని కర్మ(పని). అనగా లోకహితము కాని పనులు.

అకర్మ: అకర్మ అనగా పనిచేయకుండా ఉండడము అనేది సామాన్య అర్థము. కాని అసలు అర్థము అది కాదు. అకర్మ అనగా కర్మ చేస్తున్నా మన మనసు ప్రశాంతముగా ఉండాలి. భగవద్గీతలో భగవానుడు దీనినే అత్యంత స్పష్టముగా చెప్పాడు. "ఎవరైతే అత్యంత కర్మ(పని) స్థితిలో ఉన్నా అతని మనసు అత్యంత ప్రశాంతముగా ఉంటుందో(అకర్మను చూస్తాడో), అలాగే అత్యంత ప్రశాంత స్థితిలో కూడా(అకర్మలో కూడా) తీవ్రమైన కర్మను చూస్తుంటాడో అతనే నిజముగా కర్మను తెలిసినవాడు.అతనే కర్మ యోగి."
దీనినే కొద్దిగా వివరముగా చూద్దాం.మీరు పూర్తిగా ట్రాఫిక్‌జాము లో ఇరుక్కుపోయారనుకోండి. చుట్టుప్రక్కల నుండి అందరూ హారన్‌లు మ్రోగిస్తున్నారు. ఎవరో గలాట పడుతున్నారు. అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మీ మనసు యొక్క ప్రశాంతతకు ఏ విధమైన భంగము కలగకుండా ఉండాలి.అంటే ఎవరూలేని ఏకాంత గుహలో మీ మనసు ఎలా నిశ్చల స్థితిలో ఉంటుందో అలా ఉండాలి.అనగా శరీరం అత్యంత కార్యనిర్వహణలో ఉన్నా మనసు అత్యంత ప్రశాంతముగా ఉండాలి.అదీ నిజమైన కర్మయోగి స్థితి.
అలాకాక ఏకాంతగుహలో ఉన్నా మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటూంటే అది నిజమైన కర్మ అనిపించుకోదు.
ఇక అకర్మ లో కర్మను చూడడము అంటే చుట్టూ జరుగుతున్న పనులను లేక జగద్‌వ్యాపారమును ఎటువంటి మనశ్చాంచల్యము లేకుండా ఒక సాక్షిగా చూడడము.
ఎవరైనా చెస్(చదరంగము) ఆడుతుంటే వారికి కూడా రాని మంచి ఎత్తులు ఊరకే చూసే మనకు వస్తుంటాయి. అలాగే మన ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయనే భావం మనలో కనుక ఉంటే మనం సాక్షిగా ఆ పని ఇంకా బాగా చేయగలము.
మీరు ఒకటి గమనించే ఉంటారు.పంకా(fan) అత్యంత వేగముగా తిరిగేటప్పుడు అసలు అది తిరగనట్టే నిశ్చలస్థితిలో ఉన్నట్టు కనపడుతుంది.ఇక్కడ తీవ్రకార్యపరత్వములో ఉన్నప్పటికీ ప్రశాంతముగా ఉన్నట్టే అనిపిస్తుంది.
దీనినే ఇంకా వివరముగా చూడాలంటే "కర్మయోగ రహస్యము" చూడండి.

ఉదాహరణలు:
మనము తిరుపతి నుండి రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే హైదరాబాదుకు చేరుతాము. మనము బస్సు కానీ రైలుకానీ ఎక్కినా మనము నిద్రపోతాము. ప్రొద్దున్నే చేరుతాము. అక్కడ మనం చేసిన పని ఏమీ లేదు. ఆ వాహనమే మనలను తీసుకు వచ్చింది. కాని మనమే వచ్చామంటాము. ఇది అకర్మలో కర్మను చూడడం.
పిల్లవాడు బాగా అలసిపోయి ఏమీ తినకుండా రాత్రి పడుకున్నాడనుకొందాం. అమ్మ వాడిని లేపి అన్నం తినిపిస్తుంది. వాడు నిద్రలోనే తింటాడు. వాడికేమీ గుర్తుండదు. ప్రొద్దునలేచి రాత్రి నేను ఏమీ తినలేదు అంటాడు. దీనిని కర్మలో అకర్మను చూడడము అంటారు.
వీటిని కేవలం ఉదాహరణలుగా మాత్రమే తీసుకోండి.
అలాగే మన మనసు సదా భగవంతుని పాదచరణాలపైనే ఉంటూ మన శరీరం మాత్రం దాని పని అది చేస్తూ ఉండాలి. మన ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయని,నేను ఏమీచేయడం లేదనే భావంలో మనం నెలకొని ఉండాలి.

Saturday, February 7, 2009

మా ఊరు కదిరి పట్టణము విశేషాలు





ఇన్నిరోజులుగానేను టపాలువ్రాస్తున్నామా కదిరిపట్టణముగురించివ్రాయకపోవడం నాకే ఆశ్చర్యముగా ఉంది. వికీపీడియా లో కదిరి గురించి వ్రాశాను.
మా ఊరి గురించి కొన్ని విశేషాలు.
కదిరి పట్టణము అనంతపురం జిల్లాలో ఉంది.
ఆంధ్ర రాష్ట్రములో తాలూకాలు ఉన్నప్పుడు కదిరి తాలూకా రాష్ట్రములోనే అతి పెద్ద తాలూకా.
రాష్ట్రములోని నవ నారసింహ క్షేత్రాలలో కదిరి ఒక నారసింహక్షేత్రము.ఇక్కడి నరసింహుని శ్రీలక్ష్మీనరసింహస్వామిఅంటారు. మరే ప్రాంతములో లేని విధముగా ఇక్కడ స్వామి వారి మూలవిరాట్టు ముందు భక్త ప్రహ్లాదుని విగ్రహంచేతులు జోడించుకొని స్వామిని శాంతపరుస్తునట్టు ఉంటుంది. నరసింహుని విగ్రహం హిరణ్యకశిపుని చీలుస్తున్నట్టుఉంటుంది. మూలవిరాట్టు స్వయంభూవిగ్రహము.
ఇక్కడి నరసింహస్వామి బెంగళూరు, కోలారు ప్రాంతాలలో చాలా మందికి ఇంటి దైవము. కదిరి లక్ష్మీనరసింహ స్వామిబ్రహ్మోత్సవాలు ఏటా వైభవముగా జరుగుతాయి. ముఖ్యముగా బ్రహ్మరథోత్సవం(తేరు) నాడు సుమారు 5 లక్షలమంది కి పైన పాల్గొంటారు. కర్ణాటక,తమిళనాడుల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
స్వామి వారికి కులమత భేధాలు లేవు. దీనికి ఋజువుగా స్వామి వారి తేరు(రథము) కదలవలనంటే కదిరికి రెండుకిలోమీటర్ల దూరంలోని కుటాగుల్ల గ్రామం నుండి బోయవాల్లు వస్తేనే వీలవుతుంది. వారు రాకుంటే ఎన్ని లక్షలమందిలాగినా,తోసినా కదలదు. మరియు సంక్రాంతి మరుసటి రోజు కనుమ నాడు స్వామి వారి రథము హరిజనల ఇళ్ళల్లోకివెళ్తుంది.
గుడి వెనకాల ఒక కోనేరు ఉంది.దానిని భృగుతీర్థము అంటారు. ఇంకా అగస్థ్యతీర్థము,కుంతితీర్థము, వ్యాసతీర్థముమొదలగు 12 తీర్థాలు ఉన్నాయి.
ఇక గుడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో కదిరికొండ ఉంది. కొండను లఘువమ్మకొండ మరియు అలివేలుమగమ్మకొండ అని అంటారు. దీని క్రింది భాగాన సీతాదేవి సమేత రాముడి గుడి ఉంది. కొండల నరసింహ స్వామి గుడి కూడాఉంది. కొండపై గుహను సప్తర్షుల గుహ అంటారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రిందట సప్తర్షుల విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు మూడు విగ్రహాలు మాత్రం ఉన్నాయి.
ఇక కదిరి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పుకోవాలంటే కదిరికి 10 కిలోమీటర్ల దూరంలో మహాకవిమరియు యోగివేమన పరమపదించిన ప్రదేశము కటారుపల్లి ఉంది. అక్కడ వేమన గారి సమాధి ఉంది. పర్యాటకశాఖవారు ప్రదేశాన్ని బాగా అభివృద్ధి చేశారు.
కదిరి కి 26 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే విస్తీర్ణములో అతి పెద్దదైన మర్రిచెట్టు (తిమ్మమ్మ మర్రిమాను) ఉంది.దీనివిస్తీర్ణము 5 ఎకారాల పైనే ఉంటుంది.
కదిరి పట్టణము జిల్లా కేంద్రమైన అనంతపురానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతపురం నుండి చెన్నైకు వెళ్ళే జాతీయరహదారిలో ఉంది. బెంగళూరుకు 175 కిలోమీటర్ల దూరంలో, ముఖ్యమంత్రి గారి పులివెందులకు 45 కిలోమీటర్లదూరంలోణు, పుట్టపర్తికి 42 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అన్ని చోట్ల నుండి బస్సు మార్గము ఉంది. బ్రాడ్గేజ్ రైలుమార్గం వేస్తున్నారు.

Friday, February 6, 2009

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?

స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి. చివరికిబ్లాగులలో కూడా తోటి మహిళా బ్లాగర్లపై అసభ్యకరమైన టపాలు,వ్యాఖ్యలు చేస్తున్న వారందరూ తెలుసుకోవలసినవిషయాలు ఇవి.

1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)

స్త్రీలు గృహమునందు పూజింపబడుచున్నారో గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.

స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)

2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)

10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.

3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.

4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)
భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు.
కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.

5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి.

Thursday, February 5, 2009

ఎన్ని రోజులు ఈ అనుకరణ ? సొంతమంటూ ఏదీ లేదా? ఉన్నా పాటించరా?

ప్రేమికుల రోజు త్వరలోనే వస్తోంది. అంటే ఫిబ్రవరి 14వ తేదీన. జరుపుకోకూడదని కొన్ని సంస్థలు, లేదు జరుపుకొనే తీరుకుంటామని యువత అంటున్నాయి. సరే అంతా బాగుంది. ప్రేమికుల రోజు అనేది పాశ్చాత్య దేశాల 
నుండి దిగుమతి చేసుకొన్నది అని అందరికీ తెలుసు. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయనుకోండి.

సరే మనకు ఆ దినోత్సవం బాగుంది,జరుపుకొంటే తప్పేముంది అనుకొందాం. తప్పు ఏమీ లేదు.జరుపుకొందాం.
కాని ఒక్క విషయం. ప్రేమికుల రోజు ఎప్పుడు అంటే టక్కున ఫిబ్రవరి 14న అంటాము.
వెంటనే అన్నాచెల్లెల్ల దినోత్సవం (రాఖీ) ఈ సంవత్సరం ఎప్పుడు వస్తోంది అంటే ఎంత మంది కనీసం 5 నిమిషాల వ్యవధిలో చెప్పగలరు? చెప్పలేరు. ఇలా ఉంది మన సంస్కృతిపై మనకు గల ప్రేమ.
ప్రేమ పేరుతో యువతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే వ్యాపార వర్గాలు, పవిత్రమైన రాఖీ దినం పై ఎందుకు శ్రద్ద చూపడం లేదు? ఇది సాంస్కృతిక బానిసత్వం కాదా? యువత బలహీనత తో ఆడుకోవడం కాదా? 

యువతను రెచ్చగొట్టడం కాదా?
ఇక్కడ రాఖీ దినోత్సవాన్ని ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది.
నేటి భారతదేశం ఇలా పలుకుతోంది:" పాశ్చాత్య భావాలను,వేషభాషలను, ఆహారవిహారాలను,పాశ్చాత్య ఆచారమర్యాదలను మనం పాటిస్తే వారిలాగే అభివృద్ధి చెందుతాము."
కాని ఒకటి తెలుసుకోవడంలేదు: " అనుకరణ వలన ఇతరుల భావాలు ఎన్నటికీ మనవి కాబోవు. సింహం తోలు కప్పుకొన్న గాడిద, సింహం అవుతుందా ? లేక ఆవు తోలు కప్పుకొన్న పులి ,ఆవు అవుతుందా(గోముఖవ్యాఘ్రం)?"
మరలా నేటి భారతదేశం ఇలా అంటోంది:"పాశ్చాత్య జాతులేమి చేస్తున్నాయో,అదంతా తప్పకుండా మంచిది,కాకపోతే అవి అంత బలవంతము ఎలా అయ్యాయి?"
ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే మెరుపు మిరుమిట్లు గొలుపుతున్నప్పటికీ దాని ప్రకాశం క్షణకాలం మాత్రమే.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఐతే ఇతర దేశస్థులనుండి మనం ఏమీ నేర్చుకోనవసరం లేదా? అభివృద్ధికై మనం ప్రయత్నించనవసరం లేదా? మనం పరిపూర్ణులమా? మనలో లోపం ఏమీ లేదా? మనం నేర్వవలసిన విషయాలు చాలా ఉన్నాయి.బ్రతికినంత కాలం నేర్చుకొంటూనే ఉండాలి.
మనం ఒక మహాప్రమాదం గుర్తించడం లేదు. పాశ్చాత్య అనుకరణ వ్యామోహం మనలను ఆవహించి ఉంది.కీడేదో,మేలేదో వివేకవిచక్షణలతో మనం ఎంతమాత్రం నిర్ణయించుకోవడం లేదు.
ఉదాహరణకు చైనా దేశస్థులు ఎక్కడైనా ప్రపంచ సమ్మేళనం జరుగుతుంటే తన సాంస్కృతిక వేషధారణలోనే వస్తారు. కాని మనవారో బయటకు వెళ్తే "సూటు,బూటు"కావలసిందే. చైనీయులు అభివృద్ధి చెందడం లేదా? 
తమ సాంస్కృతిక వారసత్వం నిలుపుకొంటూనే నేడు అగ్రరాజ్యాలలో ఒకటిగా లేదా?
మన ఆచార సాంప్రదాయాలకు పాశ్చాత్యులు ప్రశంశా పత్రం(certificate) ఇస్తేనే మనం పాటిస్తామంటే ఎంత మాత్రం అంగీకారము కాదు.
విదేశీ ఆచారవ్యవహారాలను మనము ఎలా పోట్లాడి పాటిస్తామో అంతకంటే ఎక్కువగా మన ఆచార సాంప్రదాయాలు పాటించడానికి మొహమాటం ఎందుకు? మనకంటూ సంస్కృతి ఉంది.దాన్ని నిలబెట్టుకొందాము.

Wednesday, February 4, 2009

ఋషులు చెప్పిన కలియుగ లక్షణాలు

శ్రీ మహాభాగవతంలోని 12 స్కంధములో వేదవ్యాస మహర్షి చే చెప్పబడ్డ కలియుగ లక్షణాలు సంగ్రహముగాచూద్దాము.
"కలికాలమున రోజురోజుకు సత్యము,ధర్మము,దయ,క్షమ,ఆయువు మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి.
ధనవంతుడే ఆచారవంతుడు,గుణవంతుడు,ధర్మపరుడు,న్యాయపరుడు మరియు సర్వనియంత అవుతాడు.( ప్రస్తుతం ధనమున్న అమెరికా దేశం ఇలా ఉంది.)
పెండ్లిండ్లలో కులం,శీలము,యోగ్యత చూడరు. ప్రేమవివాహాలు యువతీయువకులు తమకు నచ్చిన వారినే వివాహమాడతారు(ప్రేమవివాహాలు) .కాని ప్రేమలలో నిజాయితీపాలు చాలా తక్కువగా ఉంటుంది.
మోసం చేయగలవారు ,అబద్దాలు చెప్పువారు వ్యవహారదక్షులు అవుతారు.
బ్రాహ్మణత్వం బ్రహ్మజ్ఞానంచేకాక జందెము వలన వ్యక్తము అవుతుంది.( బ్రాహ్మణుడు అంటే ఎవరనేది ఇంత స్పష్టముగా చెప్పినా విషయంపై మనవారి వాదాలకు అంతులేకుండాపోయింది ).
వాగినవాడు పండితుడు , మంచిగా ఉండకపోవడమే మంచితనము, కలిసిఉండడమే పెళ్ళిగా పరిగణింపబడతాయి.
దూరముగా ఉన్న మురికిగుంటయే పుణ్యతీర్థముగా,వెంట్రుకలు పెంచుకొనుట అందముగా, కడుపు
నింపుకొనుట పురుషార్థముగా, కుటుంబపోషణే ఘనకార్యముగా, కీర్తిని కోరుకొనుటే ధర్మాచరణగా
పరిగణిస్తారు.
"కలౌ వేంకటనాయకః" అంటే కలియుగానికి శ్రీవేంకటేశ్వరస్వామియే భగవంతుడు. విషయం ఎంత అక్షరసత్యమో మనకు తెలియంది కాదు.
"సంఘేశక్తిః కలియుగౌ" అంటే కలియుగంలో సంఘ శక్తిదే కాలం."
ఇదండీ మన ఋషులు చెప్పిన కొన్ని లక్షణాలు.ఇంకా చాలా ఉన్నాయి. కాని మన ఋషుల మంచితనం,దీర్ఘదృష్టి గురించి చెప్పడానికి వ్రాసిన టపా కాబట్టి అన్నీ వ్రాయడం లేదు. ఇవన్నీ నిజాలు కావడం మనము గమనిస్తూనే ఉన్నాము కదా.

Tuesday, February 3, 2009

ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?

ఋషి అంటే గడ్డం పెంచుకొని ,ముక్కు మూసుకొని కొండకోనల్లో తపస్సు చేసుకొనేవాడు అనే భ్రమను మన విద్యావ్యవస్థ, మన కుహనా లౌకికవాదులు మన బుర్రల్లోకి బాగా ఎక్కించారు.అందులో చాలాభాగం సఫలం అయ్యారు.అది ప్రమాదకరమైన భ్రమ. అది తొలగించడం అంత సులభం కాదు.
మానవజీవితంలోని ప్రతి అంశం గురించి భారతీయ ఋషులు,మునులు చేసినంత అధ్యయనం,పరిశోధన,పరిశ్రమ మరెవ్వరూ చేయలేదు.ఇది సత్యం.
ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలినవాడు.ఇతర విషయాలు అతనికి తెలియదు. పరిశోధనయే అతని లక్ష్యము.ప్రాపంచిక విషయాలు అతనికి తెలియదు. అంతటి దీక్ష అతడిది.అదే అతని తపస్సు.
అతనిని ఎవరూ నియమించలేదు. ఎవరూ జీతభత్యాలు ఇవ్వలేదు.స్వచ్ఛందముగా పరిశోధనకు పూనుకొన్నవాడు.
ఋషి కోరిందేమీ లేదు.కేవలం జగత్కల్యాణం, మానవజీవితం సుఖమయం,శాంతిమయం కావడం ఒక్కటే ఋషి ఆశయం.
ఇదీ అతని లక్ష్యం.ఈరోజు మనం మాత్రం జీవిస్తున్నామంటే కారణం మహర్షుల కృషి,తపస్సే కారణం.
పాశ్చాత్యుల భాషలో శాస్త్రవేత్త అంటే జీతగాడు,వ్యాపారి. వారు కనుగొంటున్న,కనుగొన్న వాటి వలన కల్గుతున్న సుఖం తక్కువ.దుఃఖమే ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు.
ఋషులు తమ తపస్సు ద్వారా కనుగొన్న విషయాలు మనిషి సుఖజీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో శాంతియుత జీవితానికి కూడా అలానే ఉపయోగపడతాయి.ఇక్కడే మర్మము ఉంది. నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలతో మనం సుఖ(Luxury)జీవితం గడపగలుగుతున్నాము కానీ శాంతియుతజీవితం గడపడంలేదన్న విషయం మనకు తెలుసు.
ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కనుగొన్నారా అంటే కాదనే అనాలి. పరమాణువు(కణము)ను కనుగొన్న కణాదుడు, గణితములో సంచలనాలు సృష్టించిన భాస్కరాచార్యుడు,ఆర్యభటుడు మరియు శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు,వైద్యశాస్త్రవేత్త చరకుడు , వైమానికశాస్త్రం రచించిన మహర్షి భరధ్వాజుడు వీరు కూడా ఋషులే అన్న విషయం మరిచిపోరాదు.వీరు ఆధ్యాత్మికముగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధించినవారు.

ఇప్పటికైనా మనం ఋషుల గొప్పతనం గ్రహించి, వారి మీద గల దురభిప్రాయాలను తొలగించుకోవడం సమాజానికి చాలా మంచిది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు