తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, April 10, 2009

బ్లాగుల వాతావరణాన్ని బాగుచేయడానికి ప్రయత్నిద్దాం.ఏమంటారు?

ఈ మధ్య బ్లాగులలో తీవ్రమైన మాటల యుద్ధాలు, సవాల్లు-ప్రతి సవాల్లు చాలా తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. బ్లాగుల వాతావరణం ఇలాంటి ధూళిమేఘాలతో కలుషితమవుతోంది. సీనియర్ బ్లాగర్లు, జూనియర్ బ్లాగర్లు, మహిళా బ్లాగర్లు అంటూ ఏవేవో పదాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పదాలే మన మధ్య లేనిపోని అహాలు(ego), ఎక్కువతక్కువలను సృష్టిస్తున్నాయని అభిప్రాయపడుతున్నాను.

ఎప్పుడైతే మన వ్యక్తిగత అభిప్రాయాన్ని సామూహిక అభిప్రాయముగా సామాన్యీకరణ(Generalization) చేయాలని ప్రయత్నిస్తామో అప్పుడే గొడవలు ప్రారంభమవుతాయి. బ్లాగు అనేది వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకొనే వేదిక, సమాచారాలు ఇచ్చిపుచ్చుకొనే మాధ్యమము అని అనుకొంటున్నాను.

మన బ్లాగుల ప్రథమలక్ష్యము అంతర్జాలములో "తెలుగు వైభవము" అనుకొంటున్నాను. కాని ఈ లక్ష్యము ఉన్నదని ఇప్పుడు కొత్తగా బ్లాగులు వ్రాయడం మొదలుపెడుతున్న వారికి ఎంతమందికి తెలుసు? అసలు ఇలాంటి లక్ష్యము అంటూ ఒకటుందని వారికి తెలుసా? అలా తెలియకపోతే అది వారి తప్పిదము కాదు. సంవత్సరాలుగా బ్లాగులు వ్రాస్తున్న మనది.

ఈ మధ్య నిజముగా జరిగిన ఒక సంఘటన ఒకటి చెప్తాను. 10 రోజుల క్రితం నా స్నేహితుడికి కంప్యూటర్లో తెలుగు వ్రాయవచ్చని, తెలుగులో ఉత్తరాలు పంపుకోవచ్చని , తెలుగులో మన విషయాలు వ్రాసుకోవచ్చని చెప్తే అతను నమ్మలేదు. ఆ అబ్బాయి 10వ తరగతి వరకే చదువుకొన్నాడు. వాడికి కంప్యూటర్ గురించి కొద్దిగా జ్ఞానం ఉంది. సరే అని ఇంటర్నెట్ సెంటరుకు వెళ్ళి మన బ్లాగులు చూపించాను. కాని దురదృష్టము ఏమంటే అతను బ్లాగులలో మన వాగ్వివాదాలు కూడా చూసాడు. అప్పుడు వాడు నాతో అన్న మాట "ఏరా స్వామీ! ఇదేదో బాగుందే. మనకు కోపం వస్తే మొహాన కాకుండా ఇలా వ్రాసుకొంటూ తిట్టుకోవచ్చు" అన్నాడు. వాడు తెలుసుకొన్న నీతి ఇది.
తర్వాత ఒక వారం రోజులు వాడికి కంప్యూటర్లో తెలుగు ఎలా ఉపయోగించవచ్చో నేర్పించాను. త్వరలో వాడు కూడా ఒక బ్లాగు వ్రాయాలని అనుకొంటున్నాడు. అది వేరే సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే కొత్తగా బ్లాగులు వ్రాస్తున్నవారు,వ్రాయాలనుకొంటున్నవారు ఇలాంటి వాగ్వివాదాలు,అసభ్యకర వ్యాఖ్యలు చూస్తే ఏమనుకొంటారు?

ఒకరిపై కోపం ఉంటే ఆ వ్యక్తి ఉన్న వ్యవస్థపైనే లేక వర్గంపైనే శత్రుత్వం పెంచుకోవడం సమంజసం కాదు. ఉదాహరణకు ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడజాతి పైనే కక్ష్య పెంచుకోవడం, ఎవరో కొందరు అబ్బాయిలు అసభ్యముగా ప్రవర్తిస్తున్నారని మగవారంటేనే అసహ్యం పెంచుకోవడం లాంటివి. ఇలాంటివి బ్లాగులలో చాలా కనపడుతున్నాయి.ఇలా చేయడం వలన ఎదుటివారికి వచ్చే నష్టమంటూ చాలాచాలా తక్కువ. ఇలా చేసేవారికే మానసికముగా బాధలు, మానసిక వ్యాధులు ఎక్కువై తద్వారా ఆరోగ్యాలు చెడిపోవడం వంటి పరిణామాలు జరుగుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.

చివరగా నేను చెప్పదలుచుకొన్నదేమంటే బ్లాగులలో అసభ్యకర టపాలు, అసభ్య వ్యాఖ్యలు వ్రాయడం, ఒకరి బ్లాగుకే పోటీగా ఇంకో బ్లాగు మొదలుపెట్టడం లాంటివి మానుకొందాం.
చర్చించుకొందాం కాని వాదనలు,వ్యక్తిగత విమర్శలు వద్దు.


Tuesday, April 7, 2009

ఓ హనుమంతుడా! నిన్ను మేమెందుకు కొలవాలి?


ఓ హనుమా!
రామ భక్తుడైనందుకా,
సీతమ్మజాడను కనుగొన్నందుకా,
లంకను కాల్చివేసినందుకా,
లేక శివాంశుడైనందుకా,
లేక భూతప్రేతాలను దరికి చేరనీయనందుకా,
లేక సూర్యున్నే మింగబోయనందుకా నిన్ను కొలవడం?

కావు,కావు ఇవి అసలు కారణాలు

మడమ తిప్పని నీ సంకల్పం మాకు ఆదర్శం,
అంతులేని నీ ఆత్మవిశ్వాసం మాకు ఆదర్శం,
ప్రపంచాన్ని ఢీ కొట్టగల నీ ధైర్యం మాకు స్పూర్తి,
అనితర సాధ్యమైన నీ కార్యతత్పరత మాకు స్పూర్తి,
పరస్త్రీలను మాతృమూర్తులుగా చూడడం మాకు కావాలి ఆదర్శం,
నీ ఇనుపకండలు,ఉక్కునరాలు కావాలి నేటి యువవృద్ధులకు,
మీ సమాచారనైపుణ్యం నేటి లోకానికి అత్యవసరం.


ఎన్నని చెప్పాలి కారణాలు నిన్ను కొలవడానికి
ఓ ఆంజనేయా నీవే కావాలి ఆదర్శం నేటి లోకానికి,
ప్రతి మనిషి కావాలి నీ అంశ.

జయము జయము ఓ హనుమంతుడా!
ఇవే నీకు మా నమస్సుమాంజలులు.
Monday, April 6, 2009

బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర, ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది,తప్పదు

ఈ మధ్య ఎక్కడ చూసినా కులాల రాజ్యాధికారం గురించే చర్చ. మన బ్లాగులలో కూడా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.
సరే సూటిగా నేను చెప్పదలుచుకొన్న విషయానికి వస్తాను.
తమకు ఈ కాలములో సరైన గౌరవం లేదని మరియు అవమానాలు కలుగుతున్నాయని బ్రాహ్మణులు,క్షత్రియులు , తమకు సరైన గుర్తింపు లేదని వైశ్యులు మరియు తమపై వివక్ష కొనసాగుతూనే ఉందని దళితులు బాధపడుతున్నారు.
చరిత్ర యొక్క, కాలానుగుణ ధర్మం యొక్క రహస్యాన్ని విశ్లేషించి తెలుసుకొంటే పైన పేర్కొన్న అందరూ తాత్కాలిక ఆవేశాలకు,అశాంతికి లోనవుతున్నారని అనకతప్పదు.

చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది.

మానవ సమాజం ఆరంభమైన మొదట్లో శారీరకముగా బలవంతుడైన వాడిదే ఆధిపత్యముగా ఉండేది. ఎప్పుడైతే మనిషికి ప్రకృతిశక్తులను అంటే అగ్నిని, మెరుపులను, వానలను మొదలగువాటిని మొదటిసారిగా చూసాడో వాటి గురించి సరైన జ్ఞానం లేక భయపడ్డాడు. ఈ కారణం చేతనే సమాజములో దేవుడు, దుష్టశక్తులు, అతీంద్రియశక్తులు మొదలగు భావాలు ఏర్పడడం మొదలు అయ్యాయి. అప్పటికి ఇంకా కులాలు ఏర్పడకపోవడం వలన ఈ ప్రకృతిశక్తులు మొదలగువాటిని కొద్దిగానైనా అర్థం చేసుకొన్నవారు ఒక వర్గముగా తయారైనారు. వీరికి కూడా పూర్తిజ్ఞానం లేకపోవడం వలన ప్రకృతిశక్తులను శాంతపరచడం మొదలగు విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. వీరినే పురోహితవర్గం లేక బ్రాహ్మణ వర్గం అని అంటారు. ఆ కాలములో వీరే కొద్దిగా జ్ఞానవంతులు కావడం చేత అందరూ వీరి ఆజ్ఞలనే పాటించడం జరిగేది. అలా సమాజములో మొదట ఆధిపత్యాన్ని అంటే ప్రజలను శాసించేవారిగా తయారైనారు, ఈ విధంగా మొదట రాజ్యాధికారం మొదట బ్రాహ్మణుల చేతిలో ఉండేది.


తర్వాత కాలములో వివిధ ప్రదేశాలలోని ప్రజల మధ్య ఆధిపత్యం కొరకు ఒకరిపై ఒకరికి పోరాటాలు జరగడం వలన శారీరకముగా బలవంతులైన వారి అవసరం ఏర్పడింది. బ్రాహ్మణులు శారీరకముగా అంత బలవంతులు కాకపోవడం వలన ఇక్కడ వారి ఆధిపత్యము ఫలించలేదు. అప్పుడే బలవంతులైన క్షత్రియ వర్గం తయారైంది. వీరే జనసమూహాలను రక్షించగలవారయ్యారు. ఇక తప్పనిసరిగా అధికారం వారి చేతులలోనికి వెళ్ళిపోయింది. అలా క్షత్రియుల రాజ్యాధికారం మొదలైంది.


ఇక సమాజములో డబ్బు యొక్క అనగా సంపద యొక్క ప్రాముఖ్యత పెరగడం మొదలైన తర్వాత బ్రాహ్మణులు కాని,క్షత్రియులు కాని మరియు కాయకష్టం చేసుకొని బ్రతికే శూద్రవర్గం కాని ఆ ధనసంపాదన చేసే వారిపై ఆధారపడడం మొదలైంది. ఇలా ధనసంపాదన చేసేవారినే వైశ్యులు అంటారని మనకు తెలుసు. మనదేశములో కూడా మొదట ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తమే వచ్చారని మనము మరిచిపోకూడదు. ఇలా సమాజములో ఆధిపత్యము ధనసంపాదన చేసేవారివైపుకు వెళ్ళిపోయింది. ఈ సమయములో వైశ్యుల ఆధిపత్యము విపరీతముగా పెరిగిపోయింది. అలా వారే సమాజాన్ని శాసించేవారిగా తయారయ్యారు.

పై మూడు వర్గాల కాలం గడిచిపోయింది.


ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఎవరైతే కష్టపడతారో వారిదే అధికారం. ప్రాచీన పరిభాషలో చెప్పాలంటే కాయకష్టము చేసుకొని,శారీరకముగా అధికముగా కష్టపడేవారు శూద్రులు లేక దళితులు. ఇప్పుడు శ్రామికుడిదే రాజ్యం. ఆంగ్ల ప్రభుత్వం ప్రపంచమంతటా విస్తరించడానికి కారణం వారి దేశములో సంభవించిన "పారిశ్రామిక విప్లవమే" కారణం. కార్మికులు లేక శ్రామికులు లేకపోతే సమాజానికి మనుగడే లేదు. కాబట్టి ప్రస్తుత కాలములో లేక సమీపకాలములో సృష్టి ధర్మాన్ని అనుసరించి శూద్రులు లేక దళితులదే ఖచ్చితముగా రాజ్యము అవుతుంది. కాబట్టి ఒక వర్గముపై ఒకరు దుమ్మెత్తిపోసుకోకుండా,బాధపడకుండా ఉండడమే శ్రేయస్కరము. సహజముగా ఒక వర్గము ఆధిపత్యము ఉన్నప్పుడు మిగతా వర్గాలు దాని క్రిందే ఉండడము ప్రకృతి ధర్మము. దానికి బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఈ ఆధిపత్యచక్రము లో ఇప్పుడు రావలసింది శూద్రులు లేక దళితులు మాత్రమే, మిగతా వర్గాల వారికి ఆ అవకాశం వచ్చి వెళ్ళిపోయింది. కాలధర్మం ప్రకారం ఇప్పుడు వీరికి రాదు. దళితులకే వస్తుంది.
ఇలా చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది.

గమనిక: ఇక్కడ నేను నాలుగు వర్ణాలను మొత్తం ప్రపంచానికే వర్తింపజేసాను. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు. లేక హిందూమతానికి మాత్రమే కాదు. ఎందుకంటే పేర్లు వేరైనా ప్రపంచము మొత్తం మీద వర్గాలు ఇవే ఉన్నాయి.

ఈ టపాలోని విషయాలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
ఈ టపా కేవలము అధికార బదలాయింపు ఎలా జరుగుతోందో తెలుపడానికి మాత్రమే. కులాలు ఎలా పుట్టాయి మొదలగువాటి కొరకు ఉద్దేశింపబడలేదు.
అలానే శూద్రులు అనే పదమును సౌలభ్యము కొరకు మాత్రమే వాడాను. ఎవరినీ కించపరచడానికి కాదు.


Friday, April 3, 2009

కర్ణాటక ప్రభుత్వం వారి కొత్త కన్నడ నిబంధన

ఈ నిబంధన ఏమిటంటే వాహనదారులు ఖచ్చితముగా తమ వాహనపు నమోదుసంఖ్యను (Regestration Number ) వాహనానికి ఏదో ఒకవైపున (అంటే ముందుగాని లేక వెనుక గాని) ఖచ్చితముగా కన్నడలో వ్రాయాలి.

ఉదాహరణకు KA 12 A 3456 అనే సంఖ్యను ఖచ్చితముగా కెఎ ౧౨౩౪౫౬ అని ఖచ్చితముగా ఒక వైపు వ్రాయాలి.

మొన్నామధ్య ద్విచక్రవాహనములో వెళ్తుంటే ఈ నిబంధనను ఇక్కడి రక్షకభటులు తెల్పారు. అలా వ్రాయనందుకు మొదటితప్పుగా 100 రూపాయలు జరిమానా కూడా విధించారనుకోండి అది వేరే సంగతి.
శ్రీ రామనవమి శుభాకాంక్షలురామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

అందరి జీవితాలలోనూ సీతారాముడు సుఖసంతోషాలను కలిగించాలని కోరుకొంటూ

సురేష్ బాబు
Wednesday, April 1, 2009

పదండి ముందుకు! పదండి తోసుకు! పోదాం, పోదాం, పైపైకి!

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదయాంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడవునా గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీనదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?
పదండి ముందుకు,
పదండి తోసుకు,
పోదాం, పోదాం పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
''హరోం! హరోం హర!
హర! హర! హర! హర! హర!
హరోం హరా!'' అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావవేగమున ప్రసరించండి!
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు,
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణమండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసల కాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
మరో ప్రపంచపు కంచునగారా
విరామమెరుగక మోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,

-శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి
హోమజ్వాలల భుగభుగలు?

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు