తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, May 31, 2012

ఆంజనేయుడొక్కడే ఇలా అర్థం చేసుకోగలడేమో (ఆంజనేయుని అత్యద్భుత జ్ఞానం)

క్రింద ఉదహరించు సంఘటన లంకలో సీతతో రాముని నిందిస్తూ రావణుడు పలికిన మాటలు:

'
'అతల్పం నిద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''

అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు (అంటే పొగడబడేందుకు అర్హుడు కాదు) - అని రావణుడు చెప్పగా

సీతాదేవి ఇలా బదులు చెప్పింది.

'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''

ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.

ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.

ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక  పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారందుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.

''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్
)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది

''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు. 
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం. 

అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం 
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"

Wednesday, May 30, 2012

ఫలితం కోసం వేచిచూసేవాడిని ఫలితం తెలిసికూడా చెప్పకుండా టెన్షన్ పెట్టడం ఒక పైశాచికానందమే!

TV లలో వచ్చే Reality show లలో పోటీదారులను చూస్తుంటే అయ్యోపాపం అనిపిస్తోంది. వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి ఫలితం కోసం వేచిచూస్తుంటారు. కాని వ్యాఖ్యాత లేక న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు ఫలితము వాళ్ళ చేతులలో ఉంచుకొని పోటీదారులకు చెప్పకుండా వాళ్ళను Tension పెడుతుంటారు.

చూసే ప్రేక్షకులకే చాలా Tension ఉంటుంది. అలాంటిది నిజంగా పోటీలో పాల్గొన్నవారికి ఇంకెంత ఉంటుందో కదా పాపం. వారు ఏడుస్తారు. విసుగుతో (Frustration) తో పక్కవారిని ఈర్ష్యా,అసూయలతో చూస్తుంటారు, బాధపడుతుంటారు. ఇవన్నీ చూస్తూ వ్యాఖ్యాతలు మరియు న్యాయనిర్ణేతలు ఎంతో సంతోషంతో ఇంకా రెచ్చగొడుతుంటారు. పోటీదారుల బాధలలో వీరు ఆనందాన్ని వెదుక్కుంటూంటారు. ఇవన్నీ మనం చూస్తూ Tension పడుతూ ,అయ్యో పాపం అనుకొంటూ తిట్టుకొంటూ ఉంటాము.

వ్యాఖ్యాతల సంగతి సరి, మరి న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు కొద్దోగొప్పో పేరు సంపాదించుకొన్నవారే కదా! వారి బుద్ధి ఏమైంది? వయసుతో పాటు వివేకం సంగతి దేవుడెరుగు, వారికి శాడిజం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.

హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేచిచూస్తున్న వానరవీరులను ఏం Tension పెట్టలేదే. వానరుల దృష్టిలో పడగానే "దృష్ట్వాతు సీతా" (చూసాను సీతను) అన్నాడు కదా. "సీతను చూసాను" అని కూడా అనలేదు, అలా అంటే మొదట సీత పేరు చెబితే సీతమ్మకు ఏమయ్యిందో, చూసాడో లేదో అనే సందేహాలు వస్తాయని మొదటే "చూసాను" అనే పాజిటివ్ మాట అన్నాడు.

మనము హనుమంతునితో మనలను పోల్చుకోనవసరం లేదు, కనీసం అతని ఆచరణ ను తెల్సుకొని మనలను మనం దిద్దుకొంటే చాలు కదా.

కొసమెరుపు:
అసలు TV చూడకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కాని ఇలాంటి కార్యక్రమాలు చూడడం వలన ఇలా మనం మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకోవచ్చేమో. ఇలాంటి భావంతో చూస్తే ఏ తలనొప్పీ ఉండదనుకొంటాను.

Friday, May 25, 2012

ఏమిటయ్యా వేంకటేశు...

ఏమిటయ్యా వేంకటేశు...

అప్పుడెప్పుడో.. ఒక సోమరి ఏనుగు కాలికి దెబ్బతగిలితేనే... ఇంటి దగ్గరినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రక్షించావే..

ఆ తరువాత... ఒక వెర్రి పిల్లాడు... పొరపాటున ఒక పిచ్చి రాయిలో నువ్వున్నావని అంటే.. ఏకంగా ఒక అవతారాన్నే చూపించావే...

మరోసారి.. ఒక చాదస్తపు వృద్దురాలు... ఎంగిలి పండ్లిస్తే.. మొహమాటం కూడా లేకుండా తిన్నావే....

మొన్నటికి మొన్న... పాత స్నేహితుడు పలకరింపుకు వచ్చి అటుకులిస్తే... అష్ట ఐశ్వార్యలిచ్చి సత్కరించావే...

మరి నేనిప్పుడు.. అంతులేని కష్టాల్లో, అయోమయమైన రాగద్వేషాల్లో కొట్టుకుంటుంటే కరుణించవేమయ్యా....  ఇంత మొండివాడివేమయ్య .. 




--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత

Wednesday, May 9, 2012

ఈ మధ్య నేను చూసిన మంచి సినిమా "Two brothers"

నా స్నేహితుడు ఉదయ్ చెప్పగా 2004 సంవత్సరం లో విడుదలైన Two brothers అనే పులుల కు సంబంధించిన సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రేమాభిమానాలు, మాతృప్రేమ అనేవి సర్వవ్యాపకమని పులుల ద్వారా దర్శకుడు బాగా చెప్పగలిగాడు.

తల్లి పులి, దాని ఇద్దరు బిడ్డలైన రెండు పిల్లలు మానవ స్వార్థం వలన విడిపోవడం తర్వాత ఎన్నో కష్టాలు పడడం చివరికి మూడూ కలవడం ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా పులులు మధ్య భావోద్వేగాలను దర్శకుడు చాలా బాగా చూపించాడు. కొన్ని దృశ్యాలలో మనము కూడా ఆ భావోద్వేగంలో లీనమైపోతాము. అంతబాగా తీశారు.
సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తూ తీశిన ఈ ఆంగ్ల చిత్రం చాలా కదిలించింది.

మన తెలుగు మూసచిత్రాలకు భిన్నంగా మంచి సినిమా చూడాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది.

ఈ చిత్రం ఫ్రెంచ్ నుండి ఆంగ్లానికి అనువదించినట్లు ఉంది.


Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు