తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, May 24, 2010

శృంగార రసాన్ని మనసుకు హత్తుకొనేలా తిక్కన గారి లాగా ఎందరు వర్ణించగలరు?


మహాభారతములో తిక్కన గారు ఒకచోట ఒక పద్యాన్నివ్రాశాడు. పద్యం ఏంటో, పర్వం లోనిదో గుర్తులేదు.

పద్య అర్థం ఏంటంటే

" సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు తనస్థానానికి చేరాక ఆకాశం అనే పందిరి మంచం పై సంధ్యసాయం సంధ్య ) అనే కన్య తన ఎరుపెక్కిన బుగ్గలతో
( నక్షత్రాలు అనే పూలు చల్లుతుంది. తర్వాత ప్రొద్దున కూడాసిగ్గుతో ఎరుపెక్కిన మొహంతో ఎవరైనా చూస్తారేమోనని తననాథుడైన సూర్యుడు లేస్తుండగానే (ఉదయిస్తుండగానే) నక్షత్రాలు అనే పూలను పందిరిమంచం (ఆకాశం) పై నుండితొలగించివేస్తుంది."

సాయంకాలము, ఉదయము సమయాలలో దిక్కు ఎరుపెక్కడాన్ని ఎంత బాగా తీసుకొన్నాడో కదా.
అసభ్యత అనే దుర్గంధం సోకని శృంగారరస వర్ణన ఎంత బాగుందో కదా!

Sunday, May 23, 2010

మీ చేయి ఆగినా మీ పాట అమరం - వేటూరి సుందర్రామూర్తి గారికి నివాళి


కనికరం లేని కాలం, నియమాలపై నడిచే కాలం,

మీకై తన నిబంధనలను సడలించుకోరాదా,

ఓ కాలమా ఒక చేయిని ఆపగలిగావేమో కానీ,

ఆ సాహిత్య మధురిమను కాదు,

నీలో ఉన్న నవరసాలు తనలో కూడా ఉన్నాయని ఈర్ష్యపడ్డావో ఏమో,

తనను మాకు దూరం చేసావు, అంతే నీవు చేయగలిగింది ,

తన నాదోపాసనను ఎంత మాత్రం కాదు


ఆ మహోన్నత వ్యక్తికి ఆశ్రునివాళి .
తెలుగు ఉన్నంత కాలం మీరు ఉంటారు.

Friday, May 21, 2010

రామేశ్వరుడు అనే పదానికి అసలు అర్థం ఏంటి? (ఒక సరదా కథ)


రామేశ్వరం లో ఉన్న దేవుడిని (శివలింగాన్ని) రామేశ్వరుడు అంటారని అందరికీ తెలుసు. అసలు ఈ పదానికి అర్థం ఏంటి అని ఒకసారి దేవతలకు సందేహం వచ్చింది.

పరమశివుడి వద్దకు వెళ్ళి అర్థం అడిగారు.
అప్పుడు ఈశ్వరుడన్నాడు " రామేశ్వరుడు అంటే రాముడిని ఈశ్వరుడిగా గలవాడు అంటే రాముడిని భగవంతుడిగా గలవాడు" అని. అంటే అర్థం శివుడికి దైవం రాముడు అని. దేవతలు సరేనంటూ వెళ్ళిపోయారు.

కాని వారికి ఎందుకో సందేహం వీడక శ్రీమహావిష్ణువుని అడిగారు.

అప్పుడు విష్ణువు అన్నాడు " రాముడికి ఈశ్వరుడు ఐనవాడు" అని. అంటే రాముడు భగవంతుడిగా కొలిచేవాడు రామేశ్వరుడు (రాముడికి దైవం శివుడు) అని.
దేవతలు పూర్తి గందరగోళంలో పడ్డారు.

సరేననుకుంటూ చతుర్ముఖ బ్రహ్మ గారిని అడిగారు.
అప్పుడు ఆయన అన్నారు " శివకేశవులిద్దరూ అలానే మాట్లాడతారు. కాని అసలు అర్థం అదికాదు "రాముడే ఈశ్వరుడైన వాడు" అని అసలు అర్థం. అంటే వారిరువురూ ఒకటే. ఒకే భగవంతుడు వారిద్దరిగా ఉన్నాడు అని అర్థం ". అప్పుడు దేవతలకు విషయం పూర్తిగా అర్థమై సందేహం తీరిపోయింది.

ఈ కథ ఎందులోనిదో తెలియదు. విన్నది అంతే.

Tuesday, May 18, 2010

ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు సరే,ఐతే మనకు ప్రయోజనం ఏంటి ?


"విజయం సాధించటం ఎలా?", "విజయానికి ఇన్ని మెట్లు" లాంటి పుస్తకాలు కోకొల్లలు. సరే.
కానీ మన ఆదికావ్యమైన రామాయణమును తరచిచూస్తే ఇలాంటి విషయాలు ఇందులో ఉన్నాయా అన్న ఆశ్చర్యం కలుగక మానదు.

సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటడం లో , ఒక పని సాధించాలనుకొనేవారికి ఆ పనిని ఎలా సాధించాలో, మనకు నేర్పిస్తుండడం మనము గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

సముద్రాన్ని దాటడం సాధించాల్సిన పని. ఆంజనేయుడు తనకు సాధ్యము కాదని ఊరికే ఒకవైపు అమాయకముగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని శక్తిని హనుమంతునికి గుర్తుచేసాడు. ఇక్కడ ఒక పని సాధించాలి అనుకొనేవాడు మొదట తన శక్తిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని పక్షంలో పని కావడానికి ప్రోత్సహించే మిత్రుడి లేదా శ్రేయోభిలాషి అవసరం ఎంతైనా ఉంది. అంటే మనకు ఎలాంటి మిత్రుల అవసరం అనే విషయములో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి.

హనుమ బయలు దేరుతూ రామబాణం లా దూసుకెళ్ళి పనిని సాధిస్తానని ప్రకటించాడు. అంటే నాదేమీ లేదు భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా ఉంటాను అనే భావము కలిగిఉండాలి. అంటే అహంకారము ఉండరాదు అని నేర్పుతున్నాడు.

ఇక సముద్రాన్ని దాటేప్పుడు మొదట బంగారు శిఖరాలు గల మైనాకపర్వతం ఆతిథ్యం తీసుకొమ్మని కోరింది. కాని హనుమంతుడు అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ "మీకు ఎన్నో కృతజ్ఞతలు. కాని అత్యవసరమైన పని మీద వెడుతున్నాను. ఆలశ్యం చేయడం నాకు తగదు.పని ఐన తర్వాత మళ్ళీ కలుస్తాను" అంటూ ఒకసారి ఆ కొండను ముట్టుకొని "నీవు ఆతిథ్యం ఇచ్చినట్లే" అంటూ సెలవు పుచ్చుకొన్నాడు.
అంటే కార్యసాధనలో అలసత్వం పనికిరాదు అని, అదెటువంటి ఆకర్షణ ఐనా లొంగరాదని, అదే సమయములో ఎదుటివారు ప్రేమతో మనకు ఆతిథ్యం ఇస్తామన్నప్పుడు వారిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి, నడుచుకోవాలి అనే విషయం మనకు నేర్పుతున్నాడు.

ఇక తర్వాత సురస అనే నాగమాత నిన్ను ఆహారంగా తింటానని హనుమతో అనగా చాలా చిన్నగా మారిపోయి ఆమె నోట్లోకి దూరి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాడు.
ఇక్కడ "అనువుగాని చోట అధికులమనరాదు" అని, ఎంత పెద్ద సమస్య ఐనా సూక్ష్మబుద్ధితో ఆలోచించి దానిని ఎలా సామరస్యముగా పరిష్కరించుకోవాలి అని, అది మన పనికి ఆటంకము కాకుండా ఎలా చూసుకోవాలి అని, కండబలమే కాదు బుద్ధిబలము కూడా అత్యవసరము అని మనకు నేర్పుతున్నాడు.

తర్వాత సింహిక అనే రాక్షసి హనుమంతుని తినబోగా ఆమె కడుపులోనికి దూరి ఆమె లోపలి అంగాలను పిండి చేసి ఆమెను చంపేసాడు.
ఇక్కడ మన కార్యసాధనలో మనం భరించలేని,తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు ఆ సమస్య యొక్క మూలాన్ని కనుగొని మూలాన్ని కనుక దెబ్బతీస్తే పునాదులు లేని భవనములా ఆ సమస్య కూడా కూలిపోతుంది అంటే పరిష్కారమవుతుంది అని నేర్పుతున్నాడు. అదే సమయములో సమస్య మూలాన్ని అన్వేషించేటప్పుడు ఆ సమస్య మనలను ముంచేయకుండా ఎంత అప్రమత్తముగా ఉండాలి అని కూడా నేర్పుతున్నాడు.ఇంతకు
మునుపు సమస్యను కేవలం బుద్ధిబలముతో పరిష్కరించాడు. కాని ఇప్పుడు బుద్ధిబలముతో పాటు సాహసాన్ని కూడా కల్గి ఉండాలని నేర్పుతున్నాడు.

తర్వాత ఇక ఏ బాధా లేకుండా సముద్రాన్ని దాటాడు.

ఇదండీ నాకు అర్థమైన హనుమంతుడి సముద్ర లంఘనం.

ఇంకా సీతమ్మను వెతకడం లో కూడా మనం తెలుసుకోవల్సింది ఎంతో ఉంది. కాని ప్రస్తుతానికి ఇలా ముగిస్తున్నాను.

ఆదిశంకారాచార్యులను స్మరించి నమస్కరిద్దాం


భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసురమర్ధిని స్తోత్రం, గణేషపంచరత్నం వంటి ఎన్నో స్తోత్రాలను మనకు అందించి అంతేకాక శ్రీభగవద్గీత లాంటి గ్రంధాలకు భాష్యములు వ్రాసి మనకు భక్తి,జ్ఞానమార్గాలను బోధించిన సాక్షాత్ కైలాస శంకరుడైన కాలడి శంకరులకు మనసా,వాచా,కర్మణా ప్రణామాలు అర్పిస్తూ అందరికీ ఆదిశంకరచార్యుల జయంతి శుభాకాంక్షలు.

M.S. సుబ్బులక్ష్మి గారి నోట అమృత సమానమైన కన్నడ పాట ( లక్ష్మిదేవి పాట)

సంగీతానికి భాషాభేధాలు లేవని, ఎవరినైనా ఆనందడోలికలలో ఊగిస్తుందని నిరూపించే క్రింది పాటను వినండి.
సుబ్బులక్ష్మి గారి నోటి ద్వారా మనకు అమృతం కురిపించిన పాట ఇది.

ఈ కీర్తన వ్రాసినవారు పురందరదాసు గారు.
మనకు అన్నమయ్య ఎలాంటివాడో కన్నడిగులకు పురందరదాసు గారు అలాంటివారు. అన్నమయ్య,పురందరదాసు గారు సమకాలికులు. కాకపోతే పురందరదాసు గారు అన్నమయ్య కంటే వయసులో చాలా పెద్దవారు.




Monday, May 17, 2010

గొప్పవారికీ, సామాన్యులకూ గల తేడా ఎక్కడ ఉంది?


ఇక్కడ గొప్పవారు అంటే డబ్బులో ధనవంతుల గూర్చి కాదు చెప్పబడుతున్నది, శీలము (character) లో గొప్పవారి గురించి.
రమణ మహర్షి జీవితములో జరిగిన చిన్న సంఘటన. ఒకసారి ఒక దుష్టుడి గూర్చి కొందరు భక్తులు మహర్షి సన్నిధిలో మాట్లాడుకుంటున్నారు. అతని దుష్టత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహర్షిగారు కలుగజేసుకొంటూ " మీరు దుష్టుడు అని చెప్పుకొంటున్నతడు ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేస్తాడటనే" అన్నారు.
ప్రొద్దున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేయడం ఎంత మంచిదో మనకు తెలుసు.
ఇక్కడ ఆ దుష్టుడిలోని చెడ్డగుణాలను పట్టించుకోకుండా ఉన్న ఒక్క మంచిగుణమును మాత్రమే శ్రీరమణులు గుర్తుపెట్టుకొన్నారు.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

తెలుగు భాష విశిష్టత - కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతుల వారి మాటలలో


తెలుగుభాషను గూర్చితెలుగులిపిని గూర్చి కొంత పరిశీలిద్దాం. ఈ రెంటిలోనూ కొన్ని విశేషా లున్నవి. పరాశక్తి యంత్రానికి తెలుగులిపి ఉపయోగింపబడ్డది. పరాశక్తి స్త్రీస్వరూపిణి. అమ్మవారికి వామావర్త పూజ ఏర్పడిఉన్నది. తెలుగులిపి కూడా వామావర్తమైనది. అనగా ఎడమప్రక్క చుట్టివ్రాయబడేది. తక్కినవి దక్షిణావర్తమైనవి. అనగా కుడిప్రక్కకు చుట్టివ్రాయబడేది. ఆవర్త మనగా చక్రం. తెలుగు వర్తులాకారలిపి, అందులోనూ వామావర్తం. వామావర్తపూజ లందుకొనే అమ్మ వారి యంత్రంలోనూ చక్రంలోనూ తెలుగులిపి వున్నది. అందుచే తెలుగులిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది. తెలుగుభాష శివప్రదానం. లిపి శక్తిస్వరూపం. భాష శివ స్వరూపం. వాగర్థాలు పార్వతీపరమేశ్వరులనికదా కాళిదాసు రఘువంశంలో అన్నాడు. తెలుగుభాష శివప్రధానమైన దని గుర్తించినది అప్పయదీక్షితులవారు. వారు పరమశివభక్తులు. దక్షిణాదిని, ఆరణి (తమిళనాడు) అనుఊరికి సమీపంలోఉన్న ఆడెయపాలెం వారు పుట్టినఊరు.దక్షిణ భారతాన శివోత్కృష్టత స్థాపించినవారు. ఈక్రిందిశ్లోకం చెప్పారు.

ఆంధ్రత్వ మాంధ్రభాషా చా ప్యాంధ్రదేశః స్వజన్మభూః,

తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్||

ఆంధ్రం త్రిలింగదేశం. దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినది. దక్షిణాన దక్షిణకాశి కాళహస్తిక్షేత్రం ఉన్నది. పడమట శ్రీశైలక్షేత్రమున్నూ, ఉత్తరమున కోటిలింగక్షేత్రమున్నూ ఎల్లలుగాకలది ఆంధ్రదేశం. అట్టి త్రిలింగదేశంలో తాను జన్మించలేదన్న విషయమూ ఆంధ్రభాష తన మాతృభాష కాకపోయినదే అన్నసంగతీ ఆయనకు కొరతయట. ఇవి రెండేకాక మరొక్క కొరతకూడా ఆయన కున్నదిట.

ఆంధ్రులు శైవులైనా సరే, వైష్ణవులైనాసరే, అక్షరాభ్యాస సమయంలో ''ఓం నమః శివాయ'' అని చదువు ప్రారంభిస్తారు. జన్మతారకమైన శివపంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈభాష నేర్చేవారికి ఏర్పడిఉన్నది. పంచాక్షరి, యజుర్వేదమధ్యంలో ఉన్నది. అంటే యజుర్వేదం శివసంబంధమైనది. దానికి తగినట్టు తెలుగువారిలో యజుఃశాఖేయులు ఎక్కువమంది
. అంటే యజుర్వేదం పఠించేవారు ఎక్కువ. సామశాఖీయులులేనేలేరు. ఋగ్వేదుల సంఖ్యకూడా తక్కువ. ఇట్లా సామశాఖేయులున్నూ పరమశివ భక్తులు అయిన అయ్యప్ప దీక్షితుల వారు శివసంబంధమైన తెలుగు దేశంలో జన్మించకపోతినే అని విచారపడేవారట. తెలుగుకు లిపి శక్తిస్వరూపమై, భాష శివస్వరూపమై ఎల్లలుత్రిలింగములై, వేదము యజుర్వేదమై ఒప్పుతుండడం ఒక విశేషం.

Friday, May 14, 2010

తర్పణం వదిలే నువ్వులు,నీళ్ళు మొదలగునవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి?

ఈ టపా కేవలం శ్రాద్ధకర్మలను నమ్మినా అసలు ఇది ఎలా సంభవం? అనే వారి కోసం మాత్రమే. దయచేసి నమ్మనివారు వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.

ఈ కర్మలలో నువ్వులు,నీళ్ళు మొదలగునవి వదులుతారు కదా? మరి అవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి అనే సందేహము వస్తుంది. బ్రతికిఉన్నవారికి ఏమైనా ఇస్తే వాళ్ళు పుచ్చుకొంటారు. మరి చనిపోయినవారికి ఎలా అందుతాయి?
ఒక చిన్నకథ ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు.

ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును మని యార్డరు చేయవలసినదని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి ఒక పల్లెవాడు,అమాయకుడు. డబ్బును తంతీ(Telegram) ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను'- అని అన్నాడు. 'నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?' అని అతని ప్రశ్న. 'ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా' అని అతడు టెలిగ్రాఫ్ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది.

మనం పితరులకూ(అంటే చనిపోయినవారికి), దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతాయి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ చనిపోయినవారు ఆసరికే ఎక్కడో జంతువులుగానో లేక మనుషులుగానో లేక మరే విధముగానో పుట్టిఉంటే వారికి ఆహారరూపములోనో లేక మరే ఉపయోగకరమైన వస్తువుల రూపముగానో వారికి చేరుతాయి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు భగవంతుడుఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు.

శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థము.
ఒక ఉత్తరం వ్రాసి దాన్ని పోష్టు చేయబోతూ " ఈ తపాలాపెట్టె (పోష్టుబాక్సు) అందముగాలేదు, నా వద్ద ఇంతకంటే మంచి పెట్టె ఉంది. అందులో వేస్తాను" అని అనుకొంటే ఆ ఉత్తరం చేరవలసిన వారికి చేరుతుందా? అందుచేత మనం ఏ పని చేయాలన్నా మనము సఫలము కావాలి అనుకొంటే వాటివాటి విధులను పాటించాలి. పెద్దలు అందులకే 'యథాశాస్త్రం, యథావిధి' అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.

మరోసారి మనవి చేసుకొంటున్నాను. దయచేసి నమ్మనివారు ఈ టపాను పట్టించుకోవద్దని, వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు