తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, September 11, 2014

ప్రపంచ చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత చాలా ఆనందం,అద్భుతం,ఆశ్చర్యం,బాధాకరం

సెప్టెంబరు 11,1893:

సరిగ్గా నేటికి 121 సంవత్సరాల క్రిందట చికాగోలో

స్వామివివేకానంద "అమెరికా సోదరసోదరీమణులారా!.."

అంటూ ఇచ్చిన ఉపన్యాసం సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టింది.

భారతదేశాన్ని ప్రపంచం ముందు తిరిగి తలెత్తుకొనేలా చేసింది మరియు

భవిష్యత్తుకై బాట వేసింది.సెప్టెంబరు11,2001:

నేటికి 13 సంవత్సరాల క్రింద ఉగ్రవాదుల దాడిలో న్యూయార్క్ లోని WTO ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి.


మొదటిది ధర్మస్థాపన కోసం నాంది అయితే రెండవది అధర్మానికి వేదిక

అయింది.మీరు సరిగా గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది.

అదేమంటే తేడా 108 సంవత్సరాలు. మన హిందూధర్మం లో 108 ప్రాముఖ్యత మీకు తెలిసిందే. దీనికై నా గత టపా

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? 


లోని మాటలు ఇక్కడ చూడండి.

1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరంసూర్యుని వ్యాసానికి 108 రెట్లు#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.

2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.

3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108

4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.

5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.

6.ఉపనిషత్తులు 108.

7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).

8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.

Monday, August 11, 2014

కాకతాళీయం లేక యాదృచ్చికం అయ్యుండచ్చు...కాని మాయగా కూడా అనిపిస్తాయి!


మన నిత్యజీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి సంఘటనలు యాదృచ్చికమో లేక కాకతాళీయమో అయ్యొండొచ్చు.కాని మనలను చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ఇలాంటి రెండు సంఘటనలు నా జీవితంలో జరిగినవి చెప్తాను.

ఈ మధ్యే అంటే 10 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన.

రాఘవేంద్రస్వామి వారి శ్లోకం

"పూజ్యా రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ|
 భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే|"

ఈ శ్లోకం నాకు వచ్చినప్పటికీ 10 రొజుల క్రిందట శ్లోకం లో మొదటిపాదం ఒకటే గుర్తుకువచ్చేది. రెండవ పాదం గుర్తుకు వచ్చేది కాదు. ఎక్కడా చదవకుండా, ఎవరితోనూ అడగకుండా రెండవ పాదం గుర్తుకుతెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసేవాడిని. 10 రోజుల క్రిందట బెంగళూరు లో సిటీ బస్సులో వెళ్ళేటప్పుడు గుర్తుతెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఎదురుగా ఒక అబ్బాయి(బహుశా భవననిర్మాణ కార్మికుడు అనుకొంటాను) చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఊగిపోతూ పాటలు వింటున్నాడు.అప్పుడప్పుడు hum చేసుకొంటున్నాడు. ఆ అబ్బాయి తెలుగు పాట వింటున్నాడని అర్థమైంది. ఆ అబ్బాయి ఎందుకో ఇయర్ ఫోన్స్ తీసివేశాడు. ఇంతలో నాకు అకస్మాత్తుగా రెండవపాదం గుర్తుకు వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఆ అబ్బయితో మీది ఏ ఊరు అన్నాను. ఆ అబ్బాయి "అన్నా మాది "మంత్రాలయం", అదే అన్నా రాఘవేంద్రస్వామి మఠం ఉన్న ఊరు " అన్నాడు.

ఈ సంఘటన యాదృచ్చికమే అయ్యుండచ్చు. కాని ఆ క్షణంలో నాకు మాయగా అనిపించింది.

ఇక రెండవ సంఘటన ఏమంటే నా బ్లాగు "లేవండి,మేల్కొనండి..." పేరు 2009 వ సంవత్సరం మొదటిదాక "సత్యమేవజయతే" అనే పేరుతో నడిపేవాడిని. ఒకరోజు రాత్రి అనుకోకుండా బ్లాగుపేరు మార్చేశాను. మరుసటిరోజే "సత్యం" రామలింగరాజు గారు తమ మోసం ఒప్పుకోవడం, "సత్యం" కంపెనీ తిరోగమనం మొదలైంది.

ఈ సంఘటన అత్యంత యాదృచ్చికం,కాకతాళీయం ఐనా నాకు మాత్రం వింతగా అనిపించింది.

ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా సంభవిస్తుంటాయి. అను భవించేవాడికి మాత్రం వింతగా,మాయగా,అద్బుతంగా అనిపిస్తాయి.

Monday, June 16, 2014

ఇకనైనా మారండయ్యా చులకన అయినది చాలు!


తరాలు మారినా మనకు మాత్రం సిగ్గు రావడం లేదు. ఎందుకండీ సాధువులారా! మీ సాధుత్వం? హాయిగా సంసారంలోకి రండి. రాగద్వేషాలు ఉన్నచోట సాధువుకీ సంసారికీ తేడా ఏముంది? సంసారి సంసారం కోసం కొట్టుకొంటున్నాడు, కొందరు సాధువులు పంతం కోసం కొట్టుకొంటున్నారు.

లేకుంటే ఏంటి ఇది..మొన్న భద్రాచలం లో సీతారాముల నిత్యకళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు "రామనారాయణ" అన్నారట...అలా అనకూడదని కొందరు సాధువులు గగ్గోలు పెట్టారట..
శ్రీరాముడి నామాలలో "రామనారాయణ" కూడా ఒకటి...అంటే నారాయణ స్వరూపమైన రాముడు అని అర్థం..ఇది కూడా తెలియని సాధువులా వీరు?

ప్రసిద్ది చెందిన క్రింది స్తోత్రం చూడండి:

అచ్యుతం కేశవం రామనారాయణం!!
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్!!
శ్రీధరం మాధవం గోపికావల్లభం!!
జానకీనాయకం రామచంద్రం భజే!!

అచ్యుతం కేశవం సత్యభామాధవం!!
మాధవం శ్రీధరం రాధికారాధితమ్!!
ఇందిరామందిరం చేతసా సుందరం!!
దేవకీనందనం నందజం సందధే!!


శివ కేశవుల భేధమే అంతరించిపోతున్న ఈ కాలంలో ఇంకా ఇలాంటి సంకుచిత భావాలతో ఇలాంటి వారు సనాతనధర్మానికి ఎంత ద్రోహం చేస్తున్నారో వీరికి తెలుస్తోందా?

ఇతర మతస్థులు మన ధర్మం గురించి తెలియక విమర్శిస్తే ఏమన్నా అనుకోవచ్చు, కాని మనవారే మనలనే కించపరుచుకుంటూ ఉంటే మనకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించరా? "

ఏకం సత్ విప్రా బహుదా వదంతి" (ఉన్నది ఒక్కటే, కాని అది పలురకాల పేర్లతో పిలువబడుతోంది) అన్న విషయం జీర్ణించుకుపోని సాధువులు ఎందుకు. సంసారులకు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు.కాని భగవంతుడి కోసం అని చెప్పుకుని సంసారాన్ని వదిలివేసి సాధువుల వేషం కట్టిన ఇలాంటి సాధువులు ఘోరమైన దుర్గతి పాలవుతారు.

గమనిక: ఈ పోస్ట్ కుహనా (Half minded) మరియు ఢాంభికులైన సాధువులను ఉద్దేశించి వ్రాసినది.

Monday, June 2, 2014

ఏంటండీ వెంకయ్యనాయుడు గారూ ఇది?


ఫేస్‌బుక్ లో ప్రాచుర్యం లో ఉన్న ఫోటో

Tuesday, April 8, 2014

రామ నామం అత్యంత శక్తివంతం అని ఎందుకంటారు ?


మన ఆనందం కానీ వేదాలు యే పురుషోత్తముని పరబ్రహ్మంగా స్తుతిస్తూ ఉన్నాయో ఆ శ్రీరాముడు జన్మించడం ఏమిటి... మనం వారి పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం ఏమిటి...నిజమే ఆ భగవంతుడే కౌసల్యా,దశరథుల పుత్రుడిగా ప్రజలకు ఆదర్శ జీవితం చూపించడానికి జన్మించాడు. ఇక రామాయణం అందరికీ తెలిసినదే...

రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.

అసలు రామనామం ఎందుకు అంత శక్తివంతం ఎందుకు...చాలా మందికి తెలుసు..కానీ తెలియని వారికోసం నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది చెప్తాను.

"రా" అనే అక్షరం అష్టాక్షరీ మంత్రం అయిన "ఓం నమో నారాయణాయ" నుండి, "మ" అనే అక్షరం పంచాక్షరీ మంత్రం అయిన "ఓం నమశ్శివాయ" నుండి వచ్చాయి.

ఈ రెండు అక్షరాలనే ఎందుకు తీసుకొన్నారు ? ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.

"రా" తీసివెస్తే "ఓం నమో నారాయణాయ" కాస్తా "ఓం నమో నాయణాయ" అవుతుంది. అసలు విరుద్దమైన అర్థం వస్తుంది. "నారాయణునకు నమస్కారం" అనే అర్థం బదులు "నడక లేక కదలిక లేని వాటికి అనగా అచైతన్యం(చైతన్యం లేనిది)కి నమస్కారం" అవుతుంది. ఆయణం అనగా నడక అని అర్థం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి.ఇక్కడ ఈ అర్థం తీసుకోబడింది.

ఇక "మ" ను తీసివేస్తే "ఓం నమశ్శివాయ" కాస్తా "ఓం నశ్శివాయ" అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్థం. "నశ్శివాయ" అనగా శివం కానిదానికి నమస్కారం అని అర్థం వస్తుంది.

చూసారుకదా రా,మ అనే పదాలు తీసివేస్తే ఎంత అర్థం మారిపోయిందో..అందుకే ఇవి బీజాక్షరాలు లేక ప్రాణాక్షరాలు అయ్యాయి.

అందుకే ఈ రెండింటినీ కలపడం ద్వారా వచ్చిన "రామ" నామం అత్యంత శక్తివంతం అని అంటారు.

ఇదీ పెద్దల వద్ద తెలుసుకున్న విషయం.

"శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

"రామాయ రామ భధ్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథ నాథ నాథాయ సీతాయాః పతయే నమః"

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Friday, March 21, 2014

కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తేరు(రథం) మరియు తేరును లాగే త్రాడు

కదిరి లో రేపు బ్రహ్మరథోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా కదిరి తేరు మరియు దానిని లాగు త్రాడు యొక్క చిన్న వీడియో.

Wednesday, March 19, 2014

మనం జయించామనుకుంటాం..కానీ ఇంతలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది..

నేను చాలా నాచురల్ గా ఉంటాను..ఏం పెట్టినా తింటాను..వాళ్ళ మనసు ముఖ్యం..వాళ్ళు మనస్పూర్తిగా అన్నం పెడ్తే చాలు..వాళ్ళ నుండి నాకు మర్యాద ఏమీ అవసరం లేదు..ఇలా సాగుతుంది మన ఆలోచనా వ్యవహారం.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.

గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?

ఒక చిన్నకథ.

శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్‌జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.

ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?

నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.

కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

Monday, March 17, 2014

"మనం చేయగలిగినంత వరకు చేయడమే - ఫలితం భగవంతుడిదే" అని ఎందుకంటారు?

ఈ టపా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ఈ మధ్య చదివిన ఒక చారిత్రక సంఘటన.

విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.

కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.

సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.

చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని  సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి  (2-47) 

పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.


Tuesday, March 11, 2014

సహనం,ఓర్పు మరియు పట్టుదలలు విజయాన్ని కల్గిస్తాయనడానికి సజీవ ఉదాహరణ - నితిన్

నితిన్...వీరే ఆ సజీవ ఉదాహరణ..సినీతెరపై అడుగుపెట్టింది 2002 లో, చివరిసారిగా విజయం సాధించినది 2004 లో. మళ్ళీ మరో విజయం కోసం 8 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది.

మధ్యలో ఎన్నో ఆటుపోట్లు...తన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అంతే...కాని పవన్ కళ్యాణ్ గారికి బలమైన నేపథ్యం ఉంది...నితిన్ గారికి బలమైన నేపథ్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ పరాజయాల కాలంలో రాటుదేలి తన లోపాలను సరిజేసుకుంటూ ఎవరు తన వెంట లేకపోయినా ఓర్పుతో అంతకు మించి సహనం,పట్టుదల లతో 2012 లో ఇష్క్ సినిమాతో విజయం సాధించాడు...తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే,హార్ట్ ఎటాక్ లతో విజయాలతో దూసుకెళ్తున్నాడు..ఇప్పుడు విజయాలు ఇస్తున్న మత్తులో పట్టుజారిపోకుండా అత్యంత జాగరూకతతో మరిన్న విజయాలు పొందాలని ఆశిస్తున్నాను.

నేను
 వ్యక్తిగతంగా ఏ హీరోకూ అభిమాని కాను.కాని ఏ రంగంలోనైనా ఇటువంటి పట్టుదల,ఓర్పు మరియు సహనములు ఉంటే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించిన నితిన్ గారి లాంటి వారిని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంకా ఎందరో ఉన్నారు.ప్రస్తుతానికి వీరి గురించి చెప్పుకోవాలనిపించింది.

కాకతాళీయం ఏంటంటే ఇదే పరిస్థితి చవిచూసిన నితిన్ గారి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా తన విజయాన్ని నితిన్ లానే 2012 లో గబ్బర్ సింగ్ తో పొందడం.

Thursday, January 30, 2014

జాతిపితకు శ్రద్దాంజలి-మహాత్ములకు తమ మరణాల గురించి ముందుగానే సూచనలొస్తాయేమో?

నేడు మహాత్మాగాంధీజీ వర్ధంతి.
వారు చూపిన బాటలో మనం నడవాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి.

నేటి సాక్షి పత్రికలో చూసిన ఈ వార్త నాలో ఒక సందేహాన్ని రేకెత్తించింది. అదేమంటే మహాత్ములకు తమ మరణాల గురించి ముందుగానే సూచనలొస్తాయేమో అని.
Wednesday, January 29, 2014

చిన్న పాత్ర ధరించిన ఈ వ్యక్తిని గుర్తుపట్టగలరా?

ఈ ఫోటో "నిన్నే ఇష్టపడ్డాను" చిత్రంలోనిది. ఈ చిత్రం లోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా?


Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు