తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, December 29, 2009

ఎవరికుంటుందండీ శ్రీరాముడికి, హనుమంతుడికీ ఉన్నంత వినయం?


"విద్య యొసగు వినయంబు" అంటారు కదా. ఆ వినయం నేటి విద్యార్థులలో ఏ మాత్రం ఉందో అందరికీ తెలుసు. ఏ చిన్న విజయం సాధించినా ఉద్రేకాన్ని అణచుకోలేక విపరీతంగా పొంగిపోయి అహంకరించే నేటి మనుషులు ( ముఖ్యంగా విద్యార్థులు ) ఉన్న సమాజంలో ఇలాంటి విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ రోజు రామాయణంలో శ్రీరాముడి వినయం ఎలాంటిదో, హనుమంతుని వినయం ఎలాంటిదో చూసాను.

మొదట రామచంద్రుడి వినయం చూద్దాం.

అందరికీ తెలుసు అహల్యను తన పాదాలతో పాపవిమోచనం కలిగించాడని. ఇక్కడ శ్రీరాముడు తనే శాపవిమోచనం కలిగించాననే అహంకారం ఏమాత్రం లేకుండా అహల్య శాపవిమోచనం పొందిన వెంటనే ఆమె తన కన్నా వయసులో పెద్దది అవటం చేత మరియు ఒక ఋషి భార్య అవడం చేత తనే ముందుగా మోకాళ్ళ మీద కూచుని అహల్యకు నమస్కారం చేసాడు.

అలానే విశ్వామిత్రుడి యజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసులను చంపిన తర్వాత ఋషులందరూ రాముడిని "ఇంత చిన్న వయసులోనే అలాంటి రాక్షసులను చంపగలిగావు కదా" అంటూ పొగిడారు. రాముడు ఏమాత్రం అహంకరించకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

ఇక హనుమంతుని వినయం ఎంతటిదో చూద్దాం.

లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.

హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".

హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఎవరూ రాలేకనే కదా హనుమంతున్ని పంపింది. కాని హనుమంతుని వినయం ఎంతగా ఉందో చూసారా? కనీసం అలాంటి వినయాన్ని ఊహించగలమా?
ఇప్పుడు చెప్పండి నేటి యువత కానీ, సమాజం కానీ, చదువుకొన్న,చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎంత వినయం నేర్చుకోవాలో.

Thursday, December 24, 2009

నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం".

నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం" పూర్తి ఆధ్యాత్మికంగా భగవంతుడి లీలలను, భక్తుల చరిత్రలను వ్రాస్తున్నాను. ఆశీర్వదించగలరు.



Sunday, December 20, 2009

భక్తులతో, భగవంతునితో పెట్టుకొని నాశనం కాకండి, సమైక్యవాదులైనా ! తెలంగాణావాదులైనా !

సమైక్యరాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. మంచిదే. పోరాడండి. కాని దేవుడిని, భక్తులను ఎందుకు ఈ విషయములోనికి లాగుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంపై కొన్ని జరిగిన సంఘటనలను చూద్దాం.

1. ఒక బ్లాగరి తన బ్లాగులో తెలుగు బాష విషయం పై వాదన చేస్తూ బమ్మెర పోతన తెలంగాణా వ్యక్తి అని వారే అసలైన తెలుగు వారని అందుకే భాగవతం చాలా బాగుంటుందని , నన్నయ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని అందుకే అతను వ్రాశిన మహాభారతం అంత బాగోదని తేల్చేసాడు.
మీ మూర్ఖత్వాన్ని, వాదనలను మీ వద్దే పెట్టుకోండి.
భక్తులకు విశ్వమంతా ఒక్కటే. వారికి దేవుడు తప్ప ఇతరాలు కానరావు. మన అజ్ఞానంతో భక్తుల పట్ల అపచారాన్ని చేస్తున్నాము. దేవుడు తనను ఏమైనా అన్నా ఉపేక్షిస్తాడేమో గానీ, భక్తుల జోలికి వస్తే ఊరుకోడు.

2. విజయవాడ అమ్మ వారి ప్రసాదాన్ని వేములవాడకు పంపిస్తే ఆ ప్రసాదం ఆంధ్రప్రాంతం వారిదని త్రిప్పి పంపేశారట. దుర్గమ్మ జగన్మాత, అంతే కాని ఆంధ్రామత అనో లేక తెలంగాణా మాత మాత్రమో కాదు. భధ్రాచలం రాముడైనా, తిరుపతి వెంకన్న ఐనా ఇద్దరూ ఒకటే అని తెలిసినా మూర్ఖవాదాలతో కాలం సాగిస్తున్నారు.

ఎవరైనా ఎంతైనా పోరాడండి. హద్దుల్లో ఉండి పోరాడండి. అంతేకాని దేవుడి విషయంలో కాని, ఇంకా ముఖ్యముగా భాగవతుల(భక్తుల) విషయంలో కాని పొరపాటున ఐనా తప్పు చేస్తే లేక మన ప్రాంతీయవాదాల్ని వారికి అంటగడితే నాశనం కాకతప్పదు.

గమనిక : ఈ టపా ఏ ఉద్యమానికీ వ్యతిరేకంగానో లేక మద్దతుగానో వ్రాయబడలేదు. ఆధ్యాత్మిక సంబంధంగానే వ్రాయబడింది.




Monday, December 14, 2009

దక్షిణామూర్తి పూర్తి కథ


రవిచంద్ర గారు తమ బ్లాగులో దక్షిణామూర్తి కథ వ్రాశారు. ఆ టపాకు వ్యాఖ్య వ్రాద్దామంటే ఒక టపా అంత అవుతుంది. అందుకే ఈ టపా వ్రాస్తున్నాను.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక,సనందన,సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువుకోసం వెదుకుతూ నారదమహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నారు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడనూ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు భోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు,మనసుకూ అందనివారు కాబట్టి అలా భోధించారు.


Friday, December 11, 2009

ఇదేనా చదివిన చదువు మనకు నేర్పింది ? సిగ్గుపడాలి.

తెలంగాణా విషయం మొదలైనప్పటి నుండి అసలు మన విద్యా వ్యవస్థ యొక్క పస ఏంటో, అది మనకు ఏం నేర్పుతోందో అర్థం అవుతోంది. అసలు విద్యార్థులు ఏం చదువుతున్నారో , ఎందుకు చదువుతున్నారో అర్థం కాకుండా ఉంది. "విద్య యొసగు వినయంబు " అంటారు , ఆ వినయంతో " విచక్షణా జ్ఞానం" వస్తుందని అంటారు. కాని ఎక్కడ వస్తోంది?

కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా, పాలిచ్చే ఆవును గాయపరిచినట్లుగా , పండిన పంటను తగలబెట్టినట్లుగా ఉంది విద్యార్థుల వ్యవహారం. లేకపోతే సమాజానికి ఉపయోగపడే బస్సులను, ఇతరుల వాహనాలను , పొట్టకూటికి జరుపుకొనే వ్యాపారాల పైనా వీరి ప్రతాపం? ఇప్పుడు బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు . మళ్లీ అంతా సద్దుమణిగాక ఆ నష్టపోయిన ఆస్తులకు పరిహారం ఎవరు, ఎలా ఇస్తారు? ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం ఎలా తెస్తుంది? అదనపు పన్నులు ప్రజల పైన వేయడం ద్వారా . అంతే కదా? ఈ మాత్రం మూల విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా ?

రాజకీయనాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొడితే చేసేయడమే. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేక పొతే ఎలా ? అసలు ఈ మాత్రానికి చదవడం ఎందుకు ? డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు ? ఏదైనా సాధించాలంటే ఒక మార్గం అంటూ ఉంటుంది. అది తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరికి నష్టం? మన చదువు ఇదేనా మనకు నేర్పుతోంది?


కొన్ని పల్లెల ప్రజలు ఎన్నో రోజులు కష్టపడి, అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళావెళ్లా పడి తమ పల్లెలకు బస్సును వేయించుకొంటారు. ఇప్పుడు వీరు ధ్వంసం చేసే బస్సులలో అవి కూడా ఉన్నాయి. మళ్లీ ఆ పల్లెలకు బస్సులు తిరగాలంటే వారు ఎంత బాధపడాలి? ఎంతగా మళ్లీ తిరగాలి? మీ పైశాచికానందం కోసం, మీలోని శాడిసం ను తృప్తి పరచడం కోసం ప్రజల ఆస్తులను నాశనం చేస్తారా? అంతగా అవసరం ఉంటే మీ సొంత వాహనాన్ని అది సైకిలైనా , బైకైనా లేక కారైనా కావచ్చు, దాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చి మీ కసితీరా ధ్వంసం చేసుకోండి. ఎవరూ ఏమి అనరు. ఈ మాటను కూడా నేను అనకూడదు. కాని ఇతరులకు , అందరికి ఉపయోగపడే వాటిని నాశనం చేసే బదులు మీవే నాశనం చేసుకొంటే సరిపోతుందికదా.మీ పైత్యం తీరాలి కదా.

ఇతరుల వరకు వస్తే మీకు అది మలం తో సమానం, మీ వరకు వస్తే అది పరమాన్నమా?

ఇక ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు చేస్తున్న గలాటాను చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ఏంటి వారు చదువుకొన్నది? వీరా మనకు న్యాయవాదులు? ఇలాంటి మనస్తత్వం కలవారా న్యాయం కోసం వాదించేది? ఇలాంటి వారి వద్దకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని అనుకోగలమా?

ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే తప్పులు ఎంత వేగంతో మిమ్మల్ను అవి తాకుతాయంటే మీ మాటను కూడా వినడానికి ఎవరూ ఉండరు. మీరు చదివి వృథా. మీకు పెట్టిన డబ్బును ఏ జంతువుకో పెడ్తే అది జీవితాంతం ఋణపడి ఉంటుంది.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఇలాంటివి చేయకుండా ఉంటే అందరికీ మేలు.

గమనిక: నేను ఈ టపాను అందరు విద్యార్థులను ఉద్దేశించి వ్రాయలేదు. ఎవరైతే చదువుకొని కూడా పై విధం గా ప్రవర్తిస్తున్నారో వారిని ఉద్దేశించి మాత్రమే వ్రాసాను. రాజకీయనాయకులు, కార్యకర్తలు, అసాంఘికశక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కూడా విద్యార్థులు, చదువుకొన్నవారు ఉన్నారు కదా. వారిని ఉద్దేశించి మాత్రమే ఇదివ్రాసాను.




Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు