తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, December 30, 2013

హృదయవాసి రమణులకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

కొందరిపై ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు..చూడగానే వారికీ,మనకూ జన్మజన్మల సంబంధం ఉందని అనిపిస్తుంది..వారి పేరు వినగానే,వారి రూపం చూడగానే ఏదో తెలియని ఆనందం మనసును ఆక్రమిస్తుంది.

అలా నాకు ఫోటో చూడగానే ప్రేమ,ఆరాధన పుట్టినవారిలో స్వామి వివేకానందులు మొదటివారు.
ఇక భగవాన్ రమణులు రెండవవారు.రామకృష్ణులు,శారదామాతలను కూడా చూడగానే ఇలాంటి భావమే కలుగుతుంటుంది.

4వ తరగతి చదువుతున్నప్పుడే(అతిశయోక్తి అనిపించవచ్చు కానీ నిజం) రమణుల ఒక వాక్యం ("నేను" గురించి)ఏదో పుస్తకంలో చదివి మా తాత గారిని అడగడం ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటుంది.
ఇప్పటికీ వీరి పేర్లు ఎవరి నోటైనా అనుకోకుండా విన్నా మనసు తెలియకుండానే ఆ మాటల వైపు వెళ్ళిపోతూంటుంది.

ప్రతిరోజూ ఏదో ఒక సందర్భం లో నా హృదయంలో తిరుగాడే నా హృదయవాసి అయిన భగవాన్ రమణులకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

"భక్తి జ్ఞానమునకు తల్లి"
                                - భగవాన్ రమణులు

Sunday, December 8, 2013

ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి - సమాధానం

నిన్నటి ప్రశ్న:

మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు. 
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.

సమాధానం:

నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a  జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.

ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే 
అందరూ కలిపిన మొత్తం 
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది 

ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.

ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.

చూసారా ఎంత సులభమో.


Saturday, December 7, 2013

ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి.

మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు. 
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.

అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.

Friday, December 6, 2013

అరటిపండు తిన్నంత సులభమేనా ఈ ఇంటర్‌వ్యూ ప్రశ్నకు సమాధానం చెప్పడం?

16 రూపాయలకు "ఎన్ని" అరటిపండ్లు వస్తాయో, "అన్ని" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయి. ఐతే డజను అరటిపండ్ల ఖరీదెంత?

( వివరణ: ఉదాహరణకు 16 రూపాయలకు "X" అరటిపండ్లు వస్తే, "X" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయన్న మాట)

అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.



దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా గారికి హృదయపుర్వక శ్రద్ధాంజలి



గతరాత్రి దివికేగిన దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా గారికి హృదయపుర్వక శ్రద్ధాంజలి.

Thursday, December 5, 2013

మీ క్రికెట్ పరిజ్ఞానానికి ఒక పరీక్ష (గణిత మరియు ఆట నియమాలకు సంబంధించినది)

మనదేశంలో క్రికెట్ అంటే తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి క్రికెట్ కు సంబంధించిన గణిత శాస్త్రపు ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం.

ప్రశ్న:

9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?

కష్టమనుకుంటున్నారా!  క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.

ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.



Saturday, November 9, 2013

అన్నమయ్య కీర్తనల బాలకృష్ణప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆధునిక కాలంలో అన్నమయ్య కీర్తనలు అంటే గుర్తుకువచ్చే మహామనిషి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు. 
వారికివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలానే అన్నమయ్య కీర్తనలు మాకోసం పాడుతూనే ఉంటారని
కోరుకుంటున్నాను.





Thursday, November 7, 2013

చాలా మందికి తెలిసిన ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.

ఒక నిరుద్యోగి ఒక సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్‌వ్యూకు వెళ్ళాడు. ఆ ఇంటర్‌వ్యూకు రానూ,పోనూ చార్జీలు ఆ సంస్థే ఇస్తుంది. కాని ఇంటర్‌వ్యూ సరిగా చేయలేక పోవడం వలన ఆ నిరుద్యోగి ఆ ఉద్యోగం పొందలేకపోయాడు. బయటకు వచ్చేసాడు.ఇంటర్‌వ్యూలు ముగిసిన తర్వాత ఇంటర్‌వ్యూ బోర్డు చైర్మన్ బయటకు వచ్చాడు.

ఈ నిరుద్యోగి ఇంకా అక్కడే తిరుగుతుండడం చూసి అతను " ఏం బాబూ!నువ్వు ఎంపిక కాలేదు కదా? ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావ్?" అన్నాడు.

దానికి ఆ నిరుద్యోగి "సార్! మీరు రానూ,పోనూ చార్జీలు ఇచ్చారు కదా. మీరు ఇచ్చినదాని కన్నా మా ఊరికి చార్జీలు తక్కువే. అందుకే మిగిలిన డబ్బును మీకు తిరిగి ఇద్దామని ఇక్కడే ఉన్నాను." అన్నాడు.

ఆశ్చర్యచకితుడైన ఆ ఇంటర్‌వ్యూ బోర్డు చైర్మన్ " బాబూ! నువ్వు ఉద్యోగం లో చేరవచ్చు. సబ్జెక్ట్‌లో (ఉద్యోగం లో) నీకు నేను సహాయం చేయగలను. నీవు నేర్చుకోగలవు. కానీ నిజాయితీ అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అది నీకు ఉంది. చాలా సంతోషం. మా సంస్థలో చేరు" అన్నారు.

ముందే చెప్పినట్లు ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.

కానీ ఇది జరిగింది ఎక్కడో తెలియనివారి కోసం ఈ టపా.

ఆ నిజాయితీ గల నిరుద్యోగి పేరు తెలియనందుకు క్షమాపణలు.

 ఆ సంస్థ : భారతీయ వైజ్ఞానిక సంస్థ (IISc),బెంగళూరు.

ఆ ఇంటర్‌వ్యూ బోర్డు చైర్మన్ : సర్ సి.వి.రామన్ గారు.

రామన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Wednesday, October 2, 2013

మహాత్మాగాంధీ గారికి,లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

నేను ఆచరించిన తర్వాతే మిగతా వాళ్ళ గురించి బాధపడగలను..

జగద్గురువుల చిన్న కథ:


ఒక పదిమంది ఒక నది అవతల ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ ఏదో పని చూసుకొని రావలసిందిగా గురువుగారి 
ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం 
దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు 
తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా 
వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు? 
నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని 
మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని 
ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం 
లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక 
రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని 
ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి 
పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే 
కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా. 

Wednesday, September 25, 2013

చెన్నై మిత్రులు(బ్లాగర్లు లేక చెన్నై లో బంధుమిత్రులు ఉన్నవారు) ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు.

 మిత్రులారా!


మా అబ్బాయి యతీశ్వర్(వయసు 1.5 సంవత్సరాలు) ఆరోగ్య సమస్య రీత్యా చెన్నై నగరములో 1 నుండి 2 నెలలు ఉండవలసి ఉంది. 4000 నుండి 6000 అద్దెలో మైలాపూరు లేక మందవేలి ప్రాంతాలలో అద్దె ఇల్లు (4 గురు సభ్యులకు) ( 1 నుండి 2 నెలలకు) ఏమైనా ఉంటే చెప్పగలరు. ఈ నెలాఖరులోగా ఈ సహాయం వీలైతే చేయగలరు.


Tuesday, September 24, 2013

Tuesday, September 3, 2013

ఈ మధ్య నేను చదివిన అత్యద్భుత పుస్తకం పరుసవేది ( The Alchemist)

చాలామంది పాలో కొయిలో వ్రాసిన "The Alchemist" అనే పుస్తకం గురించి వినే ఉంటారు. ఎందరో ఈ పుస్తకం బాగుందని చెప్తుంటే చదవాలని ఈ పుస్తకం కొన్నాను.కానీ చదవలేదు. ఈ మధ్య కినిగె వారి వెబ్సైట్ చూస్తుంటే ఈ పుస్తకం తెలుగు అనువాదం "పరుసవేది" కనిపించింది. వెంటనే అద్దెకు డౌన్‌లోడ్ చేసుకొని చదివాను. చాలాచాలా బాగుంది.

జీవితగమ్యాన్ని చేరుకోవడంలో కష్టనష్టాలు, పరిస్థితులను ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటివి ఒక పాత్రద్వారా రచయిత అద్భుతంగా వివరించాడు.

 కొన్ని కాల్పనిక సన్నివేశాల సహాయం తీసుకొన్నా మనలను ఈ పుస్తకం ఏకబిగిన చదివిస్తుంది. కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి.

ఉదాహరణకు
"ఒక నిర్ణయం ధృఢంగా తీసుకోవడం అనేది ఉధృతంగా ప్రవహించే ఏరులోకి దూకడం లాంటిది. అది ఎక్కడకు తీసుకెళ్ళినా మనం సిద్ధంగా ఉండాలి."

"నీకు లేనిదాని గురించి వాగ్దానాలు చేయడం మొదలుపెట్టావంటే దానిని సాధించాలన్న కోరికను కోల్పోతావు".

వీలుంటే ఈ పుస్తకం చదవండి. చాలా బాగుంది.

Wednesday, August 21, 2013

సత్యాన్ని పైకి తీసుకురావడానికి అసత్య సహాయం అవసరమా - జగద్గురు ఆదిశంకర చిత్రం

నిన్న జగద్గురు ఆదిశంకర చిత్రం చూసాను. ఎక్కడా బోరు కొట్టలేదు. ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ చిత్రం చూస్తే పైపూతగా కొద్దిగా తెలుసుకోవచ్చు. ఆయన ఎందుకై భూమిపైకొచ్చిందీ, ఏం సాధించిందీ తెలుసుకోవచ్చు.

కానీ ఆదిశంకరుల జీవితచరిత్ర తెలిసిఉన్నవారిని మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా బాధపెడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒక చారిత్రిక మహాత్ముని గురించి చెప్పాలనుకొన్నప్పుడు అసలు చరిత్ర కు భంగం వాటిల్లకుండా చూడాలి. అంతేకానీ నేనేదో మహత్కార్యం చేస్తున్నాననుకొని ఆ కార్యం నిమిత్తం మనకు ఇష్టమొచ్చింది, సత్యదూరమైనది చేయడం భావ్యం కాదు.

కాటికాపరితో సంభాషణ కానీ, మండనమిశ్రునితో వాదం కానీ ఇంకా అనేక విషయాలు సినిమా చూడడానికి వచ్చినవారికి బాగా అనిపిస్తాయేమో కానీ స్వామివారి చరిత్ర చదివున్నవారికి ఏమాత్రం మింగుడుపడవు.
ఇలా సత్యదూరమైన విషయాలతో సినిమా తీయడం వలన మొదటిసారి ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకున్న వారికి తెలిసేది ఏమిటి? వారికి తెలియకుండానే ఇదే ఆదిశంకరుల చరిత్ర అనుకుంటారు. తద్వారా అసలు చరిత్ర కాస్తా తెలుసుకోలేకపోతారు.

కానీ ఆదిశంకరుల గురించి నేటి తరానికి తెలియచెప్పాలన్న దర్శకుడి తాపత్రయం మెచ్చుకోవాలి.

సినిమా చూస్తున్నంతసేపూ మరియు సినిమా అయిపోయినతర్వాత నాకు ఒకటే అనిపిస్తూనే ఉంది " సత్యాన్ని తెలియజెప్పేందుకై అసత్య సహాయం అవసరమా?" అని.

Monday, August 5, 2013

పవర్‌స్టార్ (అంతకు మించి మంచి మనసు ఉన్న)పవన్‌కళ్యాణ్ నోట మా ఊరు "కదిరి" నరసింహుని పాట

"కదిరి" అనే మా ఊరు అనంతపురం  జిల్లాలోని ప్రముఖ పట్టణం. మా వైపు చాలా జనాదరణ పొందిన నరసింహస్వామి పాట "బేట్రాయి స్వామి దేవుడా" పాట రీమిక్స్ పవర్‌స్టార్ (అంతకు మించి మంచి మనసు ఉన్న)పవన్‌కళ్యాణ్ గారు ఒక సినిమా కోసం పాడారు. అందుకు వారికి మా కదిరి తరపున కృతజ్ఞతలు.

మా కదిరి గురించి తెలుసుకోవాలంటే క్రింది లింక్ నొక్కండి.

Friday, July 5, 2013

మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగల్ బార్ట్ (Douglas Engelbart)ఆత్మశాంతికై ప్రార్థిద్దాము.

కంప్యూటర్ అంటే తెలిసిన ప్రత ఒక్కరికీ "మౌస్(mouse)" గురించి తెలియకపోవడం అంటూ ఉండదు.
ఇప్పుడంటె లాప్‌టాప్ లు వచ్చి మౌస్ ఉపయోగం తగ్గింది కానీ ఆ మాటకొస్తే లాప్‌టాప్ కు కూడా మౌస్ తగిలించుకొని పనిచేసేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. 
అసలు మౌసే లేకపోతే కంప్యూటర్ వినియోగం అత్యంత కష్టంగా ఉండేది అనడం అతిశయోక్తి కాదు. 

అలాంటి మౌస్ సృష్టికర్త ఐన "డగ్లస్ ఎంగల్ బార్ట్ ((January 30, 1925 – July 2, 2013))" గారు జులై 2వ తేదీన మరణించారు.

అంతేకాక కంప్యూటర్ కు సంబంధించిన hyper Text, GUI(Graphical User Interface) యొక్క ఆవిష్కరణలలో వీరి పాత్ర ఉంది. 


వారి ఆత్మశాంతికి భగవంతున్ని ప్రార్థిస్తూ ఇంకా ఇటువంటి శాస్త్రవేత్తలను ప్రపంచానికి ఎంతోమందిని ప్రసాదించాలని భగవంతుని వేడుకుందాము.

Thursday, July 4, 2013

వివేకానందుడు ఏం చేసాడో ఇంకో వివేకానందుడు ఉంటే తెలుసుకోగలడు

"వివేకానందుడు ఏం చేసాడో ఇంకో వివేకానందుడు ఉంటే తెలుసుకోగలడు." 

ఈ మాటలు ఎవరో అన్నది కాదు, వివేకానందుడే తన చివరి రోజులలో అనుకోవడం బాబూరాం(ప్రేమానంద స్వామి) విన్నాడు.

స్వామి వివేకానంద గురించి మనం ఏమని చెప్పుకోగలం? అసలు మనకు ఏమి తెలుసని.

1.ఉక్కు పరిశ్రమ పితామహుడైన జంషెడ్జీ టాటా కు దిశానిర్దేశం చేసిందెవరు ?

2.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యపదవిని సున్నితంగా తిరస్కరించిన వారు ఎవరు?

3.ఆధునిక విద్యుచ్చక్తి శాస్త్రజ్ఞుడైన నికోలా టెస్లా(Nikola Tesla) తన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో ఆధ్యాత్మిక సహాయం చేయమని స్వయంగా ఆహ్వానించిన వ్యక్తి ఎవరు?

4.బిల్‌గేట్స్,అన్నాహజారే,ఒబామా,గాంధిజీ,నెహ్రుజీ,సుభాష్‌చంద్రబోస్,సర్వేపల్లి రాదాక్రిష్ణన్,అరవిందయోగి లాంటి గొప్పగొప్ప వ్యక్తుల కే స్పూర్థినిచ్చిన ఆ మహావ్యక్తి ఎవరు?

5.బెంగళూరులోని IISc కు మొట్టమొదటి Director గా ఉండమని టాటాలచే ఆహ్వానింపబడ్డ వ్యక్తి ఎవరు?

6.అడవులలోని వేదాంతాన్ని సమాజంలోనికి తీసుకువచ్చిన వారెవరు?

7.స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అధిక సంఖ్యాకులకి స్పూర్థిప్రదాత ఎవరు?

8.కొడగట్టిన దీపంలా ఉన్న హిందూమత ప్రాభవాన్ని విశ్వ వినువీధులలో నిలబెట్టిన ఘనుడెవరు ?

9.మానవసేవే మాధవసేవ అని గురువుగారైన రామకృష్ణపరమహంస గారి ఉపదేశాన్ని స్వీకరించి విశ్వంలో చాటిన మహానుభావుడెవరు  ?

10.మతరహితంగా సర్వసమాజానికీ సేవలు చేస్తున్న రామకృష్ణ సంస్థల స్థాపకుడెవరు ?

11.వంద సంవత్సరాలు దాటినా ఇంకా లక్షలమందికి స్పూర్థిప్రదాతగా వెలుగొందుతున్న ఏకైక మహానుభావుడెవరు ?

12.యువతకు కావలసినవి ఇనుపకండలు, ఉక్కు నరాలు అని తెల్పిన మహానుభావుడు ఎవరు?

ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నని చెప్పుకోవాలి?
వీటన్నిటికీ సమాధానం స్వామి వివేకానంద అని మనకు తెలుసు.

ఆ మహానుభావుడు శివసాయుజ్యం పొంది నేటికి 111 సంవత్సరాలు. స్వామీజీ స్థాపించిన రామకృష్ణ సంస్థలు నేటికీ వివాద రహితంగా సేవలు అందిస్తూనే ఉన్నాయి.

తన సందేశం 1500 సంవత్సరాలకు సరిపడినంత ఇచ్చానని స్వామి వివేకానందుడే స్వయంగా చెప్పారు.

"వివేకానందుడే బ్రతికి ఉంటే ఆ మహాపురుషుడి కాళ్ల దగ్గర ఒక శిష్యపరమాణువుగా కూర్చుని ఉండేవాడిని."
-సుభాష్ చంద్రబోస్ 

చివరగా స్వామి వివేకానందుడు చెప్పిన ఒక సందేశంతో మనం ఆయనకు నివాళులర్పిద్దాం.

"లేవండి,మేల్కొనండి, గమ్యం చేరువరకూ విశ్రమించకండి".

Friday, June 28, 2013

నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత ముద్దుబిడ్డలు"

నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత  ముద్దుబిడ్డలు".
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
భగవంతుడి దయ మేరకు వ్రాస్తాను. 

Tuesday, June 25, 2013

ఈ అరుదైన ఫోటో చూసారా?

మదర్ థెరెసా యువతిగా ఉన్నప్పటి చిత్రం 

Monday, June 17, 2013

హమ్మయ్య! ఇన్నాళ్లకు నా HTC Desire X మొబైల్ ఫోను తెలుగు చూపిస్తోంది.

HTC కంపెనీ వాళ్ళు వారి కొత్త మొబైల్ ఫోన్లలో భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తున్నారంటే విని అప్పుడే విడుదలైన HTC Desire X అనే మోడల్ (19,000 రూపాయలు) ఫోన్ ను గత అక్టోబర్ 29 న కొన్నాను.

కాని తీరా చూస్తే అందులో హింది,మరాఠి,తమిళం మరియు బెంగాళి భాషలు మాత్రం కనిపించాయి. మన తెలుగు బ్లాగులు ఓపెన్ చేస్తే అంతా ఖాళీగా దర్శనం ఇచ్చేవి. సర్లే నా ప్రాప్తం ఇంతేలే అనుకొని ఒపెరా బ్రౌజర్ లో మాత్రం తెలుగు చూసుకొని సర్దుకుపోయేవాణ్ణి.

కాని మొన్న జూన్ 10 వ తేదీ జెల్లీబీన్ అనే కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ కు update చేసుకొమ్మని HTC నుండి కాల్ వచ్చింది. update అయిన తర్వాత చూస్తే తెలుగుతో పాటు భారతీయ భాషలు అన్నిటికీ సపోర్ట్ ఉంది.
అంతేకాకుండా మన భారతీయభాషలలో మెసేజులు కూడ పంపించుకొనే సౌకర్యం కంపెనీవాడే ఇచ్చాడు.
తెలుగు చూపిస్తున్న చిత్రం చూడండి.


చాలాచాలా ధన్యవాదాలు HTC వారికి.





Thursday, June 6, 2013

IRCTC లో అసలు ఏం జరుగుతోంది?




IRCTC లో అసలు ఏం జరుగుతోంది? ఇంకా ఎన్ని రోజులు మనం బాధ పడాలి? ప్రశ్నించేవారు లేరా?
ఈ రోజు,ఇప్పుడు (10.10 ఉదయం) సైట్ ఏం చెప్తోందో చూడండి....

Monday, May 27, 2013

పదాలతో ఆడుకోవడం అంటే ఇలా ఆడుకోవాలి....అన్నమయ్య కీర్తన

తెలుగు బాష యొక్క సొగసు,సింగారాలను మనం ఎంతగా కోల్పోతున్నామో ఎందరికి తెలుసు. రామాయణంలోని హనుమంతుని సీతాన్వేషణ ను వర్ణిస్తూ ఉన్నటువంటి ఈ క్రింది అన్నమయ్య కీర్తన వింటూ చదవండి. అప్పుడు తెలుస్తుంది తెలుగు బాష యొక్క సొగసుతనం.


ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె, 
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా ||

రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||

కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||

దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||

Thursday, May 23, 2013

మన పని మనం చేసుకోవడానికి మొహమాటం ఎందుకు? (అబ్రహం లింకన్ జీవితపు చిన్న సంఘటన)


అబ్రహం లింకన్ యొక్క మహోన్నతపు వ్యక్తిత్వం మనకు పరిచయమే.
వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఒక చిన్న సంఘటన.

ఒక సారి లింకన్ గారి స్నేహితుడు లింకన్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి లింకన్ గారు తమ బూట్లు పాలిష్ చేసుకుంటున్నారు.

అది చూసి వారి స్నేహితుడు "అదేంటి లింకన్! నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్?" అన్నాడు.

వెంటనే లింకన్ గారు " మరి నువ్వు ఎవరి బూట్లు పాలిష్ చేస్తావ్?" అన్నారు.

లింకన్ మాటల్లోని అంతరార్థం తెలుసుకుని ఆ స్నేహితుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకుందాం.

స్వామి వివేకానందులు చెప్పినట్లు " ఒకరి గొప్పతనం వారు చేసిన గొప్ప కార్యాల వలన కాక వారు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది."

Friday, April 26, 2013

ఒక శ్రేయోభిలాషి వ్యాఖ్యగా వ్రాసిన ఒక కవిత

సురేష్ గారు..

మీ వ్యాఖ్యలు/ఉత్తరాలు చదువుతూంటే..

అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్న చద్దన్నం రుచి గుర్తొచ్చినట్లు.... కమ్మగా...

మనకు ఇష్టమైన పాత సినిమాలోంచి  ఘంటసాల గారు పాడిన పాట వింటున్నట్లు.. తియ్యగా...

మన ఎలిమెంటరీ స్కూల్లో.. తెలుగు మాష్టారు పాఠం మధ్యలో, ఉదాహరణల కోసం.. చెప్పే చిట్టి కథంత.. మధురంగా...

వేసవి కాలం సెలవుల్లొ వచ్చే.. ఐస్ బండిలోంచి ఇచ్చే.. చిన్న కలర్ ఐస్ ముక్కంత, చల్లగా....

ఉంటాయండి...

నిజంగా.. ఇది ఒక అరుదైన అనుభూతి..

మీరు ఇలాగే కొత్తగా.. మనం (సమాజం) మరిచిపోతున్న పాతదనాన్ని గుర్తు చేస్తూ.. ఉండాలని..

- మీ శ్రేయోభిలాషి

Tuesday, April 2, 2013

ఈ ప్రశ్నకు ఎంతమంది సమాధానం చెప్పగలరు?

పెదవులు, నాలుక అవసరం లేకుండా మనం పలుకగలిగే ఏకైక దేశం పేరు ఏమిటో చెప్పగలరా?

Friday, March 22, 2013

ఈ ఏడు మరియు మూడు తలల పామును చూసి మీ జన్మ ధన్యం చేసుకున్నారా?

ఈ మధ్య ఇంటర్నెట్ లో ప్రచారం అవుతున్న విషయం. ముఖ్యం గా facebook లో.

తిరుమలకు వెళ్ళే దారిలో తుంబురు కోన దగ్గర శివాలయానికి సమీపం లో 
7 తలల సర్పము కనిపించింది ....దీనితో అందరు కలియుగ దైవం వేంకటేశ్వరుడు కనిపించాడని....
ఆ దారి లో వెళ్ళే భక్తులంత చూశారు .కానీ అర నిముషం కనపడి మాయమైపోయింది .......

దీన్ని చూసి షేర్ చేసిన వారి జన్మ ధన్యం అవుతుంది ....అని పూజారులు , TTD పండితులు చెప్పారు.

అలాగే మూడు తలల సర్పము కనిపించిందని మరో రాష్ట్రపు పూజారులు చెప్పారు.

అలాగే ఒక తల సర్పము కనిపించిందని ఇంకో రాష్ట్రపు పూజారులు చెప్పారు.




మీరు కూడా ఈ చిత్రాలు చూసి జన్మ ధన్యం చేసుకోండి.

Friday, March 1, 2013

అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనిపించడం లేదెందుకని?

అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనపడ్డం లేదు. 
ఏం ఫరవాలేదు, ఫిబ్రవరి 29 రాకున్నా దాని బదులు మార్చ్ 1 వచ్చింది. 
కాబట్టి ఈరోజే నా పుట్టినరోజు.

Friday, February 1, 2013

సచిన్‌టెండూల్కర్‌లా భుజాలు ఎగురవేస్తామంటే సరిపోదు....ఆయనలా...?

ఈ మధ్య గమనించిన పోకడ ఏమిటంటే ఒక ఫలానా మహాత్ముడు లేక గొప్పవాడు ఇలా బట్టలు కట్టుకొనేవాడు, మాట్లాడేప్పుడు ఇలా తల ఎగురవేసేవాడు అంటే మనం కూడా వారిలానే అనుకరిచడానికి ప్రయత్నిస్తున్నాము, వారి హావభావాలను కూడా అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాము.

ఉదాహరణకు గాంధీగారు కొళ్ళాయి గుడ్డ కట్టుకొన్నాడని మనం కూడా అలానే ఉండగలమా? భగవాన్ రమణుల వారు గోచీ గుడ్డ ఒక్కటే పెట్టుకొనే వారని మనం పెట్టుకొంటామా? యోగి వేమన నగ్నంగా ఉండేవాడని మనం కూడా బట్టలు విప్పేసి తిరగగలమా? భగవాన్ రమణులు తన పాదం తప్పుచేసిందని తేనెటీగలు కుడుతున్నా అవి పూర్తిగా కరిచి వెళ్ళిపొయేవరకు తన పాదం కదపలేదు. మనమూ అలానే చేస్తే మన గతి ఏమిటి?

బయటకు కనిపించే వాటిని అనుకరిస్తూ కావలసిన దానిని పట్టించుకోకపోవడం ఎవరికి లాభం? ప్రపంచమంతా భగవంతుడే అని ఊరకే విని ఆ జ్ఞానం నిజంగా లేనివాడు పులి కూడా భగవంతుడే అని పులి ముందు నిల్చోగలడా? బయటకు అంతా దైవమే అంటూ కాలికి ఒక ముల్లు కుచ్చుకొన్న మరుక్షణం "అబ్బా నొప్పి!" అని ఎందుకు అంటున్నారు? అంటే అతడు మాట్లాడే మాట ఒకటి, లోపల ఉంచుకొన్నది ఒకటి.

అబ్దుల్‌కలాం గారి తలకట్టు(Hair style) ను, సచిన్ టెండూల్కర్ భుజాలు ఎగురవేయడాన్ని అనుకరిస్తాము, కాని వారికి తమ పనిపట్ల ఉన్న అంకితభావం, దేశం పట్ల గల ప్రేమను అలవరచుకోవడానికి ప్రయత్నించము.వారు నడిచిన మార్గం, వారు ఆచరించి చూపిన విధానాలు మనం ఆచరిద్దాం. ఒకవేళ మనం కూడా ఆ స్థాయికి ఎదిగితే అప్పుడు మనం ఏం చేయాలో, మన బట్టలు ఎలా వేసుకోవాలో, ఎలా తలదువ్వుకోవాలో మనకే అర్థం అవుతుంది. సరే వారి వేషభాషలు బాగుంటే అనుకరించడానికి అభ్యంతరం లేదు. కాని అలా అనుకరించి మనం వారే అయినట్లు భావించడం(feel అవడం) మనలను మనం మోసం చేసుకోవడమే. అంతేకాని గుడ్డిగా వారిని అనుసరిస్తే మనకు ప్రయోజనం ఏమిటి?

Saturday, January 12, 2013

దిగాలుగా,వట్టిపోయిన జనులతో నిండిన దేశం కాదు, ఇనుపకండలు ఉక్కునరాలతో ఉత్సాహం పరవళ్ళు త్రొక్కే జనులతో కూడిన భారతదేశం నాకు కావాలి.

ఇంతటి గంభీర గర్జన చేసిన వారు ఎవరు? ఇంకెవరు, భారతీయ యువత యొక్క ఆరాధ్య దైవం స్వామి వివేకానంద! ఈ పేరు వినగానే పరవళ్ళు త్రొక్కే ఉత్సాహం కలగని వారు ఉండరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అంతగా ఉత్సాహం కల్గించే పేరు ఇది.

వివేకానందుల భౌతికదేహం పుట్టినరోజు నేడు. భారతదేశం ఈ రోజుని జాతీయ యువదినోత్సవంగా ప్రకటించింది. భౌతికదేహం పుడుతుంది మరియు చస్తుంది. కాని ఆ దేహం మాధ్యమంగా తరతరాలకు తరగని ఉత్సాహజలనిధిని ఇచ్చి వెళ్ళారు వివేకానందుడు. ఆయనే స్వయంగా అన్నట్లు తన సందేశం 1000 సంవత్సరాల వరకు జనుల హృదయాలను మేల్కొలుపుతూనే ఉంటుంది. 1000 ఏం ఖర్మ, 10000 ఏళ్ళు ఐనా మేల్కొల్పుతూనే ఉంటుంది.
భారతజాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవీధులలో సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ధీరుడు స్వామి వివేకానంద. వివేకానందులు బ్రతికి ఉన్న రోజులలో మధుమేహం, నిద్రలేమి లాంటి సుమారు 31 ఆరోగ్య సమస్యలతో బాధపడేవారని అంటారు. అటువంటి పరిస్థితులలో కూడా దేశం కోసమే జీవితంలోని ప్రతిక్షణం తపించి పోయిన మహనీయుడు స్వామి. చుట్టూ హంసతూలికాతల్పాలున్నా వాటిపై నిద్రపోకుండా భారతీయ నిరుపేదల జీవితాన్ని గురించి తలచుకొని కటికనేలపై పొర్లుతూ తలగడలు తడిసిపోయేలా కన్నీళ్ళు కార్చిన స్వామికి మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం?

వారి బోధనలను, వారి సందేశాన్ని అనుసరించి "జీవసేవే దైవసేవ" అను ఆదర్శాన్ని అనుసరించడమే వారికి మనం కొంతలోకొంతైనా తీరుచుకోగల ఋణం.

సత్యం,పవిత్రత,నిస్వార్థత ఈ మూడూ కలిగి ఉన్న వారి వెంట్రుకనైనా ఈ లోకం కదిలింపజాలదు.వీటన్నిటిని మించినది ప్రేమ. వీటిని కల్గిఉన్నవారి విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు.
- స్వామి వివేకానంద

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు