తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, September 18, 2009

64 విద్యలు(కళలు)అంటే ఏవి?


మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

అర్థము:

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)

2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు
(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)

3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు

4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.

5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము

7. నాటకములు

8. గానము (సంగీతం)

9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము

10. కామశాస్త్రము

11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,

12. దేశభాషాజ్ఞానం

13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.

14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,

17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము

18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము

19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం

20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము

22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము

24. పాకకర్మ= వంటలు

25. దోహళము=వృక్షశాస్త్రము

26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు

27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.

31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య

33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పు.

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి

45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.

47. మృగయా - వేటాడు నేర్పు

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.

49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.

51. చిత్ర - చిత్రకళ

52. లోహా - పాత్రలు చేయి నేర్పు

53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.

54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు

55. దారు - చెక్కపని

56. వేళు - వెదరుతో చేయు పనులు

57. చర్మ - తోళ్ళపరిశ్రమ.

58. అంబర - వస్త్ర పరిశ్రమ

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య


Thursday, September 17, 2009

ఒక మంచికథ- విశ్వాసం,గాఢత కలిగిన పని శీఘ్రఫలసాధనం


ఆది శంకరాచార్యుల శిష్యుడైన పద్మపాదుని జీవితములో జరిగిన ఒక సంఘటన.
పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది దాని జపం కోసం అహోబిల క్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చొన్నారు. ఒక ఎరుకవాడు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారని తాను ఏదైనా చేయగలది ఉందాయని పరామర్శించాడు. తాను నరసింహాన్ని అన్వేషిస్తూ, ఆవనము లోనికి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టి మృగం లేదని ఆ ఎరుకవాడు అన్నాడు. ఉందని పద్మపాదులు అన్నాడు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఆ ఎరుకవాడికి చెప్పాడు.

అంతటితో ఎరుకవాడు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా తాను ఆ మృగాన్ని తెచ్చి పద్మపాదులముందు నిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికి ప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు.

అంతటితో నరసింహుడు ఆ ఎరుకువానికి ప్రత్యక్షమౌతాడు.

తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఆ ఎరుకుధ్యానం రెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకా జపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో (అంటే కనబడకుండా తాను శబ్దం మాత్రం చేస్తూ తన ఉనికిని చెప్పడం) మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. అవసరమైనప్పుడు ఇంకోసారి తన ఆవేశంలో లోకోత్తరమైన ఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు.

శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో నరసింహస్వామి పద్మపాదుడిని పూని కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారు.

ఈ ఎరుకువానికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. ఆ విశ్వాసంతో తానుచూడని నరసింహాన్ని వర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. ఆ అన్వేషణలో రాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే.

నరసింహము ఉన్నదని విశ్వసించాడు. ఆ సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణ అతనికి ధ్యేయమైంది.. దానికోసం తన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచేతనే అతనికి భగవద్దర్శనం కల్గింది.

Wednesday, September 16, 2009

M.S.సుబ్బులక్ష్మి - మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ


నేడు సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు. కేవలం ప్రతిభ ద్వారానే మనుషులు గొప్పవారు కాలేరు. అహంకారానికి లోనుకాకుండా మానవత్వం కలిగిఉండేవారే అచంద్రతారార్కం నిలిచిఉంటారనే దానికి సుబ్బులక్ష్మి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన.

బాగాపేరువచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి సుబ్బులక్ష్మిగారు ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. గేటు బయట ఒక ముసలావిడ సుబ్బులక్ష్మిగారిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మిగారు విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు.
ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ముసలావిడ సుబ్బులక్ష్మిగారితో " మీ కచేరి చూద్దామని 10మైళ్ళ నుండి నడుకొనివచ్చాను.నా దురదృష్టం కొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు" అంది. సుబ్బులక్ష్మిగారు ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధముగా సుబ్బులక్ష్మిగారు ఆ ముసలావిడ ఒక్కదానికోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు.

"ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి" అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ.


Tuesday, September 15, 2009

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు నేడేఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించిన ఆ మహనీయుడెవరు..?

నేడు మన దేశం సుభిక్షంగా పంట, పొలాలతో... వరద ముంపులేని ప్రాంతాలతో తులతూగడానికి కారణం ఓ మహామనిషి. ఊళ్లకు ఊళ్లనే తన గర్భంలో కలిపేసుకునే ఉగ్ర గంగను ఆపిన మహా శక్తివంతుడాయన. ఏడుకొండలవాడా... ఎక్కడున్నావయ్యా.. అంటూ అలసిసొలసిన భక్తునికి వేంకటేశుని పాదాల చెంతకు వెళ్లే అతితేలికైన దారిని చూపించిన మహామేథావి. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక రంగానికి పుట్టిల్లయినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్లిలో సెప్టెంబరు 15, 1861న జన్మించారు విశ్వేశ్వరయ్య.
ఆనకట్టల రూపశిల్పి

ఒక్కసారి ఆ మహనీయుని చరిత్రను ఈ సెప్టెంబరు 15న ఒకసారి అవలోకిద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన బాల్యంలో అనేక ఆటుపోట్లను చవిచూశారు. సంస్కృతంలో ఉద్దండులైన తండ్రి శ్రీనివాసశాస్త్రిను విశ్వేశ్వరయ్య కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే పోగొట్టుకున్నారు. నిజానికి విశ్వేశ్వరయ్య తాత ముత్తాతల ఊరు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీపంలోని మోక్షగుండం గ్రామం.

అయితే మూడు దశాబ్దాల క్రితం మోక్షగుండం నుంచి మైసూరుకు వలస పోయారు విశ్వేశ్వరయ్య కుటుంబీకులు. అయితే వారి జన్మస్థలి నామధేయమైన మోక్షగుండం మాత్రం వారి వెన్నంటే వెళ్లింది. అందుకే మోక్షగుండం వారి ఇంటిపేరు అయింది. అందుకే ఆ పేరు విన్నప్పుడు చటుక్కున మన ఆంధ్ర రాష్ట్రంలోని గిద్దలూరులోని మోక్షగుండం మదిలో కదలాడుతుంది.

అదలావుంచితే 15 ఏళ్ల ప్రాయంలో తండ్రిని పోగొట్టుకున్న విశ్వేశ్వరయ్య, తన ప్రాథమిక విద్యను బెంగళూరులోని చిక్బల్లాపూర్‌లో పూర్తి చేశారు. 1881 సంవత్సరంలో మద్రాసు యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా పొందారు. ఆ తర్వాత పూనెలో సివిల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయనను ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లోకి ఆహ్వానించింది.

కమిషన్‌లోకి అడుగుపెట్టిన విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో సాగునీటి సమస్యపై తీవ్రంగా కృషి చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 1903లో ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ల పద్ధతిని కనుగొన్నారు. అంతేకాదు వాటిని పూనెలోని ఖండక్వస్ల రిజర్వాయిర్‌లో నెలకొల్పారు.

రిజర్వాయిర్‌లో భారీగా చేరే నీటిని నిలువవుంచగలిగే సదుపాయంతోపాటు డ్యామ్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా చూడటంలో ఈ ఫ్లడ్ గేట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సూత్రం విజయవంతం కావడంతో దేశంలో పలుచోట్ల ఇదే తరహా పద్ధతిని ప్రవేశపెట్టారు.

వరద ముప్పుతో అల్లాడే హైదరాబాదు నగరానికి శాశ్వత ప్రాతిపదికన ఆయన రూపొందించిన డిజైన్ సత్ఫలితాలనివ్వడంతో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఇలా ఆయన దేశంలోని ఆయా ప్రాంతాల్లో పరుగులు తీస్తూ సముద్రంలో వృధాగా కలిసిపోయే గంగను ఆపడమేకాక నగరాలకు నగారలనే తన గర్భంలో కలుపుకునే ఉగ్ర గంగను సైతం బంధించాడు.

అంతేనా ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించారు. అలా గోవిందుని సన్నిధికి చేరేందుకు రాచబాటను ఏర్పాటు చేశారు విశ్వేశ్వరయ్య. ఇలా ఆయన రూపొందించిన డిజైన్లు, వాటివల్ల కలిగిన ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన మేథస్సుకు అంతేలేదు. ఆయన ఓ విజ్ఞాన గని. ఆయన మెదడు ప్రణాళికలమయం.

ఆ మేథస్సుకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆయనను వెతక్కుంటూ వచ్చాయి. డాక్టరేట్లు, ఎల్ఎల్డీలు... ఇలా ఎన్నో ఆయన ముంగిట వాలాయి. ఇక ఆయన పేరిట మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు వెలిశాయి. భారతప్రభుత్వం ఆయనను అత్యున్నత భారత రత్న అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఆయన పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబరు 15ను "ఇంజినీర్స్ డే"గా ప్రకటించి ఆయనపట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది.
వీరు 1962,ఏప్రిల్ 12 న పరమపదించారు.
-telugu.webdunia.com సౌజన్యముతో

అమ్మా!M.S.సుబ్బులక్ష్మీ కారణజన్మురాలవమ్మా!


"ఎందరో మహానుభావులు,అందరికీ వందనములు" అన్న త్యాగరాజ కీర్తన ఎన్నోసార్లు విన్నాను. కాని నాగయ్యగారు తమ చిత్రం త్యాగయ్య లో పాడిన ఈ పాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలాగే నిన్న నేను సుబ్బులక్ష్మి గారు పాడిన అదే పాట దైవికముగా వినడం జరిగింది. పాట వింటున్నంత సేపు,తర్వాత కూడా ఆ భావావస్థ అలానే కొనసాగుతోంది. తెలియకుండానే ఆనందభాష్పాలు రాల్చాను. ఆ పాటలో ఆమె ఎంత లీనమై పాడింది.ఈ పాటే కాదనుకోండి, ఆమే అన్ని పాటలు అంతే తన్మయత్వంతో పాడుతుంది. సుబ్బులక్ష్మి గారు పాడిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణుసహస్రనామ స్తోత్రం అన్నీ మనకు తెలుసు.

కాని నిన్న నేను విన్న ఆమె పాడిన "ఎందరో మహానుభావులు" పాట ఎంతగా కదిలించినదంటే ఇంకా మనసు,శరీరం పులకరిస్తూనే ఉంది. కాని అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రేపు సుబ్బులక్ష్మిగారి పుట్టినరోజు అని నాకు ఈ రోజే తెలిసింది. నా ఆనందం రెట్టింపైంది. ఆమె పుట్టినరోజు సందర్బముగా భగవంతుడు ఆమె పాడిన పాట ద్వారా నాకు అనన్యమైన సంతోషం, బ్రహ్మానందం కలిగించినందుకు భగవంతునికి సహస్రకోటి వందనాలు, సుబ్బులక్ష్మిగారికి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను.

నేడు ఆమె మన మధ్య భౌతికముగా లేకపోయినా ఆమె తన పాటల ద్వారా ఆచంద్రతారార్కం మన మధ్య ఉంటుంది.

క్రింద ఆ పాట యొక్క వీడియో చూడండి.Monday, September 7, 2009

కాపీ కొట్టినప్పుడు ధైర్యముగా చెప్పుకోండి

శ్రీ రామదాసు చిత్రములో నాగేశ్వరరావు, నాగార్జునల పాట "శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవడు?" అన్న పాట వినే ఉంటారు.
అందులోని చరణాలు కొన్ని:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..

ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..

ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ !

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ..

ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ..

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ..
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ
!

ఈ పాట వింటుంటే ఎంతో ఆనందము అనుభవించాను.

ఈ మధ్య కాకతాళీయముగా ఒక అన్నమాచార్య సంకీర్తన విన్నాను. అదేమిటంటే
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు


అరే ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అనుకొంటుంటే శ్రీ రామదాసు చిత్రములోని "శుభకరుడు" పాట గుర్తుకు వచ్చింది. ఈ పాట వ్రాసిన వారు ఈ పాటను అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది. ఆ శృతి(Tuning) కూడా అలానే దింపివేసారు కదా. బాగుంది మంచి పాట అందించారు కాని అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని ,కాస్త మార్పులు చేసి వ్రాశామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది.

క్రింద లంకె(link) లో ఆ అన్నమాచార్య కీర్తనను వినండి.

http://www.esnips.com/doc/56a1760e-2a4d-4a9a-b635-6b038b0bd4d9/nityAtmuDaiyumDi-nityuDai

Saturday, September 5, 2009

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు
ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః

Thursday, September 3, 2009

చనిపోయింది మీ దేహము మాత్రమే, మీరు కాదు. మీ ఆశయాలు అమరణము.


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః

ఈ ఆత్మను ఏ ఆయుధాలు ఖండింపలేవు. అగ్ని దీనిని దహింపలేదు. నీరు తడిచేయలేదు,గాలి ఎండింపలేదు. ఈ ఆత్మ శాశ్వతము.


జయహో రాజశేఖరా!


మీరు మరణించలేదు.


మీ దేహము మరణించినా


మీ ఆశయాలు,మీ చిరునవ్వులు


మా మనసులలో కలకాలం ఉంటాయి.

Wednesday, September 2, 2009

Y.S.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగి వస్తారు.


ముఖ్యమంత్రి గారు శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ,ముక్కోటి దేవతలను, శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిద్దాం.


Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు