తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స
Showing posts with label సాంకేతికవిజ్ఞానము. Show all posts
Showing posts with label సాంకేతికవిజ్ఞానము. Show all posts

Thursday, September 25, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 1





మనకు తెలుసు ఐన్‌స్టీన్ ప్రపంచప్రఖ్యాతి పొందినది తను కనుగొన్న సాపేక్షసిద్దాంతాల వలన.ఇవి ప్రత్యేక,సాధారణ సాపేక్షసిద్దాంతాలని రెండు రకాలు.ఈ భాగంలో మనం సాధారణ సాపేక్ష సిద్దాంతం గురించి చూద్దాం.ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌స్టీన్ 1915 వ సంవత్సరం లో ప్రతిపాదించాడు.(ఈ విషయంపై 1907 నుండి 1915 వరకు పరిశోధనలు చేసాడు).తర్వాతి
భాగాలలో ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం వివరాలు తెలుసుకొందాము.

మొదట సాపేక్షం అంటే ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాము.మనం ఒక వస్తువు పొడుగ్గా ఉన్నది అంటున్నామంటే దాన్ని మనం దాని పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్న వస్తువుతో పోల్చి పొడుగ్గా ఉన్నదని అంటాము.ఇలానే ఒకడు ఇంకకడికంటే వేగంగానో లేక ఆలస్యంగానో పరుగెడుతున్నాడని,ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ లేక తక్కువ మార్కులు తెచ్చుకుంటాడని చెప్తాము.అంటే ఒక వస్తువు లక్షణం దృష్ట్యా ఇంకో వస్తువు లక్షణం చెప్తున్నామన్న మాట.ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతివిషయాన్నీ ఇంకొక అదే లక్షణాలు గల
విషయంతో పోల్చి చూస్తుంటాము.దీన్నే "సాపేక్షము" లేక "సాపేక్షత" అంటారు.

ఇక అసలు విషయమైన సాధారణ సాపేక్ష సిద్దాంత విషయానికి వద్దాము.

ఈ సిద్దాంతము ప్రధానంగా గురుత్వాకర్షణ విషయాన్ని చర్చిస్తుంది.గురుత్వాకర్షణ విషయన్ని న్యూటన్ ప్రతిపాదించాడని మనకు తెలుసు.న్యూటన్ ప్రకారం సృష్టిలో ప్రతి వస్తువూ ఇంకొక వస్తువుని ఆకర్షిస్తోంది.ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణశక్తి మొదట వాటి ద్రవ్యరాశి పై మరియు వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది.ద్రవ్యరాశులు పెరిగేకొద్దీ ఆకర్షణ పెరుగుతుంది.అలాగే దూరం పెరిగేకొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.ఇలా సృష్టి మొత్తం ఈ నియమాలు పాటిస్తాయని న్యూటన్ కనుగొన్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ అసలు అవి ఎందుకు ఆకర్షించుకొంటున్నాయో న్యూటన్ చెప్పలేదు.
సాధారణ సాపేక్షసిద్దాంతం ఈ విషయాన్ని గురించే చెబుతుంది.
మనకు తెలిసిన మూడు కొలతలు పొడవు,వెడల్పు,లోతు లతో పాటు ఐన్‌స్టీన్ నాల్గవ కొలత గా కాలాన్ని తీస్కొన్నాడు.ఈ నాలుగు కొలతలతోనే విశ్వమంతా ఉంటుంది.(మొత్తం 11 కొలతలు ఉంటాయని నేటి శాస్తవేత్తలు భావిస్తున్నారు.)ఈ నాలుగు కొలతలు గల ప్రదేశాన్నే "space time continuum" అంటారు.ఈ continuum లో ఏదైనా బరువైన వస్తువును పెట్టినప్పుడు ఆ వస్తువు పెట్టిన చోట ఒక గుంత లాగ ఏర్పడుతుంది.ఉదాహరణగా మనం దిండు(తలగడ) పైన ఏదైనా బరువైన వస్తువును ఉంచామనుకోండి.అక్కడ ఒక గుంత లాగ ఏర్పడినట్టు అన్నమాట.అర్థం కావడానికి ప్రక్క పటాలు చూడండి.ఆ గుంతకు సమీపంలోని వస్తువులు,పరిధిలోని వస్తువులు ఆ గుంతలోనికి దొర్లినప్పుడు మనకు ఆ దొర్లుతున్న వస్తువులు ఆ పెద్ద వస్తువుచేత ఆకర్షింపబడుతున్నట్టు కనబడతాయి.దీనినే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతము అంటారు.ఎంతగా ఆ వస్తువులు దొర్లుతాయి అనే విషయం న్యూటన్ చెప్పిన సిద్దాంతం ద్వారా కనుగొనవచ్చు.

ఇది అర్థం కావడానికి సైన్సు లో ఒక ప్రసిద్ద ఉదాహరణను చెబుతారు.అది ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయాడనుకోండి.న్యూటన్ ప్రకారం ఆ విషయం వెంటనే భూమికి తెలిసిపోయి తన కక్ష్య నుండి తప్పి సరళరేఖామార్గంలో విశ్వంలోనికి వెళ్ళిపోతుంది.కాని నిజానికి అలా జరుగదు.ఎందుకంటే ఈ విశ్వంలో కాంతి కన్నా వేగంగా ఏ వస్తువూ,శక్తీ ప్రయాణించదని మనకు తెలిసిన సిద్దాంతాల ద్వారా తెలుస్తోంది.మనకు తెలుసు సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు తీసుకుంటాయని.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి చేరడానికి 8 నిమిషాల పైనే పడుతుంది.అప్పుడే భూమి తన కక్ష్య నుండి ప్రక్కకు తప్పుకుంటుంది.ఐన్‌స్టీన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ సూర్యుడు మాయమైనందున space time continuum లో ఏర్పడిన గుంత మామూలు స్థాయికి వస్తుంది.ఇలా గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో వ్యాపించి ఆ continuum అంతా
బల్లపరుపుగా అవుతుంది.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి 8 నిమిషాల తర్వాతే తెలుస్తుంది.

స్థలకాలం వంగి ఉందన్న అద్భుతవిషయము,దానికి ఋజువులు మొదలగు వివరాలు తర్వాత టపాలో తెలుసుకొందాము.

Monday, September 22, 2008

సినిమా ఎలా తీస్తారు?(సైన్సు)

మనమందరూ సినిమాలు చూస్తాము.కానీ సినిమాలు ఏ విధంగా తీస్తారు,బొమ్మలు ఎలా కదులుతున్నాయి అనే విషయం ఇంకా కొందరికి తెలియదు.

సినిమా తీయడానికి మూలాధారము తీసే కెమెరా,తీసిన సినిమాను చూపించే ప్రొజెక్టరు.

కెమెరా:
మన అందరికీ తెలుసు ఫోటో కెమెరా ఎలా పని చేస్తుందనే విషయం.కెమెరా క్లిక్ చేసినప్పుడు కెమెరా కు ముందున్న కుంభాకారకటకం(lens) ద్వారా మన బింబం యొక్క కాంతికిరణాలు కటకం వెనుక భాగమున ఉన్న
ఫోటోగ్రాఫిక్ ఫిల్ము పై పడి అక్కడ మన ప్రతిబింబమును ఏర్పరుస్తాయి. ఆ ఫిల్ము పై రసాయనాలు పూసిఉండడం వలన ఇది జరుగుతుంది.తర్వాత మనమే తర్వాత ఫిల్ము వచ్చేలా తిప్పాలి లేక దానంతటదే( ఆటోమేటిక్ ఐతే) తరవాత ఫిల్ము వచ్చేలా తిరుగుతుంది.ఇది కదలని చిత్రాలకోసం ఐతే.

మన కన్ను సెకనుకి 16 దృశ్యాలకంటే ఎక్కువ ఉంటే గనుక ఆ దృశ్యాన్ని గుర్తించలేదు.సరిగా ఇదే విషయాన్ని సినిమా కెమెరా నిర్మాణ విషయంలో ఉపయోగిస్తారు.

మామూలు కెమెరా లో లాగానే ఫిల్మురీలు ఉంటుంది.కానీ సెకనుకి 16 లేక అంతకన్నా ఎక్కువ ఫిల్ములు మారుతుంటాయి.వాటిపై తీయబడే దృశ్యాల ప్రతిబింబాలు పడతాయి.ఫిల్ము లో ఒక భాగంగా ఒక వైపు ఒక
నల్లని గీత, శబ్దము సంగ్రహించడానికి ఉంటుంది.

నేటి కెమెరాలు సెకనుకి 24 ఫిల్ములపైన తిప్పుతుంటాయి.దానివలన చిత్రంలో స్పష్టత వస్తుంది.

ఇలా తయారుచేసిన రీలును నెగెటివ్ అంటారు(మామూలు కెమెరా లో లాగానే).తర్వాత దాన్ని కడిగి(develop)ఇంకా కావలసినన్ని ఫిల్మ్ లపైన ముద్రిస్తారు.వీటిని పాజిటివ్ లు అంటారు.

ప్రొజెక్టరు:
ఇలా తీసిన ఫిల్మ్ రీళ్ళను ప్రొజెక్టరులో ఉంచుతారు.
ఈ ప్రొజెక్టరు నిర్మాణం ఎలాగుంటుందంటే ముందు ఒక కుంభాకారకటకం ఉంటుంది.దాని వెనుక మరి కొన్ని కటకాలు ఉంటాయి.వీటన్నిటి వెనుక ఫిల్మ్ రీలు ఉంటుంది.ఈ రీలుని తిప్పి పెడతారు.ఎందుకంటే కటకాల గుండా ప్రయాణించి ఇది మామూలు దృశ్యం గా వస్తుంది.ఫిల్మ్ రీలు గుండా శక్తివంతమైన కాంతి ని పంపిస్తారు.

ఈ కాంతి రీలు గుండా ప్రసరించి తెర పైన బొమ్మలను ఏర్పరుస్తుంది.ఈ రీలు తీసినప్పుడు సెకనుకి ఎన్ని ఫ్రేములు తిరిగి ఉంటుందో అన్ని ఫ్రేములుగా ప్రొజెక్టరు లోని మోటరు తిప్పుతుంది.నల్ల గీతపై శబ్దగ్రహణ సాధనం
తగులుతూ అందులోని శబ్దాన్ని గ్రహించి బయటకు ఇస్తుంది.సెకనుకు 16 పైన(ఇప్పుడు 24) ఫ్రేములు తిరగడం వలన మన కళ్ళు కనబడే దృశ్యాలను కదులుతున్నట్టుగా చూస్తుంది.

ఈ ఆధునిక కాలంలో డిజిటల్ కెమెరాలు వచ్చాయి.ఉపగ్రహం ద్వారా కూడా సినిమాలు చూపిస్తున్నారు.

Friday, September 19, 2008

కృష్ణబిలాలు లేక కాలబిలాలు(Blackholes) - వివరణ

ఈ మధ్య బిగ్‌బ్యాంగ్ ప్రయోగం అనగానే అందరినీ భయపెట్టినవి కృష్ణబిలాలు అనే విషయం.అసలు వీటి కథాకమామీషు ఏమిటి?

కృష్ణబిలం అనగా ఒక నక్షత్రం పూర్తిగా నశించగా ఏర్పడే అత్యంత చిన్న పదార్థము(ఆ నక్షత్రము మునుపటి రూపంతో పోల్చుకుంటే). ఈ బిలం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పడిన కాంతి కూడా బయటకు రాలేనంత గురుత్వాకర్షణశక్తి దీనికి ఉంటుంది.మనకు తెలుసు భూమి యొక్క ఆకర్షణశక్తిని దాటుకొని అంతరిక్షంలోనికి వెళ్ళాలంటే సెకనుకు సుమారుగా 11 కిలోమీటర్ల వేగంతో పైకి ప్రయాణించాలి.కాని కృష్ణబిలంలో ఈ వేగం కాంతివేగం కన్న ఎక్కువ ఉండాలి.ఈ వేగాన్ని ఇంతవరకు కనుక్కోలేదు.

కృష్ణబిలాలు ఎలా ఏర్పడుతాయి:

ఒక నక్షత్రం కాంతిని వెలువరచాలి అంటే అందులోని హీలియం ప్రధాన కారణం.ఆ నక్షత్రంలోని హీలియం పూర్తిగా శక్తిగా మారిపోయిన తర్వాత ఆ నక్షత్రం తన స్వంత గురుత్వాకర్షణ ప్రభావం చేత తనలోని పదార్థం తన కేంద్రం వద్దకు ఆకర్షింపబడుతుంది.దీనివలన ఆ నక్షత్రపరిమాణం తగ్గుతూ తెల్లని మరుగుజ్జుగా,న్యూట్రాన్ తారగా మారతుంది.అలా మారుతూ ఒక నిర్దిష్టపరిమాణానికి చేరుకుంటుంది.ఆ పరిమాణం మన కంటికి కనిపించనంత సూక్ష్మపరిమాణం కూడా కావచ్చు.అది సెంటిమీటరులో కోటి వంతుకూడా కావచ్చు.కాని దాని ద్రవ్యరాశి వందలకోట్ల టన్నుల వరకూ ఉంటుంది.ఇవి సూక్ష్మ కృష్ణబిలాలు.ఇవి అత్యంత అధికసాంద్రత కల్గినవి.ఒక మిల్లిమీటరులో కొన్ని కోట్ల టన్నుల ద్రవ్యరాశి నిక్షిప్తమైన అధిక సాంద్రత కలిగి ఉంటాయి. వీటి గురుత్వాకర్షణ చాల ఎక్కువ కాబట్టి వీటి పరిమాణమును బట్టి తన చుట్టుపక్కల ఉన్న ద్రవ్యరాశిని తమలోనికి లాగుకుంటాయి.

వీటి గురుత్వాకర్షణశక్తి పరిధిని సంఘటనా క్షితిజము(Event horizon)అంటారు.ఈ క్షితిజములోనికి ప్రవేశించిన ఏ వస్తువూ (కాంతితో సహా) బయటకు రాలేవు. ఒక వేళ రెండు కృష్ణబిలాలు కనుక కలిస్తే వాటి ద్రవ్యరాశి,సంఘటనా క్షితిజం రెట్టింపు కన్నా ఎక్కువ అవుతాయి.

చంద్రశేఖర్ పరిమితి(Chandrasekhar limiT):

ఏ నక్షత్రమైనా కృష్ణబిలముగా మారాలంటే ఒక నిర్దిష్ట ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉండాలి.చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం(ఇతనికి నోబుల్ బహుమతి వచ్చింది)అనే భారతీయశాస్త్రవేత్త ఈ నిర్దిష్టద్రవ్యరాశి పరిమితిని కనుగొన్నాడు.ఈ పరిమితి మన సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.5(ఒకటిన్నర)రెట్లు అధిక ద్రవ్యరాశి. కృష్ణబిలాలు మరీ కారునలుపేమీ కాదు.ఇవి ఒక వేడివస్తువులాగానే ఉష్ణమును వెలువరుస్తుంటాయి.అత్యంత సూక్ష్మస్థాయిలలో గామా కిరణాలను వెలువరుస్తాయి.

కొన్ని విశేషాలు:

1.విశ్వము ఏర్పడినప్పుడు చాలా కృష్ణబిలాలు ఏర్పడిఉంటాయని నమ్ముతున్నారు.ఐతే అప్పటి కృష్ణబిలాలు ఇంకా ఇప్పటికి ఉండవని శాస్త్రవేత్తల అంచనా.

2.సగటున మన భూమికి,ప్లూటోకు ఎంత దూరం ఉంటుందో అంత పరిధిలోపల 100 దాకా కృష్ణబిలాలు ఉంటాయని అంచనా.

3.కృష్ణబిలాలూ తమ అంత్యదశలో బ్రహ్మాండమైన విస్పోటనం తో పేలిపోతాయి.

4.ఒక నక్షత్రం పేలిపోవడాన్ని సూపర్‌నోవా(SuperNova) అంటారు.

(వనరు(resourse): స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు )

Tuesday, September 16, 2008

గతాన్ని చూడవచ్చు(ఒక సాంకేతిక(సైంటిఫిక్)విశ్లేషణ)




నేడు సైన్సు విజ్ఞానము ఎంతో విస్తరిస్తోంది.కాలయంత్రాలు(Time Machines) ఊహ చాలాకాలంగా ఉంది.వీటిలో గతంలోనికి మరియు భవిష్యత్తు లోనికి ప్రయాణించాలని అనుకోవచ్చు.ఐతే భవిష్యత్తు లోనికి ప్రయాణించడం ఆచరణ సాధ్యం కాదు.ఎందుకంటే భవిష్యత్తు ఇంకా జరగలేదు కాబట్టి.
అలానే గతంలోనికి కూడా ప్రయాణించడం సాధ్యం కాదు.
ఐతే గతాన్ని,గతంలో ఒక ప్రదేశంలో జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగా చూడడానికి ఆస్కారం ఉంది.ఇది అత్యంత కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం.ఈ విషయం అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు.సరే ఇక విషయానికి వద్దాము.

మొదట ఒక విషయం తెలుసుకోవాలి.అదేమంటే మనం ఒక వస్తువునిగానీ తద్వారా ఒక సంఘటనను చూడాలంటే ఆ వస్తువుపైన కాంతి పడి ఆ పడిన కాంతి మన కన్నులను చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలము.కాబట్టి మనం చూడాలంటే కాంతి అవసరము.

మనలో చాలామందికి తెలుసు కాంతి వేగం సుమారుగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు అని.ఈ విధముగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతిసంవత్సరము అంటారు.(ఒక కాంతి సంవత్సరము= 5,880,000,000,000 మైళ్ళు లేక 9,460,000,000,000 కిలోమీతర్లు లేక 63,240 A.U(ఆంగ్‌స్ట్రాం యూనిట్లు)). కాబట్టి కాంతి సంవత్సరము అంటే అది సంవత్సరాలను సూచించేది కాదు దూరాన్ని సూచించేది అని అర్థం చేసుకోవాలి.
సూర్యుని నుండి భూమికి కాంతి ప్రసారం కావడం గమనించండి.సూర్యుని నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా 8 నిమిషాలు పడుతుంది.అంటే ఇంతకు ముందు మనము అనుకున్నదాని ప్రకారము మనము 8 నిమిషాల క్రిందటి సూర్యున్ని చూస్తున్నాము.ప్రస్తుతము(అంటే ఈ క్షణము)సూర్యునిలో ఒక గమనింపదగ్గ పెద్ద పర్వతము ఆకుపచ్చ రంగులోనికి మారిందనుకుందాము.ఆ సంఘటనకు సంబంధించిన కాంతి కిరణాలు మనలను చేరడానికి 8 నిమిషాల సమయం తీస్కుంటాయి కాబట్టి మనకు ఆ పర్వతం ఆకుపచ్చ రంగులోకి మారడం మనం ఇప్పటి నుండి 8 నిమిషాల తర్వాత మాత్రమే చూడగలము.
ఒక పరిశీలకుడు భూమి పైన గల ఒక ప్రదేశము నుండి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఒక దూరదర్శిని(Telescope)ను కలిగిఉన్నాడనుకుందాము.ఈ పరికరము అంతదూరము నుండి కూడా స్పష్టంగా భూమిపైన గల ప్రదేశాన్ని చూపగలిగినదై ఉండాలి.

ఆ ప్రదేశము నుండి భూమిపైన గల ఒక ప్రదేశాన్ని అతను చూస్తున్నప్పుడు అతనికి 4 సంవత్సరాల క్రిందటి విషయము చూస్తుంటాడు.ఎందుకంటే ఇంతకుముందు మనము చెప్పుకున్న దాని ప్రకారము 4 సంవత్సరాల క్రిందటి కాంతికిరణాలు అతన్ని ఇప్పుడు(అతని సమయం ప్రకారం)చేరుతున్నాయి.మన కాలం ప్రకారం ఇప్పుడు మనకు జరుగుతున్న విషయాలు అతను చూడాలంటే 4 సంవత్సరాలు జరగాల్సిందే.అప్పుడు మాత్రమే ఈ క్షణమున మన వద్ద జరిగిన సంఘటనల కాంతి కిరణాలు 4 సంవత్సరాల తర్వాత అతనికి చేరి అతను అప్పుడు చూడగలడు.(ఇక్కడ పరిశీలకుడు మనము ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నాడని అనుకుందాము).

3 వ పటం గమనిస్తే పరిశీలకుడు ఒక కాంతిసంవత్సరము దూరం నుండి ఒక సంవత్సరం క్రిందటి సంఘటనలను,2 కాంతి సంవత్సరాల దూరం నుండి 2 సంవత్సరాల క్రిందటి సంఘటనలను అలాగే 3,4 కాంతిసంవత్సరాల దూరం నుండి 3,4 సంవత్సరాల క్రితం సంఘటనలను చూస్తాడని తెలుసుకోవచ్చు.(ఈ సంవత్సరాలనేవి మన దృష్ట్యా నేను చెప్తున్నాను.పరిశీలకునికి అవి అప్పుడే జరుగుతున్నట్లు అనుకుంటాడు).

ఇప్పుడు పటం(4) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు భూమిపైన ఈ క్షణంలో కాంతివేగంతో ప్రయాణం మొదలు పెట్టాడనుకుందాము.అతను భూమిపైన తను బయలుదేరిన ప్రదేశాన్ని చూస్తూ వెనుకకు ప్రయాణిస్తున్నాడనుకుందాము.అప్పుడు భూమిపైన జరుగుతున్న సంఘటనల సమాచారాన్ని తీసుకువెళ్ళే కాంతి తో పాటు అతడు ప్రయాణిస్తుంటాడు.ఇక్కడ అత్యంత ఆశ్చర్యకర అనుభవాన్ని పరిశీలకుడు పొందుతాడు.అదేమంటే కాలం నిలిచిపోయినట్టు అతడికి అనుభవం అవుతుంది.అతడు బయలుదేరిన క్షణంలో సంఘటన ఐతే అతను భూమిపైన చూశాడో అదే సంఘటనను అతను చూస్తూనే ఉంటాడు.ఎందుకంటే అతను సంఘటనను చూపించే కాంతికిరణాలతోపాటే అదే వేగంతో(అంటే కాంతి వేగంతో) అతడు ప్రయాణిస్తున్నాడు.దానివలన అతను ఎంతదూరం పోయినప్పటికీ అతను చూసిన సంఘటన ను చూపించే కాంతికిరణాలు కుడా అతనితో పాటే వస్తుండడం వలన అతనికి సంఘటన తప్ప వేరే ఏమీ కనిపించదు.కాబట్టి కాలం నిలిచిపోయినట్లు అతడికి అనుభవం అవుతుంది.

ఇపుడు పటం(5) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు కాంతికి రెట్టింపు వేగంతో ప్రయాణం మొదలుపెట్టాడనుకుందాము.ఆ సమయం సెప్టెంబరు 16,2008 అనగా ఈ రోజు అనుకుందాము.అతను ఈ రెట్టింపు వేగముతో రెండు సంవత్సరాల పాటు పైకి ప్రయాణించాడనుకుందాము.అప్పుడు మనకు సెప్టెంబరు 16,2010 అవుతుంది..ఇప్పుడు అతను అక్కడ ఆగి భూమివైపు చూస్తున్నాడనుకుందాము.కానీ ఇక్కడే విచిత్రము జరుగుతుంది.ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.
పటం(5) గమనిస్తే అతను కాంతికి రెట్టింపువేగంతో 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత పరిశీలకుడు B స్థానం వద్ద,కాంతి A స్థానం వద్ద ఉంటుంది.అంటే కాంతి 2 సంవత్సరాల దూరంలో,పరిశీలకుడు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడు.అంటే అప్పుడు మనకు సెప్టెంబర్ 16,2010 అవుతుంది.ఇప్పుడు మనం ఈ రోజు సెప్టెంబర్ 16,2010 అనుకుందాము.అంటే ఒకటవ కాంతి సంవత్సరం దూరానికి ఇప్పటి మన సంఘటనల కాంతికిరణాలు పోవడానికి ఒక సంవత్సరం పడుతుంది.ఒకటవ కాంతి సంవత్సరం దూరంలో సెప్టెంబర్ 16,2009 యొక్క సంఘటనలు చూడవచ్చు.2 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2008 నాటిసంఘటనలు,3 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2007 నాటి సంఘటనలు మరియు 4 కాంతి సంవత్సరాల దూరంలో అంటే మన పరిశీలకుని స్థానంలో సెప్టెంబర్ 16,2006 యొక్క సంఘటనల కాంతి కిరణాల కారణంగా పరిశీలకుడు సెప్టెంబర్ 16,2006 వ రోజును చూస్తుంటాడు.
అంటే అతను బయలుదేరింది సెప్టెంబరు 16,2008,కానీ అతను చూస్తున్నది సెప్టెంబరు 16,2006.
దీనిని బట్టి అతను 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత మన ప్రకారం సెప్టెంబరు 16,2010 చూడాల్సింది అతను గతం లోని సెప్టెంబరు 16,2006 చూస్తున్నాడు.అంటే మొత్తం అతను 4 సంవత్సరాల క్రిందటి విషయాలను ప్రత్యక్షంగా చూస్తున్నాడు.పైన జరిగిన సంఘటనలు కాంతి కన్నా రెట్టింపు వేగంతో పొయినప్పుడు జరుగుతున్నాయి.ఇక్కడ నిజానికి 2 సంవత్సరాలు గడిచిపోయి సెప్టెంబరు 16,2010 వచ్చినప్పటికీ ఇప్పటి సంఘటనలకు సంభందించిన కాంతి కిరణాలు పరిశీలకుని చేరడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది.అంటే మన ప్రకారం సెప్టెంబరు 16,2014 వ తేదీ అతను సెప్టెంబరు 16,2010 యొక్క సంఘటనలను చూడగలడు.కాబట్టి గతాన్ని చూడగలమని స్పష్టంగా అర్థం అవుతోంది.మనము చూడగలము కానీ గతాన్ని మార్చడంకానీ,గతంలో పాల్గొనడం కానీ చేయలేము.
కానీ ఇది ఆచరణసాధ్యం కాకపోవడానికి కొన్ని పరిమితులు అడ్డుగా నిలుస్తున్నాయి.

పరిమితులు(Limitations):

ఐన్‌స్టీన్ సిద్దాంతం ప్రకారం సృష్టి లో ఏ వస్తువూ కాంతివేగాన్ని మించి ప్రయాణించలేదు.అలా ప్రయాణించాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి అనంతం కావాలి.కాని నేటి శాస్త్రవేత్తలు కాంతి కన్నా వేగం గా ప్రయాణించే కొన్ని రకాలైన కిరణాలను కనుగొన్నారు.
కాబట్టి గతాన్ని చూడాలంటే మనిషిని కిరణాలుగా మార్చాలి.తిరిగి అంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి మనిషిగా మార్చాలి.ఇది మన ఊహకు అందని విషయం.
అందువలనే గతాన్ని చూడడం అనే విషయం అత్యంత కష్టమైన విషయం.దాదాపుగా అసాధ్యమైన విషయం.

పైన పేర్కొన్న నిరూపణ కేవలం జరగవచ్చు అని చెప్పగలము కానీ జరుగుతుంది అని అనలేము.
పైన పేర్కొన్న నిరూపణ ఐన్‌స్టీన్ యొక్క సాపేక్ష సిద్దాంతం ద్వారాచేయడం జరిగింది.
పై వ్యాసం ద్వారా కొన్ని కొత్త విషయాలు మనము గ్రహించవచ్చు.అవేమిటో ఇంకో సారి చూద్దాము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు