తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, December 29, 2009

ఎవరికుంటుందండీ శ్రీరాముడికి, హనుమంతుడికీ ఉన్నంత వినయం?


"విద్య యొసగు వినయంబు" అంటారు కదా. ఆ వినయం నేటి విద్యార్థులలో ఏ మాత్రం ఉందో అందరికీ తెలుసు. ఏ చిన్న విజయం సాధించినా ఉద్రేకాన్ని అణచుకోలేక విపరీతంగా పొంగిపోయి అహంకరించే నేటి మనుషులు ( ముఖ్యంగా విద్యార్థులు ) ఉన్న సమాజంలో ఇలాంటి విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ రోజు రామాయణంలో శ్రీరాముడి వినయం ఎలాంటిదో, హనుమంతుని వినయం ఎలాంటిదో చూసాను.

మొదట రామచంద్రుడి వినయం చూద్దాం.

అందరికీ తెలుసు అహల్యను తన పాదాలతో పాపవిమోచనం కలిగించాడని. ఇక్కడ శ్రీరాముడు తనే శాపవిమోచనం కలిగించాననే అహంకారం ఏమాత్రం లేకుండా అహల్య శాపవిమోచనం పొందిన వెంటనే ఆమె తన కన్నా వయసులో పెద్దది అవటం చేత మరియు ఒక ఋషి భార్య అవడం చేత తనే ముందుగా మోకాళ్ళ మీద కూచుని అహల్యకు నమస్కారం చేసాడు.

అలానే విశ్వామిత్రుడి యజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసులను చంపిన తర్వాత ఋషులందరూ రాముడిని "ఇంత చిన్న వయసులోనే అలాంటి రాక్షసులను చంపగలిగావు కదా" అంటూ పొగిడారు. రాముడు ఏమాత్రం అహంకరించకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

ఇక హనుమంతుని వినయం ఎంతటిదో చూద్దాం.

లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.

హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".

హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఎవరూ రాలేకనే కదా హనుమంతున్ని పంపింది. కాని హనుమంతుని వినయం ఎంతగా ఉందో చూసారా? కనీసం అలాంటి వినయాన్ని ఊహించగలమా?
ఇప్పుడు చెప్పండి నేటి యువత కానీ, సమాజం కానీ, చదువుకొన్న,చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎంత వినయం నేర్చుకోవాలో.

Thursday, December 24, 2009

నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం".

నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం" పూర్తి ఆధ్యాత్మికంగా భగవంతుడి లీలలను, భక్తుల చరిత్రలను వ్రాస్తున్నాను. ఆశీర్వదించగలరు.Sunday, December 20, 2009

భక్తులతో, భగవంతునితో పెట్టుకొని నాశనం కాకండి, సమైక్యవాదులైనా ! తెలంగాణావాదులైనా !

సమైక్యరాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. మంచిదే. పోరాడండి. కాని దేవుడిని, భక్తులను ఎందుకు ఈ విషయములోనికి లాగుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంపై కొన్ని జరిగిన సంఘటనలను చూద్దాం.

1. ఒక బ్లాగరి తన బ్లాగులో తెలుగు బాష విషయం పై వాదన చేస్తూ బమ్మెర పోతన తెలంగాణా వ్యక్తి అని వారే అసలైన తెలుగు వారని అందుకే భాగవతం చాలా బాగుంటుందని , నన్నయ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని అందుకే అతను వ్రాశిన మహాభారతం అంత బాగోదని తేల్చేసాడు.
మీ మూర్ఖత్వాన్ని, వాదనలను మీ వద్దే పెట్టుకోండి.
భక్తులకు విశ్వమంతా ఒక్కటే. వారికి దేవుడు తప్ప ఇతరాలు కానరావు. మన అజ్ఞానంతో భక్తుల పట్ల అపచారాన్ని చేస్తున్నాము. దేవుడు తనను ఏమైనా అన్నా ఉపేక్షిస్తాడేమో గానీ, భక్తుల జోలికి వస్తే ఊరుకోడు.

2. విజయవాడ అమ్మ వారి ప్రసాదాన్ని వేములవాడకు పంపిస్తే ఆ ప్రసాదం ఆంధ్రప్రాంతం వారిదని త్రిప్పి పంపేశారట. దుర్గమ్మ జగన్మాత, అంతే కాని ఆంధ్రామత అనో లేక తెలంగాణా మాత మాత్రమో కాదు. భధ్రాచలం రాముడైనా, తిరుపతి వెంకన్న ఐనా ఇద్దరూ ఒకటే అని తెలిసినా మూర్ఖవాదాలతో కాలం సాగిస్తున్నారు.

ఎవరైనా ఎంతైనా పోరాడండి. హద్దుల్లో ఉండి పోరాడండి. అంతేకాని దేవుడి విషయంలో కాని, ఇంకా ముఖ్యముగా భాగవతుల(భక్తుల) విషయంలో కాని పొరపాటున ఐనా తప్పు చేస్తే లేక మన ప్రాంతీయవాదాల్ని వారికి అంటగడితే నాశనం కాకతప్పదు.

గమనిక : ఈ టపా ఏ ఉద్యమానికీ వ్యతిరేకంగానో లేక మద్దతుగానో వ్రాయబడలేదు. ఆధ్యాత్మిక సంబంధంగానే వ్రాయబడింది.
Monday, December 14, 2009

దక్షిణామూర్తి పూర్తి కథ


రవిచంద్ర గారు తమ బ్లాగులో దక్షిణామూర్తి కథ వ్రాశారు. ఆ టపాకు వ్యాఖ్య వ్రాద్దామంటే ఒక టపా అంత అవుతుంది. అందుకే ఈ టపా వ్రాస్తున్నాను.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక,సనందన,సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువుకోసం వెదుకుతూ నారదమహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నారు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడనూ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు భోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు,మనసుకూ అందనివారు కాబట్టి అలా భోధించారు.


Friday, December 11, 2009

ఇదేనా చదివిన చదువు మనకు నేర్పింది ? సిగ్గుపడాలి.

తెలంగాణా విషయం మొదలైనప్పటి నుండి అసలు మన విద్యా వ్యవస్థ యొక్క పస ఏంటో, అది మనకు ఏం నేర్పుతోందో అర్థం అవుతోంది. అసలు విద్యార్థులు ఏం చదువుతున్నారో , ఎందుకు చదువుతున్నారో అర్థం కాకుండా ఉంది. "విద్య యొసగు వినయంబు " అంటారు , ఆ వినయంతో " విచక్షణా జ్ఞానం" వస్తుందని అంటారు. కాని ఎక్కడ వస్తోంది?

కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా, పాలిచ్చే ఆవును గాయపరిచినట్లుగా , పండిన పంటను తగలబెట్టినట్లుగా ఉంది విద్యార్థుల వ్యవహారం. లేకపోతే సమాజానికి ఉపయోగపడే బస్సులను, ఇతరుల వాహనాలను , పొట్టకూటికి జరుపుకొనే వ్యాపారాల పైనా వీరి ప్రతాపం? ఇప్పుడు బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు . మళ్లీ అంతా సద్దుమణిగాక ఆ నష్టపోయిన ఆస్తులకు పరిహారం ఎవరు, ఎలా ఇస్తారు? ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం ఎలా తెస్తుంది? అదనపు పన్నులు ప్రజల పైన వేయడం ద్వారా . అంతే కదా? ఈ మాత్రం మూల విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా ?

రాజకీయనాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొడితే చేసేయడమే. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేక పొతే ఎలా ? అసలు ఈ మాత్రానికి చదవడం ఎందుకు ? డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు ? ఏదైనా సాధించాలంటే ఒక మార్గం అంటూ ఉంటుంది. అది తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరికి నష్టం? మన చదువు ఇదేనా మనకు నేర్పుతోంది?


కొన్ని పల్లెల ప్రజలు ఎన్నో రోజులు కష్టపడి, అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళావెళ్లా పడి తమ పల్లెలకు బస్సును వేయించుకొంటారు. ఇప్పుడు వీరు ధ్వంసం చేసే బస్సులలో అవి కూడా ఉన్నాయి. మళ్లీ ఆ పల్లెలకు బస్సులు తిరగాలంటే వారు ఎంత బాధపడాలి? ఎంతగా మళ్లీ తిరగాలి? మీ పైశాచికానందం కోసం, మీలోని శాడిసం ను తృప్తి పరచడం కోసం ప్రజల ఆస్తులను నాశనం చేస్తారా? అంతగా అవసరం ఉంటే మీ సొంత వాహనాన్ని అది సైకిలైనా , బైకైనా లేక కారైనా కావచ్చు, దాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చి మీ కసితీరా ధ్వంసం చేసుకోండి. ఎవరూ ఏమి అనరు. ఈ మాటను కూడా నేను అనకూడదు. కాని ఇతరులకు , అందరికి ఉపయోగపడే వాటిని నాశనం చేసే బదులు మీవే నాశనం చేసుకొంటే సరిపోతుందికదా.మీ పైత్యం తీరాలి కదా.

ఇతరుల వరకు వస్తే మీకు అది మలం తో సమానం, మీ వరకు వస్తే అది పరమాన్నమా?

ఇక ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు చేస్తున్న గలాటాను చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ఏంటి వారు చదువుకొన్నది? వీరా మనకు న్యాయవాదులు? ఇలాంటి మనస్తత్వం కలవారా న్యాయం కోసం వాదించేది? ఇలాంటి వారి వద్దకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని అనుకోగలమా?

ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే తప్పులు ఎంత వేగంతో మిమ్మల్ను అవి తాకుతాయంటే మీ మాటను కూడా వినడానికి ఎవరూ ఉండరు. మీరు చదివి వృథా. మీకు పెట్టిన డబ్బును ఏ జంతువుకో పెడ్తే అది జీవితాంతం ఋణపడి ఉంటుంది.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఇలాంటివి చేయకుండా ఉంటే అందరికీ మేలు.

గమనిక: నేను ఈ టపాను అందరు విద్యార్థులను ఉద్దేశించి వ్రాయలేదు. ఎవరైతే చదువుకొని కూడా పై విధం గా ప్రవర్తిస్తున్నారో వారిని ఉద్దేశించి మాత్రమే వ్రాసాను. రాజకీయనాయకులు, కార్యకర్తలు, అసాంఘికశక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కూడా విద్యార్థులు, చదువుకొన్నవారు ఉన్నారు కదా. వారిని ఉద్దేశించి మాత్రమే ఇదివ్రాసాను.
Monday, November 9, 2009

ఈ సంఘటనకు మీరైతే ఎలా స్పందిస్తారు? మేము లోకల్.

ఇది బెంగళూరులో నాకు నిజంగా జరిగిన సంఘటన.

పోయిన దీపావళి పండుగ రోజు బెంగళూరులో మేమున్న మారతహళ్ళిలో మేము మా రూం ముందు నిలుచునిఉన్నాము. అప్పుడు రాత్రి 7వ,8వ తరగతి పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. కాల్చడములో ఎవరికీ అభ్యంతరము లేదు కానీ రోడ్డులో పోయేవాళ్ళపైకి చేత్తో టపాసులు కాల్చి విసురుతున్నారు. నేను,నా స్నేహితులు వద్దని వారించాము.

తర్వాత మేము వెనుకకు తిరగగానే ఒక పిల్లవాడు లక్ష్మీటపాసును మా మిత్రుడిపై విసిరాడు. దాంతో మా వాడికి కోపం వచ్చి వానిపై చెయ్యెత్తబోయాడు. కాని ఎందుకులే అని ఊరుకున్నాడు. కాని ఆ అబ్బాయిలు మా వద్దకు వచ్చి కన్నడంలో " మీరు ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.కానీ మేము ఇక్కడ Local. మా మీద చెయ్యెత్తేంత ధైర్యమా మీకు ? చెయ్యెత్తి ఇక్కడ ఉంటామనే అనుకుంటున్నారా?" అని అన్నాడు. మాకు చేష్టలుడిగిపోయాయి(shock). అన్నది పెద్దవారు కాదు. 13,14 ఏళ్ళు వయసు గల పిల్లలు. తప్పు వాళ్ళదే. ఐనా Local feeling వారికి ఎలా వచ్చినో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

ఇక్కడ వ్యవస్థ తప్పా? లేక సినిమాల ప్రభావమా? లేక ప్రాంతీయ దురభిమానమా? ఏమో అస్సలు అస్సలు అర్థం కావడంలేదు.
Friday, October 30, 2009

"ఈశావాస్య ఉపనిషత్తు" ను బ్లాగులో ఇప్పుడే పూర్తిచేసాను.

భగవంతుడి దయవలన "ఈశావాస్య ఉపనిషత్తు"ను బ్లాగులో వ్రాయడం ఇప్పుడే పూర్తి చేసాను. తర్వాత "కేనోపనిషత్తు" ను వ్రాయాలని అనుకుంటున్నాను.

ఉపనిషత్తులు మన ప్రాచీన విజ్ఞానము. వేదాంతముగా ప్రసిద్దికెక్కినవి. వ్యాఖ్యానించడం, వ్యాఖ్యానించకపోవడం ఇక్కడ అప్రస్తుతం. దయచేసి మన ప్రాచీన విజ్ఞానమైన ఉపనిషత్తులను అందరూ చదవాలని కోరుతున్నాను. చదవనివారి కోసం మరియు తెలుగులో ఉపనిషత్తులు ఇంటర్‌నెట్ లో ఉంచాలని నేను సంకల్పించాను.

నా ఉపనిషత్తుల బ్లాగు "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" చూడండి.
Tuesday, October 27, 2009

ఈశావాస్య ఉపనిషత్తు


గత ఫిబ్రవరిలో ఉపనిషత్తులను బ్లాగులో వ్రాయాలని సంకల్పించాను. అది నేటికి కార్యరూపం దాల్చింది.
నా ఉపనిషత్తుల బ్లాగు "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" చూడండి.


Friday, September 18, 2009

64 విద్యలు(కళలు)అంటే ఏవి?


మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

అర్థము:

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)

2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు
(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)

3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు

4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.

5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము

7. నాటకములు

8. గానము (సంగీతం)

9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము

10. కామశాస్త్రము

11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,

12. దేశభాషాజ్ఞానం

13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.

14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,

17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము

18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము

19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం

20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము

22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము

24. పాకకర్మ= వంటలు

25. దోహళము=వృక్షశాస్త్రము

26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు

27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.

31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య

33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పు.

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి

45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.

47. మృగయా - వేటాడు నేర్పు

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.

49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.

51. చిత్ర - చిత్రకళ

52. లోహా - పాత్రలు చేయి నేర్పు

53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.

54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు

55. దారు - చెక్కపని

56. వేళు - వెదరుతో చేయు పనులు

57. చర్మ - తోళ్ళపరిశ్రమ.

58. అంబర - వస్త్ర పరిశ్రమ

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య


Thursday, September 17, 2009

ఒక మంచికథ- విశ్వాసం,గాఢత కలిగిన పని శీఘ్రఫలసాధనం


ఆది శంకరాచార్యుల శిష్యుడైన పద్మపాదుని జీవితములో జరిగిన ఒక సంఘటన.
పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది దాని జపం కోసం అహోబిల క్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చొన్నారు. ఒక ఎరుకవాడు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారని తాను ఏదైనా చేయగలది ఉందాయని పరామర్శించాడు. తాను నరసింహాన్ని అన్వేషిస్తూ, ఆవనము లోనికి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టి మృగం లేదని ఆ ఎరుకవాడు అన్నాడు. ఉందని పద్మపాదులు అన్నాడు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఆ ఎరుకవాడికి చెప్పాడు.

అంతటితో ఎరుకవాడు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా తాను ఆ మృగాన్ని తెచ్చి పద్మపాదులముందు నిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికి ప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు.

అంతటితో నరసింహుడు ఆ ఎరుకువానికి ప్రత్యక్షమౌతాడు.

తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఆ ఎరుకుధ్యానం రెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకా జపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో (అంటే కనబడకుండా తాను శబ్దం మాత్రం చేస్తూ తన ఉనికిని చెప్పడం) మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. అవసరమైనప్పుడు ఇంకోసారి తన ఆవేశంలో లోకోత్తరమైన ఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు.

శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో నరసింహస్వామి పద్మపాదుడిని పూని కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారు.

ఈ ఎరుకువానికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. ఆ విశ్వాసంతో తానుచూడని నరసింహాన్ని వర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. ఆ అన్వేషణలో రాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే.

నరసింహము ఉన్నదని విశ్వసించాడు. ఆ సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణ అతనికి ధ్యేయమైంది.. దానికోసం తన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచేతనే అతనికి భగవద్దర్శనం కల్గింది.

Wednesday, September 16, 2009

M.S.సుబ్బులక్ష్మి - మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ


నేడు సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు. కేవలం ప్రతిభ ద్వారానే మనుషులు గొప్పవారు కాలేరు. అహంకారానికి లోనుకాకుండా మానవత్వం కలిగిఉండేవారే అచంద్రతారార్కం నిలిచిఉంటారనే దానికి సుబ్బులక్ష్మి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన.

బాగాపేరువచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి సుబ్బులక్ష్మిగారు ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. గేటు బయట ఒక ముసలావిడ సుబ్బులక్ష్మిగారిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మిగారు విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు.
ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ముసలావిడ సుబ్బులక్ష్మిగారితో " మీ కచేరి చూద్దామని 10మైళ్ళ నుండి నడుకొనివచ్చాను.నా దురదృష్టం కొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు" అంది. సుబ్బులక్ష్మిగారు ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధముగా సుబ్బులక్ష్మిగారు ఆ ముసలావిడ ఒక్కదానికోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు.

"ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి" అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ.


Tuesday, September 15, 2009

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు నేడేఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించిన ఆ మహనీయుడెవరు..?

నేడు మన దేశం సుభిక్షంగా పంట, పొలాలతో... వరద ముంపులేని ప్రాంతాలతో తులతూగడానికి కారణం ఓ మహామనిషి. ఊళ్లకు ఊళ్లనే తన గర్భంలో కలిపేసుకునే ఉగ్ర గంగను ఆపిన మహా శక్తివంతుడాయన. ఏడుకొండలవాడా... ఎక్కడున్నావయ్యా.. అంటూ అలసిసొలసిన భక్తునికి వేంకటేశుని పాదాల చెంతకు వెళ్లే అతితేలికైన దారిని చూపించిన మహామేథావి. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక రంగానికి పుట్టిల్లయినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్లిలో సెప్టెంబరు 15, 1861న జన్మించారు విశ్వేశ్వరయ్య.
ఆనకట్టల రూపశిల్పి

ఒక్కసారి ఆ మహనీయుని చరిత్రను ఈ సెప్టెంబరు 15న ఒకసారి అవలోకిద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన బాల్యంలో అనేక ఆటుపోట్లను చవిచూశారు. సంస్కృతంలో ఉద్దండులైన తండ్రి శ్రీనివాసశాస్త్రిను విశ్వేశ్వరయ్య కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే పోగొట్టుకున్నారు. నిజానికి విశ్వేశ్వరయ్య తాత ముత్తాతల ఊరు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీపంలోని మోక్షగుండం గ్రామం.

అయితే మూడు దశాబ్దాల క్రితం మోక్షగుండం నుంచి మైసూరుకు వలస పోయారు విశ్వేశ్వరయ్య కుటుంబీకులు. అయితే వారి జన్మస్థలి నామధేయమైన మోక్షగుండం మాత్రం వారి వెన్నంటే వెళ్లింది. అందుకే మోక్షగుండం వారి ఇంటిపేరు అయింది. అందుకే ఆ పేరు విన్నప్పుడు చటుక్కున మన ఆంధ్ర రాష్ట్రంలోని గిద్దలూరులోని మోక్షగుండం మదిలో కదలాడుతుంది.

అదలావుంచితే 15 ఏళ్ల ప్రాయంలో తండ్రిని పోగొట్టుకున్న విశ్వేశ్వరయ్య, తన ప్రాథమిక విద్యను బెంగళూరులోని చిక్బల్లాపూర్‌లో పూర్తి చేశారు. 1881 సంవత్సరంలో మద్రాసు యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా పొందారు. ఆ తర్వాత పూనెలో సివిల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయనను ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లోకి ఆహ్వానించింది.

కమిషన్‌లోకి అడుగుపెట్టిన విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో సాగునీటి సమస్యపై తీవ్రంగా కృషి చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 1903లో ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ల పద్ధతిని కనుగొన్నారు. అంతేకాదు వాటిని పూనెలోని ఖండక్వస్ల రిజర్వాయిర్‌లో నెలకొల్పారు.

రిజర్వాయిర్‌లో భారీగా చేరే నీటిని నిలువవుంచగలిగే సదుపాయంతోపాటు డ్యామ్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా చూడటంలో ఈ ఫ్లడ్ గేట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సూత్రం విజయవంతం కావడంతో దేశంలో పలుచోట్ల ఇదే తరహా పద్ధతిని ప్రవేశపెట్టారు.

వరద ముప్పుతో అల్లాడే హైదరాబాదు నగరానికి శాశ్వత ప్రాతిపదికన ఆయన రూపొందించిన డిజైన్ సత్ఫలితాలనివ్వడంతో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఇలా ఆయన దేశంలోని ఆయా ప్రాంతాల్లో పరుగులు తీస్తూ సముద్రంలో వృధాగా కలిసిపోయే గంగను ఆపడమేకాక నగరాలకు నగారలనే తన గర్భంలో కలుపుకునే ఉగ్ర గంగను సైతం బంధించాడు.

అంతేనా ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించారు. అలా గోవిందుని సన్నిధికి చేరేందుకు రాచబాటను ఏర్పాటు చేశారు విశ్వేశ్వరయ్య. ఇలా ఆయన రూపొందించిన డిజైన్లు, వాటివల్ల కలిగిన ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన మేథస్సుకు అంతేలేదు. ఆయన ఓ విజ్ఞాన గని. ఆయన మెదడు ప్రణాళికలమయం.

ఆ మేథస్సుకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆయనను వెతక్కుంటూ వచ్చాయి. డాక్టరేట్లు, ఎల్ఎల్డీలు... ఇలా ఎన్నో ఆయన ముంగిట వాలాయి. ఇక ఆయన పేరిట మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు వెలిశాయి. భారతప్రభుత్వం ఆయనను అత్యున్నత భారత రత్న అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఆయన పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబరు 15ను "ఇంజినీర్స్ డే"గా ప్రకటించి ఆయనపట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది.
వీరు 1962,ఏప్రిల్ 12 న పరమపదించారు.
-telugu.webdunia.com సౌజన్యముతో

అమ్మా!M.S.సుబ్బులక్ష్మీ కారణజన్మురాలవమ్మా!


"ఎందరో మహానుభావులు,అందరికీ వందనములు" అన్న త్యాగరాజ కీర్తన ఎన్నోసార్లు విన్నాను. కాని నాగయ్యగారు తమ చిత్రం త్యాగయ్య లో పాడిన ఈ పాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలాగే నిన్న నేను సుబ్బులక్ష్మి గారు పాడిన అదే పాట దైవికముగా వినడం జరిగింది. పాట వింటున్నంత సేపు,తర్వాత కూడా ఆ భావావస్థ అలానే కొనసాగుతోంది. తెలియకుండానే ఆనందభాష్పాలు రాల్చాను. ఆ పాటలో ఆమె ఎంత లీనమై పాడింది.ఈ పాటే కాదనుకోండి, ఆమే అన్ని పాటలు అంతే తన్మయత్వంతో పాడుతుంది. సుబ్బులక్ష్మి గారు పాడిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణుసహస్రనామ స్తోత్రం అన్నీ మనకు తెలుసు.

కాని నిన్న నేను విన్న ఆమె పాడిన "ఎందరో మహానుభావులు" పాట ఎంతగా కదిలించినదంటే ఇంకా మనసు,శరీరం పులకరిస్తూనే ఉంది. కాని అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రేపు సుబ్బులక్ష్మిగారి పుట్టినరోజు అని నాకు ఈ రోజే తెలిసింది. నా ఆనందం రెట్టింపైంది. ఆమె పుట్టినరోజు సందర్బముగా భగవంతుడు ఆమె పాడిన పాట ద్వారా నాకు అనన్యమైన సంతోషం, బ్రహ్మానందం కలిగించినందుకు భగవంతునికి సహస్రకోటి వందనాలు, సుబ్బులక్ష్మిగారికి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను.

నేడు ఆమె మన మధ్య భౌతికముగా లేకపోయినా ఆమె తన పాటల ద్వారా ఆచంద్రతారార్కం మన మధ్య ఉంటుంది.

క్రింద ఆ పాట యొక్క వీడియో చూడండి.Monday, September 7, 2009

కాపీ కొట్టినప్పుడు ధైర్యముగా చెప్పుకోండి

శ్రీ రామదాసు చిత్రములో నాగేశ్వరరావు, నాగార్జునల పాట "శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవడు?" అన్న పాట వినే ఉంటారు.
అందులోని చరణాలు కొన్ని:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..

ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..

ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ !

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ..

ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ..

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ..
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ
!

ఈ పాట వింటుంటే ఎంతో ఆనందము అనుభవించాను.

ఈ మధ్య కాకతాళీయముగా ఒక అన్నమాచార్య సంకీర్తన విన్నాను. అదేమిటంటే
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు


అరే ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అనుకొంటుంటే శ్రీ రామదాసు చిత్రములోని "శుభకరుడు" పాట గుర్తుకు వచ్చింది. ఈ పాట వ్రాసిన వారు ఈ పాటను అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది. ఆ శృతి(Tuning) కూడా అలానే దింపివేసారు కదా. బాగుంది మంచి పాట అందించారు కాని అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని ,కాస్త మార్పులు చేసి వ్రాశామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది.

క్రింద లంకె(link) లో ఆ అన్నమాచార్య కీర్తనను వినండి.

http://www.esnips.com/doc/56a1760e-2a4d-4a9a-b635-6b038b0bd4d9/nityAtmuDaiyumDi-nityuDai

Saturday, September 5, 2009

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు
ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః

Thursday, September 3, 2009

చనిపోయింది మీ దేహము మాత్రమే, మీరు కాదు. మీ ఆశయాలు అమరణము.


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః

ఈ ఆత్మను ఏ ఆయుధాలు ఖండింపలేవు. అగ్ని దీనిని దహింపలేదు. నీరు తడిచేయలేదు,గాలి ఎండింపలేదు. ఈ ఆత్మ శాశ్వతము.


జయహో రాజశేఖరా!


మీరు మరణించలేదు.


మీ దేహము మరణించినా


మీ ఆశయాలు,మీ చిరునవ్వులు


మా మనసులలో కలకాలం ఉంటాయి.

Wednesday, September 2, 2009

Y.S.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగి వస్తారు.


ముఖ్యమంత్రి గారు శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ,ముక్కోటి దేవతలను, శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిద్దాం.


Friday, August 14, 2009

మనకు ఆదర్శము పరమేశ్వరుడి కుటుంబమే!


ఎప్పుడైనా శివపార్వతుల కుటుంబము ను గమనించారా?
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులు కాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి కుటుంబ సభ్యులు. సరే, ఇక్కడ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.

పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి, శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమే మహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మ పార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.
సందర్బములో ఒకకుటుంబములోని భర్త తెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతనను ఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలు కొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసం రాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.


అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటే తనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారి సంతోషమేఅమ్మవారిసంతోషము. విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకు అవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్య తెలుసుకోవలసిన విషయం.


ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ. బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వ పుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడు నిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు. కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని) సంతోషముగా అంగీకరించాడు. విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.


ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.
శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.
గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.

మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పర శత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా జంతువునైనా తినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.
కాని కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగా మసలుకొంటున్నాయి.

ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీ బాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.

ఓం నమః శివాయ
ఓం జగన్మాతాయ నమః
ఓం గం గణపతయే నమః
ఓం స్కందాయ నమః

గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్ని ఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను.
,


Wednesday, July 8, 2009

వేదకాలము లో విష్ణువు చిల్లరదేవుడా? హవ్వ!

మధ్య ఏవో పరీక్షలు ఉండడం వలన బ్లాగ్ వ్రాసి దాదాపు నెలకు పైగానే అయ్యింది. మళ్ళీ మొదలు పెడుతున్నాను. సరే విషయానికి వస్తాను.
మధ్య కొన్ని బ్లాగులలో ఒక వింత అయిన విషయాన్ని చూసాను. అదేంటంటే "శ్రీ మహావిష్ణువు వేదకాలములో చిల్లరదేవుడు,తర్వాత లక్ష్మీదేవికి మొగుడు అయినాడు" అని. దీనికి ఉదాహరణగా క్రింద ఇచ్చిన వాక్యాన్ని ఉదహరిస్తున్నారు.
"సమాజానికి అనుగుణంగా దేవుడే మారాడు!...వేదకాలంలో చిల్లర దేవుడిగా ఉండిన విష్ణువు పురాణకాలానికి నాలుగు చేతులతో శంఖుచక్రగధా పద్మాము ధరించి,వర్గ సమాజానికి ఆరాధ్యదేవత అయిన లక్ష్మికి మొగుడై,పాల సముద్రంలో (లేదా వైకుంఠంలో) చేరాడు."
- కొడవటిగంటి కుటుంబరావు,
వ్యాసం:జీవితాలు - దేవుడి పాత్ర
పత్రిక: ప్రభంజనం పక్షపత్రిక
తేది: 16.11.1972
అసలు వీరు వేదాలు కనీసముగానైనా చదివారా అని అనిపించింది.
వారెవరో చెప్పారట, చెప్పినదానిలో నిజము ఉందా? లేదా ? అని కూడా ఆలోచించకుండా మన బ్లాగర్లు తమకు అనుకూలముగా ఉన్నదని ఉదహరిస్తున్నారు.
సరే మనకు తెలుసు ఋగ్వేదము చాలా పురాతనమైనదని. అందులోని 22 సూక్తము 16 నుండి 21 వరకు మంత్రాలు చూడండి.
अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे |
पर्थिव्याः सप्तधामभिः ||
इदं विष्णुर्वि चक्रमे तरेधा नि दधे पदम | समूळ्हमस्य पांसुरे ||
तरीणि पदा वि चक्रमे विष्णुर्गोपा अदाभ्यः |
अतो धर्माणि धारयन ||
विष्णोः कर्माणि पश्यत यतो वरतानि पस्पशे | इन्द्रस्य युज्यः सखा ||
तद विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः | दिवीव चक्षुराततम ||
तद विप्रासो विपन्यवो जाग्र्वांसः समिन्धते |
विष्णोर्यत परमं पदम

వీటి అర్థాలు:

విష్ణువు ,గాయత్రి(గాయత్రి అనేది ఛందస్సు పేరు) మొదలగు ఏడు ఛందస్సులతో భూమిపై పదవిన్యాసము చేసాడు. భూమిపై మానవులు ఉన్నారు. మనుషులను సకలదేవతలు రక్షించాలి.విష్ణువు జగములో సంచరించినాడు. మూడు విధాలుగా అడుగుపెట్టినాడు. విష్ణువు పాదధూళితో సమస్త విశ్వము నిండిఉన్నది.విష్ణువు అజేయుడు,సకల విశ్వమును పాలించు వాడు. అతడు ధర్మరక్షణకు గాను మూడు లోకాలలో మూడు అడుగులు పెట్టినాడు.విష్ణువు యొక్క కర్మలు చూడండి. మనము విష్ణువు గూర్చి కర్మలు చేయుచున్నాము.ఆకాశమున నిలిచి మనము అంతా చూడవచ్చు. అలాగే విద్వాంసులు విష్ణువు యొక్క మహత్తును ఎప్పుడూ అన్నిచోట్లా చూడగలరు.లోపరహితులు, జాగురూకులు ఐన ఋషులు(వేదకర్తలు) విష్ణువు యొక్క పరమపదమును లో ప్రకాశింపచేస్తారు(ప్రకాశిస్తారు).


ఇంత బాగా ఋగ్వేదం యొక్క 22 సూక్తములోనే విష్ణువు యొక్క మహత్వాన్ని వర్ణించారు.

ఇంతేకాక ఋగ్వేదం(10.8.90) లోని పురుషసూక్తం అలానే విష్ణుసూక్తము మరియు తైత్తిరీయరణ్యకం(4.10.13) (యజుర్వేదం) లోని నారాయణసూక్తం అన్నీ విష్ణువును స్తుతించేవే. ఇవన్నీ వేదాలలోనివే కదా.

ఇక లక్ష్మీదేవి విషయానికి వస్తే వేదకాలము నాటికే లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు భార్య అనే విషయం ఇంతకుమునుపు ఉదహరిచిన పురుషసూక్తం మరియు శ్రీసూక్తముల ద్వారా తెలుసుకోవచ్చు.

1.పురుషసూక్తములోని 24వ మంత్రములో "హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ" అంటే లక్ష్మీదేవి మరియు హ్రీదేవి భార్యలుగా కలిగినవాడవు అని.
2.ఇక శ్రీసూక్తం లో "లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం" అనే శ్లోకములో "శ్రీరంగధామేశ్వరీం" అనియు మరియు "వందే ముకుందప్రియం" అనియు ఉన్నాయి. శ్రీరంగధామేశ్వరీం అంటే శ్రీరంగములో వెలిసిన దానా అని అర్థము.శ్రీరంగములో ఉన్నది శ్రీరంగనాథుడు అంటే శ్రీమహావిష్ణువు అని మనకు తెలుసు. అలాగే ముకుందుడు అన్నా విష్ణువే అనియు ముకుందప్రియం అంటే విష్ణువుకు ఇష్టమైనదానా అని అర్థము కదా.
3. శ్రీసూక్తములోనే "పద్మప్రియే పద్మహస్తే" శ్లోకములో "విష్ణుమనోనుకూలే" అని, "ఓం విష్ణుపత్నీం క్షమాందేవీం" అనియు
4."సరసిజనిలయే సరోజహస్తే" శ్లోకములో" భగవతి హరివల్లభే మనోజ్ఞే" అనియు
5. ఇక లక్ష్మీదేవి గాయత్రీమంత్రములో " ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి, తన్నో లక్ష్మిః ప్రచోదయాత్" అని ఉన్నది కదా.

పైవన్నీ ఋగ్వేదములోని శ్రీ సూక్తములోనివే. ఋగ్వేదము అత్యంత ప్రాచీనము అని మనకు తెలుసు.
అందులోనే ఇవన్నీ ఉన్నాయంటే వేదకాలములోనే మహావిష్ణువుకు లక్ష్మీదేవి భార్యగా ఉందని కదా అర్థము. అంతేకాని పురాణాలకాలములో విష్ణువుకు ఎవరూ లక్ష్మీదేవిని అంటగట్టలేదు.

అలాంటిది విష్ణువును చిల్లరదేవుడని ఎలా అనగలరు? చెప్పేముందు కనీసము మూల గ్రంథాలను చదివితే బాగుంటుంది.
అలానే వారెవరో వ్రాసారని మనము మాత్రం ఆలోచించకుండా ఉదహరించడం మిగతావారిని బాధపెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి.
టపా కేవలము "విష్ణువు వేదకాలములో చిల్లరదేవుడు కాడని,వేదకాలమునాటికే విష్ణుపత్ని మహాలక్ష్మీదేవి అని" నిరూపించడానికే వ్రాశాను. వ్యాఖ్యలు విషయానికి సంబంధించే వ్రాయగలరు. అంతేకాని విషయసంబంధము లేకుండా వ్యాఖ్యానిస్తే తొలగిస్తానుSunday, May 17, 2009

మా ప్రాంతపు కొన్ని తెలుగు పదాలు - మా యాస - 1

ఈ శీర్షికను మన విభిన్న ప్రాంతాల మధ్య తెలుగు భాషా పదాలను తెలుసుకోవడానికి మొదలుపెడుతున్నాను. అలాగే ముందు మా ప్రాంతపు పదాలు వ్రాస్తాను. మా ఊరు అనంతపురం జిల్లా, కదిరి పట్టణము.

తొందరగా = బిరిన్న(బిర్న)
గరాటు = లొడిగి
పళ్ళెము = తట్ట ( మిగతా ప్రాంతాలలో తట్ట అనగా గంప అని అర్థము )
ఎల్లుండి = మర్నాడు లేక మన్నాడు
పురోహితుడు చేసే పెళ్ళిపనులు = సాంగ్యాలు
పొద్దస్తమానం = పల్లాపగలు
కొబ్బరిబోండాము = ఎల్లీరు కాయ
ఐదుగురు = ఐదుమంది ( మా ప్రాంతాలలో ఐదుగురు, ఆరుగురు అనే బదులు ఐదుమంది, ఆరుమంది ఇలా ఉపయోగిస్తాము)
పదిహేను = పదహైదు
పద్దెనిమిది = పజ్జెనిమిది

ఇవి కొన్ని పదాలు.  మిగతావి తర్వాత.Wednesday, May 13, 2009

మనము మనుషులమేనా? లేక మానవత్వం లేని రాక్షసులమా?

ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక వార్త నాకు ఈ సందేహం తెప్పించింది. 
అదేమిటంటే కరీంనగర్ జిల్లాలో జరిగిన సంఘటన.

ఒక వృద్ధుడు రైలు వస్తున్నదని తెలియక పట్టాలు దాటుతూంటే అక్కడ ఉన్న మనుషులు ఎవరూ పట్టించుకొన్న పాపానపోలేదు. కాని ఈ విషయం గమనించిన ఒక శిల్ప అనే 22 ఏళ్ళ అమ్మాయి ఆ వృద్ధున్ని చేయి పట్టుకొని లాగబోయింది. ఆ అమ్మాయి పరీక్ష వ్రాయడానికి వెళ్తోంది.కాని అప్పటికే రైలు ఆ వృద్ధున్ని గుద్దివేయగా, ఆ వృద్ధునితో పాటు అతని చెయి పట్టుకొన్న శిల్ప కూడా ఆ విసురుకు దూరముగా విసిరివేయబడింది. జనము ఆ ఇద్దరూ చనిపోయారనుకొని చోద్యం చూసారే కాని ఒకరు కూడా సహాయానికి వెళ్ళలేదు. సుమారు గంట తర్వాత ఆ అమ్మాయి కదలడం చీసి ఎవరో గేట్‌మాన్ కు సమాచారం అందించారు. అతను అంబులెన్స్ కు ఫోన్ చేసారు. వారు వచ్చి తీసుకెల్లబోయేంతలో ఆ అమ్మాయి చనిపోయింది. సుమారు గంటసేపు ఆ అమ్మాయి కొనప్రాణంతో కొట్టుమిట్టాడి ప్రత్యక్షనరకం చూసింది.

ఇదంతా చదివిన తర్వాత ఏమనిపిస్తోంది. మనుషులు తమ మొగాలను ఎక్కడ పెట్టుకోవాలి. ఒక కోతికి ఏమైనా ఐతే అక్కడ ఉన్న కోతులు అన్ని అరిచి గోలపెట్టి బాధ పడతాయే. అలానే కాకులు కూడా అంతే కదా. అంటే మనుషుల పరిస్థితి ఎంత అధ్వాన్నముగా ఉందో తెలుస్తోంది. ఎప్పుడూ నేను, నావారు, నాది అనే స్వార్థం తప్ప ఇంకేమి పట్టని ఈ సమాజంలోని మనుషులకు మంచిరోజులు ఎందుకు రావాలి? అస్సలు అవసరం లేదు. మన కర్మలకు అంటే మనం చేసే పనులకు మనమే బాధ్యులం తప్ప ఇతరులు కాదు.నీవు ఇతరులు బాధపడుతున్నా పట్టించుకోకున్నప్పుడు  ఇతర మనుషులు కాని, ఆ దైవం కాని నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? మనం మారనంత కాలం మన బ్రతుకులింతే. ఇంత కన్నా ఎక్కువ చెప్పుకోనవసరం లేదు.

Tuesday, May 12, 2009

ప్రజలారా! హక్కులే తప్ప బాధ్యతలు పట్టవా?

మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.

1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు. 

2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.

ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.

గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించ్ వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది.Sunday, May 10, 2009

"అమ్మ" అను పదానికి గణిత నిర్వచనము:

1000 మంది తండ్రులు + 100000 పరమగురువులు + 1000000 సాధారణ గురువులు +........................అనంతము వరకు << అమ్మ

అమ్మ ప్రతిక్షణమూ పూజ్యనీయురాలైనప్పటికీ అమ్మలను పూజించుకొనేందుకు, గౌరవించుకొనేందుకు ఒక రోజును కేటాయించినందున 
" మాతృదినోత్సవ శుభాకాంక్షలు" 
మాతృమూర్తులందరికీ అనంతకోటి నమస్కారాలు.

Friday, April 10, 2009

బ్లాగుల వాతావరణాన్ని బాగుచేయడానికి ప్రయత్నిద్దాం.ఏమంటారు?

ఈ మధ్య బ్లాగులలో తీవ్రమైన మాటల యుద్ధాలు, సవాల్లు-ప్రతి సవాల్లు చాలా తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. బ్లాగుల వాతావరణం ఇలాంటి ధూళిమేఘాలతో కలుషితమవుతోంది. సీనియర్ బ్లాగర్లు, జూనియర్ బ్లాగర్లు, మహిళా బ్లాగర్లు అంటూ ఏవేవో పదాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పదాలే మన మధ్య లేనిపోని అహాలు(ego), ఎక్కువతక్కువలను సృష్టిస్తున్నాయని అభిప్రాయపడుతున్నాను.

ఎప్పుడైతే మన వ్యక్తిగత అభిప్రాయాన్ని సామూహిక అభిప్రాయముగా సామాన్యీకరణ(Generalization) చేయాలని ప్రయత్నిస్తామో అప్పుడే గొడవలు ప్రారంభమవుతాయి. బ్లాగు అనేది వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకొనే వేదిక, సమాచారాలు ఇచ్చిపుచ్చుకొనే మాధ్యమము అని అనుకొంటున్నాను.

మన బ్లాగుల ప్రథమలక్ష్యము అంతర్జాలములో "తెలుగు వైభవము" అనుకొంటున్నాను. కాని ఈ లక్ష్యము ఉన్నదని ఇప్పుడు కొత్తగా బ్లాగులు వ్రాయడం మొదలుపెడుతున్న వారికి ఎంతమందికి తెలుసు? అసలు ఇలాంటి లక్ష్యము అంటూ ఒకటుందని వారికి తెలుసా? అలా తెలియకపోతే అది వారి తప్పిదము కాదు. సంవత్సరాలుగా బ్లాగులు వ్రాస్తున్న మనది.

ఈ మధ్య నిజముగా జరిగిన ఒక సంఘటన ఒకటి చెప్తాను. 10 రోజుల క్రితం నా స్నేహితుడికి కంప్యూటర్లో తెలుగు వ్రాయవచ్చని, తెలుగులో ఉత్తరాలు పంపుకోవచ్చని , తెలుగులో మన విషయాలు వ్రాసుకోవచ్చని చెప్తే అతను నమ్మలేదు. ఆ అబ్బాయి 10వ తరగతి వరకే చదువుకొన్నాడు. వాడికి కంప్యూటర్ గురించి కొద్దిగా జ్ఞానం ఉంది. సరే అని ఇంటర్నెట్ సెంటరుకు వెళ్ళి మన బ్లాగులు చూపించాను. కాని దురదృష్టము ఏమంటే అతను బ్లాగులలో మన వాగ్వివాదాలు కూడా చూసాడు. అప్పుడు వాడు నాతో అన్న మాట "ఏరా స్వామీ! ఇదేదో బాగుందే. మనకు కోపం వస్తే మొహాన కాకుండా ఇలా వ్రాసుకొంటూ తిట్టుకోవచ్చు" అన్నాడు. వాడు తెలుసుకొన్న నీతి ఇది.
తర్వాత ఒక వారం రోజులు వాడికి కంప్యూటర్లో తెలుగు ఎలా ఉపయోగించవచ్చో నేర్పించాను. త్వరలో వాడు కూడా ఒక బ్లాగు వ్రాయాలని అనుకొంటున్నాడు. అది వేరే సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే కొత్తగా బ్లాగులు వ్రాస్తున్నవారు,వ్రాయాలనుకొంటున్నవారు ఇలాంటి వాగ్వివాదాలు,అసభ్యకర వ్యాఖ్యలు చూస్తే ఏమనుకొంటారు?

ఒకరిపై కోపం ఉంటే ఆ వ్యక్తి ఉన్న వ్యవస్థపైనే లేక వర్గంపైనే శత్రుత్వం పెంచుకోవడం సమంజసం కాదు. ఉదాహరణకు ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడజాతి పైనే కక్ష్య పెంచుకోవడం, ఎవరో కొందరు అబ్బాయిలు అసభ్యముగా ప్రవర్తిస్తున్నారని మగవారంటేనే అసహ్యం పెంచుకోవడం లాంటివి. ఇలాంటివి బ్లాగులలో చాలా కనపడుతున్నాయి.ఇలా చేయడం వలన ఎదుటివారికి వచ్చే నష్టమంటూ చాలాచాలా తక్కువ. ఇలా చేసేవారికే మానసికముగా బాధలు, మానసిక వ్యాధులు ఎక్కువై తద్వారా ఆరోగ్యాలు చెడిపోవడం వంటి పరిణామాలు జరుగుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.

చివరగా నేను చెప్పదలుచుకొన్నదేమంటే బ్లాగులలో అసభ్యకర టపాలు, అసభ్య వ్యాఖ్యలు వ్రాయడం, ఒకరి బ్లాగుకే పోటీగా ఇంకో బ్లాగు మొదలుపెట్టడం లాంటివి మానుకొందాం.
చర్చించుకొందాం కాని వాదనలు,వ్యక్తిగత విమర్శలు వద్దు.


Tuesday, April 7, 2009

ఓ హనుమంతుడా! నిన్ను మేమెందుకు కొలవాలి?


ఓ హనుమా!
రామ భక్తుడైనందుకా,
సీతమ్మజాడను కనుగొన్నందుకా,
లంకను కాల్చివేసినందుకా,
లేక శివాంశుడైనందుకా,
లేక భూతప్రేతాలను దరికి చేరనీయనందుకా,
లేక సూర్యున్నే మింగబోయనందుకా నిన్ను కొలవడం?

కావు,కావు ఇవి అసలు కారణాలు

మడమ తిప్పని నీ సంకల్పం మాకు ఆదర్శం,
అంతులేని నీ ఆత్మవిశ్వాసం మాకు ఆదర్శం,
ప్రపంచాన్ని ఢీ కొట్టగల నీ ధైర్యం మాకు స్పూర్తి,
అనితర సాధ్యమైన నీ కార్యతత్పరత మాకు స్పూర్తి,
పరస్త్రీలను మాతృమూర్తులుగా చూడడం మాకు కావాలి ఆదర్శం,
నీ ఇనుపకండలు,ఉక్కునరాలు కావాలి నేటి యువవృద్ధులకు,
మీ సమాచారనైపుణ్యం నేటి లోకానికి అత్యవసరం.


ఎన్నని చెప్పాలి కారణాలు నిన్ను కొలవడానికి
ఓ ఆంజనేయా నీవే కావాలి ఆదర్శం నేటి లోకానికి,
ప్రతి మనిషి కావాలి నీ అంశ.

జయము జయము ఓ హనుమంతుడా!
ఇవే నీకు మా నమస్సుమాంజలులు.
Monday, April 6, 2009

బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర, ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది,తప్పదు

ఈ మధ్య ఎక్కడ చూసినా కులాల రాజ్యాధికారం గురించే చర్చ. మన బ్లాగులలో కూడా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.
సరే సూటిగా నేను చెప్పదలుచుకొన్న విషయానికి వస్తాను.
తమకు ఈ కాలములో సరైన గౌరవం లేదని మరియు అవమానాలు కలుగుతున్నాయని బ్రాహ్మణులు,క్షత్రియులు , తమకు సరైన గుర్తింపు లేదని వైశ్యులు మరియు తమపై వివక్ష కొనసాగుతూనే ఉందని దళితులు బాధపడుతున్నారు.
చరిత్ర యొక్క, కాలానుగుణ ధర్మం యొక్క రహస్యాన్ని విశ్లేషించి తెలుసుకొంటే పైన పేర్కొన్న అందరూ తాత్కాలిక ఆవేశాలకు,అశాంతికి లోనవుతున్నారని అనకతప్పదు.

చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది.

మానవ సమాజం ఆరంభమైన మొదట్లో శారీరకముగా బలవంతుడైన వాడిదే ఆధిపత్యముగా ఉండేది. ఎప్పుడైతే మనిషికి ప్రకృతిశక్తులను అంటే అగ్నిని, మెరుపులను, వానలను మొదలగువాటిని మొదటిసారిగా చూసాడో వాటి గురించి సరైన జ్ఞానం లేక భయపడ్డాడు. ఈ కారణం చేతనే సమాజములో దేవుడు, దుష్టశక్తులు, అతీంద్రియశక్తులు మొదలగు భావాలు ఏర్పడడం మొదలు అయ్యాయి. అప్పటికి ఇంకా కులాలు ఏర్పడకపోవడం వలన ఈ ప్రకృతిశక్తులు మొదలగువాటిని కొద్దిగానైనా అర్థం చేసుకొన్నవారు ఒక వర్గముగా తయారైనారు. వీరికి కూడా పూర్తిజ్ఞానం లేకపోవడం వలన ప్రకృతిశక్తులను శాంతపరచడం మొదలగు విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. వీరినే పురోహితవర్గం లేక బ్రాహ్మణ వర్గం అని అంటారు. ఆ కాలములో వీరే కొద్దిగా జ్ఞానవంతులు కావడం చేత అందరూ వీరి ఆజ్ఞలనే పాటించడం జరిగేది. అలా సమాజములో మొదట ఆధిపత్యాన్ని అంటే ప్రజలను శాసించేవారిగా తయారైనారు, ఈ విధంగా మొదట రాజ్యాధికారం మొదట బ్రాహ్మణుల చేతిలో ఉండేది.


తర్వాత కాలములో వివిధ ప్రదేశాలలోని ప్రజల మధ్య ఆధిపత్యం కొరకు ఒకరిపై ఒకరికి పోరాటాలు జరగడం వలన శారీరకముగా బలవంతులైన వారి అవసరం ఏర్పడింది. బ్రాహ్మణులు శారీరకముగా అంత బలవంతులు కాకపోవడం వలన ఇక్కడ వారి ఆధిపత్యము ఫలించలేదు. అప్పుడే బలవంతులైన క్షత్రియ వర్గం తయారైంది. వీరే జనసమూహాలను రక్షించగలవారయ్యారు. ఇక తప్పనిసరిగా అధికారం వారి చేతులలోనికి వెళ్ళిపోయింది. అలా క్షత్రియుల రాజ్యాధికారం మొదలైంది.


ఇక సమాజములో డబ్బు యొక్క అనగా సంపద యొక్క ప్రాముఖ్యత పెరగడం మొదలైన తర్వాత బ్రాహ్మణులు కాని,క్షత్రియులు కాని మరియు కాయకష్టం చేసుకొని బ్రతికే శూద్రవర్గం కాని ఆ ధనసంపాదన చేసే వారిపై ఆధారపడడం మొదలైంది. ఇలా ధనసంపాదన చేసేవారినే వైశ్యులు అంటారని మనకు తెలుసు. మనదేశములో కూడా మొదట ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తమే వచ్చారని మనము మరిచిపోకూడదు. ఇలా సమాజములో ఆధిపత్యము ధనసంపాదన చేసేవారివైపుకు వెళ్ళిపోయింది. ఈ సమయములో వైశ్యుల ఆధిపత్యము విపరీతముగా పెరిగిపోయింది. అలా వారే సమాజాన్ని శాసించేవారిగా తయారయ్యారు.

పై మూడు వర్గాల కాలం గడిచిపోయింది.


ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఎవరైతే కష్టపడతారో వారిదే అధికారం. ప్రాచీన పరిభాషలో చెప్పాలంటే కాయకష్టము చేసుకొని,శారీరకముగా అధికముగా కష్టపడేవారు శూద్రులు లేక దళితులు. ఇప్పుడు శ్రామికుడిదే రాజ్యం. ఆంగ్ల ప్రభుత్వం ప్రపంచమంతటా విస్తరించడానికి కారణం వారి దేశములో సంభవించిన "పారిశ్రామిక విప్లవమే" కారణం. కార్మికులు లేక శ్రామికులు లేకపోతే సమాజానికి మనుగడే లేదు. కాబట్టి ప్రస్తుత కాలములో లేక సమీపకాలములో సృష్టి ధర్మాన్ని అనుసరించి శూద్రులు లేక దళితులదే ఖచ్చితముగా రాజ్యము అవుతుంది. కాబట్టి ఒక వర్గముపై ఒకరు దుమ్మెత్తిపోసుకోకుండా,బాధపడకుండా ఉండడమే శ్రేయస్కరము. సహజముగా ఒక వర్గము ఆధిపత్యము ఉన్నప్పుడు మిగతా వర్గాలు దాని క్రిందే ఉండడము ప్రకృతి ధర్మము. దానికి బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఈ ఆధిపత్యచక్రము లో ఇప్పుడు రావలసింది శూద్రులు లేక దళితులు మాత్రమే, మిగతా వర్గాల వారికి ఆ అవకాశం వచ్చి వెళ్ళిపోయింది. కాలధర్మం ప్రకారం ఇప్పుడు వీరికి రాదు. దళితులకే వస్తుంది.
ఇలా చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది.

గమనిక: ఇక్కడ నేను నాలుగు వర్ణాలను మొత్తం ప్రపంచానికే వర్తింపజేసాను. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు. లేక హిందూమతానికి మాత్రమే కాదు. ఎందుకంటే పేర్లు వేరైనా ప్రపంచము మొత్తం మీద వర్గాలు ఇవే ఉన్నాయి.

ఈ టపాలోని విషయాలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
ఈ టపా కేవలము అధికార బదలాయింపు ఎలా జరుగుతోందో తెలుపడానికి మాత్రమే. కులాలు ఎలా పుట్టాయి మొదలగువాటి కొరకు ఉద్దేశింపబడలేదు.
అలానే శూద్రులు అనే పదమును సౌలభ్యము కొరకు మాత్రమే వాడాను. ఎవరినీ కించపరచడానికి కాదు.


Friday, April 3, 2009

కర్ణాటక ప్రభుత్వం వారి కొత్త కన్నడ నిబంధన

ఈ నిబంధన ఏమిటంటే వాహనదారులు ఖచ్చితముగా తమ వాహనపు నమోదుసంఖ్యను (Regestration Number ) వాహనానికి ఏదో ఒకవైపున (అంటే ముందుగాని లేక వెనుక గాని) ఖచ్చితముగా కన్నడలో వ్రాయాలి.

ఉదాహరణకు KA 12 A 3456 అనే సంఖ్యను ఖచ్చితముగా కెఎ ౧౨౩౪౫౬ అని ఖచ్చితముగా ఒక వైపు వ్రాయాలి.

మొన్నామధ్య ద్విచక్రవాహనములో వెళ్తుంటే ఈ నిబంధనను ఇక్కడి రక్షకభటులు తెల్పారు. అలా వ్రాయనందుకు మొదటితప్పుగా 100 రూపాయలు జరిమానా కూడా విధించారనుకోండి అది వేరే సంగతి.
శ్రీ రామనవమి శుభాకాంక్షలురామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

అందరి జీవితాలలోనూ సీతారాముడు సుఖసంతోషాలను కలిగించాలని కోరుకొంటూ

సురేష్ బాబు
Wednesday, April 1, 2009

పదండి ముందుకు! పదండి తోసుకు! పోదాం, పోదాం, పైపైకి!

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదయాంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడవునా గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీనదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?
పదండి ముందుకు,
పదండి తోసుకు,
పోదాం, పోదాం పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
''హరోం! హరోం హర!
హర! హర! హర! హర! హర!
హరోం హరా!'' అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావవేగమున ప్రసరించండి!
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు,
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణమండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసల కాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
మరో ప్రపంచపు కంచునగారా
విరామమెరుగక మోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,

-శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి
హోమజ్వాలల భుగభుగలు?

Tuesday, March 31, 2009

కల్నల్ రాజు - తెలుగు వారి వైభవం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనగానే ఇంకా ఈ దేశంలో కోట్లాది మందికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన సహచరుడిగా, వైద్యుడిగా యుద్ధాల్లో అనేక సార్లు త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకొన్న ఓ కల్నల్ మన తెలుగు వాడైనందుకు గర్విస్తాం. ఆయన వట్టి కల్నల్ మాత్రమే కాదు. అనేక ఆసుపత్రులు, కళాశాలలు స్థాపించి తెలుగు వారికి వెలుగునీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మాణంలో పాల్గొన్న యోధుడిగా, ఆజాద్‌హింద్ ఫౌజ్ నాయకుడిగా పొందిన అనుభవాన్ని కేంద్రమంత్రిగా చేతల్లో చూపిన కార్యశీలుడు. ప్రకృతి ఆరాధకుడు. ఈ దేశం నాకే మిచ్చిందన్నది కాక ఈ దేశానికి నేనేమిచ్చానని ప్రశ్నించుకొని త్యాగయమ జీవితం గడిపిన కల్నల్ డాక్టర్ డి.ఎస్.రాజు జీవిత పయనం ఎలా సాగిందో చూద్దాం.

1904 ఆగస్టు 28న శృంగవృక్షంలో మాతామహుల ఇంట్లో జన్మించారు సత్యనారాయణరాజు. తల్లిదండ్రులు అచ్చయ్యమ్మ, రామచంద్రరాజులు. స్వగ్రామం పోడూరు. నరసాపురం తాలూకా. అప్పట్లో అది కృష్ణా జిల్లాలో ఉండేది. 1924 తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు మారింది. పెద్ద వ్యవసాయ కుటుంబం. తండ్రి ఆయర్వేద వైద్యులు. అక్షరాలు దిద్దే వయసులోనే తల్లి కన్నుమూసింది. అమ్మ లేకున్నా పిన్ని, పెద్దమ్మలు ఎంతో ఆప్యాయంగా చూశారు. ప్రాథమిక పాఠశాలలైనా లేని ఊళ్లల్లో ఎన్నో కష్టాలకోర్చి విద్యాభ్యాసం ప్రారంభించారు. వీరవాసరంలో మాధ్యమిక పాఠశాల విద్య పూర్తిచేశాక నర్సాపురం టైలర్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1923లో మద్రాసులో ఇంటర్ మొదటి తరగతిలో పాసయ్యారు. రాజు డాక్టరు కావాలని తండ్రి కోర్కె. అదే సంవత్సరం విశాఖలో వైద్య కళాశాల ప్రారంభమైంది.

మొదటి బ్యాచ్ విద్యార్థిగా రాజు అందులో చేరారు. 28లో చదువు పూర్తయింది. పై చదువులు చదవాలన్నది రాజు కోరిక. తండ్రి ఆర్థికస్థితి సహకరిస్తుందో లేదోనన్న అనుమానం. అప్పటికే రాజుకి వివాహం కూడా అవ్వడంవల్ల ఎలా? అన్న ఆలోచనలో పడ్డారు రాజు. ఎట్టకేలకు రాజు లండన్ వెళ్లారు. ఎల్.ఆర్.సి.పి., ఎం.ఆర్.సి.ఎస్. డిగ్రీలు సాధించారు. అప్పట్లో క్షయ, శ్వాసకోశ వ్యాధుల వల్ల ఎంతో మంది చనిపోయేవారు. అందువల్ల రాజు లండన్‌లో ఉన్నత విద్య పూర్తయినా వియన్నా వెళ్లి అత్యున్నత విద్య సాధించాలనుకొన్నారు. వెళ్లారు. శ్వాసకోశ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి పోడూరు గ్రామం వచ్చారు. ప్రాక్టీసు మొదలు పెట్టారు. అప్పట్లో జాతీయోద్యమ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండేది. దానికి బాగా ఆకర్షితులయ్యారు రాజు. ఓ పర్యాయం రాజుని ఏలూరులో వైద్య సంఘ సమావేశానికి ఆహ్వానించారు. అందులో రాజు అద్భుతంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఓ ఆంగ్ల మిలటరీ అధికారివిని భారతీయుల్లోనూ ఇంతటి ప్రజ్ఞావంతులుంటారా అని ఆశ్చర్యపోయారు. వెంటనే రాజుని కలిసి మిలిటరీలో చేరితే మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజు అంగీకరించారు. మిలిటరీలో పోస్టింగ్ రానే వచ్చింది. బెంగుళూరు, పూనెలో కొన్నాళ్లు పని చేశాక సౌదీ ఆరేబియాలోని ''ఎమన్''కి బదిలీ అయింది. ఏడెన్ నగరంలో ఉంటూ అబిసీనియా యుద్ధబాధితులకు సేవ చేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రాజుకి సింగపూర్‌కి బదిలీ అయింది. ఆయన సింగపూరులో ఉండగానే రెండో ప్రపంచ యుద్ధం తూర్పు ఆసియా దేశాలకు పాకింది. 1941లో జపాన్, ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధ ప్రకటన చేసింది.

ఆ సమయంలోనే కల్నల్ రాజు ఇండియన్ నేషనల్ ఆర్మీ పట్ల ఆకర్షితులయ్యారు. సుభాష్‌చంద్రబోస్‌కి కుడిభుజంగా మారారు. అండమాన్ దీవులలోని సెల్యులర్ జైలును బ్రిటిషర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న సమయంలో కెప్టెన్ రాజు, సుభాష్ ఇద్దరూ ఉన్నారు. జాతీయ పతాక వందనం చేసిన వారు కూడా వీరిద్దరే. ఇండియన్ నేషనల్ ఆర్మీలో కీలక వ్యక్తిగా పరిణమించారు. కల్నల్ రాజు నేతాజీ ఆంతరంగిక వైద్యుడిగా పని చేశారు. 1944 ఫిబ్రవరి నాలుగో తేదీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచీ బర్మాలో ఉన్నంతకాలం కల్నల్ రాజు నేతాజీ ఆంతరంగికుడిగానే ఉన్నారు.

1944 ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఆజాద్ హింద్ ఫౌజ్ మణిపూర్‌లోని మెయిరాంగ్ ప్రాంతం చేరుకొని బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి పారదోలి స్వతంత్ర జెండా ఎగురవేసింది. ఆ తర్వాత ఫౌజ్ సైనికులు చాలామంది మరణించారు. బ్రిటన్ ఆధిపత్యం మొదలైంది. మంచూరియా మీదుగా రష్యా వెళ్లడానికి ప్రయత్నించిన నేతాజీ కల్నల్ రాజు కోసం ప్రత్యేకంగా కారు పంపారు. ఆకారు బాంబు దాడిలో గుల్ల అయింది. కల్నల్ రాజు మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. అంతకు ముందు అలా ఎన్నో సార్లు జరిగింది! రాజు ప్రమాదానికి గురైన తరుణంలోనే నేతాజీ సింగపూరు నుంచి బ్యాంకాక్ వెళ్లిపోయారు. అందరూ రాజు హతులయ్యారని భావించే తరుణంలో ఆయన బయటికొచ్చారు. ఆనాటికి పదిహేడువేల మంది సైనికులు మిగిలి ఉన్నారు. క్షమాభిక్ష వేడుకొంటే వారిని విడుదల చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షమించమని అడగడానికి వారు అంగీకరించలేదు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ సైనికుల పక్షాన నిలిచింది. కోర్టు మార్షల్ విచారణ జరిపి సైనికుల్ని విడుదల చేసింది. కల్నల్ రాజు పోడూరు చేరుకొన్నారు. తిరిగి వైద్యవృత్తి చేపట్టారు. మిలిటరీలో చేరమని వైస్రాయ్ ఆయనను ఆహ్వానించారు. బరోడా మహారాజు తన పర్సనల్ డాక్టర్‌గా రమ్మన్నారు. విజయలక్ష్మీ పండిట్ రష్యాకు రాయబారిగా వెళ్లినపుడు ఎంబసీలో చేరమని కోరారు. వాటన్నిటినీ తిరస్కరించిన కల్నల్ రాజు 1953లో ధవళేశ్వరంలో ఆరు ఎకరాల భూమిని సేకరించి ఆస్పత్రి నిర్మించారు. అప్పట్లోనే ఎక్స్‌రే తీసే యంత్రాలు కూడా తెప్పించారు. అలా ఆయన అధునాతన వసతులు కల్పించారు.
మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒరిస్సా మాజీ గవర్నరు కుమారస్వామి వంటి వారు కల్నల్ రాజును రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. సరోజినీనాయుడు కుమారుడు జయసూర్య వంటివారుప్రోత్సహించడంతో చివరికి కల్నల్ రాజు రాజకీయాల్లోకి రావడానికి సంసిద్ధమయ్యారు. అప్పటికే ఆయన జాతీయనాయకులు గాంధీజీ మొదలుకొని అందరితో మంచి పరిచయాలుండేవి. 1957 సార్వత్రిక ఎన్నికల్లో కల్నల్ డి.ఎస్.రాజు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెహ్రూజీతో పరిచయాలుండడంతో ఆరోగ్య, రక్షణ విషయాల్లో ఆయన కల్నల్ సలహాలు తీసుకొనేవారు. 1963లో జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి భారత ప్రభుత్వపు ప్రతినిధిగా కల్నల్‌ని నెహ్రూజీ పంపడం విశేషం. 1962లో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రెండేళ్లు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి మంత్రివర్గంలో డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో, దేశంలో ఆస్పత్రుల్ని తనిఖీ చేసి సదుపాయాలు కల్పించారు.

కల్నల్‌రాజు ఎప్పుడూ దూరదృష్టితో వ్యవహరించారు. అప్పటి విశాఖ జిల్లా కోరుకొండలో సైనిక్‌స్కూల్ నిర్మాణానికి కృషి చేసి ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు పొంది పాఠశాల నిర్మించారు. ఆ పాఠశాల కోసం కల్నల్‌రాజు స్వయంగా నెహ్రూజీని కలిశారు. భూపతిపాలెంలో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించారు. ఆయన జీవనయానంలో మరో విశిష్టత కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాల స్థాపన! అలాగే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ని ఒప్పించి నెలకొల్పిన ముళ్లపూడి వెంకట్రామయ్య విద్యా సంస్థ. తోటలు పెంచారు. పేదలకు వైద్య సాయం చేశారు. అందరికీ తలలో నాలుకలా మెలిగారు. 1973 జూన్ 6న కల్నల్‌రాజు పరమపదించారు. ఆయన పలు వ్యవస్థల, సంస్థల నిర్మాత.భవిష్యత్తరాలు ఆయన సేవల్ని గుర్తుంచుకొంటాయి. ఆయనకి నమస్కరిస్తూనే ఉంటాయి.


(ఈనాడు సౌజన్యము )

Monday, March 30, 2009

గరుత్మంతుడు చెప్పిన విష్ణుమాయ గుణాలు, ప్రభావము

శ్రీ మహావిష్ణువు మహాత్వం ఏమిటి? ఎలా ఉంటాడు? ఆయనకు గరుత్మంతుడు ఎప్పుడు వాహనంగా, మరెప్పుడు ధ్వజంగా ఉంటాడు? అనే సందేహాలకు సమాధానాలు చెప్పే కథ మహాభారతం ఆనుశాసనిక పర్వంలో కనుపిస్తుంది.


పూర్వం ఒకసారి హిమగిరి మీద మునిగణాలన్నీ పురాణ శ్రవణం చేస్తూ ఆనందిస్తున్న సమయంలో అక్కడికి వినత కుమారుడైన గరుత్మంతుడు వచ్చాడు. ఆ ముని గణాలన్నీ ఆయనకు వినయంగా నమస్కరించి తమకు శ్రీమహావిష్ణువు వైభవాన్ని, మాయ, రూప విలాసాన్ని వివరించమని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు వైనతేయుడు (గరుత్మంతుడు) ఆనందించి వారందరికీ విష్ణు విలాసాన్ని చెప్పటం ప్రారంభించాడు. అయితే తనకే కాక ఎంతటి వారికైనా కూడా ఆ శ్రీమహావిష్ణుమాయ, స్వస్వరూప విషయాలను వర్ణించే శక్తిలేదని, తనకు తెలిసినంతలో తనకు అనుభవంలోకి వచ్చిన విషయాలను వివరించగలనని అన్నాడు.

గతంలో తన తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు దేవేంద్రుడితో పోరాడి అమృతభాండాన్ని స్వాధీనం చేసుకొని తరలిపోతున్న తరుణంలో తనకు ఒక ప్రేమపూరితమైన పిలుపు వినిపించిందని గరుత్మంతుడు చెప్పాడు. ఆ మాటలు వినిపించిన దిశగా మరికొంత ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో నీకొక వరం ఇస్తున్నాను. తీసుకో అన్న పలుకులు మళ్ళీ వినిపించాయని, అయితే ఆ పలుకుతున్న దెవరో? ఎటువంటివారో? తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆ శబ్ధం వచ్చిన దిక్కుకు చూస్తూ మీరెవరో నాకు పూర్తిగా మీ విషయాన్ని వివరించాకే వరం ఇవ్వవలసినదిఅని గరుత్మంతుడు అడిగాడు. అందుకు సమాధానంగా తనస్వరూపమేమిటోఇకమీదట పూర్తిగా అవగతమవుతుందని, అయితే ముందుగా గరుత్మంతుడు తనకు వాహనంగా మారాలని మళ్ళీ వినిపించింది. అలా అయినందువల్ల వృద్ధాప్యం, మృత్యువు లాంటివి లేకుండా ఉండే ఒక మహాత్తర శక్తి సంప్రాప్తిస్తుందని గరుత్మంతుడికి వినిపించింది. అనుకొని ఆ వర ప్రసాదానికి గరుత్మంతుడికి ఒళ్ళు పులకించింది. వెంటనే భక్తిపూరితంగా నమస్కరించి తాను వెంటనే వాహనమూర్తిగా మారి సేవించుకుంటానని ఒకవేళ ఆ అడుగుతున్న మహానుభావుడు రథాన్ని ఎక్కివుంటే ఆ రథానికి కేతనంగా ఉండగలనని అలా తనను అనుగ్రహించమని గరుత్మంతుడు వేడుకున్నాడు. అలాగే తాను అనుగ్రహిస్తున్నట్లు ఆ అద్భుతశక్తి పలికింది. ఆ తరువాత గరుత్మంతుడుఎంతో ఉత్సాహంగా తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చిజరిగిన విషయాన్నంతా వివరించాడు. కశ్యపుడు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ మాటలు ఎవరివోకాదని, ఆ వరం ఇచ్చింది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని తెలియచెప్పాడు.

ఎంతో గొప్ప సమాధినిష్ఠతో తపస్సుచేస్తే తప్ప లభించని శ్రీమహావిష్ణువు అనుగ్రహం గరుత్మంతుడికి లభించిందని, వెంటనే వెళ్ళి శ్రీమహావిష్ణువు ఉండే బదరికాశ్రమంలో ప్రవేశించి ఆయనను భక్తితో సేవించమని కశ్యపుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ వెంటనే గరుత్మంతుడు బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పచ్చని వస్త్రాలతో, శంఖ, చక్ర, గదాది ఆయుధాలతో ఎనిమిది భుజాలతో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనేఇక తనను అనుసరించమని గరుత్మంతుడితో చెప్పాడు.

అలా చెప్పిన వెంటనే ముందు శ్రీమహావిష్ణువు వెళుతుండగా గరుత్మంతుడు అనుసరించాడు. అలా చాలా యోజనాల దూరం వాయువేగంతో గరుత్మంతుడు వెళ్ళాడు. ఇంతలో ఒకచోట భయంకర అగ్నిజ్వాలలు ఎదురుపడ్డాయి. అక్కడ ఎటుచూసినా ఇంధనం కానీ, మరొకటి కానీ ఎమీలేదు. ఆ మంటలను లెక్కపెట్టక తీవ్రవేగంతో వాటిలోకి ప్రవేశించాడు గరుత్మంతుడు. అయినా అతడికేమీ ప్రమాదం సంభవించలేదు. మరికొంత ముందుకెళ్ళాక తీవ్రమైన తపస్సు చేస్తున్న పార్వతీపరమేశ్వరులు కనుపించారు. అక్కడినుండి ఇంకా ముందుకు వెళుతున్న విష్ణువును అనుసరిస్తున్న గరుత్మంతుడికి బాగా ఒడలిక కలిగింది. అయినా ఆ ఒడలికను లెక్కచేయక ముందుకు వెళ్ళాడు అక్కడ ఒకచోట గాడాంధకారమైన ప్రదేశం ఉంది. ఆ చిమ్మచీకట్లో దిక్కుతెలియని స్థితిలో చేసేది ఏమీలేక గరుత్మంతుడు బాధపడుతూ తనకేమీ కనుపించటంలేదని తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఇదిగో ఇటుచూడు, ఈ వైపురా అని అన్నాడు. ఆ శబ్ధం వినిపించిన దిక్కు చూడగానే చిమ్మచీకట్లన్నీ చెల్లాచెదురైపోయాయి.

దివ్వమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఆ ప్రదేశంలో భగవానుడు అంతకన్నా ఎక్కువగా తేజరిల్లుతూ కనుపించాడు.అక్కడ మంగళవాద్య ధ్వనులు మారుమోగసాయి. అద్భుతమైన సరోవరాలు కమలాలతో నిండి కనుపించాయి. ఆ ప్రదేశాన్ని కన్నార్పకుండా చూస్తున్నంతలోనే మళ్ళీ విష్ణువు తన ప్రయాణం సాగించాడు. ఆయనను గరుత్మంతుడు అనుసరించాడు. మళ్ళీ ఇంతలో ఒక భీకరమైన జ్వాల కనుపించటంతో గరుత్మంతుడు తత్తరపడ్డాడు.

మళ్ళీ తన శక్తిమీద ఆశలువదులుకొని ఆ దేవదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆనారాయణుడు అనుగ్రహించి దోవచూపి అగ్నిజ్వాలలు పోగొట్టి మరికొంతదూరం గరుత్మంతుడు తన వెంటరాగానే అదృశ్యమైపోయాడు. ఆ క్షణంలో గరుత్మంతుడు ఉన్న ప్రదేశమంతా ఎంతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ కనుపించింది. అక్కడున్న ఒక చక్కని సరోవరంలో శ్రీమన్నారాయణుడు జలకాలాడుతూ కనుపించాడు. ఆ సరోవరం ఒడ్డుకు గరుత్మంతుడు చేరుకోగానే విష్ణువు మాయమయ్యాడు. ఆ సంఘటనకు మళ్ళీ బాధపడ్డాడు గరుత్మంతుడు. దానికితోడు అక్కడ ఒక పక్క చతుర్వేదాల గంభీర ఘోష వినిపిస్తున్నా ఎవరూ అక్కడ ఉన్నట్లు కనుపించలేదు. మళ్ళీ అంతలోనే మహా భయంకరమైన గరుడ పక్షులెన్నెన్నో ఆ ప్రదేశమంతా తిరుగాడుతూ కనుపించాయి. గరుత్మంతుడిక ఆ పరిస్థితి నుండి తాను బయటపడేందుకు పరమాత్ముడొక్కడే తనకు దిక్కని ఎలుగెత్తి పలుకుతూ రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆందోళన పడవద్దని తాను రక్షిస్తాననిపలికాడు. ఆ పలుకులు వినిపించిన మరుక్షణంలో శ్రీమన్నారాయణడక్కడ సాక్షాత్కరించాడు. ఆయనకు భక్తితో నమస్కరించి గరుత్మంతుడు చుట్టూఒకసారి తేరిపారచూడగా ఆ ప్రదేశం మరేమీకాదని ఒదరికా వనమేనని స్పష్టమైంది.


అలా తనకు శ్రీమహావిష్ణువు స్వస్వరూపాన్ని, తన మాయా విశేషాలను వివరించినట్లు గరుత్మంతుడు మునులకు చెప్పాడు. అహంకారభావంతో మనిషి ప్రవర్తిస్తుంటాడు. అహంకార భావాన్ని విడిచి భక్తితో, ఆర్తితో భగవానుడిని స్తుతించినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని ఈ కథా భాగం వివరిస్తోంది.

( ఈనాడు సౌజన్యముతో )


Friday, March 27, 2009

తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేసిన కొందరు తెలుగువారు

ముందుగా అందరికీ శ్రీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెల్పుతూ సందర్బముగా మన తెలుగు జాతికి కీర్తిప్రతిష్ఠలు కలుగజేసిన కొందరు మహనీయుల గురించి తెలుసుకొందాము.

* శంకరంబాడి సుందరాచారి: రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి. తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్నమొన్నటి దాకా దక్కాల్సినంత పేరు దక్కలేదు. మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
* పొట్టి శ్రీరాములు (1901-1952): ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఆత్మార్పణం చేసిన త్యాగ ధనుడు. సత్యము, అహింస, హరిజనోద్ధరణ ప్రధానాశయాలుగా గాంధీజీ అడుగు జాడల్లో నడచిన మహనీయుడు. తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు. తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ.
* గిడుగు రామమూర్తి పంతులు (1863-19409): ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.
* కందుకూరి వీరేశలింగం (1948-1919): గొప్ప సంఘ సంస్కర్త, సాహితీ వేత్త. కథ, నవల, వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్య శ్రీకారం చుట్టినవాడు. స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. వివేకవర్థిని పత్రికను స్థాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను, దురాచారాలను తూర్పార బట్టారు. అధికార వర్గాల్లోని అవినీతి, అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు.
* ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (19 శతాబ్దం పూర్వార్థం): దేశ స్వాతంత్య్రంకోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.
* గురజాడ అప్పారావు (1862-1915): 'దేశమును ప్రేమించుమన్నా' అంటూ దేశ భక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు. భాషా సాహిత్యాలు, కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి. గురజాడ సృష్టించిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.
* రఘుపతి వెంకటరత్నంనాయుడు (1862-1939): సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ ప్రచారకుడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల్లో రుజువర్తన, నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు. మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులేనంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.
* టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు. తెలుగు వారి గుండెలొల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం. బారిస్టర్గా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించాడు. సైమన్ కమిషన్ వచ్చినపుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్ర జాతి గుండెను గెలుచుకున్నారు.
* పింగళి వెంకయ్య (1878-1963): భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత. స్వాతంత్య్ర సమర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, గుండె నిండుగా దేశాభిమానమే కాదు, మెదడు నిండుగా విజ్ఞానాన్ని ధరించిన వాడు. కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి, పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు, వెండి పతకాలను గెలుపొంది రాయల్ ఎగ్రికల్చర్ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.
* బండారు అచ్చమాంబ (1874-1905): స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్న ఆరోజుల్లోనే చదువుకోడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను 'అబలా సచ్ఛరిత్ర రత్నమాల' పేరుతో ఒక్క చేతితో రాశారు. భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు. స్త్రీ సమాజాలను స్థాపించారు.
* డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (1895-1948): ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త. ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్ కార్బామజీన్ అనే మందును కనుగొన్నారు. 1945లో ఆరియోమైసిన్ అనే యాంటీబయోటిక్ మందును ఆవిష్కరించారు. పాండురోగ నివారణకు పోలికామ్లం, క్షయ రోగానికి పసోనికోటినికాసిడ్ హైడ్రోజన్లను కనుగొన్నారు.
(ఈనాడు సౌజన్యము )Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు