తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, September 10, 2011

రెండు తెలుసుకోవలసిన మంచిమాటలు

వేష భాషా సదాచారః రక్షణీయం ఇదం త్రయం
అంధానుకరణ మన్యేషాం అపకీర్తికర ముచ్యతే

భావం : వేషం,భాష, సంస్కృతి ఈ మూడింటిని రక్షించుకోవాలి. గుడ్డిగా అనుకరిస్తే అపకీర్తిపాలవుతాం.



కో ధర్మో? భూతదయా ................. ఏది ధర్మం ? జీవులయందు దయ
కిం సౌఖ్యం? అరోగితా ................... ఏది సుఖం ? ఆరోగ్యం
కః స్నేహః? జగతిజన్తో సధ్భావః .................. ఏది స్నేహం ? అన్ని జీవరాశుల యందు మంచి భావం
కిం పాండిత్యం? పరిచ్చేదః .......................... ఏది పాండిత్యం ? మంచి,చెడుల విచక్షణ

Friday, September 9, 2011

ప్రపంచం ఋణపడి ఉన్న భారతీయ శాస్త్రవేత్త - భాస్కరాచార్యుడు

సనాతన భారతదేశం కన్న గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు.ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్యశాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి.చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు.పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత,గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్( విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.చిన్నపటి నుండే గణితం లో అనేక పరిశొధనలు ప్రారంభించాడు.వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట.ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక,నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను,శుభాశుభాలను లెక్కించేవాడు.ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు.తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు.కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది.ముహూర్తనిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది.ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క,పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు.ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు.ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు,సిద్దాంతాలు కనుగొని ప్రపంచప్రఖ్యాతుడయ్యాడు.తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సిద్దాంత శిరోమణి గ్రంధం ( భాస్కరులు ప్రపంచానికి అందించిన కానుక)

1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణితప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు.
అవి ౧.లీలావతి(అంకగణితం)
౨ .బీజగణితం
౩.గోళాధ్యాయ(గోళాలు,అర్దగోళాలు)
౪.గ్రహగణితo (గ్రహాలకు,నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను,వర్గాలను,వర్గమూలాలను,ధనాత్మక-ఋణాత్మక అంకెలను,వడ్డీలెక్కలను,సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు,వర్గ సమీకరణాలను,అనంతం (ఇన్‌ఫినిటీ)ని కనుగొని చర్చించి,వాటిని సాధించింది.సమీకరణాలను వాటి 3వ,4వ ఘాతం వరకు సాధించింది.త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము.. కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి.కాబట్టి భూమి,గ్రహాలు,చంద్రుడు,నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి.వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."

ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.

తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళగణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు.

వీరు మరణించిన సంవత్సరం 1183 లేక 1187.

Thursday, September 8, 2011

మతమౌఢ్యం ఎన్నాళ్ళు? మారరా ఇకనైనా?

సైన్సుపరంగా,నాగరికతపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నామని అనుకుంటున్నాము.కాని మనిషిపరంగా అంటే మానవత్వపరంగా,నైతికంగా,సంస్కారపరంగా అభివృద్దిచెందకపోవడమే దీనికి ప్రధానకారణం గా కనిపిస్తోంది.ఇంకా ప్రధాన కారణం వ్యక్తి ఆరాధన శృతి మించడం.ఆరాధించబడేవారి బోధనలను మరిచిపోవడం."నీవంటే నాకు చాలా ఇష్టము,ప్రాణము.కాని నువ్వు చెప్పేమాటలను నేను వినను,పాటించను" అంటున్నారు.అలాంటప్పుడు ఆ ఆరాధింపబడే వారికి తమను పూజించే వారంటే ఏమి ఇష్టము ఉంటుంది?.ఏ మతమైనా ఏం చెబుతుంది? ఇతరులను చంపమనా?కాదుకాదు ప్రేమించమని,ద్వేషింపవద్దని.దీనికి ఉదాహరణగా వివిధ మతగ్రంథాలు ఏమంటున్నాయో చూడండి.

భగవద్గీత:
"ఎవరెవరు ఏఏ రూపాన్ని ఆరాధిస్తారో వారికి ఆయా రూపాలందే శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేసి వారిని ఆయా రూపాలతోనే అనుగ్రహిస్తున్నాను. ( విజ్ఞానయోగం 21-22)

ఖురాన్:
" ఎవరు ఖురాన్‌ను నమ్ముతారో,మరియు ఎవరు(యూదుల)లేఖనాలను అనుసరిస్తారో,మరియు క్రైస్తవులు...మరియు దేవునిపై నమ్మకం కలవారందరూ ధర్మంగా పని చేయువారందరూ అంతిమదినము నందు తమ దేవుని చేత బహుమానాలు పొందుతారు.వారు దుఃఖంచేగానీ,భయంచే గానీ బాధపడరు". ( 2:62)

బైబిల్:
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి.(ముత్తయి 5:44)

ఏసు అనుచరులు సమారియాలోని గ్రామంలోనికి ప్రవేశించారు.కానీ ఆ గ్రామ ప్రజలు వారిని తిరస్కరించారు.అప్పుడు శిష్యులు ఏసు తో "ఎలీజా చేసినట్టు మీరు మమ్ము స్వర్గం నుండి అగ్నిని రప్పించి వారిని భస్మం చేయమంటారా?"అన్నారు.అప్పుడు ఏసు వారితో "మీరు ఎలాంటివారో మీకు అర్థం కావడంలేదు.మనుష్యకుమారుడు మనుష్యుల ప్రాణాలను కాపాడుటకు వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు"అన్నాడు. ( లూకా 9:52-56)

ఈ విధంగా ప్రతి మతగ్రంథంలోనూ పరమతసహనాన్ని,తోటిమానవులను ప్రేమించమని ఉండగా ఎంతమంది వీటిని అనుసరిస్తున్నారు? ఈ గ్రంథాలలో మనం పూజించేవారి ఆదేశాలు,భోధనలు ఉండగా వాటిని పట్టించకొనకుండా పెడచెవిన పెట్టి వారిని పూజిస్తూ వారి పేరుపై కలహాలు సృష్టిస్తే వారు మెచ్చుకొంటారా? ఏమైనా అడిగితే తమ దేవుని కోసం చేస్తున్నామంటారు.కాని ఆ దేవుళ్ళు చెప్పినది మనం స్పష్టంగా పైన చూసాము.ఆ దేవుళ్ళు వీరి పనులను అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా??
ఉదాహరణకు ఒక తోట యజమాని తన ఇద్దరు పనివారికి తోటపని చెప్పి చేయమన్నాడు.అందులో ఒకరు తనకు ఇచ్చిన పని చేస్తుండగా మరొకరు తమ యజమానిని "మీరు గొప్పవారు.మీ చేతులు ఎంతోసుందరాలు.మీ మనసు వెన్నలాంటిది."అని పొగుడుతున్నాడని అనుకొందాము. ఇద్దరిలో యజమాని ఎవరిని ఇష్టపడతాడు?తను చెప్పిన పని చేయకుండా తనను పొగిడేవాడినా? లేక తను చెప్పినపని సక్రమంగా చేసినవాడినా? ప్రస్తుతం కలహాలను చేసేవారి పరిస్థితి,సృష్టించేవారి పరిస్థితి పొగిడేవాని పని లాగానే ఉంది.
ద్వేషం కానీ,కలహం కానీ ఎదుటివారిలో మార్పు తీసుకురాదనే విషయం వీరు ఎందుకు తెలుసుకోవడంలేదు ? ఎప్పుడైతే తమ మతగ్రంథాలను కూలంకుషంగా చదివి అర్థం చేసుకుంటారో తమ ఇంగితజ్ఞానాన్ని,యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తారో అప్పుడే ఇలాంటి కలహాలు ఆగుతాయన్నది నా అభిప్రాయం.

నిజము కు, సత్యానికి గల తేడా ఏమిటి? ( ఆధ్యాత్మికత )

నిజము,సత్యము రెండిటినీ ఒకటిగానే పరిగణిస్తారు.కానీ ఆధ్యాత్మిక పరిబాషలో చిన్న తేడా ఉంది.
దీన్ని చిన్న ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తాను.


ఇప్పుడు మీ జేబులో ఒక పెన్ను ఉంది అనుకోండి. మీరు "నా జేబులో పెన్ను ఉంది" అంటారు. పెన్ను ఉండడం అనేది "ఇప్పుడు" నిజం. కొద్ది సేపైన తర్వాత పెన్ను తీసి ఎక్కడొ పెట్టేసారనుకోండి. ఇప్పుడు పెన్ను మీ జేబులో లేదు కదా. అంటే పెన్ను మీ జేబులో ఉండడం అనేది అది ఉన్నంత వరకే సరైనది. తర్వాత కాదు. అంటే నిజం అనేది మారుతూంటుంది.


ఇక సత్యం అనగా అది ఎన్నడూ మారనిది. సూర్యుడు తూర్పున పుడతాడు అనేది సత్యం. ఇది ఎన్నటికీ మారదు. మరి సృష్టి అంతం అయిపోయినతర్వాత అంటారేమో. ఒక ఉదాహరణ గా మాత్రమే తీసుకున్నాను. సత్యం అనగా మూడు కాలాలలోనూ మారనిది అంటే భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలలోనూ ఏ విధమైన మార్పూ పొందనిది. అందుకే భగవంతుడొక్కడే సత్యం అంటారు. ఎందుకంటే మార్పులేనిది భగవంతుడు మాత్రమే కదా.


నిజానికి, సత్యానికి ఆధ్యాత్మికంగా మాత్రమే అర్థం చెప్పాను, కాని నిజజీవితంలో రెండింటినీ ఒకేలా భావించడం సంభవిస్తోంది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు