తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, December 11, 2015

మీ పాటకు ఒక్క తీగ చాలదా ? నాలుగు కావాలా? (ఒక నిజ సంఘటన)ప్రఖ్యాత ఫిడేల్ వాయిద్య విద్వాంసులుగా శ్రీ కృష్ణయ్యర్ గారి గురించి చాలామందికి తెలుసు.
వారి జీవితములో ఒకసారి జరిగిన సంఘటన ద్వారా వారెంత సాధకులో,విద్వాంసులో తెలుస్తుంది.

ఒకసారి ఒక కచేరీలో గాయకులకు ప్రక్కవాద్య సహకారంగా కృష్ణయ్యర్ గారు ఫిడేలు వాయిస్తున్నారు. ఉన్నట్టుండి ఫిడేల్ లో ని ఒక తీగ తెగిపోయింది. గాయకుడు కృష్ణయ్యర్ గారి వైపు  "పాటకు అనుగుణంగా వాయించలేక కావాలని తీగ తెంపుకున్నావు" అన్నట్లు వ్యంగముగా చూసారట. ఫిడేలుకు 4 తీగలు ఉంటాయి. కృష్ణయ్యర్ గారికి కోపం వచ్చి "మీ పాటకు ఒక తీగ చాలు మిగతా 3 కూడా అవసరం లేదు" అని మిగతా రెండు తీగలు కూడా తెంపేసి ఒక్క తీగ తోనే మొత్తం కచేరీకి అత్యద్భుతంగా వాద్య సహకారం  అందించారు. కానీ ఎవరికీ అనుమానం రాలేదు.

చూసారా ఇలాంటి మహానుభావుల సాధనా బలం.

- వాసుదేవ గారి "స్మృతులు" గ్రంధం నుండి

Monday, December 7, 2015

నీలము - ఆ రంగుకు (తెలుగు భాషలో) ఈ పేరెలా వచ్చింది ? (నా అభిప్రాయము)కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా,అకస్మాత్తుగా మనసుకు తడుతూఉంటాయి. అలా నిన్న పడుకున్నప్పుడు ఉన్నట్టుండి మెరుపులా నాకు కలిగిన భావన ఇది.

నాకు తట్టిన ఊహ ప్రకారము  :

మనకు తెలుసు సముద్రము ఆకాశము రంగులో అంటే నీలపు రంగులో ఉంటుందని (రామన్ ఎఫెక్ట్ దీనినే వివరించింది).
నీటిని తెలుగులో నీళ్ళు, నీరు గ్రాంధిక భాషలో "నీరము" అని కూడా అంటారు.
భాష అభివృద్ధి దశలో మన తెలుగువారు ఎప్పుడైనా నీలము రంగును చుసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు (ఇంకా నీలము అనే పదము లేదు కాబట్టి) వారు సముద్రపు రంగును దృష్టిలో పెట్టుకొని "నీళ్ళ రంగులో" లేక "నీరము రంగులో" ఉంది అనేవారు అని నా భావన.
ఈ భావమే తర్వాతి కాలములో నీరము అనేది నీలము అని మారిందని నా ఊహ. నీరు అనేది "నీలి" అని మారి ఉండవచ్చు..

ఇది కేవలం నా భావన మాత్రమే.ఇదే నిజమని నేను చెప్పలేను.

ఇదండీ నాకు నిన్న అకస్మాతుగా మెరుపులా వచ్చిన ఊహ.

Saturday, July 25, 2015

జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?

జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?
పొందగలము.

కానీ...........ఇది చదవండి..

శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే

"అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః"


దీని అర్థము
"ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు " అని

సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం "అమ్మా" అనో, "అబ్బా" అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.

మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. మనకు అత్యంత ఇష్టమైన సంఘటన లేక ఇష్టులు లేక పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?

మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో గుర్తుకువస్తాడు.

అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.

అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.


Monday, January 12, 2015

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్పురద్రూపి..ఒక్క మాటలో చెప్పాలంటే Manly person. 

అ వేశ్యలు విటుల కోసం చేసే హావభావాలను చూసి ఆ వ్యక్తి సహచరులలోని స్త్రీలు ఆ వేశ్యలను చూసి భయపడ్డారు. అందుచేత వారు ఆ వ్యక్తిని అక్కడ నుండి పక్కకు వచ్చేయమని వారించారు.కాని ఆ వ్యక్తి సూటిగా ఆ వేశ్యల వద్దకు వెళ్ళి వారి వద్ద కూర్చొని " వీరు తమ దివ్యత్వాన్ని బాహ్యమైన అందం రూపంలో వ్యక్తపరుస్తున్నారు( They put their divinity into beauty)" అని కన్నీళ్ళు కారుస్తూ అన్నాడు. అతని ఈ మాటలు ఆ వేశ్యలను ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆ వేశ్యలలో కొందరు తమ జీవితాన్ని తలుచుకొని మొహం కప్పుకొని ఏడవసాగారు. ఒక వేశ్య ఈ వ్యక్తి అంగీ కొనను పట్టుకొని " నేడు నేను ఒక దైవదూత అంగీని ముట్టుకొని ధన్యత చెందాను" అన్నది. ఆ వ్యక్తి మీ అందరి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు.
ఇంతలో ఆ వ్యక్తి సహచర స్త్రీలు ఆయనను పక్కకు లాక్కుపోయారు.

ఎవరు ఈ వ్యక్తి? మీలో చాలా మంది ఊహించే ఉంటారు. తన వ్యక్తిత్వంచే నేటికీ, ఎల్లప్పటికీ ప్రభావితం చేస్తున్న స్వామి వివేకానందుడే ఆ వ్యక్తి.

జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవమని, వివేకానందుల పుట్టినరోజని జరుపుకోవడం ఇదేనా ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ?
ఆయన ఉపదేశాలలో ఒక్కటి మనస్పూర్తిగా ఆచరించినా మన జీవితమే అత్యధ్బుతంగా తీర్చిదిద్దబడుంది.

"ధనం కోల్పోతే ఏమీ కోల్పోనట్టే. ఆరోగ్యం కోల్పోతే కొంత కొల్పోయినట్లే. కానీ వ్యక్తిత్వం( శీలం లేక గుణం) కోల్పోతే ప్రతిదీ కోల్పోయినట్లే."

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు