తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, December 29, 2011

భగవద్గీత శ్లోకము - శ్రీ చంద్రశేఖరసరస్వతులవారి వ్యాఖ్యానం

శక్నోతీ హైవ యస్పోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్,
కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీనరః'

- కర్మసన్యాసయోగము, 23వ శ్లోకము

భావం:-
ఎవడీ శరిరమును విడుచుటకు పూర్వమే ఇక్కడే (ఈ జన్మయందే) కామక్రోధముల వేగమును అరికట్ట గలుగుచున్నాడో అతడే యోగియు , సుఖవంతుడునగును.


ఎవడు ఈ జీవితమందే శరీరత్యాగానికి ముందే కామ క్రోధ కారణంగా పుట్టిన వికారాలను సహిస్తున్నాడో అతడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనందాన్ని అనుభవిస్తున్నాడు. మరణానికి ముందు మనం ఏలాగుంటామో, మరణించిన తరువాత గూడా అలాగే ఉంటాము. ఇహజీవితంలోనే కామక్రోధాలను అణచి శాంతానందాలను చూచి ఉండకపోతే మరణానంతరం మనం దానిని చూడగల్గుతామనడం కల్ల. అందుకే కృష్ణ పరమాత్మ 'ఇహైమ' అన్న పదప్రయోగం చేస్తూ అంతటితో ఆగక ప్రాక్ శరీర విమోక్షణాత్' అని వ్యాఖ్యానమూ చేసినారు. ఐతే ప్రశ్న వేస్తారు. జీవితంలో మాకు వృత్తులున్నాయి. ఉద్యోగాలున్నాయి. మాకు ఎన్నో పనులు ఉన్నాయి. మేము సాధారణ జనులం. ఇంతాచేస్తే కాని మా బాధ్యతలు తీరవు. మీరేమోధ్యానం చేయమంటారు. దానికి కావలసినశక్తి కాలమూఏది? అని అంటారు. జీవనానికి కావలసినవృత్తిని వదలమనలేదు. జీవనవృత్తిని అవలంబిస్తున్నా, జీవితలక్ష్యాన్ని మరువకూడదనే చెప్పడం. త్రికరణశుద్ధికోసం సతతమూ పాటుపడుతూ ఆ భగవంతుని అనుగ్రహంకోసం ప్రార్ధిస్తూ ఉంటేనేకాని, కామక్రోధాలు మనలను వదలిపోవు. అట్లేమనంకూడా అనుదిన కార్యక్రమంలో మునిగి తేలుతున్నా జీవితలక్ష్యాన్ని మాత్రం ఏనాటికీ మరిచిపోకుడదని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది.

''పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి
బ్రహ్మావలోకన ధియం నజహాతి యోగి,
సంగీత తాఖ లయ నృత్త వశంగతోపి
మౌళిస్ధ కుంభ పరిరక్షణ ధీర్నటీవ.''

నర్తకి తలపై ఒక చిన్న కుండను ఉంచుకొని ఆట ఆడుతూ ఉంటుంది. లయ సంగీత, తాళ, గతులకు అనుగుణంగా పాద విన్యాసం చేస్తున్నా ఏ ఒక్క క్షణమూ తన తలమీద కుండను మాత్రం మరువకుండా కాపాడుకుంటూనే ఉంటుంది.

Tuesday, December 27, 2011

పరమశివులపై ఆదిశంకరాచార్యుల వేళాకోళం

ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం పెరిగేకొద్దీ చనువు ఎక్కువై వారి మధ్య ఆటపట్టించుకొనే తత్వం కూడా పెరుగుతుంది. భగవంతుడు,భక్తుడు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆదిశంకరాచార్యులు తన దైవమైన శివుడిని కూడా ఇలాగే ఆటపట్టించారు.

క్రింది శ్లోకం చూడండి.

"జడతా పశుతా కలంకితా
కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ!
అస్తి యది రాజమౌలే!
భవదాభరణస్య నాస్మి కిం పాత్రం? "

అర్థం : ఓ శంకరా! నాలో బద్దకం లేదు. పశుత్వం అసలు మచ్చుకైనా లేదు. ఇక మచ్చ అంటావా? నా శరీరానికీ, జీవితానికీ కూడా మచ్చ లేనేలేదు.వంకర టింకర గా నడిచే లక్షణం నాకు ఎన్నడూ లేదు. ఈ గుణాలన్నీ మంచివేనంటావా? ఒకవేళ ఈ గుణాలే ఉన్నాయనుకో! నీకు ఆభరణాన్ని అవుతానుకదా."

తనంతట తాను కదలలేని నీరు (గంగమ్మ) శివుడి తలపై ఆభరణముగానూ, వాహనమైన నంది పశుజాతి వాడు, తనలో మచ్చ ఉన్న చంద్రుడు శివుడికి శిరోభూషణముగా మరియు వంకర గా అంటే మెలికలు తిరుగుతూ ఉండే పాము కూడా శివుడికి ఆభరణాలే.

కాబట్టి జడత్వం,పశుత్వం, కుటిల కదలిక ఉన్నా నీవు ఆదరిస్తావు. నాకు కూడా ఇలాంటి గుణాలు ఉంటేనే నన్ను కూడా ధరిస్తావేమో! అని ఆదిశంకరాచార్యులు ఆటపట్టిస్తున్నారు.

Monday, December 26, 2011

బెంగళూరు లో ఆంధ్రప్రదేశ్ బస్టాండు మార్పు


ఇన్నిరోజులుగా బెంగళూరులోని మెజెస్టిక్ నుండే ఆంధ్రా,కర్ణాటక వైపు వెళ్ళే బస్సులు బయలుదేరేవి. కాని మెట్రోరైలు పనుల మూలాన నేటి నుండి ఆంధ్రావైపు అంటే హైదరాబాద్,విజయవాడ,తిరుపతి,కర్నూలు వైపు వెళ్ళే అన్ని APSRTC,KSRTC బస్సులు శాంతినగర బస్టాండు నుండి బయలుదేరుతాయి.

మతభేధాలు తప్పు అన్న పరమేశ్వరుడు

ఈ కథ వరాహపురాణంలో ఉంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని పూజించాలి? ఎవరిని గురించి తపస్సు చేస్తే కోరుకున్నవి నెరవేరతాయి? అనే సందేహం పూర్వం ఓసారి అగస్త్య మహామునికే వచ్చింది. అప్పుడాయన సందేహం ఎలా నివృత్తి అయింది అని చెప్పే కథా సందర్భం ఇది. మహారాజుకు అగస్త్యుడు తన స్వానుభవాన్ని వివరించాడు.

పూర్వం సర్వలోక జ్ఞానప్రాప్తికి అగస్త్యుడు ఎవరిని ఆరాధించాలా అని ఆలోచించి తనకు తెలిసినంతలో సనాతనుడు, యజ్ఞమూర్తి అయిన విష్ణువును ఆరాధించటం ప్రారంభించాడు. అలా ఆ యజ్ఞమూర్తిని చాలాకాలం పాటు ఆరాధిస్తుండగా ఓ రోజున యజ్ఞమూర్తి ప్రత్యక్షం కాలేదు. కానీ దేవేంద్రుడితో సహా దేవతలంతా అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చారు. తాను యజ్ఞమూర్తిని ఆరాధిస్తుంటే ఆయన ప్రత్యక్షం కాక ఈ దేవతలంతా వచ్చారేమిటబ్బా.. అని అగస్త్యుడు ఆలోచిస్తుండగానే ముక్కంటి నీలలోహితుడు అయిన శివుడు అక్కడికి వచ్చి నిలుచున్నాడు.

ఆయనను చూడగానే దేవతలు, రుషులు అంతా కలిసి ఆ రుద్రమూర్తికి నమస్సులర్పించారు. ఇంతలో మహాయోగి, త్రికాలజ్ఞుడు, పద్మ సంభవుడు అయిన బ్రహ్మ ఓ విమానంలో అక్కడకు వచ్చాడు. అలా దేవతలంతా అక్కడకు వచ్చారు కానీ అగస్త్యుడు అనుకొన్నట్లు విష్ణువు మాత్రం రాలేదు. ఇదేమిటి నేననుకొన్నట్లుగాక ఈ దేవతలంతా వచ్చారేమిటి? అని ఆ ముని అనుకొంటూ ఇంతమంది దేవతల్లో అసలు పూజనీయుడెవరు? అనే సందేహం కలిగి రుద్రుడు వైపున తిరిగి అదే విషయాన్ని గురించి అడిగాడు. అప్పుడు రుద్రుడు ఇలా చెప్పటం ప్రారంభించారు.

ఓ మునీ.. లోకాలన్నీ సర్వయజ్ఞాలతో యజిస్తున్నది ఎవరినో, ఎవరి వల్ల ఈ జగత్తంతా దేవతలతో సహా పుడుతోందో.. అలాగే ఈ జగత్తంతా ఎప్పుడూ ఎవరిలో నిలిచి ఉంటుందో, ఎవరిలో విలీనమవుతోందో ఆ పరదైవమే సత్యరూపమైన భగవంతుడు. ఎవరు ఎంతమంది దేవతలను గురించి ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని నమస్కారాలు పెట్టినా అవన్నీ ఆ భగవంతుడికే చెందుతాయి. ఆ దేవదేవుడే లోకపాలనా సౌలభ్యం కోసం మూడు రూపాలుగా సృష్టించుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవే ఆ రూపాలు. సత్వరజస్తమోగుణాలలో సత్వగుణం చేత జీవికి ముక్తి కలుగుతుంది. ఆ సత్వం నారాయణాత్మకం. యజ్ఞరూపుడైన నారాయణుడే ఆ భగవానుడు.

ఈయన నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా లోకవాసుల చేత పూజలందుకొంటుంటాడు. కృతయుగం లోని వారు సూక్ష్మ రూపంలో ఉండే భగవంతుడిని ఉపాసిస్తారు. త్రేతాయుగం లోని ప్రజలు యజ్ఞరూపంలో ఉన్న
భగవంతుడిని అర్చిస్తారు. ద్వాపరంలో పాంచరాత్ర సిద్ధాంతాన్ని అనుసరించే వారు ఆయనను ఉపాసిస్తారు. కలియుగంలో అనేక రూపాలలో ఆ భగవంతుడు పూజలందుకొంటుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి కంటే పరదైవం ఇంకొకటి లేదు. విష్ణువే స్వయంగా బ్రహ్మ. బ్రహ్మే స్వయంగా రుద్రుడు.. అని బ్రహ్మ విష్ణు రుద్రులకు ఏ భేదాన్ని పాటించకుండా అందరూ ఆరాధించాలి. ఆ ముగ్గురిలో భేదాన్ని భావించిన వాడు పాపకారి, దుష్టాత్ముడు అవుతాడు.

ఇలా రుద్రుడు అగస్త్యమునికి దైవతత్వాన్ని గురించి వివరించి చెప్పారు. అగస్త్యముని అసలు విషయాన్ని అప్పటికి గ్రహించాడు. తాను అనవసరంగా బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు అని అనుకొంటూ ఎదురొచ్చిన దేవతలను తక్కువ చేసి చూసినందుకు చింతించాడు. ఎవరి మనస్సుకు నచ్చిన పద్ధతిని బట్టి వారు ఆయా దేవతలను అర్చించవచ్చు. అంతేకానీ ఈ కనిపిస్తున్న దేవుడు మా దేవుడు కాదు.. అంటూ మన భేదాన్ని సృష్టించటం, ఎదుటి మతాన్ని, ఆ దేవతలను తక్కువ చేసి చూడటం సమంజసం కాదని ఆ మునికి బాగా అర్థమైంది.


ఇప్పటి పరిస్థితులకు అనుగుణముగా మనం ఈ కథను విభిన్నమతాలకు అన్వయించుకోవచ్చు

Saturday, December 24, 2011

సనాతన ( హిందు ) ధర్మం లో "ఓం" ను ఎందుకు భగవంతుని చిహ్నము గా స్వీకరించారు?

శబ్దమే భగవంతుడని చెప్పబడింది.ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది.శబ్దోచ్చారణ లో మనం కంఠం లో ని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు.ఇది ఓంకారానికి బీజం గా ఉంది.చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు.నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయము లో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది.అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.

" స్వామి వివేకానంద "

Thursday, December 22, 2011

ఈ మతంలో కొంత మంచి ఉంది, ఆ మతంలో కూడా కొద్దిగా ఉందేమో

దేవుడొక్కడే అని అందరికీ తెలుసు. కానీ మళ్ళీ నా మతం,నీ మతం అని అంటాము. అనేక మతాలు ఉన్నాయనటం భ్రాంతి మాత్రమే. ఉన్నది ఒకే ధర్మం."ఏకమేవ అద్వితీయం" అనే సత్యమే అనాదిగా వస్తోంది.లోకం లో వేర్వేరు ప్రవృత్తులు గల మనుషులు జన్మిస్తుండేటంత వరకూ ఆ అద్వితీయ దైవమే పాత్రోచిత మార్పులను పొందుతుందని గ్రహిస్తే, మనం పరస్పర సహనాన్ని చూపించుకోగలం.


"నదులన్నీ వేర్వేరు తావుల్లో జన్మించి,ఋజు లేక వక్రమార్గాలలో పయనించి సముద్రంలో కలిసిపోయేటట్లు, వివిధ శాఖల వారు విభిన్న దృక్పథాల్లో చివరకు నిన్నే చేరుతున్నారు(శివ మహిమ్నా స్తోత్రం 7)" అనేది అత్యంత వాస్తవం. కొందరంటారు "అవునవును,ఈ మతంలో కొంత మంచి ఉంది.ఇవి అధమ మతాలు.వీటిలో కూడా కొంత మంచి ఉంది" అని. అలాగే ఇతర మతాలన్నీ చరిత్రకందని కాలానికి పూర్వం జరిగిన క్రమపరిణామాన్ని సూచించే శిథిలాలనీ తమ మతం ఒక్కటే పరిపూర్ణమైన పరిణామాన్ని పొందినదనీ అంటారు. ఇంకొందరు తమ మతం నవీనమైనదవటంతో అదే సర్వోత్తమం అనీ సర్వశ్రేష్ఠతను దానికి ఆపాదిస్తున్నారు. కాని వీటన్నిటికీ సముద్ధరణ శక్తి సమంగానే ఉన్నదని మనం గ్రహించాలి.మనకు కనిపించే తేడాలన్నీ కేవలం గౌణ(secondary) విషయాలనే ఆశ్రయించుకొని ఉన్నాయి.ఇలాంటి విషయాలు మూఢాచారం నుండి పుట్టినవి. పిలిచేవారందరికీ భగవంతుడే సమాధానం ఇస్తాడు. ఎవరికి గానీ జీవుల ఉద్ధరణ గురించి కానీ,వారి ముక్తిని గురించి కానీ తలకొట్టుకోవలసిన అవసరం లేదు. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడే జీవుల ఉద్ధరణ గురించి ఆలోచిస్తాడు. ఒకే భగవంతుడు జీవుల మొరలను ఆలకిస్తున్నాడు.


ఒక వైపు తమకు దేవుడిపై విశ్వాసం ఉందంటూ , మళ్ళీ తమ మతం భుజస్కందాలపైనే మానవకోటిని ఉద్ధరించే భారం ఉందని అసంబద్ధంగా మాట్లాడే వారి తీరు ఎలాంటిదో నాకు తెలియడం లేదు. దీనిని ధర్మం అనగలమా? ధర్మం అంటే భగవత్ సాక్షాత్కారం.


మాటలు,కేవలం మాటలలోనే విశ్వాసం, గ్రుడ్డితనం తో తడుముకోవడం, పూర్వుల సిద్ధాంతాలను చిలుకల మాదిరి పలుకుతూ మతం పేరున రాజకీయాలను చేయడం తగదు. ఇప్పుడు కొందరు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తునందని అనుకొంటున్న ఇస్లాం మతంలో కూడా " ప్రభూ! నువ్వు సర్వేశ్వరుడివి.నీవు అందరి హృదయాలలో ఉన్నావు.నువ్వే ప్రతివారికీ శరణు. నువ్వే జగద్గురువవు.నీ ప్రజలు నివశించే భూమిని రక్షింప నువ్వే మా అందరికంటే అధికముగా ప్రయత్నిస్తావు" అనే అమోఘవాక్యాలు వెలువడ్డాయి.


ఎవరి నమ్మకాలనూ చెరుపనవసరం లేదు. మంచిని ఇచ్చే శక్తిని ఉంటే ఇద్దాము. వారి విశ్వాసాలను కదల్పకుండానే వారిని బాగుపడనిద్దాము. దీనికేమీ అభ్యంతరం లేదు. కాని రెంటికీ చెడ్డ రేవడి పరిస్థితి ని ఎందుకు కల్పించాలి?

Wednesday, December 21, 2011

ఆశ్చర్య పర్చే మన దేవుళ్ళ పేర్ల అర్థాలు

మన దేవతల పేర్లకు అర్థాలు తెల్సుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కల్గుతుంది.
కొన్నిటిని ఇక్కడ చూద్దామా!

విష్ణు - సర్వవ్యాపకత్వం
శివ - చైతన్యం ( గమనించండి శివం కు వ్యతిరేకం శవం అనగా అచైతన్యం)
గౌరి - తెలుపు పసుపు కలిసిన వర్ణం కలది
కాళి - నలుపు వర్ణం కలది
కృష్ణ - నలుపు వర్ణం
రామ - రమ్యతే ఇతి రామ: అనగా ఆత్మతో సదా కలిసిఉండేవాడు
గణపతి - గణాలకు అధిపతి
విఘ్నేశ్వరుడు - విఘ్నాలకు అధిపతి
ఇంద్రుడు - ఇంద్రియాలకు అధిపతి
జర - ముసలితనం ( కృష్ణావతార సమాప్తానికి కారణం)
వ్యాసుడు - విభజించేవాడు
సుబ్రహ్మణ్యం: బ్రహ్మత్వం నందు(పరమాత్మతత్వం నందు) బాగా కుదురుకున్నవాడు

అలాగే కొన్ని సంస్కృత పదాలు ఎలా వచ్చాయో చూద్దామా!

పక్షి : "క్షిప"తీతి పక్షిః (ఎగురునది పక్షి)
సింహం : "హింస"తీతి సింహః ( హింసించునది సింహం)

Tuesday, December 20, 2011

భగవద్గీత పై నిషేధం - ఎవరికి నష్టం?

పాపం "ఖర్మ"జీవులు భగవద్గీతను నిషేధించాలని చూస్తున్నవాళ్ళు.

అమృతం త్రాగమని ఇచ్చాడు దేవుడు, కాది ఇది విషం అని నిరాకరిస్తే అది ఎవరికి నష్టం?

పద్దెనిమిది అంతస్తుల సౌధం ఇచ్చాడు భగవంతుడు.దీన్ని ఆశ్రయించుకొని జీవితాన్ని పండించుకొమ్మన్నాడు దేవుడు. వద్దు మాకు అవసరం లేదు అంటే ఎవరికి నష్టం?

అనేక వేలఏళ్ళుగా తుఫానులకు, భూకంపాలకు అనేకానేక భీభత్సాలకు ఎదురొడ్డి ఏమాత్రం తొణకని,చెదరని 18 అంతస్తుల సౌధమే మాకు వద్దు అంటే ఎవరికి నష్టం?

ఏమనుకుంటున్నారు ఈ మతచాందసులు?
భగంతుడు మానవుడి పై ఆధారపడి ఉన్నాడా లేక మానవుడు భగవంతుడిపై ఆధారపడి ఉన్నాడా?

భగవద్గీతను నిషేధించి మెల్లమెల్లగా సనాతన వైదిక ధర్మాన్ని నశింపజేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది కాని ఇతరం కాదు. భారతీయులు ఏ మతం వారు కానివ్వండి, భారతీయుల నరనరాలలోనూ సనాతన వైదికధర్మమే ప్రవహిస్తోంది.

భగవద్గీతను ఒకమతగ్రంధం గా భావించి నిషేధించాలని చూస్తున్న వీరి అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప సగటు భారతీయుడు ఏ మాత్రం బాధపడడు. బాధపడతాడు ఎందుకంటే అది వారి అజ్ఞానం గురించే.

Monday, December 19, 2011

నచికేతుడిలాంటి వారిని పది మందిని ఇస్తే ప్రపంచాన్నే మార్చేస్తాను - స్వామి వివేకానంద

"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసేవాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి.నేను ఈ ప్రపంచాన్నే మార్చేస్తాను" అన్నాడు స్వామివివేకానంద.

ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు?అతని గొప్పతనం ఏమిటి?

కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు(ఉద్దాలకుడు) అను ఒక రాజు ఒక యాగం చేయ సంకల్పించాడు.ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి.కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను,గొడ్డులను,ముసలి ఆవులను దానం చేయసాగాడు.ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా!నేనూ నీకు గల సంపదనే కదా.మరి నన్ను కూడా దానం చెయ్యి"అన్నాడు.దీన్ని ఒక బాల్యచేష్ట గా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు.కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను"అని అన్నాడు.(ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు.అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా!ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్యదోషం వస్తుంది.మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి."అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు.నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రొజులు నిరాహారంగా ఉన్నాడు.యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథి ని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను.అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా!మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి(ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి).మరియు అతని పాపాలన్నీ పోవాలి.
రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని,దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు.యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు.
ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి మరియు బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు.యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన,వస్తు,కనక,వాహన,కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు.కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.
తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.

Thursday, December 8, 2011

గ్యాస్ సిలిండర్ తీస్కొనేప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం


మీరెప్పుడైనా మానం నిత్యం వాడే గ్యాస్ సిలిండర్ కు expiry date ఉంటుందని విన్నారా.
ఇక్కడ చెప్పబోయేది గ్యాస్ యొక్క expiry date గురించి కాదు. సిలిండర్ యొక్క expiry date.
మనం గ్యాస్ సిలిండర్ ను గనుక గమనించినట్లైతే ఫోటోలో చూపించినట్లు వ్రాసిఉంటుంది.

ఇది ఆంగ్ల అక్షరము మరియు అంకెలను కలిగి ఉంటుంది.

దీని అర్థం ఏంటంటే:
ఆంగ్ల అక్షరాలైన A,B,C,Dలలో ఏదో ఒకటి ఉంటుంది.

A ఉంటే మార్చి నెల వరకు (మొదటి త్రైమాసికం)
B ఉంటే జూన్ నెల వరకు (రెండవ త్రైమాసికం)
C ఉంటే సెప్టెంబర్ వరకు (మూడవ త్రైమాసికం)
d ఉంటే డిసెంబర్ వరకు (నాలగవ త్రైమాసికం) లను సూచిస్తాయి.
ఇక సంఖ్య సంవత్సరం ను సూచిస్తుంది.

బొమ్మలో D-06 ఉంది అంటే ఈ గ్యాస్ సిలిండర్ కాలపరిమితి డిసెంబర్ 2006 తో ముగుస్తుంది అని అర్థం.

ఉదాహరణకు B-12 ఉంటే జూన్ 2012 తో ముగుస్తుంది అని అర్థం.

కాలపరిమితి(expiry date) ముగిసిన సిలిండర్లను గనుక మనం వాడినట్లైతే గ్యాస్ లీక్ కావడం, పేలడం లాంటి ప్రమాదాలకు చాలా ఆస్కారం ఉంది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు