తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Sunday, May 17, 2009

మా ప్రాంతపు కొన్ని తెలుగు పదాలు - మా యాస - 1

ఈ శీర్షికను మన విభిన్న ప్రాంతాల మధ్య తెలుగు భాషా పదాలను తెలుసుకోవడానికి మొదలుపెడుతున్నాను. అలాగే ముందు మా ప్రాంతపు పదాలు వ్రాస్తాను. మా ఊరు అనంతపురం జిల్లా, కదిరి పట్టణము.

తొందరగా = బిరిన్న(బిర్న)
గరాటు = లొడిగి
పళ్ళెము = తట్ట ( మిగతా ప్రాంతాలలో తట్ట అనగా గంప అని అర్థము )
ఎల్లుండి = మర్నాడు లేక మన్నాడు
పురోహితుడు చేసే పెళ్ళిపనులు = సాంగ్యాలు
పొద్దస్తమానం = పల్లాపగలు
కొబ్బరిబోండాము = ఎల్లీరు కాయ
ఐదుగురు = ఐదుమంది ( మా ప్రాంతాలలో ఐదుగురు, ఆరుగురు అనే బదులు ఐదుమంది, ఆరుమంది ఇలా ఉపయోగిస్తాము)
పదిహేను = పదహైదు
పద్దెనిమిది = పజ్జెనిమిది

ఇవి కొన్ని పదాలు.  మిగతావి తర్వాత.Wednesday, May 13, 2009

మనము మనుషులమేనా? లేక మానవత్వం లేని రాక్షసులమా?

ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక వార్త నాకు ఈ సందేహం తెప్పించింది. 
అదేమిటంటే కరీంనగర్ జిల్లాలో జరిగిన సంఘటన.

ఒక వృద్ధుడు రైలు వస్తున్నదని తెలియక పట్టాలు దాటుతూంటే అక్కడ ఉన్న మనుషులు ఎవరూ పట్టించుకొన్న పాపానపోలేదు. కాని ఈ విషయం గమనించిన ఒక శిల్ప అనే 22 ఏళ్ళ అమ్మాయి ఆ వృద్ధున్ని చేయి పట్టుకొని లాగబోయింది. ఆ అమ్మాయి పరీక్ష వ్రాయడానికి వెళ్తోంది.కాని అప్పటికే రైలు ఆ వృద్ధున్ని గుద్దివేయగా, ఆ వృద్ధునితో పాటు అతని చెయి పట్టుకొన్న శిల్ప కూడా ఆ విసురుకు దూరముగా విసిరివేయబడింది. జనము ఆ ఇద్దరూ చనిపోయారనుకొని చోద్యం చూసారే కాని ఒకరు కూడా సహాయానికి వెళ్ళలేదు. సుమారు గంట తర్వాత ఆ అమ్మాయి కదలడం చీసి ఎవరో గేట్‌మాన్ కు సమాచారం అందించారు. అతను అంబులెన్స్ కు ఫోన్ చేసారు. వారు వచ్చి తీసుకెల్లబోయేంతలో ఆ అమ్మాయి చనిపోయింది. సుమారు గంటసేపు ఆ అమ్మాయి కొనప్రాణంతో కొట్టుమిట్టాడి ప్రత్యక్షనరకం చూసింది.

ఇదంతా చదివిన తర్వాత ఏమనిపిస్తోంది. మనుషులు తమ మొగాలను ఎక్కడ పెట్టుకోవాలి. ఒక కోతికి ఏమైనా ఐతే అక్కడ ఉన్న కోతులు అన్ని అరిచి గోలపెట్టి బాధ పడతాయే. అలానే కాకులు కూడా అంతే కదా. అంటే మనుషుల పరిస్థితి ఎంత అధ్వాన్నముగా ఉందో తెలుస్తోంది. ఎప్పుడూ నేను, నావారు, నాది అనే స్వార్థం తప్ప ఇంకేమి పట్టని ఈ సమాజంలోని మనుషులకు మంచిరోజులు ఎందుకు రావాలి? అస్సలు అవసరం లేదు. మన కర్మలకు అంటే మనం చేసే పనులకు మనమే బాధ్యులం తప్ప ఇతరులు కాదు.నీవు ఇతరులు బాధపడుతున్నా పట్టించుకోకున్నప్పుడు  ఇతర మనుషులు కాని, ఆ దైవం కాని నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? మనం మారనంత కాలం మన బ్రతుకులింతే. ఇంత కన్నా ఎక్కువ చెప్పుకోనవసరం లేదు.

Tuesday, May 12, 2009

ప్రజలారా! హక్కులే తప్ప బాధ్యతలు పట్టవా?

మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.

1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు. 

2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.

ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.

గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించ్ వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది.Sunday, May 10, 2009

"అమ్మ" అను పదానికి గణిత నిర్వచనము:

1000 మంది తండ్రులు + 100000 పరమగురువులు + 1000000 సాధారణ గురువులు +........................అనంతము వరకు << అమ్మ

అమ్మ ప్రతిక్షణమూ పూజ్యనీయురాలైనప్పటికీ అమ్మలను పూజించుకొనేందుకు, గౌరవించుకొనేందుకు ఒక రోజును కేటాయించినందున 
" మాతృదినోత్సవ శుభాకాంక్షలు" 
మాతృమూర్తులందరికీ అనంతకోటి నమస్కారాలు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు