తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, August 29, 2008

మైత్రేయి(మన ప్రాచీన తల్లులు)

విద్య కొరకు ఒకరికి రెండవ భార్యయై విద్యావతి ఐన సాధ్వీమణి మైత్రేయి.

మైత్రేయి మన పురాణ(వేదకాలపు) ప్రఖ్యాత స్త్రీ.ఈమె జనకమహారాజు సభలో అందరు పండితులను ఓడించిన యాజ్ఞవల్కుని రెండవ భార్య.ఇతని మొదటి భార్య కాత్యాయిని.

మైత్రేయి సకల వేదాలను,స్మృతులను ఔపోశన పట్టిన సాధ్వి.ఆమె కాలంలో మైత్రేయి "బ్రహ్మవాదిని" అను బిరుదు పొందినది.

మైత్రేయి మొదట గార్గి అను మహాయోగిని శిష్యురాలు.కాని యాజ్ఞవల్కుని తో జనకసభలో గార్గి కూడా పరాజితురాలవడం చూసి యాజ్ఞవల్కుని వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకొంది.తను అతని భార్య ఐతే సకల విద్యా జ్ఞానాన్నీ పొందగలనని భావించింది.ఈ విషయమై యాజ్ఞవల్కుని మొదటి భార్య ఐన కాత్యాయినిని సంప్రదించింది.తర్వాత కాత్యాయని అనుమతితో యాజ్ఞవల్కుని పెళ్ళాడి అతని రెండవ భార్య అయింది.

ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి.

సప్తర్షులు (అధ్యాత్మికం)

హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంధాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు.

సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14)లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.

వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.

వీరు మన్వంతరానికి ఒకసారి మారుతుంటారు.
1.మొదటి మన్వంతరము,అధిపతి స్వాయంభువు,సప్తర్షులు
మరీచి,అత్రి,అంగీరస,పులహ,క్రతు,పులస్త్య మరియు వశిష్ఠ
2.రెండవ మన్వంతరము,అధిపతి స్వారోచిషుడు,సప్తర్షులు
ఊర్జ,స్థంభ,ప్రాణ,దత్తోలి,నిస్చర,ఋషభ మరియు అర్వరివత్తు
3.మూడవ నన్వంతరము,అధిపతి ఔతమి
సప్తర్షులు కౌకునిది,కరుంది,దలయ,సాంఖ,ప్రవహిత,మిత మరియు సమ్మిత
4.నాల్గవ మన్వంతరము,అధిపతి తామస మను
సప్తర్షులు జ్యోతిర్ధామ,పృధు,కవ్య,చైత్ర,అగ్ని,వనక మరియు పివర
5.ఐదవ మన్వంతరము,అధిపతి రైవతమనువు
సప్తర్షులు హిరణ్యరోమ,వేదశ్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధామ, ఫర్జన్య మరియు మహాముని.
6.ఆరవ మన్వంతరము,అధిపతి చక్షూసమనువు
సప్తర్షులు శుమేధస్సు, విరాజస్సు, హవిష్మత్, ఉత్తమ, మధు, అభినామన్ మరియు సహిష్ణు.
7.ఏడవ మన్వంతరము,అధిపతి వైవస్వతమనువు (ఇది ప్రస్తుతకాలం)
సప్తర్షులు కష్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.

విష్ణుపురాణం ఆధారంగా

Wednesday, August 27, 2008

స్త్రీలు,శూద్రుల వేదాధ్యయన అధికారం

మన హిందూమతం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకువచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు.స్త్రీలు,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలాఅని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం.

భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు
"చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః"అన్నాడు.
దీని అర్థం"మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే పనులబట్టి నాలుగు వర్ణాలు(కులాలు) నాచే(భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి."అని అర్థం.

వేదాలలో నాలుగు వర్ణాల (కులాల)గురించి చెప్పారు కానీ వాటిమధ్య ఎక్కువ,తక్కువల గురించి చెప్పలేదు.మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు.సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.
1.యజుర్వేదం(26.2) శ్లోకం
"యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ"
అంటే "నేనెలా కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రులవరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి."అని అర్థము.
2.అధర్వణ వేదం (8వ మండలం,2వ అనువాకం) బ్రాహ్మణులకు,శూద్రులలో కూడా చివరివారికి
"సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద,నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే"
అంటే " మానవుడా!గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను.నేను దాస(శూద్ర),ఆర్య పక్షపాతము గలవాడను కాదు.నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను"అని అర్థము.
3.ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయబ్రాహ్మణమును,స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4.అలానే ఋగ్వేద ఒకటవ మండలం,17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిసకొడుకని ఋగ్వేదంలోనూ, శాయనభాష్యములోనూ,మహాభారతంలోనూ చూడవచ్చు.
5.అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు.సత్యకామజాబాలి వేశ్య కొడుకు.వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం(వేదాల చివరివి)ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6.ఋగ్వేద ఒకటవమండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర,8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక,శాయనభాష్యములోనూ చెప్పబడింది.
"న స్త్రీ శూద్ర వేదం అధీయతాం"(స్త్రీలు,శూద్రులు వేదమును అభ్యసింపరాదు)అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ వాక్యము వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7.ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు.యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది.ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు.ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరుప్రఖ్యాతులు పొందింది.(బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8.వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో,సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుషశూద్ర భేధము లేక అందరూ అర్హులే.

నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు,శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల(ఆత్మానుభవం పొందినవారు)మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.

దుష్టము,సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని,ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.

Tuesday, August 26, 2008

సహారా(సాగర),కాలిఫోర్నియా(కపిలారణ్య) లకు రిఫరెన్సులు

నేను గత టపాలో సహారా,కాలిఫోర్నియా ల గురించి వ్రాశినాను.వాటికి రెఫెరెన్సులు

సహారా(సాగర) : http://www.csre.iitb.ac.in/ysrao/sahara.html
కాలిఫోర్నియా (కపిలారణ్య): http://www.salagram.net/VWH-World.html
ఇవి IIT బెంగళూరు,ముంబాయి ల ఉత్తరాల నుండి సేకరించినవి.

అలాగే సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీ మొదలగు వివరాలకు వికీపీడియా(en.wikipedia.org/wiki/Sushruta_Samhita, en.wikipedia.org/wiki/Susrutha) చూడండి.

Monday, August 25, 2008

ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)

ఆర్యభట గురించి ఒక టపాలో చెప్పాను.ఇందులో అతని ప్రఖ్యాత ఆర్యభటీయం లోని విశేషాలను వ్రాయడం జరిగింది.
1.భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
2.సూర్యుని దృష్ట్యా గ్రహాల రోజులు కనుగొనడం
3.చంద్రుడు మరియు ఇతర గ్రహాలు సూర్యకాంతి వలనే ప్రకాశిస్తున్నాయి
4.గ్రహణాలు సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే వరుసలోనికి వచ్చినపుడు ఏర్పడతాయి.(ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు).
5.ఈ గ్రంథం ప్రకారం సంవత్సరం=365 రోజులు,6 గంటలు,12 నిమిషాలు,30 సెకన్లు.(ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది 365 రోజులు,6 గంటలు,9 నిమిషాలు,10 సెకన్లు)
6.ఈ గ్రంథం ప్రకారం గణితశాస్త్రంలో "పై(π)" విలువ దాదాపు 62832/20000=3.1416....( ఇప్పటి విలువ=3.14159...)
7.భూమి చుట్టూకొలత=24,835 మైళ్ళు ( ఇప్పటి ప్రకారం 24,902 మైళ్ళు)
8.సమస్య ద్వికరణీ. ప్రమాణం త్రితీయెన వర్ధయెత్ తచ్చతుర్థానాత్మ చతుసస్త్రింషెనెన సవిషెషహ్
ఇది 2 యొక్క వర్గమూలం కనుగొనడాన్ని వివరిస్తుంది.
2 యొక్క వర్గమూలం=1 + 1/3 + 1/(3.4) - 1(3.4.34)...=1.41421569(5 దశాంశాలకు సవరిస్తే).
9.sin(15 డిగ్రీలు)=890 ( ఇప్పటి విలువ 889.820) (ఇతను sin ను అర్దజ్యా గా వ్యవహరించాడు).

సుశ్రుతుడు- శస్త్రచికిత్సా పితామహుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)

సుశ్రుతుడు క్రీ.పూ 4 వ శతాబ్దమునకు చెందినవాడు.ఇంతకు మించి వీరి వృత్తాంతము తెలియరావడం లేదు.

వీరు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు.మరియు మత్తుమందు ఉపయోగించడంలోనూ,కంటి శుక్లాలు తొలగించడంలోనూ,మూత్రపిండరాళ్ళు తొలగించడంలోనూ మరియు విరిగిన ఎముకలు అతికించడంలోనూ అనుభవజ్ఞులు.
ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.


ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.

ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
"ఒక రాత్రి ఒక ప్రమాదన్లూ దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు."

ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన "ప్లాస్టిక్ సర్జరీ".వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.

వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం "సుశ్రుతసంహిత".ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.

Sunday, August 24, 2008

కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)

వేదభాష్యకారులలో ఒకరైన శాయనాచార్యులు (క్రీ.శ.1315 -1387) విజయనగర రాజులలో ఒకరైన బుక్కరాయల అస్థానంలో మంత్రిగా ఉండేవారు.వీరు తమ ఋగ్వేద భాష్యంలో కాంతి యొక్క వేగాన్ని ప్రస్తావించాడు.

వీరు తమ ఋగ్వేద భాష్యంలో ఒక శ్లోకంపై వ్యాఖ్య లో (1.50 సూక్తము,4 వ శ్లోకం)
"ఓ! సూర్యదేవా నీ కిరణాలు అరనిమేషంలో 2202 యోజనాలు ప్రసరిస్తాయి"అన్నాడు.

మనకు తెలుసు
ఒక యోజనం=9.00625మైళ్ళు
మహాభారతం,శాంతిపర్వం ప్రకారం
అరనిమేషం= 8/75 సెకన్లు (ఇక్కడ 7.9789... ను సమీప 8 కు మార్చడం జరిగింది).

ఈ లెక్క ప్రకారం కాంతివేగం 186413.22 మైళ్ళు/సెకన్.
ఇప్పటి లెక్కప్రకారం ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.
ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం.ఎంత దగ్గరగా మనవాళ్ళు లెక్కించారో.

Friday, August 22, 2008

కణాదుడు(ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)

పరమాణువుల గురించి పాశ్చాత్యులకన్నా ముందే కనుగొన్నవారు కణాదుడు.

వీరి తల్లిదండ్రుల గురించి,జన్మించిన స్థలం గురించి,మరణ వృత్తాంతం తెలియ రావడం లేదు.
వీరు క్రీ.పూ.6 వ శతాబ్దంలో జన్మించారు.వీరి అసలు పేరు కశ్యపుడు.చిన్నప్పటినుండే వీరు సునిశిత జ్ఞానం కలవారు.చిన్నచిన్న విషయాలను కూడా వీరు ఆసక్తిగా గమనించేవారు.

ఒకసారి వీరు ప్రయాగకు వారి నాన్న తో పాటు వెళ్ళారు.అక్కడి దారులపైన భక్తులు చల్లిన పూలు,బియ్యం గమనించి భక్తులు పూజల్లో నిమగ్నులై ఉందగా ఇతను మాత్రం ఆ గింజల్ని లెక్కించడం మొదలుపెట్టాడు.అది చూసి సోమశర్మ అను ఋషి చూసి ఎందుకలా లెక్కిస్తున్నావని అడిగాడు.అప్పుడు కణాదుడు ఆ గింజలు ఎంత చిన్నవైనప్పటికీ ఈ విశ్వంలో భాగమేకదా అన్నాడు.
ఈ విధంగా కణాదుడికి చిన్నచిన్న విషయాలపైన కూడా దృష్టి ఉండడంచూసి ఆ ఋషి అతనికి "కణాదుడు"(కణ అనగా ధాన్యపుగింజ) అని పేరుపెట్టాడు.

వీరు కనుగొన్నవి:
#ప్రపంచంలో మొట్టమొదట పరమాణుసిద్దాంతం ప్రతిపాదించారు.
#ఒక అణువులో కనీసం రెండు పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు.
#ప్రతిపదార్థానికి మూలం పరమాణువులే అని వటిని విభజించలేమని,అవి కనపడవని తెల్పాడు.(ఇప్పుడు వాటినికూడా విభజించవచ్చని కనుగొన్నారు,కానీ ఆ కాలం లో కణాదుడిలా కనీసం ఎవరూ అణువును కూడా ఊహించలేకపోయారు).

కణాదుడు వైశేషికదర్శనం(మిగతా దర్శనాలు న్యాయ,సాంఖ్య,మీమాంస మొదలగునవి)ప్రతిపాదించాడు.ఇందులో విజ్ఞాన,మత మరియి వేదాంతాల సమన్వయం ఉంది.ఈ దర్శనాలు నవీన శాస్తజ్ఞులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Thursday, August 21, 2008

ఆనందంగా జీవించండి (వ్యక్తిత్వవికాసం)

ఎన్నో ఆందోళనలకు,మనశ్శాంతి కరువవడానికి,చేస్తున్న పనులు సరిగా చేయకపోవడానికి ప్రధాన కారణం "మనిషి వర్తమానంలో జీవించకుండా గతంలో జీవించడం,అలాగే భవిష్యత్తును ఎక్కువగా ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని సరిగా జీవించలేకపోవడం".ఒక్క విషయం ఇక్కడ మనుషులు గమనించడం లేదు.మన ప్రస్తుత పరిస్థితి గతంలో మనం చేసిన పనుల యొక్క ఫలితం.అలాగే ఇప్పుడు మనం చేయబొయే పనులపైనే మన భవిష్యత్తు ఆధారపడిఉంటుంది.ఇది తెలుసుకోకుండా గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి అదేపనిగా బాధపడడం,మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధపడడం జరుగుతోంది.తద్వారా ఇప్పుడు అనగా వర్తమానంలో సరిగా పనులుచేయకపోవడం వలన గతకాలపు చేదు జ్ఞాపకాలనూ చెరిపివేయలేము,అలాగే అనుకున్న ఆశావహ భవిష్యత్తునూ జీవించలేరు.

"తప్పులు చేయడం మానవసహజం".కాబట్టి గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం మానేసి తప్పులను మరోసారి చేయకుండా జాగ్రత్తపడాలి.

కాబట్టి జరిగిపోయిన మన చరిత్రను ఒక్కసారి కూలంకుషంగా విశ్లేషించి ఇక సంఘటనలను పట్టించుకోవడం మానివేసి ప్రస్తుతం చేయబోయే పనులపైన దృష్టి పెట్టాలి.అలాగే చేయబోయే పనినైనా ముందుగా పని వలన సంతోషం మిగులుతుందా లేక బాధ ఫలితమవుతుందా అని విశ్లేషించి మొదలుపెట్టాలి.ఇక్కడ ఇంకో విషయం మరిచిపోకూడదు."మన స్వేచ్చ ఇతరులను బాధపెట్టేదైతే మనం స్వేచ్ఛగా ఉండలేము" అన్న విషయం.కాబట్టి మన పనులు సమాజానికి మేలు చేయలేకపోయినా కనీసం హాని మాత్రం చేయరాదు.

అలాగే అనవసరంగా ఎవరినీ అనవసరంగా ద్వేషించకూడదు.మన ద్వేషం వలన ద్వేషింపబడేవారిలో ఏదైనా మంచి మార్పు వచ్చేటట్టైతే మన ద్వేషానికి అర్థం ఉంటుంది.ద్వేషం వలన మనసూ మనశ్శాంతి పొందలేదు.ఉదాహరణకు మనము మనకు ఇచ్చిన పని మనస్పూర్తిగా చేస్తున్నప్పుడు మన ద్వేషానికి కారణమైన మనిషికానీ,సంఘటన కానీ ఎదురైనా లేక గుర్తువచ్చినా మనకు తెలియకుండానే మన మనసు వికలమయ్యి మన పనికి ఆటంకం అవుతుంది. విషయాలన్నీ ఆదర్శపూరిత విషయాలని అనుకోవచ్చు.కాని ఆదర్శంలేని వ్యక్తి కన్నా ఏదో ఒక ఆదర్శం గల వ్యక్తి వలనే సమాజానికి ఉపయోగం ఉంటుందన్న విషయం మనం మరిచిపోరాదు.
అప్పుడే మనము వర్తమానాన్నీ ఆనందంగా జీవించగలము మరియు సుందర భవిష్యత్తునూ జీవించగలము.

Tuesday, August 19, 2008

కొన్ని ఆంగ్ల పదాలు వాటి మూలాలు

సహారా(ఎడారి):

ఇది "సాగర"అను సంస్కృత పదము నుండి వచ్చినది.పూర్వము భూమి అంతా ఒకే ఖండము గా ఉండి ఇప్పటి రూపము సంతరించుకొనేటప్పుడు ఎన్నో మార్పులు జరిగినాయి.భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారము సహారా ఎడారి ఒక ఎండిపొయిన సముద్రము."సాగర" అను సంస్కృత పద రూపాంతరమే నేటి "సహారా" అను పదము అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.

కాలిఫోర్నియా:

మన రామాయణము లోని సగర కుమారుల వృత్తాంతము అందరికీ తెలిసేవుంటుంది.వారు కపిలమహర్షి నివశించే అరణ్యము లోనికి వెళ్ళి ఆ మునికి తపస్సు భంగము గావిస్తారు.అప్పుదు కపిలుడు వారిని బూడిద చేస్తాడు.ఈ "కపిలారణ్య"మే నేటి కాలిఫోర్నియా అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.ఇందుకు నిదర్శనము గా నేటికీ అక్కడ కనిపించే ప్రఖ్యాత " ఫౌంటైన్ యాషెస్".అనగా బూడిద ఫౌంటైన్స్.

దశావతారాలు - అంతరార్థం

ఈ క్రింద చెప్పబడిన విషయాలను ఆధ్యాత్మిక దృష్టి ద్వారా లేక మతపరంగా కాకుండా విజ్ఞానదృష్టి తో చూడాలని కోరుతున్నాను.
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.
అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.

అదెలాగంటే

1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.
2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.
3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.
4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.
5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.
6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.
7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.
8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.
9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.
10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు.

Monday, August 18, 2008

ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్తలు)

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న("0") ను అందించిన గొప్పవాడు.

ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.

ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.

గణితంలో ఇతని ఘనకార్యాలు:

1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన "భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం" గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని "పై"విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.

వీరు క్రీ.శ.550 లో మరణించారు.

మహోన్నత జీవితానికి మూడు సూత్రాలు

సత్యం,పవిత్రత,నిస్వార్థం ఈ మూడు గుణాలున్న వ్యక్తిని ముల్లోకాల్లోని ఏ శక్తీ ఏ హానీ చేయలేదు.ఈ మూడు సద్గుణాలతో శోభిల్లే వ్యక్తి సమస్త విశ్వాన్నీ ఎదుర్కోగల
సమర్థుడు
-- స్వామివివేకానంద
.సత్యం:
"సత్యం" ఈ మాట వింటేనే మనలో చాలామందికి వణుకు వస్తుంది.కానీ ఒక్కటి మరువరాదు
"సత్యమేవ జయతే,నానృతం" - ముండకోపనిషత్తు
సత్యమే జయిస్తుంది,అసత్యమెన్నటికీ కాదు.
అందరూ అనుకుంటారు " సత్యమే మాట్లాడుతూ కార్యాలయాలలోనూ,వ్యాపారాలలోనూ ఈ కాలంలో పనిచేయడం అసంభవం అని".కానీ ఇక్కడ గమనించవలసిన
విషయం ఏమిటంటే "సత్యం పురాతనమైనా,ఆధునికమైనా ఏ సమాజానికీ తలవంచదు;సమాజమే సత్యానికి తలవంచాలి".
సత్యం యొక్క తక్షణఫలితాలు చేదుగా అనిపించినా అంతిమ ఫలితం శుభమే అన్న విషయం చరిత్రలో ఋజువైంది.సత్యం పలుకువాడు దేనికీ తలవంచనవసరం
లేదు,భయపడనవసరం లేదు.

.పవిత్రత:
"పవిత్ర హృదయులు ధన్యులు.ఎందుకంటే వారు దేవుడిని దర్శిస్తారు" - బైబిల్
పవిత్ర హృదయం అనగా నిష్కల్మష హృదయమే.ఏదైనా పని నిర్విఘ్నంగా సాధించాలంటే ముందు మన మనసు పరిశుభ్రంగా ఉండాలి.ఆ పని చేస్తున్నంతవరకూ మన శ్వాస,ధ్యాస అంతా అప్పటికి ఆ పనే కావాలి.కాని ఇది సాధ్యం కావాలంటే పవిత్రమైన మనసుకు తప్ప మరేవిధంగానూ సాధ్యం కాదు.
పవిత్రత నిండిన హృదయం కులం,మతం,జాతి,సంప్రదాయం-అనే భేదబుద్ధిని విడిచి సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకుంటుంది.అప్పుడు మన పనికి ఏ విధమైన ఆటంకమూ ఏమీ చెయ్యలేదు.ఎందుకంటే అప్పుడు మన మనసు పవిత్రం కావడం వలన ఏ ఆటంకమునైనా మనము తేలికగా దాటగలము.

.నిస్వార్థత:
నేడు ప్రపంచంలో చాలామంది తమ స్వార్థం కోసమే జీవిస్తున్నారు.ఇక్కడ స్వార్థం అనగా స్వ+అర్థం=సొంత ప్రయోజనం కోసమే అని.
నిజం చెప్పాలంటే స్వార్థం లేనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు.కాని ఆ స్వార్థ శాతాన్ని తమ జీవితంలో ఎంతమేరకు తగ్గించుకుంటారో అంత ఎక్కువ ఆనందం అనేది అనుభవం అవుతుంది.
"చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష" అని అనుకున్నంత కాలం స్వార్థం అనేది లవలేశమైనా తగ్గదు.అందరికీ అనుభవమే పంచుకొని తినడంలో,అనుభవించడంలో గల ఆనందం.కాని ఎవరూ ఆచరణలో పెట్టలేకపోతున్నారు.ఎప్పుడైతే నిస్వార్థత మనకు కలుగుతుందో అప్పుడే మనశ్శాంతి వస్తుంది.కోట్లు సంపాదించినా పొందలేని మనశ్శాంతి మన వశమవుతుంది.
మనం ప్రపంచాన్ని మన మనసు ద్వారానే చూస్తున్నము కాబట్టి పరిశుద్దమైన మనసు ద్వారా మనకు ప్రపంచంలోని మంచే కనిపిస్తుంది.

సత్యం ద్వారా పవిత్రత,తద్వారా నిస్వార్థత అలవడుతాయి.

Sunday, August 17, 2008

శ్రీరామకృష్ణ పరమహంస

శ్రీరామకృష్ణ పరమహంస గారు అంటే తెలియని ఆస్తిక భారతీయులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు.భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామివివేకానంద వెనుకగల కర్త,కర్మ,క్రియ అంతా శ్రీరామకృష్ణులే.

జననము మరియు బాల్యము
శ్రీరామకృష్ణ పరమహంస గారు క్రీ.శ 1836,ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్,చంద్రమణిదేవి.వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు.రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు.బాల్యం నుండే ఇతనికి లలితకళలు,చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది.ఐనా ఇతనికి పాఠశాల విద్య అంటే ఏహ్య భావము కలిగిఉండేవాడు.దానివలన చదువు అబ్బలేదు.పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు.వారిని సేవించేవాడు.
ఉపనయనం తర్వాత చిన్నప్పుడు ఒక దళిత మహిళకు ఇచ్చిన మాటప్రకారం బంధువులు వారిస్తున్నా మొదటి భిక్షకు వెళ్ళి స్వీకరించాడు.
రానురాను వీరి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారటంతో వీరి అన్నగారైన రాంకుమార్ గారు కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాలను నడిపేవారు.తర్వాత ఒక అంత్యకులంలో జన్మించిన రాణిరాస్మణి దక్షిణేశ్వరంలో నిర్మించిన కాళికాలయంలో పూజారిగా నియమితుడయ్యాడు.

పూజారిగా
మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు పూజలో సేవచేసేవాడు.గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.కాలక్రమంలో తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవల్లు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు.ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు.అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు.నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు.

వీరి గురువులు మరియు సాధనలు
కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు.వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు.తర్వాత భైరవీబ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు.ఈ విధంగా భగవత్,ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం,క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశాం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.

వివాహము
వీరు భగవత్ధ్యాసలో ఉండడాన్ని పిచ్చితనంగా భావించిన వీరి తల్లి వీరికి వివాహము చేయ సంకల్పించింది.రామకృష్ణులే తమకొరకు ఒక అమ్మాయి సిద్దంగా ఉన్నదని ఆమె పేరు శారదాదేవి అని చెప్పి శారదాదేవిని పెళ్ళాడారు.ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు.ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.

గురువుగా
తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందముగ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యౌలు రావడం ప్రారంభించారు.వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరిపేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు.వీరి పరిచయం విచిత్రంగా జరిగినది.
అప్పటికి వివేకానందులు నిజంగా భగవత్ అనుభవమ్ పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు."మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు.రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆద్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.

రామకృష్ణులు ప్రపంచానికి అందించిన శిష్యులు:
స్వామి వివేకానంద,స్వామి బ్రహ్మానంద,స్వామి ప్రేమానంద,స్వామి శివానంద,స్వామి త్రిగుణాతీతానంద,స్వామి అభేదానంద,స్వామి తురీయాతీతానంద,స్వామి శారదానంద,స్వామి అద్భుతానంద,స్వామి అద్వైతానంద,స్వామి సుభోదానంద,స్వామి విజ్ఞానానంద,స్వామి రామకృష్ణానంద,స్వామి అఖండానంద,స్వామి యోగానంద,స్వామి నిర్గుణానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వీరు సన్యాస శిష్యులు.గృహస్థ శిష్యులలో నాగమహాశయులు,పూర్ణుడు,గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.

వీరి ప్రముఖ భోదలు
#అన్నిమతాల సారాంశం ఒక్కటే.
#కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
#మానవసేవే మాధవసేవ
#ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
అలాగే స్వామీ వివేకానందుని భోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
అంత్యదశ
వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు.
చివరికి వీరు 1886,ఆగష్టు 16 న భగవంతునియందు లయించారు.

Thursday, August 14, 2008

కొన్ని ధైర్య-ఆత్మవిశ్వాస ఉత్పాదక వచనాలు

నీవు నిత్యం నిర్భీతునిగా ఉండు.భయమే మృత్యువు,నిర్భయమే జీవితము.

అచంచల ఆత్మవిశ్వాసం గలవాడికి సముద్రం పిల్లకాలువ లాగా,మహోన్నతపర్వతాలు గోపాదంలాగా కనిపిస్తాయి.

--స్వామి వివేకానంద

భగవంతుడు మనిషికి ఎదుర్కోలేని కష్టాలు ఇవ్వడని గుర్తుంచుకో.
-- పరమహంస యోగానంద

అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖముంటుంది.సాదించి శోధించాలి.
-- శ్రీశ్రీ

నీకు విజయం వరించాలని ఆశించబోయేముందు అందుకు నీవు అర్హుడవో,కావో ఆలోచించు.
-- ఖలీల్ జిబ్రాన్

Wednesday, August 13, 2008

భూమి గుండ్రం (వేదాలు)

మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు? మనం చదువుకున్నది 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్,కోపర్నికస్,గెలీలియోలని.

కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం " భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."

అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది" అని దాని అర్థం.

ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం " భూగోళః సర్వతో వృత్తః" అంటే " భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.

క్రీ.శ.505 లో వరాహమిహిరుడు " పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)"
అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.

లీలావతి గ్రంథం లో భాస్కరాచార్యుడు " నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."
శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు