తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, March 21, 2014

కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తేరు(రథం) మరియు తేరును లాగే త్రాడు

కదిరి లో రేపు బ్రహ్మరథోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా కదిరి తేరు మరియు దానిని లాగు త్రాడు యొక్క చిన్న వీడియో.

Wednesday, March 19, 2014

మనం జయించామనుకుంటాం..కానీ ఇంతలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది..

నేను చాలా నాచురల్ గా ఉంటాను..ఏం పెట్టినా తింటాను..వాళ్ళ మనసు ముఖ్యం..వాళ్ళు మనస్పూర్తిగా అన్నం పెడ్తే చాలు..వాళ్ళ నుండి నాకు మర్యాద ఏమీ అవసరం లేదు..ఇలా సాగుతుంది మన ఆలోచనా వ్యవహారం.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.

గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?

ఒక చిన్నకథ.

శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్‌జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.

ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?

నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.

కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

Monday, March 17, 2014

"మనం చేయగలిగినంత వరకు చేయడమే - ఫలితం భగవంతుడిదే" అని ఎందుకంటారు?

ఈ టపా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ఈ మధ్య చదివిన ఒక చారిత్రక సంఘటన.

విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.

కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.

సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.

చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని  సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి  (2-47) 

పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.


Tuesday, March 11, 2014

సహనం,ఓర్పు మరియు పట్టుదలలు విజయాన్ని కల్గిస్తాయనడానికి సజీవ ఉదాహరణ - నితిన్

నితిన్...వీరే ఆ సజీవ ఉదాహరణ..సినీతెరపై అడుగుపెట్టింది 2002 లో, చివరిసారిగా విజయం సాధించినది 2004 లో. మళ్ళీ మరో విజయం కోసం 8 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది.

మధ్యలో ఎన్నో ఆటుపోట్లు...తన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అంతే...కాని పవన్ కళ్యాణ్ గారికి బలమైన నేపథ్యం ఉంది...నితిన్ గారికి బలమైన నేపథ్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ పరాజయాల కాలంలో రాటుదేలి తన లోపాలను సరిజేసుకుంటూ ఎవరు తన వెంట లేకపోయినా ఓర్పుతో అంతకు మించి సహనం,పట్టుదల లతో 2012 లో ఇష్క్ సినిమాతో విజయం సాధించాడు...తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే,హార్ట్ ఎటాక్ లతో విజయాలతో దూసుకెళ్తున్నాడు..ఇప్పుడు విజయాలు ఇస్తున్న మత్తులో పట్టుజారిపోకుండా అత్యంత జాగరూకతతో మరిన్న విజయాలు పొందాలని ఆశిస్తున్నాను.

నేను
 వ్యక్తిగతంగా ఏ హీరోకూ అభిమాని కాను.కాని ఏ రంగంలోనైనా ఇటువంటి పట్టుదల,ఓర్పు మరియు సహనములు ఉంటే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించిన నితిన్ గారి లాంటి వారిని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంకా ఎందరో ఉన్నారు.ప్రస్తుతానికి వీరి గురించి చెప్పుకోవాలనిపించింది.

కాకతాళీయం ఏంటంటే ఇదే పరిస్థితి చవిచూసిన నితిన్ గారి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా తన విజయాన్ని నితిన్ లానే 2012 లో గబ్బర్ సింగ్ తో పొందడం.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు