తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, June 30, 2010

మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?

రోముకు వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండమని ఒక సామెత. అంటే వారి మనస్తత్వానికి తగ్గట్లు నడుచుకోవాలన్నమాట. అంటే ప్రతి దేశానికి కొన్ని విధివిధానాలు, సంస్కృతీసాంప్రదాయాలు
ఉంటాయి, అవి ఇంకో దేశంలో చెల్లుబాటు కావచ్చు,కాకపోవచ్చు. అలానే ప్రజల మనస్తత్వాలు కూడా. భారతదేశంలో ని ప్రజల వేషధారణ ఇంగ్లాండ్ వారికి ఎబ్బెట్టు గా కనిపించవచ్చు.
అలానే వారి స్వేఛ్ఛా మనస్తత్వాన్ని మనం విచ్చలవిడితనం గా భావించవచ్చు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన విధానాల కళ్ళజోళ్ళ లో నుండి, వారు వారి
విధానాల కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నారు. అలా చూడకూడదు కదా. ఎవరి ప్రమాణాలు(Standards) వారివి.

ఇదే విషయం మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విషయంలో కూడా వర్తిస్తుంది. వారి విధానం వేరు. ఇక్కడ మన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఋషులని సంభోధిస్తున్నాను. భారతీయులు
ఎప్పుడూ దేవుడు,ఆత్మ,వేదాంత రంగాలలోనే విషయాలు కనుగొన్నారు కానీ సైన్సు పరంగా ఏమీ లేదనే అభిప్రాయం విదేశీయులలోనే కాదు, దురదృష్టవశాత్తూ మన భారతీయులలో కూడా
చాలా ఎక్కువగా ఉంది.

మన ఋషులు ఏవైనా సైన్సుకు సంబంధించిన విశేషాలు కనుగొంటే ఎందుకు చెప్పలేదు? అని చాలామంది అంటుంటారు. ఒకటే కారణం వారు చెప్పిన విధానం వేరు.

మన ఋషుల విధానం ఏమంటే సమాజంలో సామాన్యులే ఎక్కువగా ఉంటారు. మేధావుల శాతాన్ని మామూలు జనం సంఖ్యతో పోలిస్తే నిర్లక్ష్యం చేయవచ్చు(Negligible). సైన్సు యొక్క ఫలాలు సామాన్యులకు చేరినప్పుడే దానికి విలువ అని ప్రస్తుతం మనం అనుకుంటున్నదే వారి విధానం కూడా. సాధారణంగా మన పూర్వీకుల పద్దతి ఆధ్యాత్మిక సంబంధమైనది. ఆ పద్దతికి తగ్గట్లే మన ఋషులు కూడా తమ పద్దతిని రూపకల్పన(Design) చేసుకొన్నారు. తము కనుగొన్న విషయాలను కథల రూపంలోనూ, కట్టుబాట్ల రూపం లోనూ, నిషేధాల రూపం లోనూ జనానికి అందించారు. ఉదాహరణకు ఏదైనా ఆసనం పై (కుర్చీ లేదా గోడ ఏదైనా కావచ్చు) కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు అంటారు. అలా ఊపడం అలవాటైతే గనుక పక్షవాతం వస్తుందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. కానీ మనవారు అలా ఊపితే ఎదురుగా ఉన్న వారికి కాళ్ళు చూపినట్లవుతుందని ,వారికి అగౌరవమని నిషేధించారు.ఇది ఒక ఉదాహరణ
మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా ఇందులో కలిసిపోయుండవచ్చు. అంత మాత్రాన అన్నీ మూఢనమ్మాకాలేనని ఎలా నిర్ణయించగలం?

మనఋషుల విధానం లో ప్రజలలోనికి విషయం ఎలాగైనా చేరాలి, వారు ఆచరించాలి అంతే.
అసలు తాము ఒక విషయం కనుగొన్నమనే దానికి వారు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఉదాహరణకు సాయణాచార్యులు ఋగ్వేద భాష్యం చెప్తూ కాంతివేగాన్ని కూడా
పరోక్షం(indirect)గా చెప్పారు. తానేదో కొత్తవిషయాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పలేదు.
మనకు తెలిసిన ఆర్యభటుడు , భాస్కరాచార్యుడు, చరకుడు,కణం అనే భావనను కనుగొన్న కణాదుడు మొదలగు వారు కూడా తమ ఆవిష్కరణలను ఏనాడూ ప్రచారం చేసుకోలేదు.
పేటెంటు కూడా తీసుకోలేదు. పేరును ఆశించలేదు. తమ కృషి ఫలితాలు కేవలం ప్రజలకు చేరడమే వారికి కావలసింది. అంతెందుకు మన కాలం నాటి జగదీశ్ చంద్రబోస్ కూడా ఎన్నో
కనుగొన్నా ఏనాడూ పేరు ఆశించకుండా కేవలం తన పరిశోధన ఫలితాలు జనానికి అందాలని ఆశించాడు. పేటెంట్లు కూడా తీసుకోలేదు.

ఇప్పుడంటే మనం మన పూర్వీకులు ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు అని చెప్పుకొంటున్నాం కానీ వారు ఏనాడూ పేరుప్రతిష్టలకై ఆశించలేదు.

ఇక విదేశీయుల పద్దతి ఏమిటంటే తాము ఏదైనా కనుగొంటే మొదట తమ పేరున పేటెంట్ పొంది తర్వాత జనాలకు ఆ అవిష్కరణను పరిచయం చేస్తారు. ఇక్కడ నేను విదేశీయులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వారి విధానం ఇది అని చెప్తున్నాను. వారి విధానం వారికి సరైనదని అనిపించవచ్చు కాబట్టి అదే వారు అనుసరిస్తున్నారు.

ఇప్పుడు ఆలోచించండి విదేశీయుల విధానాలను ప్రాతిపదికగా తీస్కొని మన విధానాలను పోల్చడం ఎంత బుద్ధి తక్కువ పనో!

వనరులు:
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?

Tuesday, June 29, 2010

మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఇవ్వడు.అలాంటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అవసరమా?

మొన్న మౌనిక అనే నర్సింగ్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. ఇంత చిన్న వయసులో పిల్లలు అలా ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ఎందరు బాధపడరు? కొందరు పరీక్షలలో తప్పామనో, మరి కొందరు ప్రేమలు విఫలమయ్యాయనో, ఇంకొందరు తమకు అవమానాలు జరుగుతున్నాయనో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

ఎన్నో విషాదకరసంఘటనలు జరుగుతున్నా బ్రతుకుతున్నామంటే మన వలన జరగవలసింది ఇంకా ఉందన్నమాటే కదా! పరీక్ష ఫెయిల్ అయినవెంటనే లేక ప్రేమ విఫలమైన వెంటనే లేక అవమానం పొందిన వెంటనే ప్రాణం దానంతట అది ఎందుకు పోవడం లేదు? అలా పోతే ఏం చెప్పలేము. కానీ 99% అలా పోవడం లేదే! అంటే ఇంకా అవకాశాలు ఉన్నాయన్న మాటే కదా!

ఏమైనా అంటే " మా పొజిషన్ లో మీరుంటే మీకు తెలుస్తుంది" అంటారు. ఎవరి స్థితి వారికి బాధాకరమైనదే. కాని అదే లోకమా? ఇంక ప్రపంచమే లేదా?

బ్రతకడానికి ధైర్యం కల్గించే మాటలు ఉపాధ్యాయులూ చెప్పరు, తల్లిదండ్రులూ చెప్పరు. అందరినీ అలా అనడం లేదు కానీ చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికీ ర్యాంకుల, మార్కుల గోలే కానీ ఒక పిల్లవాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అని చాలామంది తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ చూడడం లేదు.

ఇక స్నేహితుల విషయానికి వస్తే తమ స్నేహితుడు(స్నేహితురాలు) ఒకరిని ప్రేమిస్తున్నామంటే మద్దతు బాగా ఇస్తారు కానీ ఎందుకు సపోర్ట్ చెయ్యాలి,అవుతుందాలేదా అనే ముందుచూపు కానీ ఉండదు. అంతే కాక వారి ప్రేమ విఫలం ఐతే ధైర్యం చెప్పడం కానీ ఉండదు. అందరినీ ఇలా అనడం లేదు కానీ చాలామందే ఇలా ఉంటున్నారు.

నా ఇంజనీరింగ్ చదువు అయిపోయి 7 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు నాకు పర్మనెంట్ ఉద్యోగం లేదు.ఎన్నో ఉద్యోగాలు చేతివరకు వచ్చి, చివరి క్షణంలో జారిపోయాయి. పార్ట్‌టైం ఉద్యోగాలే చేసుకొంటూ ఉన్నాను. ఇదే కారణాన వచ్చిన పెళ్ళిసంబంధాలు వెళ్ళిపోయాయి. ఇంట్లో వారి బాధలూ, బయటి వారి అవమానాలూ ఎన్నో భరిస్తున్నాను.బాధపడ్డాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషిని మాత్రమే.అంతవరకే.కానీ ఏనాడూ ఒక స్థాయిని మించి బాధపడలేదు.

నాకు స్పూర్తిని ఇచ్చిన మహామంత్రం పరమహంస యోగానంద చెప్పిన" మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు ".
రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు.""చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది"అని.ఇలాంటి స్పూర్తిదాయక మాటలు చెప్పేవారుండరు.

ఎప్పుడూ సిలబస్ పుస్తకాలే లోకం కానీ మహాత్ముల పుస్తకాలు చదవరు, అలా చదవడానికి ప్రోత్సాహం కూడా చాలా తక్కువే. కొంతమంది ఒంటరితనం భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వీరికీ తోడు ఇవ్వలేనప్పుడు మహాత్ముల,గొప్పవారి జీవిత చరిత్రల పుస్తకాలు చదవడమే తోడు అవుతుంది. అలా అలవాటు చేయడం ఎంతో ముఖ్యం కదా!.

పెద్దలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వీరందరికీ నా మనవి ఒక్కటే చదువులు ఎన్నైనా చదివించండి లేక చెప్పండి అలాగే మనుషులను ధైర్యవంతులుగా చేసే మాటలు, బ్రతకడానికి
స్పూర్తిని కల్గించే బోధనలు చెప్పండి.
స్నేహితులను కూడా ఇదే వేడుకొంటున్నాను.

చివరిగా ఒక మాట "బలమే(ధైర్యమే) జీవితము, బలహీనతయే మరణము". కాబట్టి ఆత్మవిశ్వాసము, ధైర్యమూ కలిగించే మాటలనే ఎప్పుడూ తల్చుకొందాము.
అలా అందరూ తలచుకొనేలా ప్రయత్నిద్దాము.

Monday, June 28, 2010

వేదాలా! అవి ఒట్టి ట్రాష్! ఎందుకంటే విదేశీయులు అలా అన్నారు మరి!

మన జీవన సూత్రం ఏమంటే మన సొత్తు గురించి మనకు బయటి వారి సర్టిఫికేషన్(ధ్రువీకరణ) మనకు కావాలి. మన సొంత పరిశీలన చాలా తక్కువగా ఉంటుంది.

వేదాల విషయంలో కూడా జరిగింది, జరుగుతున్నదీ కూడా అదే.

వేదాలు మూడే అన్నారు. అధర్వణ వేదం వేదం కాదని తర్వాత చేరిందన్నారు.
'' చత్వారోహి ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదః
సామవేదో బ్రహ్మవేద ఇతి'' అని గోపథ బ్రాహ్మణం (పూర్వభాగం) అంది. బ్రహ్మవేదమే అథర్వవేదం

'వేదత్రయి' అని మరొక విభజన ఉంది. 1. పద్య, 2. గద్య 3. గేయవిభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, 2. గద్యంలో దర్శించినవీ 3. గేయంలో దర్శించినవీ ఉన్నాయి. ఇది ఛందో విభజన.

వేదం మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది. అవి. 1. బ్రహ్మ, 2. ఆత్మ, 3. బ్రహ్మ ఆత్మల ఏకత్వం. అందుకు కూడ అది 'వేదత్రయి' అయింది.
ఇవన్నీ తెల్సుకోరు కానీ వేదాలు మూడే అంటారు, అలానే అని మనలను నమ్మించారు.

వేదానికి 'శ్రుతి' అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది- విన్నది.
ఇంకేం పాశ్చాత్యులకు మంచి అస్త్రం దొరికింది. మనపై మనకే అపనమ్మకం ఏర్పడేలా చేసారు.
శ్రుతి అంటే విన్నది కాబట్టి వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు. తొలుత వేదం పలుకబడింది , వ్రాయబడలేదు అన్నారు. అదే నిజం అని మనం నమ్ముతున్నాం.

వేదమంత్రాలు స్వర ప్రాధాన్యం కలవి కాబట్టి విని నేర్చుకొని ఒక విధానంలో వాటిని పలకాలి. ఇలా వింటూ నేర్చుకొనే విధానం ఉండేది కాబట్టి "శ్రుతి" అన్నారు.అంతే కాకుండా వేద మంత్రాలను ఋషులు తమ తపో బలంతో తపస్సు లో వాటిని విని అక్షరబద్దం చేసారు(వ్రాసారు). వారు వాటిని విన్నారు కాబట్టి శ్రుతి అయింది. పాశ్చాత్యులకు ఈ విషయం తెలుసో లేదో లేక తెలిసే మనలను నమ్మించారో తెలియదు. మనవాళ్ళూ వారు చెప్పిందే నమ్మారు.

గౌతమ బుద్దుడూ, శ్రీ రామానుజాచార్యులూ వేదాలను నిరసించారని మనలనే నమ్మేలా చేసారు. నిజానికి వారు నిరసించింది వేదాలను కాదనీ, వేదం పేరున జరుగుతున్న కర్మలను మాత్రమే అని మనం తెలుసుకోలేదు. వేదం అంటే యజ్ఞ,యాగాలు మాత్రమే అనే నమ్మకం కలిగించారు.ఇది ఈనాటికి జరుగుతున్నది.

"దైవం స్థాణోపరపరాధః యదేనం అంధో న పశ్యతి పురుషాపరాధః న భవతి'' ఒక పదార్థం ఉంది. దాన్ని గ్రుడ్డివాడు చూడడు. తప్పు పదార్థానిది కాదు.గ్రుడ్డివాడిది అవుతుంది.
వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోనివాడు గ్రుడ్డివాడు . అతడికి వేదకర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు.
క్రీస్తుకు వేయి సంవత్సరాల ముందు వాడైన యాస్కఋషి చెప్పినట్లుగా
''ఒకడు బరువు మోస్తాడు. మోసిందేమిటో తెలియదు. అలాంటివాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు.
వేదం చదివి అర్థం చేసుకున్నవాడికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాల్ను కడిగేస్తుంది.''

అసలు మనము మనవాటి పైన శ్రద్ద చూపనప్పుడు వారిని అని మాత్రం ఏం లాభం? పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో ఉన్నాయి. మరో టపాలో ఎప్పుడైనా అవి పంచుకొనే ప్రయత్నం చేస్తాను.

Friday, June 25, 2010

భారతదేశం పై ఆర్యుల దండయాత్ర(లేక వలస) లో నిజానిజాలు ఎంత?

ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము.
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.

2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".

4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.

1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.

ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు.నేను నివశించే అనంతపురం జిల్లాలో కూడా ఈ ఆచారం లేదు.ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.

ముక్తాయింపు:
వ్యక్తిగత విమర్శలు చేస్తే అవి తొలగిస్తాను. మీ వద్ద గల అధారాలు, అభిప్రాయాలు మాత్రం చెప్పగలరు.

Thursday, June 24, 2010

ఎప్పుడూ తన పదవి పోతుందని భయపడే ఇంద్రుడికి వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు?

ఏంటండీ ఇంద్రుడు ఎప్పుడూ తమ మానాన తాము దైవసాక్షాత్కారం కోసం తపస్సు చేసుకొనే ఋషుల తపస్సును భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూంటాడు. అలానే అతనికి ఒక మామూలు మనుషికి ఉండే దుర్గుణాలన్నీ ఉంటాయి. అంటే ఇతర స్త్రీలను ఆశించడం, పదవీ వ్యామోహం మొదలగునవి ఉంటాయి. మరి ఇలాంటి ఇంద్రునికి మనం ఎంతో గొప్పగా చెప్పుకొనే వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు అనే సందేహం చాలామందికి ఉంది. విషయం తెలియక ఈ కారణంతోనే వేదాలను నింద చేసే వారున్నారు.

ఆ అనుమానంను నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.

మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పైన అనుకొన్న ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి. అందుకే ఇతను తన పదవి పోతుందనే భయము తో ఋషులు చేసే తపస్సును భగ్నం చేస్తుంటాడు.

ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.

ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం

13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.


కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.

అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.

గమనిక : గతంలో ఈ విషయానికి సంబందించిన టపా వ్రాసినప్పటికీ పొరపాటున అది తొలగింపబడడం వలన మళ్ళీ వ్రాస్తున్నాను.

Wednesday, June 23, 2010

ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి మీరు చేస్తున్న నిర్వాకానికి?

మొన్న ఉప్పల్,హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో అభం,శుభం ఎరుగని, కల్లాకపటం తెలియని చిన్నపిల్లలు ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దీనికి కారణం మద్యం తాగి వాహనం నడపడమే.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మద్యం త్రాగండి, త్రాగి చంపండి, మీరూ చావండి" పథకం అత్యద్బుతంగా పనిచేస్తోంది. లేకుంటే ప్రజాసంక్షేమం మరిచి మద్యం ఏరులై పారిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎండాకాలంలో వీధి వీధికో చలివేంద్రం ఉన్నట్లుగా వీధివీధికీ మద్యం అంగళ్ళ లైసెన్సులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వఖజానా నిండడం కోసం న్యాయమైన మార్గాలు వదిలి, ఇలాంటి మార్గాలు అనుసరిస్తూ ముక్కుపచ్చలారని పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రాణాలు తీస్తుంటే మనం ఇలా ఎన్నాళ్ళని చేతులు ముడుచుకొని కూర్చోవాలి? అనుభవజ్ఞులు కూడా ఏం చేయలేరా? కనీసం అనుభవజ్ఞులు ఒక ప్రణాళిక రచిస్తే ఇలాంటి సంఘటనల వలన బాధపడే యువత కూడా ముందుకొస్తుంది కదా!

Thursday, June 17, 2010

మంత్రాలకు చింతకాయలు ఎందుకు రాలకూడదు?

ఒక మనిషిని "ఓ మూర్ఖుడా!,నువ్వెందుకూ పనికిరావు" అంటే కృంగిపోవచ్చు లేక అన్నవాడిపై కోప్పడవచ్చు. అప్పటి వరకు అతను ఎంత ఆనందంగా ఉన్నా ఈ మాట అనేసరికి ముఖం అంతా మాడిపోయి,డీలా పడిపోయి ఇంతకు ముందు మనం చూసిన అతను ఇతనేనా అనుకొనేట్లు మారిపోతాడు.

అలానే " మీ అంత మంచివారు ఈ కాలంలో చాలా అరుదండీ!, మీరు చాలా గొప్పవారు" అంటే పొంగిపోతాడు. ఆ పొంగు బయటకు కనపడకపోవచ్చు కాని మనసు ఆనందపడుతుంది.

పైన చెప్పిన రెండు సందర్బాలలోనూ ఏమాత్రం పట్టించుకొనని వారు నూటికో,కోటికో కొందరే ఉంటారు. అంటే ప్రతిస్పందన(Reaction) చూపేవారు నూటికి 95 శాతం పైమాటే.

ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతున్నాయి కదా. అంటే మనసున్న ప్రతి మనిషీ మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావం, అందుకు తగినట్లు ముఖకవళికలు మారుతాయి కదా. చివరికి జంతువులు కూడా మన మనసు బాగా లేనప్పుడు, మనం కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అవి కూడా మన వద్ద ముభావం(Dull) గా ఉంటాయి కదా. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే మనసు పై మాటల ప్రభావం ఖచ్చితం గా ఉంటుందని అందరికీ తెలుసు.

ఇక అసలు విషయానికి వద్దాం.

నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని మొక్కలకు,చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని అలానే మనసు కూడా ఉంటుందని, అవి కూడా తమ భావాలను(ఆనందం లేక బాధలను) వ్యక్తపరుస్తాయని తెలుస్తోంది. మనం పరిహాసం గా మాట్లాడితే ఆ మాటల పౌనఃపున్యము, స్థాయి ఒకలా ఉంటాయి. అలానే సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల పౌనఃపున్యము,స్థాయిలు వేరేగా ఉంటాయి. అందరికీ ఈ సైన్సు విషయాలు తెలియకపోవచ్చు. కాని తెలిసినా,తెలియకున్నా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా.

అంటే ఎలా మాట్లాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం పై మనకు ఒక అవగాహన(Idea) ఉంటుంది కదా. మరి మనలానే మనసు గల చెట్లపై నిర్ధిష్ట పౌనఃపున్యము, స్థాయి గల మాటలు మాట్లాడితే అవి కాయలు రాల్చనూవచ్చు, లేక చెట్టే పడిపోవనూవచ్చు అనే విషయం పై అనుమానం ఎందుకుండాలి. మంత్రాలంటే ఒక విధివిధానం గల మాటలే కదా.

ఋషులంటే కేవలం ఆధ్యాత్మికవాదులే కాదు కదా, ఏ శాస్త్రంలో నిష్ణాతులైనా వారిని ఋషులనే అంటాము. ఉదాహరణకు కణము అనే భావనను కనిపెట్టిన కణాదున్ని ఋషి అనే అన్నాము. మంత్రాలతో పనులు చేయవచ్చు అని అన్నది ఆ ఋషులే కదా.

మన కాలపు మనుషులకు తెలిసింది పూర్వకాలపు మనుషులకు తెలియకపోవచ్చు, అలానే వారికి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన కేవలం హేతువును లేక తర్కాన్ని పట్టుకొని వారు చెప్పింది అసంభవం,బూటకం అని అనడం ఎంతవరకు సమంజసం? వారు చెప్పిన దానిపై పరిశోధన చేద్దాం. తప్పని ఋజువైతే అప్పుడు బూటకం అందాం. మనం ఏ పరిశోధన చేయకుండా ,ఊరకే పనీపాటాలేని పెద్దలు రచ్చబండ పైనో, చెట్ల క్రిందనో కూర్చొని చెప్పారు, అని అవి బూటకం అని ఎలా అనగలం.

గమనిక: మంత్రాలకు చింతకాయలు రాలడం అనే భావన ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మంత్రాలను నమ్మమనీ చెప్పడం లేదు, అలాగే నమ్మవద్దనీ చెప్పడం లేదు. విశ్వాసం,నమ్మకం ఉన్న వారిని వారి మానాన వారిని వదిలెయ్యండి. పరిశోధనల ఫలితంగా మీరనుకొన్నదే ఋజువైతే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఏ విషయమైనా మన ఊహకు అందనంత మాత్రాన ఆ విషయంపై అతి తొందరగా ఒక అభిప్రాయానికి రావద్దని మాత్రమే నేను చెప్పదలచుకొన్నది.

Tuesday, June 15, 2010

ఎప్పటికీ మెకాలేను తిట్టుకుంటూనే ఉందామా? మనం చేసేదేమైనా ఉందా?

మెకాలే అను ఆంగ్లేయుడు మన విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అగ్రగణ్యుడని అంటుంటారు. దాని గురించి చర్చ మనకు అనవసరం. మన దురదృష్టమో లేక ప్రారబ్దమో విద్యావ్యవస్థ మారింది. నైతికవిలువల కన్నా మార్కులకే,ర్యాంకులకే ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులే,పెద్దలే ఎక్కువయ్యారు. అందరూ అలానే లేరు కానీ అసలంటూ ఉన్నారని తెలుస్తోంది కదా.

ఇలా ఎందుకంటూ ఉన్నానంటే "ఆట" అనే ఒక TV కార్యక్రమం విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల వాదన వింటే ఆశ్చర్యం,విస్మయం కగుతుంది. "మాకు లేని బాధ మీకెందుకంటూ?" వారు అన్న మాటలకు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు విస్తుపోయారు.

మెకాలే పై చర్చ అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు లేడు. రామాయణం లో శ్రీరాముడు చెప్పినట్లు "ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు కాని ఆ వ్యక్తి చనిపోవడంతోటే అతని పై శతృత్వాన్ని కూడా మనం చంపేసుకోవాలి". అందుకే వాదన అనవసరం అన్నాను.

జరిగిందేదో జరిగింది, మరి మనం చేసేది ఏంలేదా?

ఇక్కడ విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.

ఇక్కడ నిజముగా జరిగిన విషయాన్ని గురించి చూద్దాము."ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు.

అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు."వ్యక్తులు" లేరు."అని సమాధానం ఇచ్చారు.ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.

జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.

తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.

మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా?మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు.

ప్రతి దేశపు సంస్కృతిలోనూ కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, అవి మనకెందుకు? మనం మంచినే పిల్లలకు నేర్పుదాం.
"విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?


ఇతర దేశాలవారి నుండి బట్టలు ఎలాంటివి వేసుకోవాలో, ఎలాంటి ఫ్యాషన్ ను అనుకరించాలో నేర్చుకొంటున్నాము కానీ మనకు నిజముగా పనికి వచ్చేది నేర్చుకోవడం లేదు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు