తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 8, 2010

వేదకాలం లో జంతుబలి ఉన్నంత మాత్రాన వారు అనాగరికులా? మనం కాదా?

ఈ మధ్య వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఒక వ్యాసము(article)ఈ టపాకు ప్రేరణ.విచిత్రమేమిటంటే మన భారతీయులు కూడా ఆ వ్యాసానికి వంతపాడారు.అందుకే ఈ టపా వ్రాయవలసి వచ్చింది.

అందరికీ తెలుసు వేదకాలపు యజ్ఞాలలో జంతుబలులు ఉండేవని.ఈ విషయం ఒక్కటి తీసుకొని పాశ్చాత్యులు వేదకాలపు జనులు ఆటవికులని,అది ఆటవిక సమాజమని,ఆనాటివారు అనాగరికులని నిర్ణయించారు.లోపాలు తప్ప మంచిని గ్రహించని ఆ కాలపు ఆంగ్లేయుల వలన మన ప్రజలు కూడా వారికి వంత పాడారు,నేటికీ పాడుతూనే ఉన్నారు.సరే నేడు వారు కానీ,మనం కానీ చేస్తున్నది ఏమిటి.ఏ దేశపు ప్రజలు మాంసాహారం తినడం లేదు? కోళ్ళు,మేకలు,పొట్టేళ్ళు మొదలుకొని ఎద్దు(beef),పంది(fork),ఒంటె,పాములు,బల్లుల వరకు తినడం లేదా?దీనిని బట్టి నేటి సమాజం కూడా ఆటవిక సమాజం అనగలమా?ఏ మతం వారు,ఏ దేశం వారు పండుగలని,ఉత్సవాలని
జంతుహింసకు పాల్పడడం లేదు? ఇలా అని ప్రస్తుతం ఆటవిక సమాజం నడుస్తోందని అందామా? ప్రస్తుతం మనం కూడా అనాగరికులమని అన వీలవుతుందా? అలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పటికీ ఆంగ్లేయులకు కానీ,అమెరికనులకు కానీ ఎద్దు మాంసం కానీ,పంది మాంసం అంటే కానీ ఇష్టం పోయిందా(శాఖాహారులు తప్ప)? వీరినే ఎందుకు ఉదహరించడం జరిగిందంటే వీరే ఇలాంటి వాదనలకు ఆద్యులు.

అప్పుడు వేదకాలం లో జంతుబలులకు పాల్పడ్డవారే కాలక్రమంలో శాఖాహార ప్రాముఖ్యతను గుర్తించి శాఖాహారానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు.ఇదంతా మానవ మనసు పరిణామ దశలలో భాగమని ఎందుకు అనుకోకూడదు? కాని ఒకరిలో లోపాలు ఎంచడానికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడమే నేటి లోక నైజం. "ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో" అన్న ఏసుక్రీస్తు బోధన తెలియదా? తను బెల్లం తినడం మానివేసిన తర్వాతే పిల్లవాడికి బెల్లము ఎక్కువ తినడం హానికరమని బోధించిన రామకృష్ణపరమహంస గురించి తెలియదా?

ఒక్క మాట.మనుషులు చీమలకున్న పాటి జ్ఞానం కూడా కోల్పోతున్నారు.చీమలు ఇసుక,చక్కెర మిశ్రమం నుండి చక్కెరను మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాయి.అంటే పనికిరాని విషయాన్ని వదిలివేసి పనికివచ్చే చక్కెరను మాత్రమే గ్రహిస్తాయి.లోకంలో చాలా మందిలో లోపాలు ఉన్నంత మాత్రాన లోకాన్నంతటినీ ఒకే గాటన కట్టగలమా?(for faults in many,judge not the whole). వేదాలలోని శాంతి మంత్రం(అసతోమా సద్గమయ మంత్రం) వారికి కనపడలేదా? అనాగరికులే ఈ మహోన్నత మంత్రాన్ని అందించారు."సర్వేజనా సుఖినో భవంతు" అని ఘోషించడానికి ఎంత పరిపక్వం చెందిఉండాలి? "సహనాభవతు,సహనౌ భునక్తు"(కలిసి ఉందాం,కలిసి తిందాం) అనే సంస్కారం ఆనాటి వేదాలలోనే ఉన్నదని గ్రహించరా?

"సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమాన మస్తు వో మనో యథా వః సుసహాసతి"(అధర్వణవేదం 6-64-4)
అర్థం: మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ భావం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక!ఈ విధముగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొను గాక!
ఇంతటి ఉపదేశం ఇచ్చినవారు అనాగరికులా? ఆలోచించండి.వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే గ్రహించి మొత్తం వేదాలనే నిందించడం తగదు.

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం గారు తన ఆత్మకథ (ఒక విజేత ఆత్మకథ) లో ఒక విషయం చెప్పారు.అదేమిటంటే అతను అంతరిక్షశాఖ లో పని చేస్తున్నప్పుడు తరచూ శాస్త్రవేత్తల సమావేశాలు జరిగేవట.వాటిలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరైనా ఒక నూతన విషయం ప్రస్తావిస్తే తక్షణం అందరు శాస్త్రవేత్తలు వాదోపవాదాలు లేవదీసేవారు.కాని అదే ఎవరైనా విదేశ శాస్త్రవేత్త గనుక ప్రతిపాదిస్తే ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించేవారట.

అలానే ఆంగ్లేయులు చెప్పినంత మాత్రాన గొర్రెలా తలాడించి అవుననడమే తప్ప ఆలోచన లేకుండా తలాడించడమేనా? ఏదైనా ఒక విషయం పై అభిప్రాయం ఏర్పరుచుకునేముందు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోనవసరం లేదా? " వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ " అని మన మహాత్ములు చెప్పిన విషయం తల కు ఎక్కదా?. మేలెంచి కీడెంచమన్న పెద్దలమాట మరిచిపోయారు.కనీసం కీడెంచి మేలు కూడా ఎంచడం లేదు.కేవలం లోపాలు వెదకడమే పనిగా
పెట్టుకున్నారు.వేదాలను ఎవరైనా పూర్తిగా చదివారా? చదవకుండానే,తెలుసుకోకుండానే ఆంగ్లేయులు చెప్పారు కాబట్టి అవన్నీ బూటకమని నిర్ణయించడమేనా?.

ఆంగ్లేయులు మనలను భౌతికముగా,సాంస్కృతికముగా బానిసలు చేసుకోవడంకోసం పన్నిన ఉచ్చులో మనం ఎంత బాగా పడ్డామో తెలుసుకోవాలి.ఇప్పుడు వారు లేరు కాని వారి ప్రభావము నుండి ఇంకా బయట పడలేకపోతున్నాము.ఒకరు చెప్పినది గ్రుడ్డిగా కాకుండా పూర్తిగా తెలుసుకొని,అన్ని కోణాలలోనూ విచారించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.వేదాల విషయమే కాదు ఏ విషయానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

33 comments:

 1. అలాంటి వారికి పాజిటివ్ అంశాలేమి రుచించవనుకుంటాను. తమ పరిశోధన కోసం, పాపులారిటీ కోసం మన సనాతన సంస్కృతిలోని లోపాలు పనిగట్టుకుని విమర్శించడం తప్ప వారు చేసేదేమీ ఉండదు.

  ReplyDelete
 2. In the evolution of species,its a part.After the man discoverd pulses[esply-మినుములు]this act gradually faded out from our culture.Acc.to rituals of that time pereiods"జంతుబలి"ని పాటించారు.rug/yajur vedas said,that this act gives the punya-phalam to that animal,who sacrifies its life in the rituals.------jayadev,chennai-17.

  ReplyDelete
 3. జంతుబలులివ్వడం అనాగరికతా ? కాదా ? అనేది అప్రస్తుతచర్చ. వాటి వలన ప్రయోజనం ఉన్నదా ? లేదా ? అనేదే ప్రాస్తావికాంశం. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. నమ్మకం లేనివారి మాటలు ఇక్కడ ప్రమాణం కాదు. వైదికమతం ప్రధానంగా కర్మకాండతో కూడుకొన్న మతం. అందులో నైవేద్యాలకూ, బలులకూ చాలా ప్రాధాన్యం ఉంది. వాటివల్ల ప్రయోజనం కూడా ఉంది. ఎందుకంటే అదృశ్యశక్తులు మాంసప్రియులు. శాస్త్రోక్తంగా కర్మకాండ మొత్తం నిర్వహించినప్పుడు వారు ఆ బలుల్ని స్వీకరించి మానవుల కోరికలు తీఱుస్తారు.

  బలులు క్రిస్టియానిటీలో లేవు కాబట్టి ఇంకే మతంలోను ఉండకూడదని వాదించడం ఒక క్రైస్తవమూర్ఖత్వం.

  ReplyDelete
  Replies
  1. బలులు క్రిష్టియానిటీలో ఉన్నాయి.

   Delete
 4. ఓబుల్ రెడ్డి గారు,

  జంతు బలులు వైదిక ప్రామాణికాలే అయినపుడు, బలులకు చాలా ప్రాథాన్యం ఉన్నపుడు ఇప్పటి వైదిక పురోహితు లెందుకు ఆచరించడం లేదు? కేవలం ఇతరులే ఎందుకు ఆచరిస్తున్నారు? మీ ఉద్దేశంలో ఇప్పటి పురోహితులు క్రైస్తవ ప్రభావంలో పడ్డారనా?

  ReplyDelete
 5. very under researched article and mere rhetoric nothing much.

  బౌద్దానికి పూర్వం బ్రాహ్మణమతంలో జంతుబలులు చాలా సాధారణం. బౌద్దమత ప్రభావానికి తట్టుకోలేక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి reform జరిగినప్పుడు, సమాజానికి పనికిరాని మహానైవేద్యాలూ(దాదాపు కొన్ని వేల ఆకలి కడుపులు నింపగల అన్నాన్ని కూడా అగ్నికి ఆహుతిచ్చేవాళ్ళు), జంతుబలులూ (వ్యవసాయంలో, యుద్దం పనికొచ్చే కొన్ని వందల పశువుల్ని ఒక్క క్రతువులో బలిచేసేవాళ్ళు)పక్కన పెట్టబడ్డాయి. బౌద్ద మత ప్రభావంతో శాఖాహారం "ఉత్తమ"ఆహారం అయ్యింది. అహింస బ్రాహ్మణధర్మం అయ్యింది.అదే ఇప్పుడు మీరు "నాగరికం" అంటున్న మతం.

  అమెరికన్లనూ, బ్రిటిష్ వాళ్ళనూ క్రైస్తవుల్నీ ఆడిపోసుకుంటూ సాగిన ఈ వ్యాసం ఆర్థరహితం.

  ReplyDelete
  Replies
  1. i agree with you, though i am a Brahman i found you are right. at the same time i am appreciating him for publishing these awakened articles, but it needs a logical and critical support.

   Delete
 6. మహేష్ గారూ!ఈ వ్యాసం లో క్రైస్తవ మతాన్నో లేక మరో మతాన్నో కించపరిచేలా ఉన్న ఒక్క వాక్యాన్ని చూపించండి. అసలు మత ప్రసక్తే ఈ వ్యాసం లో ఎక్కడా లేదు. అంతేకాక హిందూమతపు ప్రసక్తి కూడా ఇక్కడ నేను ప్రస్తావించలేదు. వేదకాలం సంగతులనే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అమెరికన్లను,బ్రిటిష్ వారినే అన్నాను ఎందుకంటే వారు వ్రాసిన Article ఈ వ్యాసానికి ప్రేరణ కాబట్టి. వేదాలను, భారతీయ సంస్కృతీసాంప్రదాయాలను కించపరిచి వారు చేస్తున్నది గమనించండి.
  ఇక జంతుబలుల విషయానికి వస్తే నేడు మాత్రం పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అంటూ ప్రపంచం మొత్తం మీద ఎన్ని వేల కాదు లక్షల్లో జంతువుల వధ జరుగుతోందో కనిపిస్తోంది కదా. ఇక్కడ మతప్రసక్తి లేదు. అందరు,అన్ని జాతుల వారు తింటున్నారు ఏ కొందరో తప్ప.
  నేను క్రైస్తవాన్నో లేక మరో మతాన్నో ఆడిపోసుకొంటున్నామంటున్నారంటే మీరు ఈ వ్యాసాన్ని సరిగా చదవనట్లే అనుకొంటున్నాను.అసలు మతప్రసక్తే లేని ఈ వ్యాసంలో మీరు మతాన్ని జొప్పిస్తున్నారు.

  ReplyDelete
 7. మహేష్ గారూ!
  ####సమాజానికి పనికిరాని మహానైవేద్యాలూ(దాదాపు కొన్ని వేల ఆకలి కడుపులు నింపగల అన్నాన్ని కూడా అగ్నికి ఆహుతిచ్చేవాళ్ళు), జంతుబలులూ (వ్యవసాయంలో, యుద్దం పనికొచ్చే కొన్ని వందల పశువుల్ని ఒక్క క్రతువులో బలిచేసేవాళ్ళు)పక్కన పెట్టబడ్డాయి#### అన్నారు.
  ఇప్పుడు మాత్రం కొన్ని వేలమందికి సరిపడే టమేటాలను తమ ఉత్సవం కోసం టన్నులకొద్దీ టమేటా పళ్ళతో కొట్టుకొంటూ వృధా చేసే దేశాలు, పాలకు గిట్టుబాటు ధర లేదంటూ గ్యాలన్ల కొద్దీ పాలను పొలాల్లో,మైదానాలలో పారబోసే దేశాలు లేవంటారా? వాటిని ఆకలి దేశాలకు (సోమాలియా మొదలగునవి) ఉచితంగా సరఫరా చేయవచ్చు కదా.ఇప్పుడు మాత్రం వ్యవసాయానికి పనికి వచ్చే కొన్ని లక్షల ఎద్దులను తినడం లేదంటారా? ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్లు మొదలగునవి వచ్చాయంటారా,ఐతే మాత్రం ఎద్దుల్ని,ఆవుల్ని,గేదెల్ను తినడం న్యాయమంటారా? అప్పుడు వాళ్ళు చేశారు కాని తర్వాత కాలంలో మానేసారు. కాని ఇప్పటి వారు ఇంకా మానడం లేదు కదా. నేను వారిని అనాగరికులు అనడాన్ని ప్రశ్నించాను. ప్రశ్నించడం లో పోలిక అనేది సర్వసాధారణం.
  అందువలన "వేదకాలం వారు అనాగరికులు" అనే వాదన లేవనెత్తిన బ్రిటిష్ వారినీ, అమెరికా వారినీ పోల్చానే కానీ మతప్రసక్తి మాత్రం ఎంతమాత్రం పేర్కొనలేదు.

  ReplyDelete
 8. Yes--
  in christiyanity there is no such brutal act but they were a bit ahead of this act..i..e..they r experts in "maanava bali".1ST they started with jesus nd then it spreads like a masscare in the form of wars for petrol nd wealth.జంతుబలికి వో పరమార్ధాన్ని చేప్పారు కాని ఈ నరబలులకు పరమార్ధం ఏమిటో ద్దీన్ని ఖదిన్చే పెద్దలు వివరించాలి మరి.పెట్రోలు /డబ్బా?.జీవించి ఉన్నంతకాలం ఈ రెండింటితో పబ్బం గడుపుకోవడమే ఆ పరమార్ధమా?దీనికి మీరు అవును అని సమాధానం ఇచ్చే పక్షంలో ణా ప్రశ్నకు మీరు స్పందించాల్సిన పనే లేదు మరి-----జయదేవ్.

  ReplyDelete
 9. @క్.మహేష్-- సమాజానికి పనికిరాని మహానైవేద్యాలూ(దాదాపు కొన్ని వేల ఆకలి కడుపులు నింపగల అన్నాన్ని కూడా అగ్నికి ఆహుతిచ్చేవాళ్ళు),/aa kaalamlo janabhaa parinitamae kanuka aakalikosam evaru almatinchalaedu.appati mahaneyadyaalu sariiyinavae.annaanni agnilo vrelchadam valana'CLOUD-FERTILITY" Jarugutundi,deeni valla varshaalu sakaalamlo kurustaayi.మహానేయ్వేద్యం ఒక వ్యర్ధ ప్రక్రియ కాదు [u r more under researched here mr mahaesh].e kriyaku ardham unnadi.urs comment is a superficial one only----jayadev,chennai-17

  ReplyDelete
 10. @suresh-yes in venice,every year some laks-tonns of grapes were wasted on the name of vieny yard festivals.మూగ జీవాలను బలి ఇచ్చిన మన సుమ్స్క్రుతే,కనుమ మన ఆచారాల్లో ,ఎరువాకపున్నామి వంటి పండుగలలో వాటిని పూజిస్తోంది మరి.మన ఆచారాల్లో ఒక అంతరార్ధం ఎప్పుడూ ఉన్తూవస్తోంది.అదే మన ప్రత్యేకత----జయదేవ్

  ReplyDelete
 11. హరి దోర్నాల గారూ ! ఇప్పటి వైదికక్రతువుల్లో జంతుబలులు లేవని ఎవఱు చెప్పారు మీకు ? ఏయే క్రతువుల్లో అవి అవసరమో ఆయా క్రతువుల్లో వాటిని ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నారు. ఏయే దేవతలకి అవి అవసరమని సంప్రదాయం చెబుతున్నదో ఆయా దేవతలకు ఆయా జంతుమాంసాలని ఇప్పటికీ సమర్పిస్తూనే ఉన్నారు. కావాలంటే దసరా రోజున ఎన్ని జీవాల్ని అమ్మవారికి బలిస్తారో ఆరోజున దేశపర్యటన చేసి గమనించండి. హిందూమతంలో జంతుబలులు లేనిది కేవలం సాధారణ/ దైనందిన/ గృహ పూజాపునస్కారాలలోనే !

  కొద్దిమంది దేవతల్ని సంతృప్తిపఱచడానికి నరబలి కూడా ఒక పద్ధతి. ఎందుకంటే మన దృష్టిలో మనం మనుషులం గట్రా గట్రా ! కానీ దేవతల దృష్టిలో మనం అన్ని జంతువుల లాంటివాళ్ళమే. మన దృష్టిలో జంతువులు ఏ విధంగానైతే తినదగినవో, అదే విధంగా ఆ దేవతల దృష్టిలో మన ప్రాణశక్తి కూడా హరించదగినదే. ప్రాజెక్టులూ, సినిమాహాళ్ళూ, ఫ్యాక్టరీలూ వంటి పెద్దపెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఇప్పటికీ నరబలిని ఆచరిస్తున్నారు. అందుకోసం అంగవైకల్యాలు లేని అబ్బాయిల్ని, ఇంకా పెళ్ళికాని/ కన్యలైన/ రజస్వలలు కానటువంటి అమ్మాయిల్ని, సదరు కట్టడాల యజమానులు దొంగతనంగా ఎత్తుకురావడమో, తల్లిదండ్రుల దగ్గర్నుంచి కొనుక్కురావడమో చేస్తారు.

  ఆయా ఉపాసనాపద్ధతుల్ని గురుముఖతః ఉపదేశం పొంది ఆ ఉపదేశాన్ని నమ్మి ఆచరిస్తే బలికి దాని ప్రయోజనం దానికున్నది. హింస, స్వార్థం అంటారా ? అది ప్రపంచంలో ప్రతివాడూ రోజూ చేస్తూనే ఉన్నాడు. బలిస్తున్నవారు కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. వారు మన కంటే ఎక్కువ అనైతికులు కారు. మూఢవిశ్వాసం అంటారా ? నా మతం నాకు విశ్వాసం. ఇతర అన్ని మతాలూ మూఢవిశ్వాసం. అయితే అన్ని మతాలూ మూఢవిశ్వాసాలే. లేదంటే అన్నీ సత్యమతాలే.

  ReplyDelete
 12. I actually heard in a discourse that the term 'bali' is misunderstood. It actually didn't carry the meaning it has today.

  ReplyDelete
 13. దేశకాలమానపరిస్థితులను అనుసరించి ధర్మమూ మారుతుంది. కలియుగంలో ధర్మం వేఱు. తత్పూర్వయుగాలలోని ధర్మం వేఱు. అప్పుడు వైదికకర్మగా వివిధజంతుమేధాలు ఉన్నా అవి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో (ఉదాహరణకు దశరథమహారాజు పుత్రార్థం అశ్వమేధయాగాన్ని చేసినట్టు) తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించినవి కావు. ధర్మం కలియుగంలో జంత్వహింసనే బోధిస్తుంది. ద్వాపరంనుండి కలికి కొనసాగుతున్న జంతుమేధాన్ని అడ్డుకున్నవారిలో బుద్ధుడే కాదు అద్వైతమతస్థాపకులైన శ్రీమచ్ఛంకరభగవత్పాదులు మొదలైనవారు కూడా ఉన్నారు. బలి అని ప్రస్తుతవ్యావహారికంలో ఉన్న తంతుకు అసలు పదం మేధం. బలి అన్న శబ్దానికి నిజమైన అర్థం నివేదన. వైదికమతంలో మేధానికీ, బలికీ ఉన్న ప్రాధాన్యం ఇప్పుడూ సమసిపోలేదు. కొబ్బరికాయ కొట్టేదీ నిమ్మకాయలు కోసేదీ మేధం క్రిందికే వస్తాయి! దేవబలి భూతబలి జంతుబలి ఇత్యాదులు బలులు. జంతుబలి అంటే జంతువులను చంపటం అని కాదు అర్థం. జంతువులకు నిత్యమూ వాటి ఆహారార్థం ఏదేని సమర్పించటం అని. మృచ్ఛకటికాదులలో వీటి ప్రస్తావన ఉంది. ఐనా సాహిత్యం చరిత్రకు అద్దం పట్టదు అనుకునే బుద్ధికుశలులకు ఏమి చెప్పినా ఒకటే కానీ, తదన్యులు నా భావాన్ని అర్థం చేసికొనగలరు. సనాతనంగా వస్తున్న ఇట్టి అనేకానేక సద్వైదికసంప్రదాయాలను అవలంబించేవారు అవైదికాలను చేరలేరు, చేరినా మనలేరు.

  అహింస ప్రాముఖ్యాన్ని బౌద్ధానికంటె జైనానికంటె చాలా చాలా పూర్వమే వైదికమతమూ చెప్పింది. ఉదాహరణకు యోగదర్శనాన్ని తీసికోండి (పతంజలిమహర్షి చెప్పిన యోగసూత్రాలు).

  * * *

  విషయాలు పూర్తిగా శోధించి తెలిసికొనకుండా వదరడం పొఱబాటే. కానీ ఈ వదరే పని ఎవఱు ఎక్కువగా చేస్తున్నారో కరతలామలకంలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

  ReplyDelete
 14. దేవనకొండ ఓబుల్ రెడ్డి గారూ మంచి విషయాలు చెప్పారు.
  బలులు కోసం లక్షలాది జంతువుల ప్రాణాలు అక్కరలేకపోయినా మొక్కుబడికోసం తీస్తున్నారు.బలులన్నీ నిరర్ధక హత్యలే.నేనుమాత్రం బక్రీదులో బలులు మాని రంజాన్ లో ఉపవాసాలే చెయ్యండి అని చెబుతుంటాను.నరబలి మొదలు పెట్టింది క్రైస్తవులు కాదు,యూదులు.
  యూదు,ఇస్లాం మతలేఖనాల్లో మాత్రం దేవుడు బలులు కోరినట్లు ఎన్నో వాక్యాలున్నాయి.క్రైస్తవ మతం విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని బలులు మానేసింది.ఇస్లాం లో ఇంకా బక్రీదులో బలులు ఇస్తున్నారు.ఇవి ఆగాలి.
  అన్ని మతాలలో బలులున్నాయి. బలి అనేది ఒక మూఢ నమ్మకం. ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే బలులివ్వాలంటారు. మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో తల నరుకుతారు. పంది తల మాత్రం బయట కుండేటట్టు పాతేసి, గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు, ఆవుల చేత తొక్కిస్తారు. పంది ముట్టెమీద పశువులు పడటంతో గింజుకుంటు తల పక్కకి వాలి ఘోరంగా నెత్తురు కారుతూ చనిపోతుంది.
  దేవతల జాతర లో మూగజీవుల [మేకపోతుల] గొంతు కొరికి నరికి చంపుతారు. ఇది తామసిక మనస్తత్వం. భగవంతునికి ఈ బలి వల్ల ప్రీతి కలుగుతుందనే మూఢ నమ్మకం .
  ఒకకథః
  ఒక కాపాలికుడు కాళీ మాత ను ప్రసన్నం చేసుకోవాలని 100 గొర్రె పొటేళ్లను బలియివ్వాలనే ప్రయత్నం మొదలుపెట్టి 99 పొట్టేళ్ళను బలిచ్చాడు. చివరగా 100వ బలికి సిద్ధమయ్యాడు. ఒక గొర్రె పొటేలును కొని తెచ్చి దానిని పూజించి బలికి సిద్ధపరచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపకా నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పూజలో నిమగ్నమయాడు. మరలా నవ్వు ఆ తర్వాత పెద్దగా ఏడ్పువినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రెపొటేలు పెద్దగా ఏడుస్తూ కనిపించింది. భయంతో బిక్కచచ్చిన కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ గొర్రె నవ్వు ఏడుపు ఆపి నేనూ ఒక జీవినే అన్నది. అయ్యా మీరెవరు? గొర్రె మాట్లాడటం ఏమిటి? నిజం చెప్పండి అన్నాడు . నాయనా నేనూ పూర్వజన్మలో ఒక కాపాలికుడనే అని అన్నదా గొర్రె. అలాగా మరయితే మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మరలా ఏడ్చారు ఎందుకు? అని ప్రశ్నించాడు . నేనుకూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేళ్ళను కాళీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తి చేసాను. కాళీ మాత అనుగ్రహము కలగలేదుగానీ మహా పాపంచుట్టుకున్నది. దానివలన ఇప్పటికి 100 సార్లు గొర్రె జన్మమెత్తాను. 99సార్లు నరికి చంపబడ్దాను. ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీనినుండి విముక్తమవుతున్నాననే ఆనందం వలన నవ్వు వచ్చింది. త్వరగా బలి ముగించి నన్ను ఈ పాపమునుండి విముక్తం చేయమని కోరింది. కాపాలికునికి తాను చేసిన పాపం గుర్తుకువచ్చి గడగడలాడాడు.
  యుద్ధం అంటే నరబలిః
  హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.

  ReplyDelete
 15. అసలీ వివరణలు, సంజాయిషీలు ఎందుకో నాకర్థం కావట్లేదు. అవునయ్యా బలులిచ్చారు. అయితే ఏం? ఈరోజు మనంగొప్పపనులుగా భావించేవి భావితరాలు ఒప్పుకోకపోవచ్చు. (అంటే ప్రభుత్వమే సారాయి అమ్మించి తాగించి డబ్బులుకక్కించడం లాంటివి.). అప్పుడు మన ఆత్మలొచ్చి సంజాయిషీ ఇస్తాయా?
  అయినా కొంతమంది లెక్కల ప్రకారం, వేదాలు పుట్టింది రెండువేలసంవత్సరాల క్రితం. హిందువు పుట్టింది ఈమద్యనేనట. తెల్లోడు ఇక్కడికొచ్చాక పుట్టాడుట.(బహుశా కల్కి అనుకుంటా.) అలాంటప్పుడు వేలసంవత్సరాలుగా జరుగుతున్న దానికి ఈపసిబిడ్ద ఎలా బాద్యుడంటారు?

  ReplyDelete
 16. రాఘవ గారు, మీ వివరణ సమంజసంగా ఉంది. మృచ్ఛకటిక ప్రస్తావన బహు ఆసక్తికరం. నా అభిమాన రూపకం అది.అందులో బలుల ప్రస్తావన నేను చదివాను. మొదటి అంకంలోనే వస్తుంది.

  అశ్వ, గో మేధాల గురించి దాదాపు శాసనాలేవీ లేవు. రామాయణ, భారతాలు చరిత్రలే కావు. ఇక దేవీభాగవతం, పురాణాదులు కల్ల. అలాంటప్పుడు అశ్వ గోమేధాలు "బ్రాహ్మణ" మతంలో ఉన్నవని ఏ చరిత్ర చెప్పింది?

  ReplyDelete
  Replies
  1. is Ramayana not the history? If so the god Rama and Hanuma , are all these just imagined characters? i believe no,no,no. Our Dharma is true and scientifically too existed. If you have any thing to discuss further please mail me.
   i am at KCPANIGRAHI1629@GMAIL.COM

   Delete
 17. సురేశ్ గారు, మీ టపా బాగుంది. రాయండి, కానీ అర్ధరహిత వ్యాఖ్యలకి సంజాయిషీలిచ్చి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆలోపు ఇంకో మంచి టపా రాయండి. అలాంటి వ్యాఖ్యల్ని తొలగించద్దు..జనాలకి తెలియనివ్వండి,,కిస్ మే కితనా దమ్ హై

  ReplyDelete
 18. మీ పోస్ట్ బాగుంది. మంచి విషయం వ్రాసారు.
  శ్రీవాసుకి

  ReplyDelete
 19. deeeyvuda........jantu bali,mamsaharam....ivanni individuals valla vachey tingari panulu...jantu balini vedalu support cheyaledu endukante almost anni rakala jantuvulu mana devullaki vahanalu leda prati rupalu.....agadupattina tikka manushulu prarambhimchi "padimandi annadey nijam avutundi" anna vemana vakyanni gurtuku teppincharu.
  Ika yagnam lo velamandi tindi posaru ante .....yagnam ante BHOJANAM ani kuda artham Vasundi....aa vishayam Research chesina vallku teliyademo ahuti ante agnilo posaru ani narrow ga alochincharu kasta broad ga alochistey....kadupulo akalini agni tone polustaru(jatahragni)....kanuka yagna samayamlo annadanam chesevaru......adi ayivundochu deanantatiki karanam mana prathamika ptashala vidya lo sanskrit leka povadame....manam goppaga alochinchaleka potunnam mana samskrutiki dooram avutunnam.

  ReplyDelete
 20. ఇక్కడ చాలామంది అసలు విషయాన్ని వక్రీకరిస్తున్నారు బలి అంటే జంతు బలి అని ఎక్కడాలేదు
  అది ఒక అనాచారం కావాలంటే ఇప్పటికి మనం గుడికి వెళితే ధ్వజ స్తంభం ముందు చిన్న ఎత్తులో సిమెంటు దిమ్మకాని చెక్క దిమ్మకాని
  ఉంటుంది దాన్ని బలి పీఠం అంటారు స్వామి వారికి నైవేద్యం అయ్యాక కొంత భాగాన్ని భూత తృప్తికై అక్కడ వేస్తారు
  తరువాతి కాలం ఈ ఆచారాన్ని ఎవరికి ఇష్టం వచినట్లు వారు అన్వయిన్చుకున్నారు

  ReplyDelete
 21. ధన్యవాదములు ప్రదీప్ గారు!

  ReplyDelete
 22. Suresh please encourage discussion, we are knowing lot. Thanks for your blog.Keep publishing

  ReplyDelete
 23. Himsayah dhooshayati Khandayati HINDU. Vimarsanatmakam ga kakunda Visleshanatmakam ga alochinchudam. Satyanni awagatam chesukundam.

  ReplyDelete
 24. క్రిష్టియానిటి లో బలులు లేవన్నది ఎవరు..???
  పాతనిబందనలో నిర్గామాఖండం లీవీయ ఖాండం ద్వితీయోపదేశాఖాండం లలో ఏ ఏ పాపానికి ఏ ఏ జంతువుల్ని ఎలా నరకాలో వివరంగా వివరించారు..దయామయుడైన యెహోవా..
  ఆ బలులు వద్దని చెప్పినందుకే యేసుని యూదులు చంపారు..
  ఇప్పటికి యుదామతంలో బలులు ఉన్నాయి..వాళ్లకి యెహోవా దేవుడు యేసు సాతాన్

  అసలు వేదాలలో జంతు బలులు ఉన్నాయని ఎక్కడుంది??

  ReplyDelete
  Replies
  1. >>అసలు వేదాలలో జంతు బలులు ఉన్నాయని ఎక్కడుంది?

   నువ్వు రాసిన వేదాల గురించి కాదులే ఇక్కడ ముచ్చట

   Delete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు