తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, March 31, 2009

కల్నల్ రాజు - తెలుగు వారి వైభవం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనగానే ఇంకా ఈ దేశంలో కోట్లాది మందికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన సహచరుడిగా, వైద్యుడిగా యుద్ధాల్లో అనేక సార్లు త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకొన్న ఓ కల్నల్ మన తెలుగు వాడైనందుకు గర్విస్తాం. ఆయన వట్టి కల్నల్ మాత్రమే కాదు. అనేక ఆసుపత్రులు, కళాశాలలు స్థాపించి తెలుగు వారికి వెలుగునీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మాణంలో పాల్గొన్న యోధుడిగా, ఆజాద్‌హింద్ ఫౌజ్ నాయకుడిగా పొందిన అనుభవాన్ని కేంద్రమంత్రిగా చేతల్లో చూపిన కార్యశీలుడు. ప్రకృతి ఆరాధకుడు. ఈ దేశం నాకే మిచ్చిందన్నది కాక ఈ దేశానికి నేనేమిచ్చానని ప్రశ్నించుకొని త్యాగయమ జీవితం గడిపిన కల్నల్ డాక్టర్ డి.ఎస్.రాజు జీవిత పయనం ఎలా సాగిందో చూద్దాం.

1904 ఆగస్టు 28న శృంగవృక్షంలో మాతామహుల ఇంట్లో జన్మించారు సత్యనారాయణరాజు. తల్లిదండ్రులు అచ్చయ్యమ్మ, రామచంద్రరాజులు. స్వగ్రామం పోడూరు. నరసాపురం తాలూకా. అప్పట్లో అది కృష్ణా జిల్లాలో ఉండేది. 1924 తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు మారింది. పెద్ద వ్యవసాయ కుటుంబం. తండ్రి ఆయర్వేద వైద్యులు. అక్షరాలు దిద్దే వయసులోనే తల్లి కన్నుమూసింది. అమ్మ లేకున్నా పిన్ని, పెద్దమ్మలు ఎంతో ఆప్యాయంగా చూశారు. ప్రాథమిక పాఠశాలలైనా లేని ఊళ్లల్లో ఎన్నో కష్టాలకోర్చి విద్యాభ్యాసం ప్రారంభించారు. వీరవాసరంలో మాధ్యమిక పాఠశాల విద్య పూర్తిచేశాక నర్సాపురం టైలర్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1923లో మద్రాసులో ఇంటర్ మొదటి తరగతిలో పాసయ్యారు. రాజు డాక్టరు కావాలని తండ్రి కోర్కె. అదే సంవత్సరం విశాఖలో వైద్య కళాశాల ప్రారంభమైంది.

మొదటి బ్యాచ్ విద్యార్థిగా రాజు అందులో చేరారు. 28లో చదువు పూర్తయింది. పై చదువులు చదవాలన్నది రాజు కోరిక. తండ్రి ఆర్థికస్థితి సహకరిస్తుందో లేదోనన్న అనుమానం. అప్పటికే రాజుకి వివాహం కూడా అవ్వడంవల్ల ఎలా? అన్న ఆలోచనలో పడ్డారు రాజు. ఎట్టకేలకు రాజు లండన్ వెళ్లారు. ఎల్.ఆర్.సి.పి., ఎం.ఆర్.సి.ఎస్. డిగ్రీలు సాధించారు. అప్పట్లో క్షయ, శ్వాసకోశ వ్యాధుల వల్ల ఎంతో మంది చనిపోయేవారు. అందువల్ల రాజు లండన్‌లో ఉన్నత విద్య పూర్తయినా వియన్నా వెళ్లి అత్యున్నత విద్య సాధించాలనుకొన్నారు. వెళ్లారు. శ్వాసకోశ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి పోడూరు గ్రామం వచ్చారు. ప్రాక్టీసు మొదలు పెట్టారు. అప్పట్లో జాతీయోద్యమ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండేది. దానికి బాగా ఆకర్షితులయ్యారు రాజు. ఓ పర్యాయం రాజుని ఏలూరులో వైద్య సంఘ సమావేశానికి ఆహ్వానించారు. అందులో రాజు అద్భుతంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఓ ఆంగ్ల మిలటరీ అధికారివిని భారతీయుల్లోనూ ఇంతటి ప్రజ్ఞావంతులుంటారా అని ఆశ్చర్యపోయారు. వెంటనే రాజుని కలిసి మిలిటరీలో చేరితే మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజు అంగీకరించారు. మిలిటరీలో పోస్టింగ్ రానే వచ్చింది. బెంగుళూరు, పూనెలో కొన్నాళ్లు పని చేశాక సౌదీ ఆరేబియాలోని ''ఎమన్''కి బదిలీ అయింది. ఏడెన్ నగరంలో ఉంటూ అబిసీనియా యుద్ధబాధితులకు సేవ చేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రాజుకి సింగపూర్‌కి బదిలీ అయింది. ఆయన సింగపూరులో ఉండగానే రెండో ప్రపంచ యుద్ధం తూర్పు ఆసియా దేశాలకు పాకింది. 1941లో జపాన్, ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధ ప్రకటన చేసింది.

ఆ సమయంలోనే కల్నల్ రాజు ఇండియన్ నేషనల్ ఆర్మీ పట్ల ఆకర్షితులయ్యారు. సుభాష్‌చంద్రబోస్‌కి కుడిభుజంగా మారారు. అండమాన్ దీవులలోని సెల్యులర్ జైలును బ్రిటిషర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న సమయంలో కెప్టెన్ రాజు, సుభాష్ ఇద్దరూ ఉన్నారు. జాతీయ పతాక వందనం చేసిన వారు కూడా వీరిద్దరే. ఇండియన్ నేషనల్ ఆర్మీలో కీలక వ్యక్తిగా పరిణమించారు. కల్నల్ రాజు నేతాజీ ఆంతరంగిక వైద్యుడిగా పని చేశారు. 1944 ఫిబ్రవరి నాలుగో తేదీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచీ బర్మాలో ఉన్నంతకాలం కల్నల్ రాజు నేతాజీ ఆంతరంగికుడిగానే ఉన్నారు.

1944 ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఆజాద్ హింద్ ఫౌజ్ మణిపూర్‌లోని మెయిరాంగ్ ప్రాంతం చేరుకొని బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి పారదోలి స్వతంత్ర జెండా ఎగురవేసింది. ఆ తర్వాత ఫౌజ్ సైనికులు చాలామంది మరణించారు. బ్రిటన్ ఆధిపత్యం మొదలైంది. మంచూరియా మీదుగా రష్యా వెళ్లడానికి ప్రయత్నించిన నేతాజీ కల్నల్ రాజు కోసం ప్రత్యేకంగా కారు పంపారు. ఆకారు బాంబు దాడిలో గుల్ల అయింది. కల్నల్ రాజు మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. అంతకు ముందు అలా ఎన్నో సార్లు జరిగింది! రాజు ప్రమాదానికి గురైన తరుణంలోనే నేతాజీ సింగపూరు నుంచి బ్యాంకాక్ వెళ్లిపోయారు. అందరూ రాజు హతులయ్యారని భావించే తరుణంలో ఆయన బయటికొచ్చారు. ఆనాటికి పదిహేడువేల మంది సైనికులు మిగిలి ఉన్నారు. క్షమాభిక్ష వేడుకొంటే వారిని విడుదల చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షమించమని అడగడానికి వారు అంగీకరించలేదు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ సైనికుల పక్షాన నిలిచింది. కోర్టు మార్షల్ విచారణ జరిపి సైనికుల్ని విడుదల చేసింది. కల్నల్ రాజు పోడూరు చేరుకొన్నారు. తిరిగి వైద్యవృత్తి చేపట్టారు. మిలిటరీలో చేరమని వైస్రాయ్ ఆయనను ఆహ్వానించారు. బరోడా మహారాజు తన పర్సనల్ డాక్టర్‌గా రమ్మన్నారు. విజయలక్ష్మీ పండిట్ రష్యాకు రాయబారిగా వెళ్లినపుడు ఎంబసీలో చేరమని కోరారు. వాటన్నిటినీ తిరస్కరించిన కల్నల్ రాజు 1953లో ధవళేశ్వరంలో ఆరు ఎకరాల భూమిని సేకరించి ఆస్పత్రి నిర్మించారు. అప్పట్లోనే ఎక్స్‌రే తీసే యంత్రాలు కూడా తెప్పించారు. అలా ఆయన అధునాతన వసతులు కల్పించారు.
మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒరిస్సా మాజీ గవర్నరు కుమారస్వామి వంటి వారు కల్నల్ రాజును రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. సరోజినీనాయుడు కుమారుడు జయసూర్య వంటివారుప్రోత్సహించడంతో చివరికి కల్నల్ రాజు రాజకీయాల్లోకి రావడానికి సంసిద్ధమయ్యారు. అప్పటికే ఆయన జాతీయనాయకులు గాంధీజీ మొదలుకొని అందరితో మంచి పరిచయాలుండేవి. 1957 సార్వత్రిక ఎన్నికల్లో కల్నల్ డి.ఎస్.రాజు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెహ్రూజీతో పరిచయాలుండడంతో ఆరోగ్య, రక్షణ విషయాల్లో ఆయన కల్నల్ సలహాలు తీసుకొనేవారు. 1963లో జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి భారత ప్రభుత్వపు ప్రతినిధిగా కల్నల్‌ని నెహ్రూజీ పంపడం విశేషం. 1962లో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రెండేళ్లు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి మంత్రివర్గంలో డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో, దేశంలో ఆస్పత్రుల్ని తనిఖీ చేసి సదుపాయాలు కల్పించారు.

కల్నల్‌రాజు ఎప్పుడూ దూరదృష్టితో వ్యవహరించారు. అప్పటి విశాఖ జిల్లా కోరుకొండలో సైనిక్‌స్కూల్ నిర్మాణానికి కృషి చేసి ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు పొంది పాఠశాల నిర్మించారు. ఆ పాఠశాల కోసం కల్నల్‌రాజు స్వయంగా నెహ్రూజీని కలిశారు. భూపతిపాలెంలో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించారు. ఆయన జీవనయానంలో మరో విశిష్టత కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాల స్థాపన! అలాగే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ని ఒప్పించి నెలకొల్పిన ముళ్లపూడి వెంకట్రామయ్య విద్యా సంస్థ. తోటలు పెంచారు. పేదలకు వైద్య సాయం చేశారు. అందరికీ తలలో నాలుకలా మెలిగారు. 1973 జూన్ 6న కల్నల్‌రాజు పరమపదించారు. ఆయన పలు వ్యవస్థల, సంస్థల నిర్మాత.భవిష్యత్తరాలు ఆయన సేవల్ని గుర్తుంచుకొంటాయి. ఆయనకి నమస్కరిస్తూనే ఉంటాయి.


(ఈనాడు సౌజన్యము )

Monday, March 30, 2009

గరుత్మంతుడు చెప్పిన విష్ణుమాయ గుణాలు, ప్రభావము

శ్రీ మహావిష్ణువు మహాత్వం ఏమిటి? ఎలా ఉంటాడు? ఆయనకు గరుత్మంతుడు ఎప్పుడు వాహనంగా, మరెప్పుడు ధ్వజంగా ఉంటాడు? అనే సందేహాలకు సమాధానాలు చెప్పే కథ మహాభారతం ఆనుశాసనిక పర్వంలో కనుపిస్తుంది.


పూర్వం ఒకసారి హిమగిరి మీద మునిగణాలన్నీ పురాణ శ్రవణం చేస్తూ ఆనందిస్తున్న సమయంలో అక్కడికి వినత కుమారుడైన గరుత్మంతుడు వచ్చాడు. ఆ ముని గణాలన్నీ ఆయనకు వినయంగా నమస్కరించి తమకు శ్రీమహావిష్ణువు వైభవాన్ని, మాయ, రూప విలాసాన్ని వివరించమని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు వైనతేయుడు (గరుత్మంతుడు) ఆనందించి వారందరికీ విష్ణు విలాసాన్ని చెప్పటం ప్రారంభించాడు. అయితే తనకే కాక ఎంతటి వారికైనా కూడా ఆ శ్రీమహావిష్ణుమాయ, స్వస్వరూప విషయాలను వర్ణించే శక్తిలేదని, తనకు తెలిసినంతలో తనకు అనుభవంలోకి వచ్చిన విషయాలను వివరించగలనని అన్నాడు.

గతంలో తన తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు దేవేంద్రుడితో పోరాడి అమృతభాండాన్ని స్వాధీనం చేసుకొని తరలిపోతున్న తరుణంలో తనకు ఒక ప్రేమపూరితమైన పిలుపు వినిపించిందని గరుత్మంతుడు చెప్పాడు. ఆ మాటలు వినిపించిన దిశగా మరికొంత ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో నీకొక వరం ఇస్తున్నాను. తీసుకో అన్న పలుకులు మళ్ళీ వినిపించాయని, అయితే ఆ పలుకుతున్న దెవరో? ఎటువంటివారో? తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆ శబ్ధం వచ్చిన దిక్కుకు చూస్తూ మీరెవరో నాకు పూర్తిగా మీ విషయాన్ని వివరించాకే వరం ఇవ్వవలసినదిఅని గరుత్మంతుడు అడిగాడు. అందుకు సమాధానంగా తనస్వరూపమేమిటోఇకమీదట పూర్తిగా అవగతమవుతుందని, అయితే ముందుగా గరుత్మంతుడు తనకు వాహనంగా మారాలని మళ్ళీ వినిపించింది. అలా అయినందువల్ల వృద్ధాప్యం, మృత్యువు లాంటివి లేకుండా ఉండే ఒక మహాత్తర శక్తి సంప్రాప్తిస్తుందని గరుత్మంతుడికి వినిపించింది. అనుకొని ఆ వర ప్రసాదానికి గరుత్మంతుడికి ఒళ్ళు పులకించింది. వెంటనే భక్తిపూరితంగా నమస్కరించి తాను వెంటనే వాహనమూర్తిగా మారి సేవించుకుంటానని ఒకవేళ ఆ అడుగుతున్న మహానుభావుడు రథాన్ని ఎక్కివుంటే ఆ రథానికి కేతనంగా ఉండగలనని అలా తనను అనుగ్రహించమని గరుత్మంతుడు వేడుకున్నాడు. అలాగే తాను అనుగ్రహిస్తున్నట్లు ఆ అద్భుతశక్తి పలికింది. ఆ తరువాత గరుత్మంతుడుఎంతో ఉత్సాహంగా తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చిజరిగిన విషయాన్నంతా వివరించాడు. కశ్యపుడు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ మాటలు ఎవరివోకాదని, ఆ వరం ఇచ్చింది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని తెలియచెప్పాడు.

ఎంతో గొప్ప సమాధినిష్ఠతో తపస్సుచేస్తే తప్ప లభించని శ్రీమహావిష్ణువు అనుగ్రహం గరుత్మంతుడికి లభించిందని, వెంటనే వెళ్ళి శ్రీమహావిష్ణువు ఉండే బదరికాశ్రమంలో ప్రవేశించి ఆయనను భక్తితో సేవించమని కశ్యపుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ వెంటనే గరుత్మంతుడు బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పచ్చని వస్త్రాలతో, శంఖ, చక్ర, గదాది ఆయుధాలతో ఎనిమిది భుజాలతో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనేఇక తనను అనుసరించమని గరుత్మంతుడితో చెప్పాడు.

అలా చెప్పిన వెంటనే ముందు శ్రీమహావిష్ణువు వెళుతుండగా గరుత్మంతుడు అనుసరించాడు. అలా చాలా యోజనాల దూరం వాయువేగంతో గరుత్మంతుడు వెళ్ళాడు. ఇంతలో ఒకచోట భయంకర అగ్నిజ్వాలలు ఎదురుపడ్డాయి. అక్కడ ఎటుచూసినా ఇంధనం కానీ, మరొకటి కానీ ఎమీలేదు. ఆ మంటలను లెక్కపెట్టక తీవ్రవేగంతో వాటిలోకి ప్రవేశించాడు గరుత్మంతుడు. అయినా అతడికేమీ ప్రమాదం సంభవించలేదు. మరికొంత ముందుకెళ్ళాక తీవ్రమైన తపస్సు చేస్తున్న పార్వతీపరమేశ్వరులు కనుపించారు. అక్కడినుండి ఇంకా ముందుకు వెళుతున్న విష్ణువును అనుసరిస్తున్న గరుత్మంతుడికి బాగా ఒడలిక కలిగింది. అయినా ఆ ఒడలికను లెక్కచేయక ముందుకు వెళ్ళాడు అక్కడ ఒకచోట గాడాంధకారమైన ప్రదేశం ఉంది. ఆ చిమ్మచీకట్లో దిక్కుతెలియని స్థితిలో చేసేది ఏమీలేక గరుత్మంతుడు బాధపడుతూ తనకేమీ కనుపించటంలేదని తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఇదిగో ఇటుచూడు, ఈ వైపురా అని అన్నాడు. ఆ శబ్ధం వినిపించిన దిక్కు చూడగానే చిమ్మచీకట్లన్నీ చెల్లాచెదురైపోయాయి.

దివ్వమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఆ ప్రదేశంలో భగవానుడు అంతకన్నా ఎక్కువగా తేజరిల్లుతూ కనుపించాడు.అక్కడ మంగళవాద్య ధ్వనులు మారుమోగసాయి. అద్భుతమైన సరోవరాలు కమలాలతో నిండి కనుపించాయి. ఆ ప్రదేశాన్ని కన్నార్పకుండా చూస్తున్నంతలోనే మళ్ళీ విష్ణువు తన ప్రయాణం సాగించాడు. ఆయనను గరుత్మంతుడు అనుసరించాడు. మళ్ళీ ఇంతలో ఒక భీకరమైన జ్వాల కనుపించటంతో గరుత్మంతుడు తత్తరపడ్డాడు.

మళ్ళీ తన శక్తిమీద ఆశలువదులుకొని ఆ దేవదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆనారాయణుడు అనుగ్రహించి దోవచూపి అగ్నిజ్వాలలు పోగొట్టి మరికొంతదూరం గరుత్మంతుడు తన వెంటరాగానే అదృశ్యమైపోయాడు. ఆ క్షణంలో గరుత్మంతుడు ఉన్న ప్రదేశమంతా ఎంతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ కనుపించింది. అక్కడున్న ఒక చక్కని సరోవరంలో శ్రీమన్నారాయణుడు జలకాలాడుతూ కనుపించాడు. ఆ సరోవరం ఒడ్డుకు గరుత్మంతుడు చేరుకోగానే విష్ణువు మాయమయ్యాడు. ఆ సంఘటనకు మళ్ళీ బాధపడ్డాడు గరుత్మంతుడు. దానికితోడు అక్కడ ఒక పక్క చతుర్వేదాల గంభీర ఘోష వినిపిస్తున్నా ఎవరూ అక్కడ ఉన్నట్లు కనుపించలేదు. మళ్ళీ అంతలోనే మహా భయంకరమైన గరుడ పక్షులెన్నెన్నో ఆ ప్రదేశమంతా తిరుగాడుతూ కనుపించాయి. గరుత్మంతుడిక ఆ పరిస్థితి నుండి తాను బయటపడేందుకు పరమాత్ముడొక్కడే తనకు దిక్కని ఎలుగెత్తి పలుకుతూ రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆందోళన పడవద్దని తాను రక్షిస్తాననిపలికాడు. ఆ పలుకులు వినిపించిన మరుక్షణంలో శ్రీమన్నారాయణడక్కడ సాక్షాత్కరించాడు. ఆయనకు భక్తితో నమస్కరించి గరుత్మంతుడు చుట్టూఒకసారి తేరిపారచూడగా ఆ ప్రదేశం మరేమీకాదని ఒదరికా వనమేనని స్పష్టమైంది.


అలా తనకు శ్రీమహావిష్ణువు స్వస్వరూపాన్ని, తన మాయా విశేషాలను వివరించినట్లు గరుత్మంతుడు మునులకు చెప్పాడు. అహంకారభావంతో మనిషి ప్రవర్తిస్తుంటాడు. అహంకార భావాన్ని విడిచి భక్తితో, ఆర్తితో భగవానుడిని స్తుతించినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని ఈ కథా భాగం వివరిస్తోంది.

( ఈనాడు సౌజన్యముతో )


Friday, March 27, 2009

తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేసిన కొందరు తెలుగువారు

ముందుగా అందరికీ శ్రీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెల్పుతూ సందర్బముగా మన తెలుగు జాతికి కీర్తిప్రతిష్ఠలు కలుగజేసిన కొందరు మహనీయుల గురించి తెలుసుకొందాము.

* శంకరంబాడి సుందరాచారి: రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి. తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్నమొన్నటి దాకా దక్కాల్సినంత పేరు దక్కలేదు. మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
* పొట్టి శ్రీరాములు (1901-1952): ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఆత్మార్పణం చేసిన త్యాగ ధనుడు. సత్యము, అహింస, హరిజనోద్ధరణ ప్రధానాశయాలుగా గాంధీజీ అడుగు జాడల్లో నడచిన మహనీయుడు. తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు. తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ.
* గిడుగు రామమూర్తి పంతులు (1863-19409): ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.
* కందుకూరి వీరేశలింగం (1948-1919): గొప్ప సంఘ సంస్కర్త, సాహితీ వేత్త. కథ, నవల, వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్య శ్రీకారం చుట్టినవాడు. స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. వివేకవర్థిని పత్రికను స్థాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను, దురాచారాలను తూర్పార బట్టారు. అధికార వర్గాల్లోని అవినీతి, అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు.
* ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (19 శతాబ్దం పూర్వార్థం): దేశ స్వాతంత్య్రంకోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.
* గురజాడ అప్పారావు (1862-1915): 'దేశమును ప్రేమించుమన్నా' అంటూ దేశ భక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు. భాషా సాహిత్యాలు, కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి. గురజాడ సృష్టించిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.
* రఘుపతి వెంకటరత్నంనాయుడు (1862-1939): సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ ప్రచారకుడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల్లో రుజువర్తన, నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు. మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులేనంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.
* టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు. తెలుగు వారి గుండెలొల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం. బారిస్టర్గా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించాడు. సైమన్ కమిషన్ వచ్చినపుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్ర జాతి గుండెను గెలుచుకున్నారు.
* పింగళి వెంకయ్య (1878-1963): భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత. స్వాతంత్య్ర సమర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, గుండె నిండుగా దేశాభిమానమే కాదు, మెదడు నిండుగా విజ్ఞానాన్ని ధరించిన వాడు. కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి, పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు, వెండి పతకాలను గెలుపొంది రాయల్ ఎగ్రికల్చర్ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.
* బండారు అచ్చమాంబ (1874-1905): స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్న ఆరోజుల్లోనే చదువుకోడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను 'అబలా సచ్ఛరిత్ర రత్నమాల' పేరుతో ఒక్క చేతితో రాశారు. భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు. స్త్రీ సమాజాలను స్థాపించారు.
* డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (1895-1948): ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త. ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్ కార్బామజీన్ అనే మందును కనుగొన్నారు. 1945లో ఆరియోమైసిన్ అనే యాంటీబయోటిక్ మందును ఆవిష్కరించారు. పాండురోగ నివారణకు పోలికామ్లం, క్షయ రోగానికి పసోనికోటినికాసిడ్ హైడ్రోజన్లను కనుగొన్నారు.
(ఈనాడు సౌజన్యము )



శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు




కొత్త సంవత్సరము మన రాష్ట్రము,దేశము మరియు ప్రపంచము అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని
కోరుకొంటూ

సురేష్ బాబు



Thursday, March 26, 2009

ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి? (అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర)

ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఓ రెండు పక్షుల మాటల్లో మనుచరిత్రలో పెద్దన ఎంతో అందంగా, సందేశాత్మకంగా వివరించి చెప్పాడు. మార్కండేయ పురాణం ఆధారంగా రూపొందిన మనుచరిత్ర ఆరో ఆశ్వాసంలో హంసి చక్రవాక సంవాదం అనే ఓ కథ ఉంది. ఇందులో చక్రవాక పక్షి హంసి (ఆడహంస)కి భార్యాభర్తల బంధం విలువను ఇలా తెలియజెప్పింది.

పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.

నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూలతోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీపంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వ జన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.

అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్దరికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమనే నా భావన. ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆడహంస.

అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది. 'చూడు హంసి.. పైపైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్య ఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగించటం ఏమీ చేయటం లేదు. ఆత్మ గౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతించటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.

ఒక పురుషుడికి అనేక స్త్రీల మీద, అనేక స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూలంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు.

తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు ఈ రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం' అని ఆడ చక్రవాక పక్షి హంసితో చెప్పింది.


ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన మనుచరిత్రలో ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం ఇలా ఇక్కడ కనిపిస్తోంది. స్త్రీ లౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు.

Tuesday, March 24, 2009

కుహనా లౌకికవాదుల,మీడియా వక్రబుద్ధి

లౌకికవాదులమని చెప్పుకొనే కుహనా రాజకీయనాయకులు,ప్రసారమాధ్యమాలు,వార్తాపత్రికలు(మీడియా) వక్రబుద్ధిని తెలిపే ఈ ఉదంతం చూడండి.
ఈ మధ్య వరుణ్‌గాంధీ ముస్లిములకు వ్యతిరేకముగా ఏవో వ్యాఖ్యలు చేసాడని వార్తలు వచ్చాయి. అలా గనుక అతను చేసుంటే అది తప్పే ఖండించవలసిందే.ఈ విషయాన్ని ప్రముఖవార్తగా అన్ని ఆంగ్లపత్రికలు, అన్ని ఆంగ్ల TV ఛానళ్ళూ ప్రసారం చేస్తున్నాయి. ఇక TimesNow,NDTV,CNN-IBN లాంటి ఆంగ్ల ఛానళ్ళకైతే ఇదే ప్రముఖ వార్త. వీళ్ళు ఎన్నిసార్లు వేస్తారంటే అలా చూపించడం వలనే ఇంకా మతకలహాలు ఎక్కువ చెలరేగే అవకాశం ఉంది. సరే వారు నిజమే కదా ప్రసారం చేస్తున్నారు అనుకొందాం.
అలా ఐతే ఇలాంటి అన్ని విషయాలనూ అలానే ప్రసారం చేయాలి కదా, పత్రికలు కూడా అలానే ప్రచురించాలి కదా.
M.F.హుస్సేన్ అనే ప్రముఖ(???)చిత్రకారుడు హిందూ దేవతల చిత్రాలను నగ్నముగా గీస్తూ దానిని సృజనాత్మకత(creativity) అని చెప్పుకుంటుంటే అది వార్త కాదా? పైగా దానికి నిరసన తెల్పితే,తెలిపిన వారిపై పోలీసుకేసులు. దానికి హిందువుల మనోభావాలు దెబ్బతినవా? వరుణ్గాంధీ కేవలం రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడాడు. కాని హుస్సేన్ చెసిందేమిటి? ఏకముగా హిందువుల దైవాలపైనే గురిపెట్టాడు.కాని అతనిపై ఈగ కూడా వాలనివ్వరు. ఇక ఈ మీడియా ఉందే, వారికి ఇవి ఏ మాత్రం పట్టవు. అసలు ఇలాంటి వార్తలను పత్రిక మధ్య కాగితాలలో వేసి ఇక చేతులు దులుపుకొంటారు. మొదటి కాగితములో మాత్రం అసలు వేయరు. ఏమంటే లౌకికవాదం అంటారు.ఇదా లౌకికవాదం?ఆంగ్ల TV చానళ్ళకైతే అసలు ఇది ఒక వార్తే కాదు.
అసలు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం గారి ప్రకారం మనుషులను రెచ్చగొట్టే,బాధపెట్టే వార్తలను పత్రిక మొదటి కాగితంలో అసలు వేయరాదు.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి వారి వక్రబుద్ధిని తెలిపే సంఘటనలు.

Friday, March 20, 2009

అంగరంగవైభవముగా జరిగిన కదిరి నృసింహుని రథోత్సవం - దృశ్యమాలిక

గత 15 రోజులుగా కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్బముగా టపాలు వ్రాయడం కుదరలేదు. ఆ బ్రహ్మోత్సవాల దృశ్యమాలిక.














Tuesday, March 10, 2009

భావోద్వేగాలను నియంత్రించడం అంటే ఇదీ - నిజముగా జరిగిన సంఘటన

అందరూ అంటూంటారు "మేము ఎంత కటిన పరిస్థితులలోనైనా దృఢముగా ఉంటాము" అని. కాని చిన్న ఓటమి ఎదురవగానే పాతాళానికి కృంగిపోతారు. కాని క్రింద సంఘటన చదవండి. ఒక ఇంటర్వ్యూలో అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి అడిగిన ప్రశ్న. ఇది నిజముగా జరిగినది.
ఆ ప్రశ్న ఏమిటంటే:
"మీ అమ్మ గనుక వేశ్య ఐతే?"
చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్న విని నిశ్చేష్టులయ్యారు. కొందరు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. కొందరు ప్రశ్నించిన అధికారిని కొట్టబోయారు. ఇంచుమించు మనము కూడా అలానే ప్రవర్తిస్తామనుకోండి.
కాని ఒకే ఒక అభ్యర్థి తడుముకోకుండా ఆలోచించి చెప్పిన సమాధానం ఏమంటే:
"మా అమ్మ గనుక వేశ్య ఐతే మా నాన్న ఒక్కడే ఆమెకు విటుడు"
ఆశ్చర్యపోయారా ? ఎంతమందికి ఇంత మానసిక స్థైర్యం ఉంటుంది?
ఇది మన భారతదేశంలోని ఒక యాజమాన్య సంస్థ (management institute) లో నిజముగా అడిగిన ప్రశ్న.




Sunday, March 1, 2009

అంతా మోసం,ఈ రోజు నా పుట్టినరోజు కనబడటంలేదు

అందరూ బాగా తమ పుట్టినరోజులు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. కాని రోజు మార్చ్ 1 వచ్చింది. ఫిబ్రవరి 29 రాలేదు. ప్చ్ ఏం చేయాలి? ఫిబ్రవరి 29 పుట్టాను. కాని లాభాలు కూడా ఉన్నాయండోయ్. ప్రతి సంవత్సరంఖర్చులు తగ్గుతాయి.అంతే కదా. సరే నాకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోకండేం.




Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు