తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, October 29, 2008

మన తెలుగు బ్లాగుల వలన తెలుగు భాషకు ప్రయోజనం ఏమిటి?

మనం అందరము తెలుగులో బ్లాగులు వ్రాస్తున్నాము.ఎంతో కొంత ఐనా తెలుగు బాషకు ప్రయోజనం చేకూరుతున్నదని అనుకొంటున్నాము.గూగుల్ వారు,ఫైర్‌ఫాక్స్ వాళ్ళు తెలుగులో తమ సర్వీసులు అందిస్తున్నారు.బయటివారందరూ తెలుగు కు బాగానే ప్రాముఖ్యత ఇస్తున్నారు.కాని తీరా అసలు ప్రదేశమైన మన రాష్ట్రం వచ్చేటప్పటికి తెలుగు వాడకం ఎంతగా తగ్గిపోతోందో తెలుసు.

మనం మనవంతుగా దృష్టి పెట్టవలసిన నేను అనుకొంటున్న కొన్ని సంఘటనలను క్రింద తెలియజేసుకొంటున్నాను.

1.తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవం గా తెలుగు బాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.అందులో పాల్గొన్న మన ముఖ్యమంత్రి గారు తెలుగు కు ప్రాముఖ్యత ఇస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.కాని అసలు జరిగింది ఏమిటి?ఆ ఉత్సవాలు ముగిసిన వారం లోపే ఆరవ తరగతి నుండి తెలుగును కేవలం ఒక పాఠ్య విషయంగా(సబ్జెక్ట్)గా మాత్రమే బోధించాలని మిగతా అంతా ఆంగ్ల మాధ్యమంలో నే ఉంచాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.
యూరప్ దేశాలలో వారి విద్యావిధానం చూడండి.వారి విద్యావిధానంలో డిగ్రీ వరకు కూడా వారి మాతృభాషలోనే బోధన ఉంది.ఆంగ్లం కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే.కేవలం పిజి మాత్రమే ఆంగ్లమాధ్యమం లో బోధిస్తున్నారు.

2.ఇక రాష్ట్ర రోడ్డు రవాణా విషయానికి వస్తే ఇంకా అధ్వాన్నంగా పరిస్థితి ఉంది.స్థానికంగా మన రాష్ట్రం లోపల నడిపే బస్సుల విషయంలో మాత్రం తెలుగును అమలు చేస్తున్నారు.హైదరాబాదులో మహాత్మాగాంధీ బస్టాండులో వోల్వో(గరుడ) బస్సులు నిలిపే స్థలానికి ఎదురుగా విచారణా కేంద్రం వద్ద ఒక ఫలకం ఉంటుంది.అందులో మన ఆర్టీసి వాళ్ళు ఎంతో గొప్పగా "తెలుగు కనపడాలి","తెలుగు వినపడాలి""తెలుగు కన్నతల్లి లాంటిది" మొదలగు నినాదాలు వ్రాసిఉన్నారు.కాని ఆచరణలో వాళ్ళు చూపిస్తున్నది ఏమిటి? మన రాష్ట్రం నుండి బయలుదేరే అన్ని అంతరరాష్ట్ర బస్సుల పైనా పూర్తిగా తెలుగు తీసివేసి అంతా ఆంగ్లమయం చేసారు.ఇక గరుడ వోల్వో బస్సుల విషయంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది.రాష్ట్రంలోపల తిరిగే బస్సులను కూడా అంతా ఆంగ్లం తో నింపివేసారు.అంతర రాష్ట్ర బస్సుల విషయంలో అంతా తెలుగులోనే వ్రాయాలని అనడం లేదు.ఆంగ్లంతో పాటు తెలుగు కూడా వ్రాస్తేనే కదా,తెలుగు కనపడితేనే కదా మన బాషపై మనకు గల అభిమానం కనీసమైనా ఇతర రాష్ట్రాలవారికి తెలిసేది.కర్ణాటక వారి విషయానికి వస్తే వారి అంతర రాష్ట్ర బస్సులపై కన్నడ,తెలుగు, వోల్వో బస్సులపై కన్నడ,ఆంగ్లం,తెలుగు మరియు తమిళనాడు విషయానికి వస్తే వారి అన్ని అంతర రాష్ట్ర బస్సులపైనా తమిళం,ఆంగ్లంలలో వ్రాసి ఉంటుంది.ఆ విధంగా వారు తమ భాష ను ఇతర రాష్ట్రాలవారికి తెలిసేలా చేస్తున్నారు.తమ భాషా సంస్కృతిని ఇతర రాష్ట్రాలవారు తెలుసుకొనేలా చేస్తున్నారు.ఆంగ్లాన్ని వద్దనకుండానే తమ బాషా సంస్కృతిని కాపాడుకుంటున్నారు.కాని మన విషయం ఏమిటి?ఇంత మాత్రం జ్ఞానం కూడా మన ప్రభుత్వానికి లేదా?

3.ఇక హైదరాబాదు చూసిన వారందరికీ ఒక విషయం తెలుసు.ఒక రాష్ట్ర రాజధానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ దానికి ఉన్నప్పటికీ అసలు లక్షణమైన బాషా సంస్కృతి లక్షణం అన్నది లేదు అని.హైదరాబాదులో తిరుగుతుంటే ఒక విదేశ నగరంలో తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించదు.ఏ దుకాణం పై చూసినా పేరు సూచికలు పూర్తిగా ఆంగ్లంలోనే ఉంటాయి.ఇదే కర్ణాటక,తమిళనాడు విషయానికి వస్తే దుకాణాలపైన ఆంగ్లంతో పాటు ఆయా భాషలు కూడా తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది.ఎవరైనా అమలు చేయకపోతే ఆ దుకాణాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

ఇతర బాషలను మనం ద్వేషించనవసరం లేదు.కాని మన మాతృబాషను మనం మరిచిపోతున్నాము.

మన బ్లాగర్లు ఈ విషయాలపైన ఏమీ చేయలేమా? మనం ఏ విధమైన కార్యాచరణ పథకం చేయలేమా? ఆలోచించండి. సంఘటనలు ఇంకా ముదిరిపోకముందే మనము సంస్థాగతంగా ఏదైనా చేయకతప్పదు.ఇలా ఏమీచేయలేనినాడు మనం మన బ్లాగుల ద్వారా ఒకరికి తెలిసిన సమాచారం మరొకరికి ఇచ్చిపుచ్చుకోవడం,అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే చేయగలము.ఇవి మాత్రమే ఉద్దేశ్యంగా గలవారికి ఏమీ చెప్పడం లేదు.తెలుగు బాషను బ్రతికించుకందామనుకొనే వారికి,కాపాడుకొందాము అనుకొనేవారికి నా ఈ అభ్యర్థన.ఇప్పటికిప్పుడు తెలుగుబాషకు ఏమీ ప్రమాదం లేదని అనుకోవచ్చు.కాని సమస్యా పరిష్కారానికి నడుము బిగించాల్సిన తరుణం ఇదే అని నా ప్రగాఢవిశ్వాసం.

మన బ్లాగుల ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషా పునర్వైభవమే కాబట్టి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
పైన పేర్కొన్నవి కేవలం కొన్ని సమస్యలు మాత్రమే.ఇంకా చాలా ఉన్నాయి.కాని పైన పేర్కొన్నవి తక్షణసమస్యలు అని అనుకొంటున్నాను.
బ్లాగుల ద్వారా ఎలానూ తెలుగుభాషకు సేవ చేసుకొంటున్నాము.ఇకనైనా మనము కార్యాచరణకు నడుము బిగించాలి అనుకొంటున్నాను.అందుకుతగ్గ కార్యాచరణను ఆలోచించండి.

3 comments:

 1. >> "మన బ్లాగుల ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషా పునర్వైభవమే"

  ఇది కొంతవరకే నిజం.

  మొత్తమ్మీద మీ ఆవేదన అర్ధవంతమైనదే.

  ReplyDelete
 2. నిజమె, మనమీ విషయం పై కొంత శ్రద్ద చుపాలి

  ReplyDelete
 3. నా బ్లాగు ద్వారా తెలుగు సహిత్యాన్ని, అంటే కొన్ని మంచి పుస్తకాలను పరిచయం చెసే ప్రయత్నం మొదలుపెట్టాను.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు