సమైక్యరాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. మంచిదే. పోరాడండి. కాని దేవుడిని, భక్తులను ఎందుకు ఈ విషయములోనికి లాగుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంపై కొన్ని జరిగిన సంఘటనలను చూద్దాం.
1. ఒక బ్లాగరి తన బ్లాగులో తెలుగు బాష విషయం పై వాదన చేస్తూ బమ్మెర పోతన తెలంగాణా వ్యక్తి అని వారే అసలైన తెలుగు వారని అందుకే భాగవతం చాలా బాగుంటుందని , నన్నయ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని అందుకే అతను వ్రాశిన మహాభారతం అంత బాగోదని తేల్చేసాడు.
మీ మూర్ఖత్వాన్ని, వాదనలను మీ వద్దే పెట్టుకోండి.
భక్తులకు విశ్వమంతా ఒక్కటే. వారికి దేవుడు తప్ప ఇతరాలు కానరావు. మన అజ్ఞానంతో భక్తుల పట్ల అపచారాన్ని చేస్తున్నాము. దేవుడు తనను ఏమైనా అన్నా ఉపేక్షిస్తాడేమో గానీ, భక్తుల జోలికి వస్తే ఊరుకోడు.
2. విజయవాడ అమ్మ వారి ప్రసాదాన్ని వేములవాడకు పంపిస్తే ఆ ప్రసాదం ఆంధ్రప్రాంతం వారిదని త్రిప్పి పంపేశారట. దుర్గమ్మ జగన్మాత, అంతే కాని ఆంధ్రామత అనో లేక తెలంగాణా మాత మాత్రమో కాదు. భధ్రాచలం రాముడైనా, తిరుపతి వెంకన్న ఐనా ఇద్దరూ ఒకటే అని తెలిసినా మూర్ఖవాదాలతో కాలం సాగిస్తున్నారు.
ఎవరైనా ఎంతైనా పోరాడండి. హద్దుల్లో ఉండి పోరాడండి. అంతేకాని దేవుడి విషయంలో కాని, ఇంకా ముఖ్యముగా భాగవతుల(భక్తుల) విషయంలో కాని పొరపాటున ఐనా తప్పు చేస్తే లేక మన ప్రాంతీయవాదాల్ని వారికి అంటగడితే నాశనం కాకతప్పదు.
గమనిక : ఈ టపా ఏ ఉద్యమానికీ వ్యతిరేకంగానో లేక మద్దతుగానో వ్రాయబడలేదు. ఆధ్యాత్మిక సంబంధంగానే వ్రాయబడింది.