Thursday, September 25, 2008
ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 1
మనకు తెలుసు ఐన్‌స్టీన్ ప్రపంచప్రఖ్యాతి పొందినది తను కనుగొన్న సాపేక్షసిద్దాంతాల వలన.ఇవి ప్రత్యేక,సాధారణ సాపేక్షసిద్దాంతాలని రెండు రకాలు.ఈ భాగంలో మనం సాధారణ సాపేక్ష సిద్దాంతం గురించి చూద్దాం.ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌స్టీన్ 1915 వ సంవత్సరం లో ప్రతిపాదించాడు.(ఈ విషయంపై 1907 నుండి 1915 వరకు పరిశోధనలు చేసాడు).తర్వాతి
భాగాలలో ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం వివరాలు తెలుసుకొందాము.
మొదట సాపేక్షం అంటే ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాము.మనం ఒక వస్తువు పొడుగ్గా ఉన్నది అంటున్నామంటే దాన్ని మనం దాని పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్న వస్తువుతో పోల్చి పొడుగ్గా ఉన్నదని అంటాము.ఇలానే ఒకడు ఇంకకడికంటే వేగంగానో లేక ఆలస్యంగానో పరుగెడుతున్నాడని,ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ లేక తక్కువ మార్కులు తెచ్చుకుంటాడని చెప్తాము.అంటే ఒక వస్తువు లక్షణం దృష్ట్యా ఇంకో వస్తువు లక్షణం చెప్తున్నామన్న మాట.ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతివిషయాన్నీ ఇంకొక అదే లక్షణాలు గల
విషయంతో పోల్చి చూస్తుంటాము.దీన్నే "సాపేక్షము" లేక "సాపేక్షత" అంటారు.
ఇక అసలు విషయమైన సాధారణ సాపేక్ష సిద్దాంత విషయానికి వద్దాము.
ఈ సిద్దాంతము ప్రధానంగా గురుత్వాకర్షణ విషయాన్ని చర్చిస్తుంది.గురుత్వాకర్షణ విషయన్ని న్యూటన్ ప్రతిపాదించాడని మనకు తెలుసు.న్యూటన్ ప్రకారం సృష్టిలో ప్రతి వస్తువూ ఇంకొక వస్తువుని ఆకర్షిస్తోంది.ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణశక్తి మొదట వాటి ద్రవ్యరాశి పై మరియు వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది.ద్రవ్యరాశులు పెరిగేకొద్దీ ఆకర్షణ పెరుగుతుంది.అలాగే దూరం పెరిగేకొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.ఇలా సృష్టి మొత్తం ఈ నియమాలు పాటిస్తాయని న్యూటన్ కనుగొన్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ అసలు అవి ఎందుకు ఆకర్షించుకొంటున్నాయో న్యూటన్ చెప్పలేదు.
సాధారణ సాపేక్షసిద్దాంతం ఈ విషయాన్ని గురించే చెబుతుంది.
మనకు తెలిసిన మూడు కొలతలు పొడవు,వెడల్పు,లోతు లతో పాటు ఐన్‌స్టీన్ నాల్గవ కొలత గా కాలాన్ని తీస్కొన్నాడు.ఈ నాలుగు కొలతలతోనే విశ్వమంతా ఉంటుంది.(మొత్తం 11 కొలతలు ఉంటాయని నేటి శాస్తవేత్తలు భావిస్తున్నారు.)ఈ నాలుగు కొలతలు గల ప్రదేశాన్నే "space time continuum" అంటారు.ఈ continuum లో ఏదైనా బరువైన వస్తువును పెట్టినప్పుడు ఆ వస్తువు పెట్టిన చోట ఒక గుంత లాగ ఏర్పడుతుంది.ఉదాహరణగా మనం దిండు(తలగడ) పైన ఏదైనా బరువైన వస్తువును ఉంచామనుకోండి.అక్కడ ఒక గుంత లాగ ఏర్పడినట్టు అన్నమాట.అర్థం కావడానికి ప్రక్క పటాలు చూడండి.ఆ గుంతకు సమీపంలోని వస్తువులు,పరిధిలోని వస్తువులు ఆ గుంతలోనికి దొర్లినప్పుడు మనకు ఆ దొర్లుతున్న వస్తువులు ఆ పెద్ద వస్తువుచేత ఆకర్షింపబడుతున్నట్టు కనబడతాయి.దీనినే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతము అంటారు.ఎంతగా ఆ వస్తువులు దొర్లుతాయి అనే విషయం న్యూటన్ చెప్పిన సిద్దాంతం ద్వారా కనుగొనవచ్చు.
ఇది అర్థం కావడానికి సైన్సు లో ఒక ప్రసిద్ద ఉదాహరణను చెబుతారు.అది ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయాడనుకోండి.న్యూటన్ ప్రకారం ఆ విషయం వెంటనే భూమికి తెలిసిపోయి తన కక్ష్య నుండి తప్పి సరళరేఖామార్గంలో విశ్వంలోనికి వెళ్ళిపోతుంది.కాని నిజానికి అలా జరుగదు.ఎందుకంటే ఈ విశ్వంలో కాంతి కన్నా వేగంగా ఏ వస్తువూ,శక్తీ ప్రయాణించదని మనకు తెలిసిన సిద్దాంతాల ద్వారా తెలుస్తోంది.మనకు తెలుసు సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు తీసుకుంటాయని.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి చేరడానికి 8 నిమిషాల పైనే పడుతుంది.అప్పుడే భూమి తన కక్ష్య నుండి ప్రక్కకు తప్పుకుంటుంది.ఐన్‌స్టీన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ సూర్యుడు మాయమైనందున space time continuum లో ఏర్పడిన గుంత మామూలు స్థాయికి వస్తుంది.ఇలా గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో వ్యాపించి ఆ continuum అంతా
బల్లపరుపుగా అవుతుంది.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి 8 నిమిషాల తర్వాతే తెలుస్తుంది.
స్థలకాలం వంగి ఉందన్న అద్భుతవిషయము,దానికి ఋజువులు మొదలగు వివరాలు తర్వాత టపాలో తెలుసుకొందాము.
వర్గాలు
సాంకేతికవిజ్ఞానము
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...